'రొమ్ముల సర్జరీ తర్వాత నన్ను నేను చూసుకోగానే ఏడుపొచ్చేసింది', వక్షోజాల సైజు తగ్గించుకున్న ఈ మహిళలు ఏమంటున్నారు?

ఫొటో సోర్స్, Ranvia
- రచయిత, రాచెల్ ఫ్లిన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
తనకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఐస్‌క్రీమ్ అమ్మే ఓ వ్యక్తి తనను చూసి అసభ్యంగా ఈల వేసిన చేదు జ్ఞాపకం ఇప్పటికీ రన్వియాను వెంటాడుతూనే ఉంది.
ఆమె కాస్త ముందుగానే యుక్త వయసుకు వచ్చేశారు. ఆ సమయంలో తన రొమ్ముల సైజు (పరిమాణం) ఇతరులు తనను చూసే విధానాన్ని, తనను తాను చూసుకునే విధానాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఆమె చెప్పారు.
స్కూలులో అబ్బాయిలు తన రొమ్ములను చూసి వివిధ రకాల పేర్లు పెట్టేవారు. ఆమె అనుమతి లేకుండానే వాటిని తాకడం, నొక్కడం వంటివి చేసేవారు.
''నేనింకా చిన్నదాన్నే. కానీ, అకస్మాత్తుగా నా శరీరంలోని ఈ రెండు భాగాలు అందరి దృష్టి నా మీద పడేలా చేశాయి, అప్పటికి నేను మానసికంగా సిద్ధంగా లేను'' అని రన్వియా అన్నారు.
ఇంగ్లండ్‌లోని లీసెస్టర్‌లో ఒక దక్షిణాసియా కుటుంబంలో పెరిగిన రన్వియా.. తన స్కూల్ స్నేహితుల మాదిరిగా దుస్తులు వేసుకోలేకపోతున్నందుకు ఇబ్బందిపడిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.


ఫొటో సోర్స్, Ranvia
''నా రొమ్ములు ముందుకొచ్చినట్లు కనిపిస్తాయని నేను కొన్ని రకాల దుస్తులు వేసుకోలేకపోయేదాన్ని. అమ్మ కూడా అలాంటి దుస్తుల్లో చూస్తే కంగారుపడేది, అలాంటివి వేసుకోవద్దని చెప్పేది'' అని ఆమె చెప్పారు.
అవి శారీరకంగానూ ప్రభావం చూపేవి. రన్వియాకు నడుం నొప్పి వచ్చేది. ఆమె బ్రా పట్టీలు ఒత్తుకుపోయేవి. వ్యాయామం చేయడం కూడా కష్టంగా ఉండేది.
అంతేకాక, ఏడీహెచ్‌డీ (అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్) కారణంగా.. నిత్యం శరీరం గురించిన ఆలోచన వల్ల కలిగే సెన్సారీ (ఇంద్రియాలకు సంబంధించిన అసౌకర్యం), భావోద్వేగ తీవ్రత ఆమెకు భరించరానివిగా మారాయి.
పాతికేళ్లు వచ్చేప్పటికి 50 కేజీల బరువు, 32జేజే కప్ సైజ్ రొమ్ములతో మానసికంగా, శారీరకంగా భరించలేనంత తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యారు రన్వియా.
రొమ్ములను తగ్గించుకునే ఫేస్‌బుక్ గ్రూప్ కనుగొనడం తనకు లైఫ్‌లైన్ అని ఆమె అంటున్నారు.
యూకేలోని ఎన్‌హెచ్ఎస్ ద్వారా సర్జరీ చేయించుకునేందుకు తన జీపీ (జనరల్ ప్రాక్టీషనర్) నుంచి సమాధానం కోసం ఎదురుచూస్తున్న సమయంలోనే.. సుమారు 6 వేల మంది సభ్యులున్న ఈ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారానే ఈ ప్రక్రియకు సంబంధించి చాలా సమాచారాన్ని ఆమె సేకరించారు.
''ఈ గ్రూప్‌లోని మహిళలు, 'ఇంతకుముందే ఈ సర్జరీ చేయించుకుని ఉంటే బాగుండేది' అని పదేపదే చెప్పేవారు" అని రన్వియా అన్నారు.
డాక్టర్‌ను కలిసిన ఆరు నెలల తర్వాత కూడా ఎన్‌హెచ్ఎస్ నుంచి ఎలాంటి స్పందనా రాకపోవడంతో, ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.

ఫొటో సోర్స్, Ranvia
"నన్ను నేను చూసుకోగలుగుతున్నట్లు అనిపించింది''
ఆమె సర్జరీ చేయించుకున్న కొన్ని నెలల తర్వాత.. ఎన్‌హెచ్‌ఎస్‌లో ఆపరేషన్‌కు ఆమె అర్హురాలంటూ రన్వియాకు తెలిపారు.
ఆమె బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) తక్కువగా ఉన్నందున రన్వియాకు ఆమోదం లభించింది.
అయితే, ''అత్యంత అరుదైన పరిస్థితుల్లో'' మాత్రమే ఇది జరుగుతుందని బ్రెస్ట్ సర్జన్ లిండ్సే హైటన్ చెప్పారు.
బ్రిటిష్ అసోసియేషన్ ఆఫ్ ఈస్తటిక్ ప్లాస్టిక్ సర్జన్స్ (బీఏఏపీఎస్) ప్రకారం.. యూకేలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రొమ్ము పరిమాణం తగ్గించుకునేందుకు ఆపరేషన్ చేయించుకున్న వేల మందిలో రన్వియా ఒకరు. ఈ ప్రక్రియకు పాపులారిటీ బాగా పెరుగుతోంది.
''సర్జరీ తర్వాత మేల్కొని కిందకి చూసినప్పుడు, మొదటిసారి నా పొట్టను చూసుకోగలిగాను. నాకు ఏడుపొచ్చేసింది. ఇన్నేళ్లుగా ఈ శారీరక, మానసిక భారాన్ని మోస్తున్న నేను, అకస్మాత్తుగా నన్ను నేను చూసుకోగలుగుతున్నట్లు అనిపించింది'' అని రన్వియా తెలిపారు.
బీఏఏపీఎస్ ఏప్రిల్ డేటా ప్రకారం... రొమ్ముల పరిమాణాన్ని పెంచుకుంటున్న మహిళల సంఖ్యను మొదటిసారి రొమ్ము పరిమాణాన్ని తగ్గించుకుంటున్న, ఇంప్లాంట్లు తీసేయించుకుంటున్న మహిళల సంఖ్య దాటేసింది.
''రొమ్ముల పరిమాణాన్ని పెద్దదిగా చూపించుకోవడం కంటే, మరింత సహజసిద్ధమైన రూపానికే మళ్లుతున్న ఒక విస్తృతమైన మార్పును ఈ డేటా ప్రతిబింబిస్తోంది.'' అని బీఏఏపీఎస్ అధ్యక్షురాలు నోరా నుజెంట్ అభిప్రాయపడ్డారు.
బరువు తగ్గించే మందుల వాడకం పెరగడం వల్ల 'సన్నని శరీరాకృతులు' అనే ధోరణి కూడా పెరిగిందని ది బ్యూటీ క్రానికల్స్ పాడ్‌కాస్ట్ వ్యాఖ్యాత మెరెడిత్ జోన్స్ అన్నారు.
"ఈ మార్పు కొంతవరకు ట్రెండ్‌లకు సంబంధించినదే అయినప్పటికీ, ఇప్పుడు చాలా మంది మహిళలకు ప్రాధాన్యత శరీర పనితీరే. అంటే, వారు కదలగలగడం, ఆత్మవిశ్వాసంతో ఉండగలగడం" అని మాంచెస్టర్‌లోని ఎన్‌హెచ్ఎస్ బ్రెస్ట్ కన్సల్టెంట్, ప్రైవేట్ బ్రెస్ట్ సర్జన్ లిండ్సే హైటన్ అన్నారు.

ఫొటో సోర్స్, Sue
గ్రేటర్ మాంచెస్టర్‌కు చెందిన 54 ఏళ్ల స్యూ.. చాలా ఏళ్ల పాటు తన పిల్లలకు పాలు ఇచ్చిన తర్వాత.. ఇంప్లాంట్స్ చేయించుకున్నారు.
''అవి చాలా బరువుగా అనిపించాయి. నేను మళ్లీ ఫిట్‌గా అవ్వాలనుకున్నా. కానీ, నా శరీరంపై అదనపు భారం పడినట్లు అనిపించింది'' అని తెలిపారు.
అయితే, ప్రైవేట్ ఆస్పత్రుల్లో రొమ్ము చికిత్స అంత చౌకేమీ కాదు. దేశవ్యాప్తంగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఈ శస్త్ర చికిత్సకు సంబంధించి ఛార్జీలు భిన్నంగా ఉన్నాయి.
మాంచెస్టర్‌కు చెందిన స్యూ 2025లో తన ఇంప్లాంట్‌లను తొలగించుకోవడానికి సుమారు 9,500 పౌండ్లు (రూ.12,23,136) ఖర్చు చేశారు.
రన్వియా సర్జరీకి సుమారు 8,000 పౌండ్లు (రూ.10 లక్షల పైన) ఖర్చయ్యాయి. ఆ మొత్తాన్ని ఆమె మూడు సంవత్సరాల పాటు ఈఎంఐలలో చెల్లించారు.
యూకేలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో రొమ్ముల సైజు తగ్గించుకునే శస్త్ర చికిత్సకు ''సుమారు 6,500 పౌండ్లు'' (భారత కరెన్సీలో రూ.8 లక్షలకు పైగా) ఖర్చవుతుందని ఎన్‌హెచ్ఎస్ చెప్పింది.
కన్సల్టేషన్లు, ఆ తర్వాత డాక్టర్‌కు చూపించుకోవడాన్ని ఇందులో కలపలేదు.
ఎన్‌హెచ్ఎస్‌లో రొమ్ముల పరిమాణాన్ని తగ్గించుకోవడాన్ని ఒక కాస్మోటిక్ ప్రొసీజర్‌గా పరిగణిస్తారు. ప్రభుత్వ వైద్యంలో ఇది అందుబాటులో ఉన్నప్పటికీ, దీన్ని పొందడం ''దాదాపు అసాధ్యం'' అని హైటన్ చెప్పారు.
మీ రొమ్ముల వల్ల మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటే, ప్రొఫెషనల్స్ ద్వారా ఫిట్ చేసిన బ్రా వాడటం వంటి ఇతర మార్గాలేవీ పనిచేయనప్పుడు మాత్రమే ఎన్‌హెచ్ఎస్ మార్గదర్శకాల ప్రకారం ఈ సర్జరీకి అర్హులు కావొచ్చు.
దీంతో పాటు మీ రొమ్ముల సైజు, బరువు, సాధారణ ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

ఫొటో సోర్స్, Michelle
గత కొన్నేళ్లుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో రొమ్ముల సైజు తగ్గించుకునేందుకు శస్త్ర చికిత్సలు చేయించుకున్న డజను మందికి పైగా మహిళలతో బీబీసీ మాట్లాడింది.
- శస్త్ర చికిత్సకు ముందు తన జీవితమంతా తన రొమ్ముల పరిమాణం చుట్టే తిరిగేదని స్టాక్‌పోర్ట్‌కు చెందిన కేటీ చెప్పారు. ఎన్‌హెచ్ఎస్ తిరస్కరించిన తర్వాత.. ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకుని, 3 కేజీల బరువును తొలగించుకున్నారు.
- ''సర్జరీ కోసం డబ్బులు దాచుకోవడం మొదలుపెట్టు. ఎందుకంటే ఎన్‌హెచ్ఎస్ మీకు సాయం చేయదు'' అని తన 16వ ఏటా ఒక డాక్టర్ చెప్పిన విషయాన్ని నార్విచ్‌కు చెందిన సిండీ చెప్పారు. ప్రస్తుతం ఆమె జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తున్నారు. ''నా రొమ్ములు ఇకపై నా రోజువారీ జీవితాన్ని నిర్ణయించలేవు'' అని ఆమె అన్నారు.
- 21 ఏళ్ల నుంచే తన సేవింగ్స్ అకౌంట్లోకి వారానికి 10 పౌండ్లు (రూ.1287) వేసేదాన్నని 2025లో సర్జరీ చేయించుకున్న 36 ఏళ్ల రియాన్ చెప్పారు.
- కౌంటీ డర్హామ్‌కు చెందిన సారా, ఆటిజం సమస్యతో బాధపడుతున్నారు. నాన్-బైనరీగా కూడా సారా గుర్తింపు పొందుతున్నారు. అంటే, పురుషుడిగా లేదా మహిళగా గుర్తింపు పొందని వ్యక్తి. పెద్ద రొమ్ములు ఆమెకు సెన్సారీ ఇబ్బందులను కలగజేయడమే కాకుండా.. ఆమె రొమ్ములు పబ్లిక్ ప్రాపర్టీలాగా అనిపించాయి.
- ఉర్మ్‌స్టన్‌కు చెందిన మిషెల్, తన 28వ పుట్టినరోజున తన రొమ్ములను పట్టుకుని, వేధింపులకు గురి చేసిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. "ఆ సంఘటన తర్వాత నేను చాలా కాలం పాటు బయటకు రాలేదు" అని ఆమె తెలిపారు. "రొమ్ముల సైజు తగ్గించుకోవడం ఎప్పుడూ అందంగా కనిపించడం కోసం కాదు. అది జీవితాన్ని మెరుగుపరచుకోవడం కోసం" అని అన్నారు.
ఎన్‌హెచ్ఎస్‌లో రొమ్ముల సైజు తగ్గించుకునే సర్జరీలకు అవకాశం దొరక్కపోతుండటంతో పాటు.. ప్రైవేట్ చికిత్సకు పెద్దయెత్తున ఖర్చు అవుతుండటంతో చాలా మంది మహిళలు ఇప్పుడు చౌకైన శస్త్ర చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారని హైటన్ అంటున్నారు.
''ఇది కేవలం కాస్మోటిక్ ట్రెండ్ గురించో లేదా ఆ ముందు, ఆ తర్వాత గురించో చెప్పే కథ కాదు'' అని రన్వియా అన్నారు.
చాలా మంది మహిళలకు, రొమ్ము పరిమాణం తగ్గించుకోవడం అంటే సౌకర్యం, భద్రత, ఆత్మవిశ్వాసం, తమ శరీరంపై తిరిగి నియంత్రణ సాధించడం.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























