‘వ్యవహారం కీలక దశలో ఉంది, అందుకే నా కొడుకు పెళ్లికి కూడా నేను వెళ్లడం లేదు’- ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

ఫొటో సోర్స్, EPA/Shutterstock
- రచయిత, బ్రాండన్ లివ్‌సే
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
ఇరాన్‌తో ఒక ఒప్పందంపై విస్తృతస్థాయిలో సంప్రదింపులు జరిగాయని, దానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ప్రకటించారు.
హార్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం కూడా ఈ ఒప్పందంలో భాగమై ఉంటుందని శనివారం(మే 23) ట్రంప్ తెలిపారు. దీనికి సంబంధించిన ఇతర ఏ వివరాలూ ట్రంప్ వెల్లడించలేదు.
అంతకుముందు ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ, ప్రభుత్వ టెలివిజన్‌తో దీనిపై మాట్లాడారు.
గతవారంలో ఇరాన్, అమెరికా మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని ఆయన అన్నారు. అయితే దానర్ధం కీలక అంశాలపై తుదిఒప్పందం కుదిరినట్టు కాదని స్పష్టంచేశారు. అమెరికన్లు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
శాంతి కోసం అవగాహన ఒప్పందం పై సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ నాయకులతో చాలా మంచి చర్చ జరిగిందని ట్రంప్ సోషల్ మీడియాలో ప్రకటించారు.

త్వరలోనే ప్రకటన - ట్రంప్
''విస్తృతంగా సంప్రదింపులు జరిపిన ఒప్పందం చివరి దశలో ఉంది. అమెరికా, ఇరాన్, జాబితాలో ఉన్న ఇతర దేశాల మధ్య ఈ ఒప్పందం ఉంటుంది'' అని ట్రంప్ చెప్పారు.
''ఒప్పందానికి సంబంధించిన అన్ని రకాల విషయాలపై ప్రస్తుతం చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే వాటిపై ప్రకటన ఉంటుంది'' అని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ సంభాషణ చాలా బాగా జరిగిందని కూడా ట్రంప్ అన్నారు.
ఒప్పందానికి సంబంధించిన ఇతర వివరాలేవీ ట్రంప్ వెల్లడించలేదుగానీ ఏ ఒప్పందమైనా ఇరాన్ అణ్వాయుధాలు సాధించుకోవడాన్ని కచ్చితంగా అడ్డుకునేలా ఉంటుందని మాత్రం స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ ప్రధాని ఏం చెప్పారంటే..
పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ దీనిపై స్పందించారు.
''శాంతి కోసం అసాధారణ ప్రయత్నాలు చేసిన అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు అభినందనలు'' అని షాబాజ్ షరీఫ్ అన్నారు. తమ ఫోన్ సంభాషణ చాలా ఉపయోగకరమైందని, మంచి ఫలితాలనిచ్చిందని ఆయన తెలిపారు.
ఈ ఒప్పందంపై సంప్రదింపుల్లో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది.
''చాలా తొందరలోనే మరో రౌండ్ చర్చలకు ఆతిథ్యమిస్తామని భావిస్తున్నాం'' అని 'ఎక్స్'లో షాబాజ్ షరీఫ్ ప్రకటించారు.
కాల్పుల విరమణ ఒప్పందానికి ఏప్రిల్ మొదటివారంలో ఇరాన్ అంగీకరించింది. ఆ తర్వాత నుంచి దీర్ఘకాలిక శాంతి ఒప్పందం కుదుర్చుకునే దిశగా అమెరికా, ఇరాన్ మధ్య చర్చలు సాగుతున్నాయి.
చర్చల తుది ఫలితాన్ని అవగాహన ఒప్పందంగా ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయి అభివర్ణించారు. ''14 అంశాలతో ఫ్రేమ్ వర్క్ రూపంలో ఉండే ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ఇరాన్ ఉద్దేశం'' అని స్పష్టంచేశారు.
అవగాహన ఒప్పందానికి తుదిరూపు కల్పించే ప్రక్రియలో ఉన్నామని, 30నుంచి 60 రోజుల్లోపు చర్చలు జరుగుతాయని, తర్వాత తుది ఒప్పందం కుదుర్చుకోవచ్చని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, EPA
‘అమెరికా మళ్లీ దాడి చేస్తుందని ప్రచారం’
అమెరికా, ఇరాన్ ఈ ప్రకటనలు చేయడానికి ముందు వాషింగ్టన్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయడానికి అధికారయంత్రాంగం సిద్ధమవుతుందని పేర్లు వెల్లడించని అధికారులు శుక్రవారం(మే 22) అమెరికా మీడియాకు వెల్లడించారు. అయితే దీనిపై తుదినిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ఇలాంటి కీలక సమయంలో తాను వాషింగ్టన్‌లోనే ఉండాలని, ఈ వారాంతంలో జరిగే తన కొడుకు (డోనల్డ్ జూనియర్)పెళ్లికి వెళ్లడం లేదని ట్రూత్ సోషల్‌లో శుక్రవారం ట్రంప్ తెలిపారు.
కాల్పుల విరమణ పరిస్థితిని గత వారం ట్రంప్ జీవచ్ఛవంతో పోల్చారు. ఇరాన్ డిమాండ్లు అస్సలు అంగీకారయోగ్యమైనవి కాదని అభివర్ణించిన ఆయన వాటిని తోసిపుచ్చుతున్నట్టు అప్పుడు తెలిపారు.
ఏప్రిల్ 13 నుంచి ఇరాన్ పోర్టులను అమెరికా దిగ్బంధించింది.
దిగ్బంధనం మొదలైన తర్వాత నుంచి వంద నౌకలను దారి మళ్లించామని, నాలుగు నౌకలను పనికిరాకుండా చేశామని, మానవతాసాయానికి సంబంధించిన 26 నౌకలను వెళ్లేందుకు అనుమతించామని అమెరికా సెంట్రల్ కమాండ్(సెంట్‌కామ్) తెలిపింది.
ఇరాన్ నౌకాశ్రయాల లోపలా, వెలుపలా ఎలాంటి వాణిజ్యం జరగకుండా చేయడంలో తమ బలగాలు చాలా బాగా ప్రభావం చూపాయని సెంట్‌కామ్ కమాండర్ అడ్మిరల్ బ్రాడ్ కూపర్ చెప్పారు. ఈ చర్య వల్ల ఇరాన్ ఆర్థికంగా ఒత్తిడికి గురయిందని అన్నారు.
మరోవైపు హార్ముజ్ జలసంధి చుట్టూ మిలటరీ నియంత్రణ ఉందని ఇరాన్ తెలిపింది. ఈ జలసంధి గుండా ప్రయాణించాల్సిన ప్రతి నౌక పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అధారిటీ (ఇరాన్ ఏర్పాటు చేసిన అధికార సంస్థ)తో సమన్వయంతో వ్యవహరించాలని, అనుమతి తీసుకోవాలని తెలిపింది.
హార్ముజ్ జలసంధిపై నియంత్రణ కోసం ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలను అమెరికా, గల్ఫ్ మిత్రదేశాలు పదే పదే వ్యతిరేకిస్తున్నాయి. హార్ముజ్ గుండా ప్రయాణించే నౌకలు ఇరాన్ నియయాలను పాటించాల్సిన అవసరం లేదని అమెరికా సూచించింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.
























