Ind vs Eng: భారత ఆటగాళ్ల బ్యాటింగ్‌పై ఐపీఎల్ ప్రభావం పడుతోందా ?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మైక్ పీటర్
- హోదా, బీబీసీ స్టోర్ట్స్ జర్నలిస్ట్
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఇంగ్లండ్ తొలిసారి భారత్‌పై టీ20 సిరీస్‌ను గెలుచుకుంది. భారత్ టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా ఐదో ఓటమిని చవిచూసింది.
బ్రిస్టల్‌లో జరిగిన నాలుగో టీ20లో ఇంగ్లండ్‌కు భారత్ 159 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లు ఫిల్ సాల్ట్, కెప్టెన్ హ్యారీ బ్రూక్ రెండో వికెట్‌కు అజేయంగా 144 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం కారణంగా ఇంగ్లండ్ కేవలం 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
బ్రూక్ 35 బంతుల్లో 79 పరుగులు చేయగా తొలి తొమ్మిది బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయని ఫిల్ సాల్ట్ చివరకు 42 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు.
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఇప్పుడు 3-0తో తిరుగులేని ఆధిక్యంలో ఉంది. చెస్టర్-లీ-స్ట్రీట్‌లో వర్షం కారణంగా మొదటి మ్యాచ్ రద్దయిన తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌లను ఇంగ్లండ్ సునాయాసంగా గెలుచుకుంది.
ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఐర్లాండ్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్‌లు ఓడిపోయింది భారత్.

జూన్ ఆరంభంలో భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శ్రేయస్ అయ్యర్‌పై వరుస ఓటములు ఒత్తిడిని పెంచుతున్నాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రేయస్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి 49 బంతుల్లో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి పోరాట పటిమను ప్రదర్శించాడు. అయితే అతనికి ఇతర బ్యాట్స్‌మెన్ల నుంచి తగినంత మద్దతు లభించకపోవడంతో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 158 పరుగులు మాత్రమే చేయగలిగింది.
గత రెండు మ్యాచ్‌ల మాదిరిగానే ఈసారి కూడా భారత బ్యాట్స్‌మెన్లు తొందరపడి గాల్లోకి కొట్టిన షాట్లు నేరుగా ఇంగ్లిష్ ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయి.
చివరి మ్యాచ్‌లో అయినా గెలిచేందుకు...
వైభవ్ సూర్యవంశీ మొదటగా ఔటయ్యాడు. జోఫ్రా ఆర్చర్ వేసిన బంతిని గాల్లోకి లేపి సామ్ కరన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. వైభవ్ సూర్యవంశీ 15 పరుగులు చేశాడు.
కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కాకుండా రెండంకెల స్కోరు సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్ శివమ్ దూబే మాత్రమే. అతను 23 బంతుల్లో 22 పరుగులు చేసి శ్రేయస్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
ఆ తర్వాత విల్ జాక్స్ బౌలింగ్‌లో లాంగ్-ఆన్‌లో ఉన్న టామ్ బాంటన్‌కు క్యాచ్ ఇచ్చి శివమ్ దూబే వెనుతిరిగాడు.
రెండు వికెట్లు తీసుకుని ఇరవై పరుగులు ఇచ్చిన జోఫ్రా ఆర్చర్, తన అద్భుతమైన ఫీల్డింగ్‌తో భారత ఇన్నింగ్స్‌ను ముగించాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్ నుంచి పరుగెత్తుకు వస్తున్న అక్షర్ పటేల్‌ను రనౌట్ చేయడానికి అతను తన కాలితో బంతిని స్టంప్స్ వైపు మళ్లించాడు.
ఈ సిరీస్‌లోని చివరి మ్యాచ్ శనివారం (ఈ నెల 11) సౌతాంప్టన్‌లో జరగనుంది. రెండుసార్లు టీ20 ప్రపంచ చాంపియన్ అయిన భారత్, కనీసం ఒక విజయాన్నైనా సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ముగించాలని ప్రయత్నించనుంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిస్టల్ ఓటమితో శ్రేయస్‌పై ఒత్తిడి
బ్రిస్టల్‌లో ఉత్కంఠభరితమైన సాయంత్రం తర్వాత కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌పై భారత మీడియా, క్రికెట్ అభిమానుల నుంచి మరిన్ని విమర్శలు వస్తున్నాయి.
2023 తర్వాత ఒక్క టీ20 అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోయినప్పటికీ 31 ఏళ్ల శ్రేయస్‌ను ఐర్లాండ్ పర్యటనకు ముందు భారత టీ20 కెప్టెన్‌గా నియమించారు. మార్చిలో జరిగిన టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ను విజయపథంలో నడిపించిన సూర్యకుమార్ యాదవ్ స్థానంలో అతను నియమితుడయ్యాడు. ఇది భారత్‌కు వరుసగా రెండో టీ20 ప్రపంచ కప్ విజయం. 2024లో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ టీ20 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది.
శ్రేయస్ 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఐపీఎల్ టైటిల్‌కు, 2025లో పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్ స్థానానికి నడిపించినప్పటికీ అంతర్జాతీయ స్థాయిలో కెప్టెన్సీ అతనికి సవాలుగా మారింది.
కెప్టెన్‌గా అతని మొదటి మ్యాచ్‌లోనే ఐర్లాండ్ చేతిలో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. రెండో మ్యాచ్‌లోనూ ఒక పరుగు తేడాతో ఓడిపోవడంతో సిరీస్‌ను కూడా చేజార్చుకుంది.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దయింది. కానీ ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌లలో భారత్ పరాజయం పాలైంది.
ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయిన భారత్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో రికార్డు స్థాయిలో 125 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలయింది. బ్రిస్టల్‌లో మరోసారి తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ ఇంతకుముందు కేవలం నాలుగు సార్లు మాత్రమే తొమ్మిది వికెట్ల తేడాతో ఓడిపోయింది.
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఐపీఎల్ పిచ్‌లకు భిన్నంగా ఉన్న వికెట్లపై భారత బ్యాట్స్‌మెన్లు అసౌకర్యంగా కనిపించారు.
వేగంగా పరుగులు చేయాలనే ప్రయత్నంలో వారు భారీ షాట్లు ఆడడానికి ప్రయత్నించి వరుసగా వికెట్లు కోల్పోయారు.
భారత్ తొలి ఆరు వికెట్లు గాల్లోకి లేచిన బంతుల రూపంలో పడిపోయాయి. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ ఇలా అందరూ సులభమైన క్యాచ్‌లు ఇచ్చి ఔటయ్యారు. షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో భారత్ మరోసారి తడబడింది.
భారత బ్యాటింగ్‌లో ప్రణాళికా లోపించిందని, జట్టు ఏ దిశగా వెళ్తోందో తనకు అర్థం కాలేదని మాజీ వికెట్ కీపర్ దీప్ దాస్‌గుప్తా అన్నారు. చివరి రెండు ఓవర్లలో భారత్ కేవలం 8 పరుగులు మాత్రమే చేయగలిగిందన్నారు.
మరోవైపు జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇద్దరికీ ఈ సిరీస్‌కు విశ్రాంతినివ్వడంతో భారత తాత్కాలిక బౌలింగ్ దళం ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లను నిలువరించడంలో విఫలమైంది.

ఫొటో సోర్స్, Getty Images
టీ20లలో మంచి ఫామ్‌ను కొనసాగిస్తున్న ఇంగ్లండ్
శ్రేయస్ అయ్యర్‌పై ఒత్తిడి పెరుగుతోంటే ఇంగ్లండ్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇటీవల న్యూజీలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఓటమి తర్వాత ఆయన భవిష్యత్తుపై ప్రశ్నలు తలెత్తాయి.
గత 22 మ్యాచ్‌ల్లో పందొమ్మిదింట్లో ఇంగ్లండ్ గెలిచింది. భారత్‌తో జరిగిన తొలి టీ20 సిరీస్‌లో విజయం సాధించిన తర్వాత 'ది హండ్రెడ్' టోర్నీకి వెళ్లే ముందు ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం నెలకొంది.
ట్రెంట్ బ్రిడ్జ్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఫిల్ సాల్ట్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తొలి ఓవర్‌లో ఒక్క పరుగు కూడా చేయనప్పటికీ, మూడో ఓవర్‌లో హ్యారీ బ్రూక్ అతనితో జతకట్టిన తర్వాత ఇద్దరూ కలిసి పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు స్కోరును 62/1కి చేర్చారు.
ఆ తర్వాత అతను వేగంగా పరుగులు సాధించి ఎనిమిది, పదో ఓవర్ల మధ్య 52 పరుగులు చేసి మ్యాచ్‌ను భారత్ చేతుల్లోనుంచి పూర్తిగా లాగేసుకున్నాడు.
బ్రూక్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌లో 4 సిక్సర్లు, 8 ఫోర్లు సాధించాడు. అతను వాషింగ్టన్ సుందర్ వేసిన 8వ ఓవర్‌లో వరుసగా 4 ఫోర్లు కూడా కొట్టాడు.
అవుటైన ఏకైక ఇంగ్లండ్ ఆటగాడు వికెట్ కీపర్ జోస్ బట్లర్. అతను అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.
35 ఏళ్ల బట్లర్ ఫామ్ ఇంగ్లండ్‌కు ఆందోళన కలిగిస్తూనే ఉంది. అతని చివరి 18 టీ20 ఇన్నింగ్స్‌లలో సగటు 15.16 మాత్రమే. అతని అత్యధిక స్కోరు 39.
శనివారం జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్‌లకు విశ్రాంతినిచ్చే అవకాశం ఇంగ్లండ్‌కు ఉంటుంది.
అయితే ఈ మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్ గెలిస్తే అది టీ20 ప్రపంచ ర్యాంకింగ్‌లో అగ్రస్థానానికి చేరుకుంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























