తిమింగలాలను తినేసే వింత సముద్ర జీవులివి..

ఫొటో సోర్స్, A Glover and T Dahlgren
- రచయిత, కేథరిన్ లాథమ్
- హోదా, బీబీసీ ఫ్యూచర్
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
తిమింగలాలు సముద్రపు భారీ వాహకాలు. ఇవి మాంసం, కొవ్వు, ఎముకలతో సుమారు 150 టన్నుల ఆహారం వంటివి. సముద్రాల్లో ఒక చోటు నుంచి మరో చోటుకు, అలాగే సముద్ర ఉపరితలం నుంచి అగాథ లోతులకు వెళ్తుంటాయి.
వీటి శరీరాలు సముద్ర జీవుల కోసం ప్రకృతి సిద్ధం చేసిన ఒక అద్భుతమైన విందు వంటివి.
''తిమింగలాలు సాధారణంగా తమ సుదీర్ఘ వలసలో, సముద్రం మధ్యలో ఎక్కడో ఒకచోట చనిపోతాయి" అని శాన్ డియాగోలోని స్క్రిప్స్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫీ క్యూరేటర్ గ్రెగ్ రూస్ అన్నారు.
మొదట్లో, తిమింగలం శరీరంలోని వాయువుల వల్ల అది ఒక బెలూన్లా ఉబ్బి నీటిపై తేలుతుంది.
ఆ తర్వాత, అది సముద్రంలోని సన్‌లైట్ జోన్, ట్విలైట్ జోన్, మిడ్నైట్ జోన్ దాటుకుంటూ చివరకు చీకటి నిండిన 'అగాథంలో' తన తుది విశ్రాంతి స్థానానికి చేరుకుంటుంది.


ఫొటో సోర్స్, Alex Dawson
మరణంలో కూడా తిమింగలం జీవాన్ని ఇస్తుంది. అది ఒక భారీ ఆహార ద్వీపంగా మారుతుంది.
సాధారణంగా సముద్రపు అగాథంలోకి ఆహారం 'మెరైన్ స్నో' అని పిలిచే చిన్న చిన్న సేంద్రియ రేణువుల రూపంలో చేరుతుంది. కానీ, ఒక తిమింగలం సముద్ర గర్భానికి చేరుకున్నప్పుడు, అది అగాథ సముద్ర నేలకు ఒకేసారి లభించే 'అత్యంత భారీ ఆహార నిధి'గా మారుతుంది.
ఒకే ఒక్క తిమింగలం, కొన్ని వేల ఏళ్ల పాటు కురిసే 'మెరైన్ స్నో'తో సమానం. దానిలోని ఆహార సంపద ఒక మొత్తం జీవవ్యవస్థకు దశాబ్దాల పాటు విందును అందిస్తుంది.
మొదటగా వచ్చేవి కళేబరాలను తినే జీవులు...
లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియానికి చెందిన అగాథ సముద్ర జీవావరణ శాస్త్రవేత్త అడ్రియన్ గ్లోవర్ మాట్లాడుతూ, ''మొదటగా 'లోతైన నీటిలో ఉండే స్కావెంజర్ల సమూహం' కళేబరం వద్దకు చేరుకుంటుంది" అని తెలిపారు.
వీటిలో హాగ్ఫిష్, స్లీపర్ షార్క్స్ వంటి వెన్నెముక కలిగిన జీవులతో పాటు, రొయ్యల వంటి 'యాంఫిపోడ్స్' అనే అనేక రకాల క్రస్టేసియన్ జీవులు ఉంటాయి. ఇవి మాంసాన్ని మొత్తం తినేసి, లోపల ఉన్న ఎముకలను బయటకు తీస్తాయి. ఈ 'సంచార స్కావెంజర్ దశ' కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతుందని అడ్రియన్ గ్లోవర్ వివరించారు.

ఫొటో సోర్స్, Alamy
పుర్రె ఉండి వెన్నెముక లేని జీవుల్లో హాగ్ఫిష్లు మాత్రమే మనకు తెలిసిన ఏకైక ప్రాణులు. ఇవి తమ ఆహారంలోకి ముఖాన్ని దూర్చి, లోపలి నుంచి బయటికి తింటాయి.
హాగ్ఫిష్లకు ఒక అద్భుతమైన 'జిగురు రక్షణ తంత్రం' ఉంది. ఏదైనా శత్రువు వీటిపై దాడి చేసినప్పుడు, ఒక రకమైన జిగురు (మ్యూకస్) విడుదల చేస్తాయి. ఆ జిగురు వల్ల దాడి చేసిన జీవి వెనక్కి తగ్గిపోవడమో లేదా ఊపిరి ఆడక చనిపోవడమో జరుగుతుంది.

ఫొటో సోర్స్, Alamy
ర్యాట్టైల్ చేపలు ఒక మీటరు పొడవు వరకు పెరుగుతాయి. సముద్రంలో 4,000 మీటర్ల లోతులో జీవిస్తాయి. అక్కడ సూర్యరశ్మి అస్సలు ఉండదు. కేవలం జీవుల ద్వారా ఉత్పన్నమయ్యే కాంతి మాత్రమే కనిపిస్తుంది.
ర్యాట్టైల్ చేపల పెద్ద నీలి రంగు కళ్లు, వాటి ఆహారం ఇచ్చే చిన్న మెరుపులను కూడా ఇట్టే పసిగట్టగలవు. వీటి గడ్డం కింద ఉండే మీసాల వంటి భాగాలు, సముద్ర గర్భంలోని బురదలో దాక్కున్న రొయ్యలు లేదా పురుగుల కదలికలను గుర్తిస్తాయి.
ఇక వీటికున్న అద్భుతమైన ఘ్రాణశక్తి(వాసన పసిగట్టే శక్తి) తిమింగలం వంటి చనిపోయిన జంతువుల వాసనను పసిగట్టి అవి ఎక్కడ ఉన్నాయో కనుగొనడానికి సహాయపడుతుంది.
సమయం చూసి వచ్చే అతిథులు...
''పెద్ద పెద్ద జంతువులు తమకు కావాల్సినంత తిని వెళ్లిపోయి, ఎముకలు మాత్రమే మిగిలినప్పుడు చిన్నపాటి జీవులు అక్కడికి చేరుకుంటాయి. ఒసెడాక్స్ అనే 'ఎముకలు తినే పురుగులు' భారీ సంఖ్యలో వస్తాయి" అని గ్రెగ్ రూస్ చెప్పారు. ఇవి 'పాలీకీట్' రకానికి చెందిన పురుగులు. వీటిని సాధారణంగా 'బ్రిసిల్ వార్మ్స్' అని పిలుస్తారు.
ఇవి వేల సంఖ్యలో తిమింగలం ఎముకలపై పేరుకుపోతాయి.
ఈ దశలో కనిపించే కొన్ని రకాల జీవులు కేవలం తిమింగలాల అవశేషాల వద్ద మాత్రమే కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Adrian Glover
'ఎముకలను తినే స్నాట్ ఫ్లవర్' అని పిలిచే 'ఒసెడాక్స్ మ్యూకోఫ్లోరిస్' అనే పురుగును మొదటిసారిగా 2005లో ఒక తిమింగలం కళేబరంపై కనుగొన్నారు. ఈ పురుగులు ఎముకలోకి యాసిడ్‌ను పంపిస్తాయి.
''ఇవి తమ జీర్ణకోశాన్ని ఎముక లోపలికి పంపి, ఆహారాన్ని నేరుగా గ్రహిస్తున్నట్లు ఉంటుంది. ఇది చాలా వింతైన విషయం'' అని అడ్రియన్ గ్లోవర్ పేర్కొన్నారు.
ఒక దశాబ్దం కాలంలో ఒకే తిమింగలంపై ఈ పురుగుల మొత్తం సంతతి పుట్టి, పెరిగి, మరణిస్తుంది.
ఎముకలు మొత్తం అయిపోయిన తర్వాత అవి చనిపోయే ముందు తమ లార్వాలను విడుదల చేస్తాయి. ఈ లార్వాలు సముద్రపు అలల వెంట ప్రయాణిస్తూ, ఎక్కడైనా మరో తిమింగలం దొరుకుతుందేమో అని వెతుకుతాయి. ఒకసారి కొత్త కళేబరం దొరికితే, మళ్లీ ఈ జీవచక్రం మొదటి నుంచి మొదలవుతుంది.
''ఇవి ఎముకలోని కాల్షియాన్ని కరిగించి, లోపల ఉండే కొల్లాజెన్ అనే ప్రోటీన్‌ను చేరుకుంటాయి" అని గ్రెగ్ రూస్ చెప్పారు.
దీనివల్ల గట్టిగా ఉండే ఎముక మెత్తని స్పాంజిలా మారుతుంది. అప్పుడు పీతలు, ఇతర జీవులు ఆ ఎముకలను సులభంగా ముక్కలు చేసి తినేస్తాయి.

ఫొటో సోర్స్, Alamy
తిమింగలం కళేబరం నుంచి సేంద్రియ పదార్థం వెలుపలికి ప్రవహించి, చుట్టుపక్కల ఉన్న సముద్ర గర్భాన్ని పోషకాలతో సుసంపన్నం చేస్తుంది.
ఇప్పుడు వేల సంఖ్యలో పురుగులు, మొలస్కా జీవులు, క్రస్టేసియన్లు మిగిలిపోయిన కొవ్వు లేదా మాంసం ముక్కలను ఏరి వేయడానికి, అలాగే సముద్రపు అడుగున ఉన్న ఇసుకను జల్లెడ పట్టి ఆహారాన్ని వెతకడానికి అక్కడికి చేరుకుంటాయి.
జపనీస్ స్పైడర్ క్రాబ్ సుమారు 100 సంవత్సరాల వరకు జీవిస్తుందని భావిస్తారు.
ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పీత. దీని ప్రధాన శరీరం కేవలం 30 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే పెరుగుతుంది.
కానీ, దీని కాళ్లు మాత్రం పెరుగుతూనే ఉంటాయి. ఒక గోరు నుంచి మరో గోరు వరకు వీటి కాళ్ల పొడవు 3.8 మీటర్ల వరకు ఉంటుంది. అంటే దాదాపు ఒక చిన్న కారు పొడవుతో సమానం.
తిమింగలాల అవశేషాల కారిడార్‌లో ప్రయాణం...
స్కావెంజర్లు ఎముకలను తింటున్న సమయంలోనే, మరో ప్రత్యేకమైన జీవుల సమూహం ఈ విందులో చేరుతుంది. ఇవి సుమారు 50 ఏళ్ల పాటు ఇక్కడ జీవిస్తాయి. దీన్ని 'సల్ఫోఫిలిక్' దశ, అంటే గంధకాన్ని ఇష్టపడే దశ అని పిలుస్తారు.
బ్యాక్టీరియా ఎముకలను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు, 'హైడ్రోజన్ సల్ఫైడ్' అనే వాయువు విడుదలవుతుంది.
ఈ వాయువులను 'కీమోసింథెటిక్' జీవులు ఆహారంగా తీసుకుంటాయి.
తిమింగలం కానుక ‘సరికొత్త పర్యావరణ వ్యవస్థ’
కీమోఆటోట్రోఫ్స్ అనేవి రసాయన చర్యల ద్వారా శక్తిని తయారు చేసుకోగల జీవులు.
మొక్కలు కిరణజన్య సంయోగక్రియ కోసం సూర్యరశ్మి, కార్బన్ డై ఆక్సైడ్‌పై ఆధారపడితే, ఈ కీమోఆటోట్రోఫ్స్ జీవులు 'కీమోసింథసిస్' అనే ప్రక్రియ ద్వారా శక్తిని పొందుతాయి.
రసాయనాలను ఆహారంగా తీసుకునే ఈ సూక్ష్మజీవులు తరచుగా వెన్నెముక లేని జీవులతో సన్నిహిత సహజీవన సంబంధాలను ఏర్పరుచుకుంటాయి. తద్వారా వాటికి కావలసిన దాదాపు అన్ని పోషకాలను గ్రహిస్తాయి.
కీమోఆటోట్రోఫ్లు కేవలం నాలుగు విభిన్నమైన లోతైన సముద్ర ఆవాసాలలో కనిపిస్తాయి. అవి హైడ్రోథర్మల్ వెంట్స్, కోల్డ్ సీప్స్, వుడ్ ఫాల్స్, వేల్ ఫాల్స్.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, వేల్ ఫాల్స్ అనేవి ప్రత్యేక జంతువులు. సాధారణంగా నిర్జనంగా ఉండే సముద్రపు అడుగుభాగంలో విస్తరించడానికి వీలు కల్పించే సోపానాలుగా పనిచేస్తాయి.
జీవించి ఉన్నప్పుడు ఒక తిమింగలం సముద్రాలను సారవంతం చేస్తుంది, కార్బన్‌ను లోతులకు తీసుకువెళుతుంది. తద్వారా సముద్రం జీవరాశితో నిండి ఉండటానికి, వాతావరణం చల్లగా ఉండటానికి సహాయపడుతుంది.
చనిపోయిన తర్వాత ఒకే ఒక తిమింగలం దాదాపు పదివేల సముద్ర జీవులకు ఆహారాన్ని, ఆవాసాన్ని, అత్యంత కఠినమైన వాతావరణంలో వృద్ధి చెందే అవకాశాన్ని అందించగలదు.
భూమికి తిమింగలం ఇచ్చే చివరి కానుక 'ఒక సరికొత్త పర్యావరణ వ్యవస్థ.'
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























