బంగ్లాదేశ్‌లో ప్రబలుతున్న తట్టు: ‘‘నా పది నెలల చిన్నారి మరణించింది, నేను ఎవరిని నిందించాలి, వ్యాక్సిన్ ఇవ్వని ప్రభుత్వాన్నా?’’

- రచయిత, ఆజాదే మోషిరి, ఆకృతి థాపర్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
‘‘ఇంత పెద్ద ఎత్తున ఈ వ్యాధి ప్రబలడం ఎప్పుడూ చూడలేదు’’ అన్నారు పిల్లల వైద్యుడు మొహమ్మద్ గోలమ్ మావ్లా. బంగ్లాదేశ్‌లోని మైమెన్‌సింగ్ నగరంలో తట్టు (మీజిల్స్) వార్డు పరిసరాలను గమనిస్తున్నప్పుడు ఆయన మాతో అన్నమాటలివి.
ఈ ఏడాది మార్చినాటికి తట్టు వ్యాధిని నిర్మూలనలో బంగ్లాదేశ్ ''గణనీయమైన పురోగతి'' సాధించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది.
ఇటీవల వరకు వ్యాక్సినేషన్ రేటు 90 శాతం కంటే ఎక్కువగా ఉండేది. కానీ, ఆ పురోగతి చాలా వేగంగా, ఒక్కసారిగా పడిపోయింది.
శ్వాస తీసుకోవడం, దగ్గడం లేదా తుమ్మడం ద్వారా సులభంగా వ్యాపించే ఈ అంటువ్యాధి కారణంగా.. మార్చి నుంచి 750 మంది, వీరిలో ఎక్కువగా పిల్లలు మరణించారని ప్రభుత్వ గణాంకాలు చూపుతున్నాయి.
ఈ మరణాల్లో తట్టు వ్యాధి ధ్రువీకరణ అనుమానమున్న కేసులు కూడా ఉన్నాయి. కానీ, అకస్మాత్తుగా కేసులు పెరగడం, ఆరోగ్య వ్యవస్థపై తీవ్ర భారం పడటం, సమాచారాన్ని సేకరించడంలో ఉన్న ఇబ్బందుల రీత్యా, వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని యూనిసెఫ్ చెప్పింది.

ఈ గణాంకాలు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉందనడానికి రుజువుగా, ఆస్పత్రి నడవాలో డజన్ల కొద్దీ కుటుంబాలు నేలపై దుప్పట్లు పరుచుకుని పడుకోవడం తప్ప మరో మార్గం లేని పరిస్థితి కనిపించింది. మెడికల్ కాలేజ్ హాస్పిటల్‌లోని వార్డు దాని సామర్థ్యానికి మించి రెండింతలు ఎక్కువగా నిండిపోయింది. కేవలం 32 గదులలో దాదాపు 130 మంది రోగులు ఉన్నారు.
వారిలో నాలుగు నెలల అరాఫత్ ఒకరు. అతని ముక్కు చాలా చిన్నదిగా ఉండటం వల్ల ఆక్సిజన్ ట్యూబ్‌లు అమర్చడం కష్టం కావడంతో వైద్యులు వాటికి బ్యాండేజ్ కట్టి, టేపుతో అతికించారు.
''మేం హాస్పిటల్‌లో 15 రోజుల నుంచి ఉంటున్నాం. కానీ, మా అబ్బాయి ఇంకా కోలుకోలేదు' అని అరాఫత్ తండ్రి మొహమ్మద్ ఆలంమియా చెప్పారు. బాబు వేడికి విలవిలలాడుతూ, శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నాడని తెలిపారు.

కేసులు ఎందుకు పెరిగాయి?
అరాఫత్ తల్లిదండ్రులు హాస్పిటల్‌కు చేరుకోవడానికి సుమారు 10 గంటలు ప్రయాణించారు. వారి మొదట బిడ్డ ఉలుకుపలుకు లేకుండా అలా పడిఉండటం చూసి, ఆయన తండ్రి అంబులెన్స్‌లో వాంతి చేసుకుని స్పృహ కోల్పోయారు.
అరాఫత్‌కు న్యూమోనియా, హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ రెండూ తట్టు వల్లే వచ్చాయి. బాబుకు వైద్యం చేయించేంత డబ్బులు మొహమ్మద్ వద్ద లేవు. ఇతరుల నుంచి అప్పు తీసుకోవాల్సి వచ్చింది.
బంగ్లాదేశ్‌లో మార్చి మధ్య నుంచి కేసులు పెరగడంతో.. రికార్డయిన 1,20,000కి పైగా తట్టు అనుమానిత, ధ్రువీకరణ కేసుల్లో అరాఫత్ కేసు ఒకటని ప్రభుత్వ గణాంకాల్లో తెలిసింది.
''ఈ వ్యాధి మా దేశంలో నియంత్రణలో ఉంది'' అని మావ్లా చెప్పారు. వ్యాక్సిన్లు చాలా బాగా పనిచేస్తున్నాయన్నారు.
కానీ, ఎందుకు ఒక్కసారిగా కేసులు పెరిగాయి?
అనేక ప్రతికూల అంశాలు ఒకేసారి కలిసి రావడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని బంగ్లాదేశ్ యూనిసెఫ్ ప్రతినిధి మిగ్యుయెల్ మాటియోస్ మునోజ్ అభిప్రాయపడ్డారు.
మొదట, వ్యాక్సిన్ ఆర్డర్లలో తీవ్రమైన జాప్యాలున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ సంవత్సరాల తరబడి రాజకీయ అస్థిరతను చూసింది. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, నిరంకుశ నేత షేక్ హసీనాను గద్దె దించేందుకు 2024లో దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు చేశారు.
ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం గత సంవత్సరం టీకాల కొనుగోలు ఆర్డర్లు ఇవ్వడంలో ఆలస్యం చేసింది. కొత్త సరఫరాదారులను పరిశీలించడం, అలాగే టీకాల కొనుగోలుకు నిధులు సమకూర్చే విధానాన్ని పునర్‌వ్యవస్థీకకరించడానికే ప్రాధాన్యం ఇచ్చిందని యూనిసెఫ్ పేర్కొంది.
‘‘ఈ మార్పులు చేయడానికి తగినంత సమయం కేటాయించుకోవాలని’’ తాత్కాలిక ప్రభుత్వాన్ని యూనిసెఫ్ కోరినట్లు మునోజ్ తెలిపారు.
''కానీ వ్యాక్సిన్ల సరఫరాలో అంతరాయం ఏర్పడి, అదిప్పుడు మనం చూస్తున్న పరిస్థితులకు దారితీస్తుందేమోనని మేం ఆందోళన చెందాం'' అని ఆయన అన్నారు.
తారిక్ రెహ్మాన్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీకాల కొరత ఉన్న విషయాన్ని గుర్తించినట్టు చెబుతోంది.
ఈ ఆరోపణలపై తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన మాజీ నేత ముహమ్మద్ యూనస్ కార్యాలయాన్ని బీబీసీ సంప్రదించింది. ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముహమ్మద్ యూనస్ నిరాకరించారు.
యూనస్ ప్రభుత్వంలోని ఆరోగ్య శాఖకు చెందిన మాజీ అధికారి ఒకరు వ్యాక్సిన్ల కొరతను ఖండించారు. యూనిసెఫ్ ఆందోళనలను వ్యక్తం చేసింది. ''కానీ దీనిలో రాబోయే తట్టు వ్యాప్తి గురించి ఎలాంటి కచ్చితమైన హెచ్చరికలు చేయలేదు'' అని బీబీసీకి చెప్పారు.
ఈ పెరుగుదలకు సంబంధించి ఇతర కారకాలను మునోజ్ ఎత్తిచూపారు. కరోనా మహమ్మారి వల్ల సాధారణంగా ఇతర వ్యాధులకు వేసే వ్యాక్సిన్లను ఆలస్యం చేయడం, 2020 నుంచి తట్టు-రుబెల్లాకు వ్యాక్సినేషన్ క్యాంపెయిన్లు క్రమం తప్పకుండా జరగకపోవడం, ఈద్ సెలవు ప్రయాణాలు, అత్యంత రద్దీ అన్నీ కూడా ఈ వ్యాధి పెరుగుదలకు కారణమని తెలిపారు.

బంగ్లాదేశ్ ఒక్కటే కాదు
ప్రపంచవ్యాప్తంగా, ఈ సంవత్సరం తట్టు వ్యాధి వ్యాప్తిని ఎదుర్కొంటున్న ఏకైక దేశం బంగ్లాదేశ్ ఒక్కటే కాదు.
బ్రిటన్ ఈ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిందని భావించారు. కానీ, కేసులు పెరగడంతో ఈ సంవత్సరం ఆ పేరును బ్రిటన్ కోల్పోయింది.
ఇటీవల సంవత్సరాలలో అమెరికాలో కూడా తట్టు వ్యాధి కేసులు పెరిగాయి. సామూహిక రోగనిరోధక శక్తి (హెర్డ్ ఇమ్యూనిటీ) రావాలంటే కనీసం 95 శాతం మందికి టీకాలు వేయించాలి. కానీ, రెండు దేశాల్లోనూ ఐదేళ్ల లోపు పిల్లలకు ఆ స్థాయిలో వ్యాక్సినేషన్ జరగలేదు.
టీకా కవరేజీలో ఏ మాత్రం ఆలస్యం చోటు చేసుకున్నా కలిగే ప్రమాదాలకు బంగ్లాదేశ్‌లో తట్టు వ్యాప్తి నిదర్శనమని ప్రజారోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రాజధాని ఢాకాకు మూడు గంటల దూరంలో ఉన్న ప్రాంతంలో, వ్యాక్సిన్ల కొరత పర్యవసనాలను మనం చూస్తున్నాం.

‘ఎవరిని నిందించాలి?’
మోసమ్మత్ నీలా అఖ్తర్, ఆమె భర్త కలిసి తమ 10 నెలల చిన్నారి మాలిహాకు వ్యాక్సిన్ కోసం ఫిబ్రవరిలో ఒక క్లినిక్‌కు తీసుకొచ్చారు. కానీ, అక్కడ వ్యాక్సిన్లు లేవని వారికి చెప్పారు.
మార్చి నెలాఖరులో వ్యాధి వ్యాప్తి తీవ్రమవుతున్నప్పుడు, మాలిహా న్యూమోనియాతో ఆసుపత్రిలో చేరింది. కానీ, కొద్ది రోజులకే డిశ్చార్జ్ అయ్యింది. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు ఆమె పొట్టపై దద్దుర్లు రావడం గమనించారు.
ఆసుపత్రికి తిరిగి వెళ్లగా, బెడ్లు అందుబాటులో లేవని వారికి చెప్పారు. నిరాశతో మరో బిడ్డను డిశ్చార్జ్ చేసే వరకు వారు వేరొక ఆసుపత్రిలో మూడు గంటలపాటు వేచి ఉన్నారు.
పడకల కొరత కారణంగా తట్టు వ్యాధి ఉన్న పిల్లలు, ఆ వ్యాధి లేని పిల్లలు కలిసి వార్డులను పంచుకోవాల్సి వచ్చిందని అఖ్తర్ ఆరోపించారు.
''ఆమె శరీరాన్ని మేం ఎంత తుడిచినా.. జ్వరం తగ్గడం లేదు. డాక్టర్లు వస్తున్నారు. 'ఆమె బాడీని తుడుస్తూ ఉండండి' అని చెబుతున్నారు'' అని అఖ్తర్ చెప్పారు.
మాలిహాకు ఐసీయూ బెడ్ అవసరమని, కానీ ఆసుపత్రిలో ఇవ్వడానికి ఏదీ లేదని వారికి చెప్పారు. మాలిహా ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, వారు ఒక బెడ్ దొరికే వరకు గంటల తరబడి అంబులెన్స్‌లోనే ప్రయాణించారు.
"ఆమె నా వైపే చూస్తూ ఉండేది. తన శరీరానికి ట్యూబ్‌లు, మెషిన్లు అమర్చినా, నా ఒళ్లోకి రావాలని ప్రయత్నించేది’’ అని అఖ్తర్ కన్నీళ్లతో తన బిడ్డను గుర్తు చేసుకున్నారు. మూడు రోజుల తర్వాత మాలిహా మరణించింది. "ఆమెకు సంబంధించిన ప్రతీదీ మాకు అద్భుతమే" అన్నారు అఖ్తర్ వణుకుతున్న గొంతుతో. ''ఎవర్ని నిందించాలి?'' అని ఆమె అడిగారు. ''ప్రభుత్వాన్ని నిందించాలా? ఎందుకంటే, నాకూతురికి వ్యాక్సిన్ ఇవ్వలేదు'' అని అన్నారు.

పలు ప్రాంతాల్లో ఏప్రిల్‌లో ఎమర్జెన్సీ వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌ను ప్రభుత్వం, యూనిసెఫ్ కలిసి ప్రారంభించాయి.
ఇప్పటి వరకు 1.84 కోట్ల మందికి పైగా చిన్నారులకు టీకాలు వేశారు.
ప్రస్తుతం నమోదవుతున్న కేసులు, మరణాలు కాస్త నెమ్మదించినప్పటికీ, సగటున రోజుకు సుమారు వెయ్యి అనుమానిత కేసులు బంగ్లాదేశ్‌లో రికార్డవుతున్నాయి. రోజూ పలు మరణాలు సంభవిస్తున్నాయి.
వైద్య వ్యవస్థపై భారం పడుతోందని ఆరోగ్య శాఖ మంత్రి సర్దార్ సఖావత్ హుస్సేన్ అంగీకరించినప్పటికీ, 17 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో ఇలాంటి పరిస్థితులు సహజమేనన్నారు.

ఫొటో సోర్స్, Supplied
అయితే, ఇది 'వ్యాప్తి కాదు, మహమ్మారి' అని అంగీకరించడానికి ప్రభుత్వం నిరాకరిస్తోందని ప్రజారోగ్య నిపుణులు ముష్‌టుక్ హుస్సేన్ అన్నారు. ప్రస్తుత గణాంకాలు కేవలం ఉపరితలం మాత్రమే. అసలైన లోతు చాలా ఉంది’ అని చెప్పారు.
''మనం ఆ గణాంకాలను పూర్తిగా నమ్మలేకపోయినప్పటికీ... ఇంకా చేయాల్సిన పని చాలా బాకీ ఉందనే విషయాన్ని మాత్రం అవి మనకు స్పష్టం చేస్తున్నాయి'' అని మునోజ్ మాతో చెప్పారు.
"పరిస్థితి ఇప్పటికీ తీవ్రంగానే ఉంది. ప్రతిరోజూ పిల్లలు చనిపోవడం, వేలాది మంది ప్రజలు వ్యాధి బారిన పడటం అంత అంగీకరించదగ్గ విషయం కాదు" అని హుస్సేన్ అన్నారు.
మైమెన్సింగ్‌లోని తట్టు వార్డును మేం సందర్శించిన కొద్ది రోజులకే, చిన్నారి అరఫాత్ మరణించాడనే వార్త విన్నాం.
టీకా ద్వారా నివారించగలిగే ఈ వ్యాధి బారిన పడి మరణించిన వందలాది మంది పిల్లలలో అరాఫత్ కూడా ఇప్పుడొకరు.
ఫోన్‌లోనే ఆయన తండ్రి కన్నీళ్లు పెట్టుకున్నారు. "నా కొడుకుని కాపాడటానికి నా డబ్బంతా ఖర్చుపెట్టాను, అప్పులు చేశాను, శాయశక్తులా ప్రయత్నించాను. కానీ ఇప్పుడు అంతా అయిపోయింది" అని అన్నారు.
ప్రేమ్ బూమినాథన్, సర్దార్ రోనీ అందించిన అదనపు సమాచారంతో
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























