మొదటి ప్రపంచ యుద్ధంలో పోరాడిన వేలాదిమంది పంజాబీ సైనికులకు తొలిసారి గుర్తింపు.. వీరి వివరాలు ఎలా తెలిశాయి?

మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఇండియా, పంజాబ్ సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అవిభక్త భారత్‌కు చెందిన దాదాపు 14లక్షలమంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు
    • రచయిత, అలీమ్ మఖ్బూల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

అవిభక్త భారతదేశానికి చెందిన వేలాది మంది సైనికులు మొదటి ప్రపంచ యుద్ధంలో సేవలందించి ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు ఇప్పుడు 80 ఏళ్లకుపైగా గడిచిన తర్వాత యుద్ధ మృతుల రికార్డులలో చేర్చడంతో వారికి అధికారిక గుర్తింపు లభిస్తోంది.

పరిశోధకులు గుర్తించిన 9,909 మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ సైనికుల పేర్లను కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ (సీడబ్ల్యూజీసీ) యుద్ధ మృతుల డేటాబేస్‌లో చేర్చుతోంది.

మొదటి ప్రపంచ యుద్ధం ముగిసిన కొద్దికాలానికే అప్పటి పంజాబ్ రాష్ట్రంలో రూపొందించిన ప్రత్యేక రిజిస్టర్లలో ఈ పేర్లను గుర్తించడానికి యూకేకు చెందిన స్వచ్ఛంద కార్యకర్తలు ఏళ్ల తరబడి శ్రమించారు. యుద్ధంలో పాల్గొని ప్రాణ త్యాగం చేసిన సైనికులకు సంబంధించి, బ్రిటన్‌‌లో స్థిరపడిన వారసులను గుర్తించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

"ఇప్పుడొక వలయం పూర్తయినట్టయింది..నాకు పరిపూర్ణత కలిగినట్టనిపిస్తోంది" అని లీసెస్టర్‌కు చెందిన డెంటిస్ట్ సన్నీ పలాహే చెప్పారు.

తన ముత్తాత యుద్ధానికి వెళ్లి తిరిగి రాలేదని మాత్రమే తనకు తెలుసని, ఆయన గురించి సమాచారం కోసం ఎన్నో ఏళ్లుగా వెతుకుతున్నానని పలాహే చెప్పారు. అయితే ఇటీవల పరిశోధకులు పలాహేను సంప్రదించి, ఆయన ముత్తాత కేసర్ సింగ్ పేరును కొత్తగా పరిశీలించిన రిజిస్టర్లలో గుర్తించామని, ఇప్పుడు దానిని అధికారిక జాబితాలో చేర్చనున్నట్లు తెలియజేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఇండియా, పంజాబ్ సైనికులు
ఫొటో క్యాప్షన్, డెంటిస్ట్ సన్నీ పలాహే ముత్తాత మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నారు

"ఇప్పుడది అధికారిక గుర్తింపు పొందింది. ఇంతకుముందు అలాంటిది జరగలేదు. ఇప్పుడు ఆయన పేరు కామన్‌వెల్త్ వార్ గ్రేవ్స్ కమిషన్ రికార్డుల్లో నమోదైంది. ఇందుకోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలించాయి" అని పలాహే చెప్పారు.

ఈ గుర్తింపు మొదటి ప్రపంచ యుద్ధంలో సేవలందించిన వారితో అనుబంధం ఉన్న ప్రపంచవ్యాప్త సమాజంలో తానూ ఒక భాగమనే గర్వాన్ని కలిగించిందని ఆయన అన్నారు.

ప్రస్తుత భారత్, పాకిస్తాన్ బంగ్లాదేశ్‌లుగా ఉన్న భారత ఉపఖండం నుంచి సుమారు 14 లక్షల మంది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీగా మొదటి ప్రపంచ యుద్ధంలో సేవలందించారు.

మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఇండియా, పంజాబ్ సైనికులు
ఫొటో క్యాప్షన్, లాహోర్ మ్యూజియంలో భద్రపరిచిన సైనికుల వివరాల రిజిస్టర్

యుద్ధం అనంతరం, అధికారులు పంజాబ్ రాష్ట్రాన్ని సందర్శించారు. ఒక్క పంజాబ్ నుంచే 3,20,000మంది సైనికులు యుద్ధంలో పాల్గొన్నారు. వీరందరి వివరాలు తెలుసుకుని నమోదు చేయడానికి అధికారులు రాష్ట్రంలోని ప్రతి పట్టణం, ప్రతి గ్రామాన్ని సందర్శించారు. అయితే 1947లో భారతదేశ విభజన అనంతరం పంజాబ్ రాష్ట్రం భారత్, పాకిస్తాన్ మధ్య విభజితమైంది.

బంగారు అక్షరాలతో ముద్రించిన గ్రామాల పేర్లు, చేతిరాతలో నిండిన వివరాలతో కూడిన తోలుతో చుట్టిన డజన్ల కొద్దీ రిజిస్టర్లు ప్రస్తుతం లాహోర్ మ్యూజియంలో భద్రపరిచి ఉన్నాయి.

యూకే పంజాబ్ హెరిటేజ్ అసోసియేషన్ సభ్యులు ఈ రికార్డులను డిజిటలైజ్ చేసి విశ్లేషించే పని మొదలు పెట్టారు. ఈ ప్రక్రియకు చాలా ఏళ్లు పట్టింది.

"స్వయంగా పంజాబీని అయినందుకు, మా ప్రజల కోసం ఈ పని చేయ చేయగలుగుతున్నందుకు గర్వంగా ఉంది" అని ఈ క్లిష్టమైన పరిశోధనలో పాల్గొన్న గ్రీనిచ్ విశ్వవిద్యాలయ పీహెచ్‌డీ విద్యార్థిని జాస్మిన్ బస్రా తెలిపారు.

ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, బస్రాకు అనుకోకుండా తన సొంత బంధువులైన ఇద్దరి పేర్లు తారసపడ్డాయి. వారిలో ఆమె ముత్తాత, చిన్న ముత్తాత్త కూడా ఉన్నారు. వీరిద్దరూ మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ తరఫున పోరాడారు.

"ఆ అనుబంధం ఎంతో భావోద్వేగానికి గురిచేసింది. బ్రిటన్‌లో జన్మించిన రెండో తరం పంజాబీగా నాకు పంజాబ్‌‌కు దాదాపు దూరమైపోయిన భావన ఉండేది. అలాగే బ్రిటిష్ చరిత్రతో పూర్తిగా మమేకమయ్యే భావనా ఉండేది కాదు. కానీ ఈ పరిశోధన ఆ రెండింటినీ కలిపే స్పష్టమైన బంధంగా అనిపించింది" అని ఆమె చెప్పారు.

మొదటి ప్రపంచ యుద్ధం, బ్రిటిష్ ఇండియా, పంజాబ్ సైనికులు

వాలంటీర్లు తయారు చేసిన రికార్డుల్ని కామన్‌వెల్త్ వార్ గ్రేవ్ కమిషన్‌ స్వీకరించి దాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది. కమిషన్ ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి రికార్డుల సవరణకు పూనుకుంటోంది.

ఇప్పటివరకు స్మారక రికార్డుల్లో చోటు దక్కని 9,909 మంది సైనికుల్లో ఎక్కువ మంది యుద్ధ రంగానికి దూరంగా గాయాల కారణంగా మరణించారని కమిషన్ చరిత్రకారులు చెబుతున్నారు.

ఆ సమయంలో బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల వారికి యుద్ధ మృతులుగా అధికారిక హోదా లభించలేదు. అయితే ఇప్పుడా నిర్ణయాన్ని పక్కన పెట్టారు.

కొత్తగా గుర్తింపు పొందిన ఈ వేలాది మంది మృతుల్లో సుమారు 25 శాతం మంది సిక్కులు, మరో 25 శాతం మంది హిందువులు, దాదాపు 40 శాతం మంది ముస్లింలు ఉన్నారని సీడబ్ల్యూజీసీ తెలిపింది.

ప్రాణత్యాగం చేసిన వారి పేర్లను శాశ్వతంగా సంరక్షించడమే కాకుండా, మొదటి ప్రపంచ యుద్ధంపై యూరప్‌ కేంద్రీకృత దృక్పథాన్ని సరిదిద్దే విస్తృత ప్రయత్నంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని కమిషన్ పేర్కొంది.

యుద్ధ స్మరణ ఆ సంఘర్షణ నాటి ప్రపంచ వాస్తవికతను సంపూర్ణంగా ప్రతిబింబించాల్సిందేనని కమిషన్ స్పష్టం చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)