‘‘క్షిపణి దాడి నుంచి ప్రాణాలతో బయటపడ్డా, ఇంకెప్పుడు సముద్రంలో పనిచేయడానికి వెళ్లను’’

మిస్సైల్ దాడి

ఫొటో సోర్స్, Sunil Puniya

    • రచయిత, కేలీన్ డెవ్లిన్, ఫీబీ కీన్
    • హోదా, బీబీసీ వెరిఫై, బీబీసీ న్యూస్ ప్రతినిధులు
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

"ఓడ మొత్తం కదిలిపోతున్నట్టనిపించింది. ఇంజన్‌ లోపమేమో అనుకున్నా. కానీ గది నుంచి బయటకు రాగానే, మరో పేలుడు జరిగింది" అని సునీల్ పునియా చెప్పారు.

మార్చి 1వ తేదీ తెల్లవారుజామున స్కైలైట్ పేరుగల చమురు ట్యాంకర్‌పై క్షిపణి దాడి జరిగింది. ఓడలో పనిచేయడం సునీల్‌కు అదే మొదటిసారి.

అమెరికా ఆంక్షలు విధించిన స్కైలైట్ నౌక దుబాయ్ నుంచి బయల్దేరి, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే నౌకా మార్గాలలో ఒకటైన హార్ముజ్ జలసంధిని సమీపిస్తోంది. ఆ ప్రాంతంలో ఇరాన్‌తో అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం చెలరేగిన తర్వాత దాడికి గురైన మొట్టమొదటి వాణిజ్య నౌక ఇదే.

దాడి జరిగిన సమయంలో సునీల్ మూడో అంతస్తులోని తన క్యాబిన్‌లో నిద్రపోతున్నారు. లేచి చూసేసరికి ఓడంతా గందరగోళం. ఇంజిన్ గదిని మిసైల్ ఢీకొనడంతో మొదలైన అగ్నికీలలు నౌకంతటా వేగంగా వ్యాపించాయి.

"కరెంటు పోయింది, ఎక్కడ చూసినా పొగే, ప్రతి ఒక్కరూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డారు" అని సునీల్ పునియా చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

"దక్షిణ భారతదేశానికి చెందిన కొంతమంది నావికులు ఏడుస్తూ, భయంతో ఇంటికి ఫోన్లు చేస్తున్నారు. వారికి ఫోన్లు చేయడం ఆపమని చెప్పి డెక్‌ పైకి వెళ్లడానికి సాయం చేశాను. కానీ వారు అక్కడకు చేరుకునేసరికే మంటలు విస్తరించాయి. ఎక్కడ చూసినా చమురే. మంటలు మా వైపు రావడంతో మేం సముద్రంలోకి దూకేశాం" అని సునీల్ చెప్పారు.

హార్ముజ్ జలసంధి

ఫొటో సోర్స్, Family of Dalip Rathore

ఫొటో క్యాప్షన్, స్కైలైట్ నౌక ఇంజిన్ గదిలో దలీప్ రాథోర్ పని చేస్తున్న సమయంలో మిసైల్ దాడి జరిగింది.

సోదరుడులాంటివాడు

దాడి జరిగిన గంటలోపే ఒమన్ నౌకాదళం సహాయక చర్యలు మొదలుపెట్టి ప్రాణాలతో బయటపడిన వారిని నీళ్లలోంచి కాపాడింది. కానీ కొంతమంది ఆచూకీ లభించలేదు.

"దలీప్ అక్కడ లేడనే విషయం అర్థమై, కంగారు మొదలైంది. అతని కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు" అని సునీల్ చెప్పారు.

సునీల్ చేరిన మరుసటి రోజే 25 ఏళ్ల దలీప్ రాథోర్ స్కైలైట్‌లో చేరారు.

ప్రపంచ షిప్పింగ్ పరిశ్రమకు, నౌకాయాన రంగానికి పెద్ద సంఖ్యలో నావికులను అందించే దేశాల్లో భారత్ కూడా ఒకటి. తామిద్దరం రాజస్థాన్‌లోని పొరుగు గ్రామాలకు చెందినవారమని తెలుసుకున్న దలీప్ రాథోర్ కొద్దికాలంలోనే మంచి స్నేహితులయ్యారు.

"ఓడలో నెట్‌వర్క్ సరిగా లేకపోవడంతో తరచుగా ఇంటికి ఫోన్ చేయలేకపోయాం. ఆ సమయాల్లో దలీప్ ఒక సోదరుడిలా అండగా ఉన్నాడు" అని సునీల్ చెప్పారు.

ఈ దాడిలో దలీప్, ఓడ కెప్టెన్ ఆశిష్ కుమార్ మరణించారు. కెప్టెన్ అవశేషాలలో కొన్ని లభ్యం కాగా, దలీప్ మృతదేహం మాత్రం దొరకలేదు.

జలసంధిలో చిక్కుకుపోయారు

ఈ ఘటన హార్ముజ్ జలసంధిలో జరుగుతున్న తీవ్ర సంక్షోభంలో భాగం. యుద్ధం ప్రారంభంలో వేగంగా స్పందించిన తెహ్రాన్ ఆ జలసంధిని మూసివేసింది. ఈ మార్గం ప్రపంచంలో సుమారు 20% చమురు, ఎల్‌పీజీ రవాణాకు కీలకం.

యుద్ధం మొదలైనప్పటి నుంచి 38 వాణిజ్య నౌకలపై ఈ ప్రాంతంలో దాడి జరిగిందని, అందులో 24 నౌకలు ఇరాన్ దాడులతో, 4 అమెరికా దాడులతో దెబ్బతిన్నాయని, మిగిలినవాటి వివరాలు ఇంకా నిర్ధరణ కాలేదని మారిటైమ్ ఇంటెలిజెన్స్ ఫర్మ్( సముద్ర నిఘా) సంస్థ క్లెప్లర్ బీబీసీ వెరిఫైకి తెలిపింది.

యుద్ధం కారణంగా వందలాది నౌకలు ఈ జలసంధి దాటలేక నిలిచిపోయాయి. ప్రస్తుతం 20,000 మందికి పైగా నావికులు గల్ఫ్‌లో చిక్కుకుపోయారని అంతర్జాతీయ సముద్ర సంస్థ తెలిపింది.

అంతర్జాతీయ సముద్ర చట్టం ప్రకారం, ఓడ యజమానులు తమ సిబ్బంది సంక్షేమానికి, వారిని స్వదేశానికి తిరిగి పంపడానికి బాధ్యత వహించాలి. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే, ఆ బాధ్యత ఏ దేశం జెండా ఉంటే ఆ దేశానిది.. అదీ స్పందించకపోతే చివరకు పోర్ట్ అధికారులపై పడుతుంది.

చాలా మంది ఓడల యజమానులు, జలసంధిలో చిక్కుకుపోయిన తమ సిబ్బంది కోసం సామాగ్రిని సమకూరుస్తున్నారు. లంగరు వేసి ఉన్న ఓడలకు ఆహారం, నిత్యావసరాలను చిన్న పడవల ద్వారా చేరవేస్తున్నారు. కానీ మరికొందరు సరైన సాయం అందించడం లేదు.

"యుద్ధం తీవ్రమైనప్పటి నుంచి హార్ముజ్ జలసంధి, దాని సమీపంలో చిక్కుకుపోయిన వివిధ రకాల వాణిజ్య నౌకల నుంచి 2వేల కంటే ఎక్కువ సాయం చేయమని అభ్యర్థనలు వచ్చాయి" అని ఆపదలో ఉన్న నావికులకు మద్దతు ఇచ్చే ఇంటర్నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఐటీఎఫ్) తెలిపింది.

జీతాలు చెల్లించకపోవడం, ఒప్పంద వివాదాలు, ఇంటికి వెళ్లలేకపోవడం, ఆహారం, నీరు వంటి ప్రాథమిక సామాగ్రి కొరత వంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిపింది.

సిబ్బంది నిజంగానే సముద్రంలో చిక్కుకుపోయి బయటకు వెళ్లలేని స్థితిలో ఉన్నారని అరబ్ వరల్డ్, ఇరాన్‌ ఐటీఎఫ్ నెట్‌వర్క్ కోఆర్డినేటర్ మొహమ్మద్ అర్రాచెడి చెప్పారు.

ప్రస్తుతం ఒమన్ తీరానికి దూరంగా ఒక చిన్న పడవలో లంగరు వేసి ఉన్న ముగ్గురు నావికుల వాయిస్ నోట్స్‌ను ఆయన బీబీసీతో పంచుకున్నారు.

ఆ రికార్డింగ్‌లో తమ వద్ద సరుకులు అయిపోతున్నాయని, నెలలుగా నౌక యజమాని నుంచి ఎలాంటి సమాచారం అందలేదని చెబుతూ ఆ వ్యక్తులు సాయం కోసం వేడుకుంటున్నారు.

"దురదృష్టవశాత్తు సముద్రయాన కార్మికులను వారి మానాన వారిని వదిలేయడమనే ఈ జబ్బును నిర్మూలించడంలో పరిశ్రమ మొత్తం విఫలమైంది" అని అర్రాచెడి అన్నారు.

ఓడ యజమానులు జీతాలు చెల్లించకుండా, , ఆహారం, నీరు, వైద్య సంరక్షణ వంటి నిత్యావసరాలు లేకుండా సిబ్బందిని నిస్సహాయులుగా వదిలివేయడాన్ని పట్టించుకోకపోవడంగా ఐటీఎఫ్ నిర్వచిస్తుంది.

గతేడాది 409 నౌకల్లో మొత్తం 6,223 మంది నావికులను పట్టించుకోకుండా వదిలేశారు. ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న లక్ష వాణిజ్య నౌకల సముదాయంలో ఇది ఒక చిన్న భాగమే అయినప్పటికీ, ఇది ఆందోళనకరమైన ధోరణి అని కార్మిక సంఘం చెబుతోంది.

ఇరాన్

ఫొటో సోర్స్, Rex Pereira

ఫొటో క్యాప్షన్, రెక్స్ పెరీరా నెలల తరబడి తన ఓడలోనే ఉండిపోయారు.

ప్రపంచంలోని అతిపెద్ద అంతర్జాతీయ షిప్పింగ్ సంఘాలలో ఒకటైన బిమ్కోకు చెందిన డేవిడ్ లూస్లీ మాట్లాడుతూ, ఈ పరిశ్రమ అంతర్జాతీయ నిబంధనల ప్రకారం పనిచేస్తున్నప్పటికీ, ప్రమాణాలను పూర్తిగా పాటించని కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయని, దీనివల్ల నావికుల సంక్షేమంపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు.

"భౌగోళిక రాజకీయ ఘర్షణలు సముద్రంలో ఉన్నవారు ఎదుర్కొనే ప్రమాదాలను గణనీయంగా పెంచుతున్నాయి" అని ఆయన అన్నారు.

ఆ ప్రాంతంలో చిక్కుకుపోయిన చాలా మంది సముద్ర కార్మికులను పూర్తిగా వదిలిపెట్టలేదు. అయినప్పటికీ, ఇప్పటికే ఉన్న ప్రమాదకరంగా పరిస్థితిని ఈ యుద్ధం మరింత ప్రమాదకరంగా మార్చింది.

ముంబైకి చెందిన 28 ఏళ్ల రెక్స్ పెరీరాను కూడా సునీల్‌ను నియమించిన ఏజెంట్లే ఆయన్నూ పనిలో పెట్టారు. అయితే ఆయన మరో ఓడలో పనిచేశారు.

యుద్ధం మొదలుకావడానికి నాలుగు నెలల ముందే సముద్రంలో భయంకరమైన పరిస్థితులను అనుభవించానని ఆయన చెప్పారు.

తాగునీరు డీజిల్‌తో కలుషితమైందని, ఆహారం ఎక్స్‌పైర్ అయిపోయిందని, సిబ్బంది ఉపయోగించాల్సిన నీళ్లు ఎంత దారుణంగా ఉన్నయో రెక్స్ పెరీరా ఫోటోలు తీశారు.

ఓడ ఎక్కిన కొద్ది రోజులకే దాన్ని విడిచి వెళ్ళడానికి ఆయన అభ్యర్థించినప్పటికీ, సాయం కోసం చేసిన కాల్స్‌కు ఎటువంటి జవాబు రాలేదు.

అమెరికా

ఫొటో సోర్స్, Rex Pereira

ఫొటో క్యాప్షన్, సిబ్బంది ఉపయోగించాల్సిన నీరు ఎలా కలుషితమైందో రెక్స్ పెరీరా ఫోటోలు తీశారు.

ఆయన్ను నెలల తరబడి సముద్రంలోనే ఉంచారు. యుద్ధం మొదలైనప్పుడు ఆయన ఇరాక్ తీరానికి దూరంగా ఉండగా, సమీపంలోనే మిస్సైల్స్ పడడాన్ని చూశారు.

"మేం ఉన్న చోటు నుంచి ఇరాన్‌ కనిపించింది. మా మీదనుంచి క్షిపణులు అన్ని వైపులా దూసుకుపోయాయి" అని రెక్స్ తెలిపారు.

"భారీ పేలుడు జరిగి, చూట్టూ పొగ కమ్మేసింది, ఓడంతా ఊగిపోయింది. చాలా భయపడ్డాం. సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరినీ సంప్రదిస్తూనే ఉన్నాం" అని ఆయన అన్నారు.

రెక్స్ తన ఓడ యజమాని ఎవరో ఎప్పటికీ తెలుసుకోలేకపోయారు. కానీ ఓ షిప్పింగ్ యూనియన్, భారత రాయబార కార్యాలయం సాయంతో చివరికి భారత్‌కు తిరిగి రాగలిగారు. కానీ ఆయనను ఇంటికి తీసుకురావడానికి ఆయన కుటుంబం ప్రయాణ ఖర్చుల కింద వేల పౌండ్లను చెల్లించాల్సి వచ్చింది.

యజమాని లేని ఓడ

స్కైలైట్ విషయంలో ఆ నౌకకు ఎవరు బాధ్యత వహించారో గుర్తించడం కష్టం.దుబాయ్‌కు చెందిన రెడ్ సీ షిప్ మేనేజ్‌మెంట్ అనే కంపెనీయే ఆ ఓడ యజమాని అని సముద్రయాన ట్రాకింగ్ ప్లాట్‌ఫామ్ అయిన మెరైన్‌ట్రాఫిక్ పేర్కొంది.

ఆ కంపెనీని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించినప్పుడు, ఆ సంస్థకు సంబంధించిన నంబర్‌కు చేసిన కాల్స్‌కు సమాధానం రాలేదు. అలాగే కంపెనీకి ఇచ్చిన ఈ మెయిల్ చిరునామాకు మెయిల్స్ పంపితే అవి తిరిగి వచ్చాయి.

ఆ కంపెనీకి పనిచేసే వెబ్‌సైట్ కూడా ఉన్నట్లు కనిపించడం లేదు.

దాడి జరిగినప్పటి నుంచి ఓడ యజమాని గురించి తమకు ఎలాంటి సమాచారం అందలేదని సునీల్, దలీప్ కుటుంబాలు చెబుతున్నాయి.

ఆంక్షల వల్ల కొన్ని నౌకలు పనిచేసే విధానం మారిపోయిందని, వాణిజ్యాన్ని కొనసాగించడానికి నౌకలు ఎక్కువగా అస్పష్టమైన యాజమాన్య నిర్మాణాలు, మారుతున్న జెండాలు, బీమా సంస్థలు, సంక్లిష్టమైన నిర్వహణ నెట్‌వర్క్‌లపై ఆధారపడుతున్నాయని నిపుణులు అంటున్నారు.

ఈ విధానాలు సమస్యలు వచ్చినప్పుడు నిజంగా బాధ్యత ఎవరిదో గుర్తించడం చాలా కష్టతరం చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.

ఇరాన్ చమురును రవాణా చేసినందుకు గత ఏడాది డిసెంబర్‌లో స్కైలైట్‌పై అమెరికా ఆంక్షలు విధించింది. ఫలితంగా అది ఇన్సూరెన్స్‌ కోల్పోయింది. వాణిజ్య నౌకలపై భద్రత, చట్టపరమైన ప్రమాణాలను అమలు చేయడానికి బాధ్యత వహించే 'ఫ్లాగ్ స్టేట్'ను కోల్పోయింది.

స్కైలైట్‌ నౌకను మిస్సైల్ ఢీకొన్నాకు ఎగసిపడుతున్న పొగ, మంటలు.

ఫొటో సోర్స్, Sunil Pereira

ఫొటో క్యాప్షన్, స్కైలైట్‌ నౌకను మిస్సైల్ ఢీకొనడంతో ఎగసిపడుతున్న పొగ, మంటలు.

ఇన్సురెన్స్ లేకపోతే...

దాడి జరిగే సమయానికి స్కైలైట్‌కు బీమా లేదు, ఏ దేశ హోదా కూడా లేకుండా పోయింది.

"బీమా లేదు కాబట్టి నష్టపరిహారం కూడా ఉండదు" అని విండ్‌వార్డ్‌లో సముద్రయాన విశ్లేషకురాలైన మిషెల్ బాక్‌మాన్ అన్నారు.

ఇక అంతా ఓడ యజమాని మనస్సాక్షిపై ఆధారపడి ఉంటుంది. కానీ ఇలాంటి సందర్భాల్లో యజమానిని కనుగొనడం చాలా కష్టం. ఓడ వెనుక అంతిమంగా ఎవరున్నారో గుర్తించడం అత్యంత కష్టంగా ఉండే దేశాల్లో, వారు ఉద్దేశపూర్వకంగానే కంపెనీ లేయర్స్ ద్వారా యాజమాన్యాన్ని గుర్తించడం కష్టతరం చేస్తారు.

ఇన్సూరెన్స్ లేకపోవడం దలీప్ కుటుంబంపై తీవ్ర ప్రభావం చూపొచ్చు.

సముద్ర చట్టం ప్రకారం, వాణిజ్య నౌకలు సిబ్బంది మరణాలు, గాయాలకు పరిహారం ఇవ్వడానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి. అది లేకపోతే, కుటుంబాలు నష్టపరిహారం పొందడం చాలా కష్టమవుతుంది.

స్కైలైట్ ఎక్కే ముందు, ఆ ఓడకు బీమా ఉందని భారత్‌లోని ఒక రిక్రూటింగ్ ఏజెంట్ చేప్పారని సునీల్ అన్నారు.

"అన్ని పత్రాలు సిద్ధంగా ఉన్నాయని, ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్పారు" అని ఆయన అన్నారు.

బీమా లేని ఓడలో నావికులను ఉంచడం సముద్ర చట్టాన్ని ఉల్లంఘించడమే.

సునీల్‌ను నియమించడంలో పాలుపంచుకున్న ఏజెంట్లలో ఒకరిని బీబీసీ సంప్రదించినప్పుడు ఆయన ఏమన్నారంటే, "ఇన్సూరెన్స్ లేదనే సంగతి మాకు తెలియదు. ఆ బాధ్యత దుబాయ్‌కు చెందిన మరో ఏజెంట్‌ది" అన్నారు.

మేం దుబాయ్‌లోని ఆ ఏజెంట్‌కు ఫోన్ చేసినా, మెసేజ్ పంపినా ఎటువంటి స్పందన రాలేదు.

ఇంకెప్పుడూ సముద్రంలో పనిచేయడానికి వెళ్లనని సునీల్ చెబుతున్నారు.

"దలీప్ కుటుంబాన్ని చూడటానికి వెళ్లే ధైర్యం కూడా లేదు. ఆ ఇంటిని చూస్తే… అతను అక్కడే ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మిస్ అవుతున్నాను" అని సునీల్ చెప్పారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)