ఎండ 40 డిగ్రీలు దాటితే మన శరీరానికి ఏమవుతుంది, వడగాడ్పులు ఎప్పుడు ప్రమాదకరం?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, శివాంగి జైశ్వాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. దేశంలో పలు ప్రాంతాలలో వడగాడ్పులకు సంబంధించి భారత వాతాావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలెర్ట్‌లు జారీ చేసింది.
వడగాల్పులు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు భావిస్తున్నారు.అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని న్యూదిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ఎం. అలీ చెప్పారు.
''తీవ్రమైన వేడి వల్ల ఎవరైనా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడితే.. కలుషితమైన గాలి, వేడి కలిసి ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయనడానికి ఇది సూచన. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయుని తగ్గిస్తుంది. ప్రమాదకరం కావచ్చు" అని తెలిపారు.

''ఆస్థ్మా, రక్తపోటు, గుండె జబ్బుల రోగులకు ఈ సీజన్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే, వడగాడ్పుల సమయంలో గాలిలో తేమ తక్కువగా ఉండటంతోపాటు, కాలుష్య కారకాలు పెరుగుతాయి. వీలైతే, మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ప్రజలు బయటకు వెళ్ల వద్దు " అని డాక్టర్ ఎం. అలీ సూచించారు.
బహిరంగ ప్రదేశాలలో పనిచేసే వారు, స్కూళ్లకు,కాలేజీలకు వెళ్లే విద్యార్థులు పగటి పూట బయటకు వెళ్లడం తప్పనిసరి. ఇలాంటి పరిస్థితిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ అలీ సూచిస్తున్నారు.
"స్లీవ్‌లెస్ బట్టలు వేసుకోవద్దు. మీ శరీరాన్ని పూర్తిగా దుస్తులతో కప్పుకోండి. ప్రజలు నల్ల గొడుగులతో బయటకు వెళ్తారు. ఇది కూడా వేడిని ఎక్కువగా గ్రహిస్తుంది. తెల్ల గొడుగు వాడటం మంచిది. తలను తెల్లటి వస్త్రంతో కప్పుకోవడం కూడా శ్రేయస్కరం" అని చెప్పారు.
''సన్‌స్క్రీన్ వాడే వారు ఎస్‌పీఎఫ్ 50తో ఉన్న సన్‌స్క్రీన్ వాడాలి. అంతకంటే తక్కువున్న సన్‌స్క్రీన్ అసలు వాడొద్దు. అలాగే, ప్రతి మూడు గంటలకు ఒకసారి రాసుకుంటూ ఉండాలి. ఎందుకంటే, మూడు గంటల తర్వాత యూవీ కిరణాలను అడ్డుకునే రక్షణ పోతుంది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇంటిని చల్లగా ఉంచుకోవడం ఎలా?
వేడి నుంచి తప్పించుకోవడానికి చాలా మంది ఇంట్లోనే ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఉష్ణోగ్రతను నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
రాత్రివేళ వీచే గాలితో మీ ఇంటిని చల్లబరుచుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది. దీని కోసం చీకటి పడ్డాక కిటికీలు తెరవాలి. అలాగే, పగటిపూట సూర్యుని వేడి ఇంట్లోకి రాకుండా తలుపులు మూసి ఉంచుకోవాలని సూచించింది.
పరిసర ఉష్ణోగ్రత 40 డిగ్రీల కంటే తక్కువుంటే, ఇంట్లో ఫ్యాన్లు శరీరాన్ని చల్లగా ఉంచుతాయని గుర్తుంచుకోండి.
కానీ, ఉష్ణోగ్రత దాన్ని మించిపోతే, ఫ్యాన్లు శరీరాన్ని చల్లబరచడానికి బదులు వేడి చేయవచ్చు. ఇలాంటి సందర్భాలలో కూలర్ లాంటివి వాటిని ఉపయోగించాలి.
ఒకవేళ ఏసీ ఉంటే.. బాగా తక్కువ ఉష్ణోగ్రతలను సెట్ చేయకుండానే మీ ఇల్లు చల్లగా ఉండేలా చూసుకోవచ్చు.
మీ ఏసీని 27 డిగ్రీల సెల్సియస్‌కు సెట్ చేసి, ఫ్యాన్‌ను ఆన్ చేస్తే.. నాలుగు డిగ్రీల తక్కువ అంటే 23 డిగ్రీల చల్లదనం లభిస్తుంది. దీనివల్ల మీకు విద్యుత్ కూడా ఆదా అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
కూల్ డ్రింక్స్ మీ శరీరాన్ని చల్లబరచవు
వేసవిలో ఏం తినాలనే దానికంటే, ఏం తినకూడదనే విషయంపైనే ఎక్కువ దృష్టి పెట్టాలని డాక్టర్ అలీ వివరించారు.
కేలరీలు, కొవ్వు, సోడియం అత్యధికంగా ఉన్న ఆహారాలకు సాధారణంగా దూరంగా ఉండాలి. కొవ్వు, కేలరీలు ఎక్కువగా ఉండటం వల్ల అవి జీర్ణం కావడం కష్టమవుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత పెరిగి, మరింత వేడిగా, నీరసంగా అనిపించవచ్చు.
రాక్ సాల్ట్ వాడకాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. అలాగే, ఆహార పరిమాణాన్ని కూడా తగ్గించుకోవాలి. శరీరాన్ని చల్లగా, శక్తిమంతంగా ఉంచుకోవడానికి.. ఇలాంటి వాతావరణంలో ఖాళీ కడుపుతో లేదా భోజనం చేసిన వెంటనే బయటకు వెళ్లడం మానుకోవాలని డాక్టర్ అలీ చెప్పారు.
తీవ్రమైన వేడి సమయంలో కెఫైన్‌ను, ఆల్కహాల్‌ను ఎక్కువగా తీసుకోవద్దని డబ్ల్యూహెచ్ఓ సూచించింది.
మీకు దాహంగా లేకపోయినా ప్రతి గంటకు కనీసం ఒక కప్పు నీరు తాగాలి. తగినంత ద్రవ పదార్థాలను తీసుకోవాలి. రోజంతా కనీసం 2నుంచి 3 లీటర్ల నీరు తాగడం చాలా అవసరం.
"చల్లని పానీయాలు లేదా చల్లటి బీరు చల్లగా ఉంచుతాయని యువత భావిస్తారు. కానీ, ఆ రెండింటిలోనూ అధిక మొత్తంలో చక్కెర ఉంటుంది. ఇది శరీరం నుంచి నీటిని తీసివేసి డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది" అని డాక్టర్ అలీ చెప్పారు.
దీనికి బదులుగా సత్తు రసం (వేయించిన శెనగలు, బార్లీ వంటి ధాన్యాలను పొడిగా చేసి తయారు చేసే పానీయం), సొరకాయ రసం, మజ్జిగ వంటివి తాగాలని డాక్టర్ సలహా ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
చెమట పట్టకపోతే అలర్ట్ అవ్వాలి
శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ చేరుకుంటే, వడదెబ్బ తగులుతుందని బీబీసీ ఓ కథనంలో పేర్కొంది. ఇలాంటి పరిస్థితిలో, తక్షణమే వైద్య సాయం తీసుకోవాలి.
మీకు కనుక ఈ లక్షణాలు ఉంటే, వైద్యుడిని సంప్రదించాలి..
- చెమట పట్టకపోవడం – ఇలాంటి పరిస్థితిలో వేడిగా అనిపించినా, శరీరం పొడిగా మారుతుంది.
- శ్వాస తీసుకోవడం ఇబ్బంది
వడదెబ్బ వల్ల స్పృహ కోల్పోవడం, కీలకమైన అవయవాలకు శాశ్వతంగా ఇబ్బంది, తీవ్రమైన కేసుల్లో మరణం కూడా సంభవించవచ్చు.
ఈ పరిస్థితిలో, మీ శరీరాన్ని వెంటనే చల్లబరచుకోవాలి. మీ శరీరం కనుక తట్టుకోలేని ఉష్ణోగ్రతకు వేడెక్కుతున్నట్లయితే.. తలనొప్పి, తల తిరగడం, ఆకలి లేకపోవడం, వికారంగా అనిపించడం, చెమట ఎక్కువ పోయడం, కండరాల నొప్పులు, శ్వాస వేగంగా తీసుకోవడం, ఎక్కువగా దాహం వేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఇలాంటి పరిస్థితిలో, వెంటనే మీ పనులను తగ్గించుకుని, శరీర ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తెచ్చుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇందుకోసం వెంటనే చల్లని ప్రదేశానికి వెళ్లాలి లేదా శరీరాన్ని తడి గుడ్డతో తుడవాలి.

ఫొటో సోర్స్, Getty Images
40 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద మీ శరీరం ఎలా పనిచేస్తుంది?
వడగాడ్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి, బీబీసీ హెల్త్, సైన్స్ ప్రతినిధి జేమ్స్ గల్లాఘర్ 2023లో సౌత్ వేల్స్ యూనివర్సిటీలోని ఒక ఎన్విరాన్‌మెంట్ ఛాంబర్‌లో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతను కృత్రిమంగా సృష్టించి పరిశీలించారు.
శాస్త్రీయ పరికరాల పర్యవేక్షణలో ఛాంబర్ ఉష్ణోగ్రతను క్రమంగా 21 డిగ్రీల సెల్సియస్ నుంచి 40.3 డిగ్రీల సెల్సియస్‌కు పెంచినట్లు బీబీసీ కథనంలో రాశారు. అప్పుడు వెల్లడైన విషయాలు...
- మెదడుకు రక్తప్రవాహం 8.5 శాతం తగ్గింది.
- శ్వాస తీసుకునే రేటు నిమిషానికి 10 నుండి 15కి పెరిగింది.
- హృదయ స్పందన రేటు నిమిషానికి 54 నుండి 87 సార్లకు పెరిగింది.
- శరీర ఉష్ణోగ్రత 36.2 నుంచి 37.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.
- ఒక గంట ప్రయోగంలో 400 మిల్లీలీటర్ల చెమట ఉత్పత్తి అయ్యింది.
- చర్మ ఉష్ణోగ్రత 31.3 నుండి 35.4 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంది.
- ఈ ప్రయోగంలో, పరీక్షించిన గరిష్ట ఉష్ణోగ్రత వద్ద మెమరీ పజిల్ స్కోరు 23/30 నుంచి 17/30 వరకు ఉంది. ఇది మెదడు గుర్తుంచుకునే సామర్థ్యంపై ఉష్ణోగ్రత చూపించే ప్రభావాన్ని తెలియజేస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























