AI: ఇది మనం ఊహించుకున్నంత 'స్మార్ట్' కాదా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, యాన్ లెకన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చాట్ జీపీటీ, క్లాడ్, జెమినై లాంటి చాట్ బాట్లు మానవ మేధకు ప్రత్యామ్నాయం కాదని నిపుణులు చెబుతున్నారు.
    • రచయిత, బెన్ మోరిస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

"భౌతిక ప్రపంచాన్ని అర్థం చేసుకోవడంలో ఎలుకలో ఉండే సామర్థ్యం ఉన్న రోబోట్‌లు మన దగ్గర లేవు" ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ప్రముఖుల్లో ఒకరైన యాన్ లెకన్ అభిప్రాయమిది.

ఆయన మెటాలో పదేళ్ల పాటు ఏఐ చీఫ్ సైంటిస్ట్‌గా పని చేశారు. 2025లో మెటాను వదిలి అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ (ఏఎంఐ ల్యాబ్స్)ను ఏర్పాటు చేశారు.

ChatGPT, Claude, Gemini వంటి వాటిని దాటి AIని ముందుకు తీసుకెళ్లడమే ఆయన లక్ష్యం.

వాటి వల్ల ఉండే ఉపయోగాలు ఉన్నప్పటికీ ఇంటి పనులు చేయడంలాంటి నిజ జీవితంలోని సంక్లిష్ట పరిస్థితులను అవి ఎన్నటికీ పరిష్కరించలేవని ఆయన అంటున్నారు.

"అవి తెలివి తేటల్లో మనుషుల స్థాయి లేదా మేధస్సుకు సమానం కావు. కనీసం జంతువుల స్థాయి మేధస్సు కూడా లేదు. ఎందుకంటే అవి వాస్తవ ప్రపంచంలో డేటాతో డీల్ చేయలేవు. వాటిని అందుకోసం నిర్మించలేదు" అని ఆయన ఫ్రాన్స్‌లో జరిగిన 'వివాటెక్' టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో బీబీసీతో చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

అందుకే పారిస్‌కు చెందిన 'ఏఎంఐ ల్యాబ్స్'... చాట్‌జీపీటీ దాని పోటీదారుల వెనుక ఉన్న సాంకేతికతపై ఆధారపడని కొత్త రకం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను అభివృద్ధి చేసే పనిలో ఉంది. దీనికి భవిష్యత్, మార్కెట్ ఉందని ఇన్వెస్టర్లు భావిస్తున్నారు.

అమెరికన్ కంప్యూటర్ చిప్ కంపెనీ ఎన్‌విడియా, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సహా ఇతర పెట్టుబడిదారుల నుంచి రూ. 9,560 కోట్లు సేకరించినట్లు ఏఎంఐ ల్యాబ్స్ ఈ ఏడాది ఆరంభంలో ప్రకటించింది.

స్టార్టప్‌లకు నిధుల సేకరణలో భాగంగా వచ్చే తొలిదశ పెట్టుబడులకు సంబంధించి యూరప్‌లో ఒక స్టార్టప్‌కు ఈ స్థాయిలో నిధులు రావడం ప్రముఖంగా నిలిచింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, యాన్ లెకన్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, యాన్ లీకున్ ఏఎంఐ ల్యాబ్స్ ఏర్పాటు చేసి కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.

చాట్‌జీపీటీ వంటి లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కోడింగ్, గణిత సమస్యలు, టెక్స్ట్ జనరేట్ చేయడం వంటి కొన్ని విషయాలలో చాలా బాగా పనిచేస్తాయని లెకన్ చెప్పారు.

ఈ సమస్యలన్నీ ముందే ఉన్నాయని, ఊహించదగినవేనని ఆయన చెబుతున్నారు.

"అవి (ఎల్ఎల్ఎంలు) ప్రాథమిక జ్ఞానాన్ని సంపాదించుకుంటాయి. అది దేన్నైనా అర్థం చేసుకోగలవు. అలా చేయడానికి వారు వాటికి శిక్షణ ఇస్తారు. అవేమీ తెలివైనవి కాదు. వాటికి అంతర్లీన అవగాహన శక్తి ఉండదు" అని లెకన్ అభిప్రాయపడ్డారు.

భౌతిక ప్రపంచంలో ఏదైనా జరిగినప్పుడు దానికి రకరకాల ప్రతిచర్యలు ఉంటాయి. వాటిని అవగాహన చేసుకోవడానికి మరింత సరళమైన కృత్రిమ మేధస్సు అవసరం అంటారాయన.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, యాన్ లెకన్

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images

ఫొటో క్యాప్షన్, హ్యూమనాయిడ్ రోబోట్లు భౌతిక ప్రపంచంలో మానవ అవసరాలకు అనుగుణంగా పని చేయాలంటే వాటికి కొత్త ఏఐ టెక్నాలజీ అవసరం ఉంది.

నిటారుగా ఉన్న ఒక పెన్ను కొనను లెకన్ పట్టుకున్నారు. దాన్ని వదిలేస్తే ఏమవుతుందని అడిగితే అది పడిపోతుందని పిల్లవాడు కూడా చెబుతాడు. కానీ అది ఏ దిశలో, ఎలా పడుతుందో మనుషులెవరూ పట్టించుకోరు. ఎందుకంటే అలా కచ్చితంగా శాస్త్రీయంగా చెప్పగలిగే మార్గాలేమీ లేవు.

అయితే ఎల్ఎల్ఎంలు పెన్ను ఎలా పడుతుందో చెప్పడానికి దాని దగ్గరున్న డేటా ఆధారంగా పెన్ కదలికను బట్టి ఒక అంచనాను రూపొందించే ప్రయత్నం చేస్తాయి.

ఈ అంచనా కచ్చితంగా తప్పవుతుంది. ఎందుకంటే పెన్ను కింద పడటం అనేది ఎల్ఎల్ఎంల దగ్గరనున్న డేటాను బట్టి కాకుండా భౌతిక పరిస్థితులను బట్టి ఉంటుంది.

ఎల్ఎల్ఎంలు భౌతిక వాస్తవికత గురించి ఆలోచించలేవు. అది తన దగ్గరున్న డేటాకు ఆమోదయోగ్యంగా ఉండే సూచన మాత్రమే ఇస్తుంది. తమ కంపెనీ అభివృద్ధి చేస్తున్న జాయింట్ ఎంబెడింగ్ ప్రిడిక్టివ్ ఆర్కిటెక్చర్ అనే వ్యవస్థ అలాంటి సమస్యలను పరిష్కరిస్తుందని లెకన్ చెప్పారు.

ఇది వాస్తవ ప్రపంచపు సాధారణ భావనలను సృష్టిస్తుంది. వాటి ద్వారా చర్యల ఫలితాలను అంచనా వేస్తుంది. అయితే వీటి రూపకల్పన చాలా సంక్లిష్టంగా ఉంటుంది. అయినప్పటికీ అవి పనికిరాని సమాచారాన్ని వడపోసి ప్రపంచానికి పనికొచ్చే వాటినే ఏఐకి అందిస్తాయి.

పెన్ను విషయాన్నే తీసుకుంటే, అది ఏవైపు పడుతుందో అంచనా వేయడానికి ప్రయత్నించడంలో ప్రయోజనం లేదని ఏఐకి తెలుస్తుంది.

మరింత సరళంగా ఉండే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను నిర్మించడం రోబోటిక్స్ పరిశ్రమకు ప్రాథమిక ప్రాధాన్య అంశం

హ్యూమనాయిడ్ రోబోట్‌లను నిర్మించడానికి అనేక సంస్థలు బిలియన్ల డాలర్లు పెట్టుబడి పెట్టబడ్డాయి. అవి ప్రతీ ఏటా మరింత ఆకట్టుకునేలా తయారవుతున్నాయి.

అయితే ఎలాంటి ప్రమాదం జరక్కుండా ఇస్త్రీ చేయడం లేదా డిష్‌వాషర్‌లో సామాన్లు సర్దడం వంటి ఇంటి పనులను చేసేలా వాటికి శిక్షణ ఇవ్వడం కష్టం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.ప్రస్తుత ఏఐ నమూనాలు అలాంటి పనులు ఎన్నటికీ చేయలేవనేది లెకన్ అభిప్రాయం.

"రోబోట్స్‌కి ఎల్‌ఎల్‌ఎంలు శుద్ధ దండగ" అని ఆయన అన్నారు.

"కేవలం ఎల్ఎల్ఎమ్‌లను విస్తరించడం ద్వారా మనం మానవాతీత మేధస్సును సాధించడం ఎన్నటికీ జరగదు" అని లెకన్ అభిప్రాయపడ్డారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీలో అనేకమంది ఆయన అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.

అలాంటి వారిలో ఇంగ్మార్ పోస్నర్ ఒకరు. ఆయన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అప్లైడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రొఫెసర్. అప్లైడ్ ఏఐ ల్యాబ్‌ డైరెక్టర్. అమెజాన్ స్కాలర్ కూడా.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, యాన్ లెకన్

ఫొటో సోర్స్, Ingmar Posner

ఫొటో క్యాప్షన్, ఇంగ్మార్ పోస్నర్ ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఒక కొత్త ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేస్తున్న బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.

"రాబోయే పదేళ్లలో ఏఐ వ్యవస్థలు మనం అడిగింది చేయడం కాదు. అది ఎలా చేస్తున్నామో వివరించేలా ఉంటాయి. అవి ఏది ముఖ్యం? దేని వల్ల ఏం జరుగుతుంది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పవచ్చు" అని పోస్నర్ అన్నారు

పోస్నర్‌తో పాటు ఆయన10 మంది రీసర్చర్స్ టీమ్ వరల్డ్ మోడల్స్ అనే ఏఐ ప్రత్యామ్నాయంపై నాలుగేళ్లుగా పని చేస్తోంది.

వరల్డ్ మోడల్స్ అనే కాన్సెప్ట్ కొన్ని దశబ్ధాలుగా ఉంది. 2018లో డేవిడ్ హా, జుర్దెన్ ష్మిధూబర్ ప్రచురించిన ఓ పత్రం దీనికి ప్రేరణగా నిలిచింది.

మెషిన్ లెర్నింగ్ కంప్యూటింగ్ శక్తిలో వచ్చిన పురోగతితో ప్రపంచం ఎలా కనిపిస్తుందో దాని గురించి నేర్చుకున్న, "మానసిక" అనుకరణ ఆధారంగా మాత్రమే ఒక ఏఐ ఏదైనా ఎలా చేయాలో నేర్చుకోగలదనేది వారి ఆలోచన

ఆ ఆలోచనే 2108 నుంచి గూగుల్‌కి చెందిన డ్రీమర్ వరల్డ్ మోడల్ సహా ప్రపంచంలోని అనేక మోడల్స్‌కి ప్రోత్సాహకంగా పని చేసింది.

తమ బృందం అభివృద్ధి చేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ మరో ముందడుగు అవుతుందని పోస్నర్ ఆశిస్తున్నారు. ఆయన దానిని "మెకానిస్టిక్ వరల్డ్ మోడల్" అని పిలుస్తున్నారు. ఇది జ్ఞానాన్ని ఏఐ సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగేలా క్రమబద్ధీకరిస్తుంది.

"అవసరమైనప్పుడు జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి, కలపడానికి, సవరించడానికి వీలుగా దానిని విభజించి వ్యవస్థీకరించే వ్యవస్థలు అవసరం" అని పోస్నర్ చెప్పారు.

ఈ కొత్త నమూనాలను అభివృద్ధి చేయడానికి ఎంత సమయం పడుతుందో చెప్పడం చాలా కష్టం అని ఆయన అన్నారు.

మీరు 2017 లేదా 2018లో ఎవరినైనా చాట్ జీపీటీ లాంటిది రావడానికి ఎంత సమయం పడుతుందని అడిగి ఉంటే, వాళ్ళు 'దశాబ్దాలు పడుతుంది' అని చెప్పేవారు. చాట్ జీపీటీ ఒరిజినల్ వెర్షన్ 2022 నవంబర్‌లో మొదలైంది.

వరల్డ్ మోడల్స్‌పై ఇతర పరిశోధనలను డీప్ మైంట్ తన జీనీ మోడల్‌తో చేస్తోంది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అడ్వాన్స్డ్ మెషీన్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్, యాన్ లెకన్

ఫొటో సోర్స్, Getty Images

లండన్‌కు చెందిన వేవ్ సంస్థకు గైయా అనే సిస్టమ్ ఉంది.

ఏఐ మార్గదర్శకురాలైన ఫీ-ఫీ లీ ఒక కొత్త ఏఐ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి 2023లో శాన్ ఫ్రాన్సిస్కోలో వరల్డ్ ల్యాబ్స్ స్థాపించారు.

ఈ ఏడాది తాము ఏఐ మోడల్ మెరుగుపరిచేందుకు ప్రయత్నిస్తామని, వచ్చే ఏడాది దాన్ని పారిశ్రామిక రంగంలోకి తీసుకువస్తామని లెకన్ చెబుతున్నారు.

అది విజయవంతమైతే, అప్పుడు పెద్ద పెద్ద ఆలోచనలు చేయాల్సి రావచ్చు.

అంటే రోబోలు స్వతంత్రంగా పనిచేయగలిగితే మనుషులకు ఏమవుతుంది?

"ఏ ప్రశ్నలు అడగాలో, ఏం నిర్మించాలో, ఏం సృష్టించాలో తెలుసుకోవడానికి మనుషుల మేధ ఎప్పటికీ అవసరమే" అని ఆయన చెప్పారు.

‘‘ఏఐ కేవలం మన కోసం పనిచేస్తుంది అంతే’’ అని ఆయన అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)