అమెజాన్: 6 ఏళ్లలోపు పిల్లలకు ప్రవేశం లేదంటూ పాలుతాగే బిడ్డ ఉన్న మహిళా వ్యాపారవేత్తను నిషేధించిన సంస్థ...

ఫొటో సోర్స్, Rachael Bews
- రచయిత, మిచెల్ లబియాక్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
ఆరేళ్లలోపు పిల్లలను శిక్షణా కార్యక్రమ ప్రాంగణంలోకి అనుమతించమంటూ ఆన్‌లైన్ రిటైల్ వ్యాపార సంస్థ అమెజాన్ పెట్టిన నిబంధన కారణంగా తల్లిపాలు తాగే చిన్నారి ఉన్న ఓ మహిళా వ్యాపారవేత్త ఆ శిక్షణా కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.
స్కాట్లాండ్‌లోని డన్‌ఫెర్టైన్‌లోని అమెజాన్ వేర్‌హౌస్‌లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమానికి తాను 20 వారాల శిశవుతో పాల్గొనాల్సి ఉంటుందని అమెజాన్‌కు వారంరోజుల ముందే తెలియజేశానని రేచెల్ బ్యూస్ చెప్పారు.
కానీ, కార్యక్రమానికి హాజరయ్యేందుకు రైలులో వెళ్తున్న సమయంలో, ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలను ప్రాంగణంలోకి అనుమతించమని ఫోన్ ద్వారా తనకు చెప్పారని ఆమె అన్నారు.
ఈ ఘటనపై అమెజాన్ స్పందిస్తూ ‘‘ప్రయాణానికి ముందు మా క్యాంపస్‌లో ప్రవేశ నిబంధనలను బ్యూస్‌కు స్పష్టంగా తెలియజేయనందుకు మేము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నాం" అని పేర్కొంది.
"అలా జరిగి ఉండకూడదు. ఆమె అసంతృప్తిని మేము అర్థం చేసుకుంటున్నాం. ఆరు సంవత్సరాల లోపు పిల్లలను మా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లలోకి అనుమతించం" అని సంస్థ తెలిపింది.

"ఇది చాలా కాలంగా అమల్లో ఉన్న ఆరోగ్య, భద్రతా విధానం. ఇది సందర్శకులు, ఉద్యోగులు అందరికీ వర్తిస్తుంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా మా సమాచార వ్యవస్థను సమీక్షిస్తున్నాం" అని అమెజాన్ వెల్లడించింది.
శుక్రవారం నిర్వహించిన ఆ కార్యక్రమంలో పాలిచ్చే తల్లుల కోసం ప్రత్యేక లాక్టేషన్ గది ఏర్పాటు చేసినట్లు బీబీసీ 'ది వరల్డ్ టునైట్' కార్యక్రమానికి బ్యూస్ తెలిపారు. అక్కడ ఆమె తన బిడ్డ కోసం పాలను సేకరించుకునే అవకాశం ఉండేదని చెప్పారు.
అయితే తాను అలా చేయాలని ముందుగా ప్రణాళిక రూపొందించుకోలేదని, అందువల్ల పాలను సేకరించేందుకు అవసరమైన సీసాలు లేదా ఇతర పరికరాలు తన దగ్గర లేవని తెలిపారు. అలాగే తల్లిపాలు తాగే ప్రతి శిశువు, సీసా పాలు తాగదని ఆమె అంటారు.
"అన్ని కార్యక్రమాల్లో అందరికీ యాక్సెసబిలిటీ, సమ్మిళితత్వం వంటి అంశాలను సమగ్రంగా పరిగణనలోకి తీసుకోవాలి" అని ఆమె అన్నారు.
"కొత్తగా తల్లి కావడం అంటేనే ఒక సవాలు. అదే సమయంలో వ్యాపారం కూడా నా వ్యక్తిత్వంలో ముఖ్యమైన భాగం. అందువల్ల ఇలాంటి అవకాశాలు నాకు, అలాగే ఉద్యోగాలు, వృత్తుల్లో ఉన్న మరెందరో తల్లులకు అందుబాటులో ఉండటం ఎంతో అవసరం" అని ఆమె చెప్పారు.
ఆరు వారాల ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఆన్‌లైన్‌లో కూడా కొనసాగించవచ్చని తనకు చెప్పారని, కానీ, ప్రత్యక్షంగా పాల్గొనడంలో కొన్ని సౌకర్యాలను తాను మిస్సవుతానని ఆ మహిళా వ్యాపారవేత్త అన్నారు.
"కాఫీ తాగుతూ ముఖాముఖిగా ఏర్పడే పరిచయాలు, మధ్యాహ్న భోజన సమయంలో కలిసే వ్యక్తులు, నా వ్యాపారానికి ఉపయోగపడే సంబంధాలు ఏర్పరుచుకునే అవకాశాన్ని నేను కోల్పోయాను" అని ఆమె తెలిపారు.
ప్రసూతి సెలవు (మెటర్నిటీ లీవ్) అనంతరం తిరిగి ఉద్యోగంలో చేరి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలనుకునే మహిళలు, తిరిగి విధుల్లో చేరే తొలి రోజుకు ముందే తాము పాలిచ్చే తల్లులమని యాజమాన్యానికి తెలియజేయాలని బ్రిటన్ నేేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్‌ఎస్) సూచిస్తోంది.
"శిశువు జననం తర్వాత మీరు తిరిగి ఉద్యోగం, విద్య లేదా శిక్షణలో చేరుతున్నట్లయితే, బిడ్డకు తల్లిపాలు ఇవ్వడాన్ని కొనసాగించగలరా అనే సందేహం రావచ్చు. దానికి సమాధానం అవును. అది కచ్చితంగా సాధ్యమే. చాలామంది మహిళలు అలా చేస్తున్నారు కూడా" అని ఎన్‌హెచ్‌ఎస్ పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























