ఘోస్ట్ సిమ్: సజ్జనార్ చెప్పిన ఈ సిమ్‌కార్డ్ ఏమిటి? మీ పేరుతో అలాంటిది ఉందో లేదో తెలుసుకోవడం ఎలా

సిమ్, ఘోస్ట్ సిమ్ కార్డ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, షేక్ అన్సారి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఘోస్ట్‌ సిమ్‌ కార్డుల నెట్‌వర్క్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌ సిటీ పోలీస్ క్రైమ్‌ విభాగం ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0ను నిర్వహించింది.

సైబర్‌ నేరాలకు పాల్పడుతున్న ఘోస్ట్‌ సిమ్‌ వ్యవస్థపై ఆపరేషన్‌ ఆక్టోపస్‌ 3.0 చేపట్టి ఆ నెట్ వర్క్‌ను ఛేదించామని, 75 కేసుల్లో ఇన్వాల్వ్ అయిన 1194 ఘోస్ట్ సిమ్‌లను గుర్తించి, 13 రాష్ట్రాల్లో రైడ్ చేసి 66 మందిని అరెస్ట్ చేశామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మీడియా సమావేశంలో చెప్పారు.

వీరిలో 44మంది ఘోస్ట్‌ సిమ్‌కార్డుల వినియోగదారులు, 20 మంది పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ ఏజెంట్లు లేదా టెలికం ప్రమోటర్లు, ఇద్దరు సిమ్‌కార్డుల సరఫరాదారులు ఉన్నట్టు సీపీ సజ్జనార్ వెల్లడించారు.

554 సిమ్‌లను సీజ్ చేసినట్లు చెప్పారు.

ఇంతకీ ఘోస్ట్ సిమ్ అంటే ఏంటి? దాన్ని నేరగాళ్లు ఎలా సంపాదిస్తారు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఘోస్ట్ సిమ్ కార్డ్, సీపీ సజ్జనార్

ఫొటో సోర్స్, V.C. Sajjanar,IPS/X.com

ఘోస్ట్ సిమ్ అంటే?

"ఒకరి పేరుమీద నమోదు అయిన సిమ్ కార్డును, మరొకరు నేర కార్యకలాపాలకు ఉపయోగిస్తే దాన్ని ఘోస్ట్ సిమ్ అంటారు" అని హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబు ‘బీబీసీ’తో చెప్పారు.

సైబర్ నేరాలకు గురైనప్పుడు ఏం చేయాలి? ఎవరికి ఫిర్యాదు చేయాలి? అసలు నేరగాళ్ల బారినపడకుండా ఉండాలంటే ఏం చేయాలనే వివరాలనూ ఆయన తెలిపారు.

బయోమెట్రిక్‌

ఫొటో సోర్స్, Getty Images

మనకి తెలియకుండా ఎలా తీసుకుంటారు?

"వినియోగదారులు కొత్త సిమ్‌ తీసుకోవడానికి వచ్చినప్పుడు లేదా మొబైల్‌ పోర్టబులిటీ కేవైసీ కోసం వచ్చినప్పుడు వారికి తెలియకుండా అదనపు సిమ్‌కార్డును యాక్టివేట్‌ చేస్తున్నారు.

కస్టమర్ల నుంచి బయోమెట్రిక్‌ తీసుకునే క్రమంలో నెట్‌వర్క్‌ సరిగా లేదు, సర్వర్‌ డౌన్‌ అయింది, వేలిముద్ర సరిగా పడడం లేదంటూ నమ్మబలికి, రెండు మూడు బయోమెట్రిక్‌లు తీసుకుంటున్నారు.

మారుమూల గ్రామాల్లో, గిరిజన ప్రాంతాల్లో ఏకంగా క్యాంపులు ఏర్పాటు చేసి మరీ నిరుపేదలను, నిరక్షరాస్యులను లక్ష్యంగా చేసుకుని వారి ఆధార్‌, బయోమెట్రిక్‌లు తీసుకుని వారిపేరుమీద రెండు సిమ్‌లు తీసుకుంటున్నారు.

ఇంటర్‌నెట్‌ ఉచితంగా ఇస్తామని ఆశచూపి కూడా అమాయకుల పేర్ల మీద సిమ్‌కార్డులు సృష్టిస్తున్నట్టు పోలీసు విచారణలో తేలింది" అని హైదరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు.

సైబర్ నేరగాళ్లు, ఈ-సిమ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఘోస్ట్ సిమ్‌ నేరగాళ్లకి దొరికితే..

"ఇలా అక్రమంగా యాక్టివేట్ చేసిన సిమ్ కార్డులను సైబర్ నేరగాళ్లు భౌతికంగా విదేశాలకు తరలించాల్సిన అవసరం లేకుండానే.. ఆధునిక సాంకేతికత సాయంతో సాధారణ సిమ్ కార్డులను యాక్టివేట్ చేసిన వెంటనే, వాటిని ఈ-సిమ్‌లుగా మారుస్తున్నారు.

విదేశాల్లో కూర్చున్న ప్రధాన సైబర్ ముఠాలకు క్షణాల్లో చేరవేస్తున్నారు.

తద్వారా ఆయా దేశాల్లో ఉండే ముఠాలు ఎలాంటి ఫిజికల్ సిమ్ కార్డు లేకుండానే, మన దేశపు మొబైల్ నంబర్లను తమ ఫోన్లలో స్వేచ్ఛగా వాడుకుంటున్నాయి" అని సీపీ సజ్జనార్ వెల్లడించారు.

స్కామ్

ఫొటో సోర్స్, Getty Images

ఈ-సిమ్‌తో చేసే నేరాలేంటి?

"ఈ ఇండియన్ నంబర్లతో వాట్సాప్, టెలిగ్రామ్ ఖాతాలు తెరవడంతో పాటు.. మ్యాట్రిమోనియల్ సైట్లు, ప్రముఖ డేటింగ్ యాప్స్‌లో నకిలీ ప్రొఫైల్స్ సృష్టించి అమాయకులకు సైబర్ వల వేస్తారు. వారి నుంచి లక్షలు, కోట్ల రూపాయలు కొల్లగొడతారు.

కొన్ని సందర్భాల్లో న్యూడ్ వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిల్ చేసే 'సెక్స్‌టార్షన్' ముఠాలు, సీబీఐ పోలీసులమంటూ భయపెట్టే 'డిజిటల్ అరెస్ట్' ముఠాలు సైతం ఈ నంబర్లనే వాడుతున్నాయి.

నంబర్ మన దేశానిదే కావడంతో బాధితులు సులభంగా నమ్మి మోసపోతున్నారు" అని సజ్జనార్ చెప్పారు.

ఇదంతా ఒక పక్కా వ్యూహంతో జరుగుతుంది. తమ టార్గెట్ మేరకు వేలాది సిమ్ కార్డుల యాక్టివేషన్ ప్రక్రియ పూర్తికాగానే, ఆ సిమ్ కార్డులను జారీ చేసిన లోకల్ ఏజెంట్లు రాత్రికి రాత్రే తమ దుకాణాలు మూసేసి, బోర్డులు తిప్పేస్తున్నారని ఆయన తెలిపారు.

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

సైబర్ క్రైమ్‌బారిన పడితే...

"ఒకవేళ సైబర్ నేరానికి గురైతే గోల్డెన్ అవర్ అయిన మొదటి గంటలోనే 1930కు కాల్ చేయాలి లేదంటే cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలి.

గంట లోపు ఫిర్యాదు చేయగలిగితే వాళ్ల డబ్బు తిరిగి పొందే అవకాశం ఎక్కువ ఉంటుంది.

ప్రజలందరూ సైబర్ క్రైమ్ గురించిన అవగాహనతో ఉండాలని కోరుతున్నా"అని సజ్జనార్ అన్నారు.

ఈ ఘోస్ట్‌ సిమ్‌ నెట్‌వర్క్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని ఎయిర్‌టెల్‌, జియో, వోడాపోన్‌ ఐడియా వంటి టెలికాం సర్వీస్‌ ప్రొవైడర్ల ఉన్నతాధికారులతో సమావేశం కావాలని నిర్ణయించామని, అలాగే డీవోటీ, ట్రాయ్‌వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను సంప్రదించి, నిబంధనల్లోని లోపాలను సరిదిద్దాలని, కేవైసీ ప్రక్రియను మరింత కఠిన తరం చేయాలని కోరనున్నట్లు సీపీ పేర్కొన్నారు.

సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌

ఫొటో సోర్స్, V.C. Sajjanar,IPS/X.com

ఫొటో క్యాప్షన్, సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌ బాబు

తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

ఇలాంటి సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలనేది సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్‌ బాబు ‘బీబీసీ’కి వెల్లడించారు.

"పబ్లిక్ అవేర్‌నెస్ ఇంపార్టెంట్. మీ పేరు మీద ఎన్ని సిమ్‌లు ఉన్నాయో సంచార్‌సాథీ పోర్టల్‌లో చెక్ చేసుకుని, ఒకవేళ మీకు తెలియకుండా వేరే సిమ్‌లు కూడా మీపేరు మీద ఉంటే వెంటనే డిస్‌కనెక్ట్ చేయించుకోవాలి.

సిమ్ కొనేటప్పుడుగానీ, ఒక పోర్టల్ నుంచి ఇంకో పోర్టల్‌కి మారేటప్పుడు గానీ జాగ్రత్తగా ఉండాలి. అక్కడ అడిషనల్ సిమ్ జెనరేట్ చేసే ప్రమాదం ఉంది.

కాబట్టి బయోమెట్రిక్ రెండోసారి అడుగుతున్నారంటే, అంటే ఒకసారి థంబ్ ప్రింట్ తీసుకుని, ఇంకోసారి కూడా థంబ్ ప్రింట్ కావాలన్నారంటే ఎందుకు అని అడగాలి.

లేదంటే మీ సిమ్ మిస్ యూజ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే జాగ్రత్తగా ఉండాలి" అని ఆయన చెప్పారు.

"అలాగే యువతకు, వృద్ధులకు, లేదంటే చదువుకోనివారికి చెప్పేదెంటంటే ఫ్రీ ఆఫర్స్ అని, తక్కువ పెట్టుబడిపెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని, లేదంటే లాటరీ తగిలింది అని మీకెవరైనా కాల్, లేదా ఎస్ఎమ్ఎస్ చేసినా నమ్మకండి.

సోషల్ మీడియాలో కూడా చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తుంటాయి. వాటిపట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి.

అలాగే డిజిటల్ అరెస్ట్ అని ఎవరైనా కాల్ చేసినా భయపడకుండా లోకల్ పోలీసులను కాంటాక్ట్ చేయాలి.

ఈ విధంగా చేస్తే సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా ఉండొచ్చు" అని డీసీపీ అరవింద్ సూచించారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)