ఇస్లాం: ఈ మతం భారత దేశానికి ఎలా వచ్చింది? కత్తి బలంతోనా, నల్ల మిరియాలతోనా..?

- రచయిత, మీర్జా ఎ.బి. బేగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 10 నిమిషాలు
ఉమయ్యద్ కాలం క్రీస్తు శకం 712లో మొహమ్మద్ బిన్ ఖాసిం సింధుపై దండెత్తడంతో ఇస్లాం కత్తి బలంతో భారత్‌లోకి ప్రవేశించిదనేది భారత్‌లో ఒక సాధారణ అభిప్రాయం. అయితే కొంతమంది చరిత్రకారులు దీన్ని పూర్తిగా తిరస్కరిస్తున్నారు.
దక్షిణాసియా లేదా భారత్‌లోకి ఇస్లాం రాక, విస్తరణ అకస్మాత్తుగా జరగలేదు. అది ఒకే సంఘటన ఫలితంగా కూడా సంభవించలేదు. అది అనేక శతాబ్ధాలపాటు సాగిన సుదీర్ఘ చారిత్రక, సామాజిక ప్రక్రియ.
భారత్‌లో ఇస్లాం విస్తరణను వివిధ కోణాల నుంచి పరిశీలిస్తున్న చరిత్రకారులు, సామాజిక శాస్త్రవేత్తలు దీనికి వలసలు, వాణిజ్యం, సూఫీ బోధనలు, రాజకీయాలు, ఆర్థిక కారణాలతో సహా కొన్ని ప్రధాన సిద్ధాంతాలను ప్రతిపాదిస్తున్నారు.
ఈ సిద్ధాంతాలలో మొదటిది శాంతియుత వాణిజ్యం, సముద్ర మార్గాల ద్వారా భారత దేశంలోకి ఇస్లాం ప్రవేశించిందని చెబుతోంది.
సుగంధ ద్రవ్యాల వ్యాపారం, ముఖ్యంగా నల్ల మిరియాల వ్యాపారం ద్వారా ఇస్లాం భారత్‌లోకి వచ్చిందనేది ఇందులో ఆసక్తికరమైన అంశం.

ఈ థియరీలో నిజానిజాల గురించి తెలుసుకునేందుకు కేరళలోని కొచ్చి నగరానికి, ఆ తర్వాత కొడుంగల్లూర్‌కు ప్రయాణించింది బీబీసీ .
ఇక్కడ మోజిరిస్ అనే పౌరాణిక ఓడరేవు ఉండేది.
అయితే 15వ శతాబ్ధంలో వచ్చిన భయంకరమైన వరదల వల్ల ఇది నాశనమైందని స్థానికులు చెబుతారు.

భారత్ తీరంతో అరబ్బుల సంబంధాలు
కేరళకు ప్రయాణించడానికి ముందు, బీబీసీ బృందం దిల్లీ యూనివర్సిటీలో మాజీ ప్రొఫెసర్, చరిత్రకారుడు సయ్యద్ జహీర్ హుస్సేన్ జాఫ్రీని కలిసింది.
అరేబియా సముద్రం కంటే బంగాళాఖాతం ప్రశాంతమైనదని, బంగాళాఖాతంలో ఒక గడ్డిపోచ లేదా దూలాన్ని విసిరితే అది అరేబియా, ఒమన్ తీరాన్ని చేరుకుంటుందని ఆయన చెప్పారు.
చాలాకాలం పాటు ఈ సముద్రంపై అరబ్బుల ఆధిపత్యం కొనసాగింది. రుతుపవనాల సీజన్ మొదలు కాగానే వారు భారత్ వచ్చి కొంతకాలం ఇక్కడ నివసించి రుతుపవనాలు తిరోగమన మార్గం పట్టిన తర్వాత అరేబియాకు వెళ్లిపోయేవారు.
అరబ్బులు ఈ మార్గం ద్వారా శ్రీలంక, జావా, సుమత్రా, మలేషియా, ఇండోనేషియా చేరుకున్నారు.
"యూరప్- భారత్ మధ్య ఉన్న మార్గం చాలా ముఖ్యమైనది. ఇది మొదట పూర్తిగా అరబ్బుల ఆధీనంలో ఉండేది. హజ్రత్ ఈసా జననానికి సుమారు 300ఏళ్ల ముందు గ్రీకులు ఈజిప్టును ఆక్రమించాక, వారు ఈ సముద్ర వాణిజ్య మార్గంపై ఆధిపత్యం సాధించారు" అని చరిత్రకారుడు సయ్యద్ సులేమాన్ నద్వి తన 'అరబ్ వ హింద్ కె తల్లుకాత్' అనే పుస్తకంలో ఇలా రాశారు
"ప్రవక్త ఈసా (అలైహిస్సలాం) తర్వాత సుమారు 600 సంవత్సరాలకు ఇస్లాం ఆవిర్భవించింది. అరబ్బులు శక్తివంతులైనప్పుడు, క్రీస్తు శకం ఆరో శతాబ్దంలో వారు ఈజిప్టు నుంచి స్పెయిన్ వరకు తమ ఆధిపత్యాన్ని విస్తరించారు. అదే సమయంలో మధ్యధరా సముద్రంపైనా ఆధిపత్యం సాధించారు. దాని ఫలితంగా ప్రపంచంలోని అత్యంత ప్రధానమైన వాణిజ్య మార్గం అరబ్బుల చేతుల్లోకి వచ్చింది. అనేక శతాబ్దాల పాటు వారు దానిపై ఆధిపత్యాన్ని కొనసాగించారు" అని సులేమాన్ నద్వి తన పుస్తకంలో పేర్కొన్నారు.
అరబ్బులు భారత్‌లో నివసించినప్పుడు స్థానికుల్ని పెళ్లి చేసుకునేవారు. దీంతో అరబ్ యువకుల్ని పెళ్లి చేసుకున్న మహిళల్ని దక్షిణ భారత దేశంలో 'మోప్లా ముస్లింలు' అని పిలిచేవారని, అదొక సమాజంగా ఏర్పడిందని ప్రొఫెసర్ జాఫ్రీ చెప్పారు.

చారిత్రక ఆధారాలు లేకపోవడం
అరబ్బులు భారత్‌కు ఎప్పుడు వచ్చారనేది స్పష్టంగా చెప్పడానికి చారిత్రక ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయని చరిత్రకారులు చెబుతున్నారు. ఎందుకంటే అరబ్ నావికులు ఎలాంటి డైరీలను వదిలిపెట్టలేదు. వారు నిర్మించిన భవనాలపై శాసనాలను చెక్కలేదు.
ఒకవేళ వారి నిర్మాణాలపై ఏవైనా శాసనాలు చెక్కినా 16వ శతాబ్దంలో పోర్చుగీసు వారు వచ్చినప్పుడు వారు ముస్లింలతో యుద్ధం చేశారు. ఈ యుద్ధాల్లో ముస్లింలను ఓడించారు. ముస్లింలకు సంబంధించిన అనేక కట్టడాలను, వాటిపై ఆధారాలను ధ్వంసం చేశారు. గోవా మ్యూజియంలో దీనికి సాక్ష్యాలున్నాయి. పోర్చుగీసువారు వాటిని తమ విజయ చిహ్నాలుగా ప్రదర్శించారు.
భారత్‌లోకి ఇస్లాం రావడానికి ముందే అరబ్ వ్యాపారులు, నావికులు మలబార్ తీరాన్ని తరచూ సందర్శించేవారని కాంగ్రెస్ నాయకుడు, చరిత్రకారుడు శశిథరూర్ చెబుతున్నారు. కేరళలో కొత్త మతం (ఇస్లాం) ప్రవేశించినప్పుడు అది కత్తి బలంతో కాకుండా స్థానికులకు అప్పటికే తెలిసిన నమ్మకమైన ప్రయాణికుల ద్వారా ఒక వార్త రూపంలో వచ్చింది.
అలాగే హిందూ రాజు చేరమాన్ పెరుమాళ్ ఇస్లాం మతంలోకి మారిన కథ కూడా ఈ కథనంలో ఒక భాగం.
బీబీసీ బృందం కేరళ చేరుకున్న తర్వాత కొచ్చి హెరిటేజ్ ప్రాజెక్టు వ్యవస్థాపకుడు యోహన్ బన్ని కురువిలాతో కలిసి పెరియార్ నది తీరంలోని కోడంగల్లూరుకు చేరుకుంది.
అక్కడ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలో ఇండియా-అరబ్ కల్చర్ సెంటర్ మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్, మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎం.హెచ్. ఇలియాస్‌ను కలిసింది.

ఫొటో సోర్స్, keralatourism.org
ఇస్లాం రాక గురించి వివిధ సిద్ధాంతాలు
దక్షిణ భారతదేశంలోకి ఇస్లాం ప్రవేశం గురించి నాలుగు సిద్ధాంతాలు ఉన్నాయని ప్రొఫెసర్ ఇలియాస్ చెబుతున్నారు.
మొదటి సిద్ధాంతం ఏంటంటే ఇస్లాం ప్రవక్త హజ్రత్ మొహమ్మద్ జీవితకాలంలోనే పౌరాణిక ముజిరిస్ నౌకాశ్రయం ద్వారా ఇస్లాం భారత్‌లోకి ప్రవేశించిందని చెబుతారు. దీనికి సాక్ష్యంగా చేరమాన్ పెరుమాళ్ జుమా మసీదును చూపిస్తారు. ఈ మసీదును మాలిక్ బిన్ దీనార్ క్రీస్తు శకం 629లో నిర్మించారని మసీదుపై రాసి ఉన్న శాసనం చెబుతోంది.
అయితే అనేకమంది చరిత్రకారులు ఈ తేదీ గురించి స్పష్టంగా చెప్పడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే కొన్ని సంప్రదాయాల్లో మాలిక్ బిన్ దీనార్‌ను సహాబాలలో, మరికొన్ని సంప్రదాయాల్లో తాబియీన్లలో చేర్చారు. సహాబా అంటే ప్రవక్తను ముస్లింగా ఉన్న స్థితిలో చూసినవారు. తాబియీన్ అంటే ఇస్లాం స్థితిలో ఏదైనా సహాబాను చూసినవారు.
ఈ మసీదు ఏర్పాటుకు సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. కొడుంగల్లూరుకు చెందిన హిందూ రాజు చేరమాన్ పెరుమాళ్ కలలో లేదా ప్రత్యక్షంగా చంద్రుడు చీలిపోయిన అద్భుత దృశ్యాన్ని (షక్కుల్ ఖమర్)ను చూశారని, దాని గురించి అక్కడికి వచ్చిన అరబ్ వ్యాపారులకు చెప్పారని చెబుతారు. వారు అరేబియా ద్వీపకల్పంలో ఒక ప్రవక్త అవతరించారని, ఇది ఆయన చేసిన అద్భుతమేనని రాజుకు వివరించినట్లు ఒక కథనం ప్రచారంలో ఉంది.
దీంతో రాజు తన విశ్వసనీయ సహచరులతో కలిసి అరేబియా ప్రయాణానికి బయలుదేరారు. ఒక కథనం ప్రకారం ఆయన ఇస్లాం ప్రవక్త హజ్రత్ మొహమ్మద్‌ను కలిసి ఇస్లాంను స్వీకరించారు. అలాగే తిరుగు ప్రయాణంలో ఒమన్‌లోని సలాలా ప్రాంతంలో ఆయన మరణించారని, అక్కడే ఆయన సమాధి ఉందని కూడా ఈ కథనం చెబుతోంది.
రెండో సిద్దాంతం ప్రకారం వారిద్దరూ కలుసుకోలేదని చేరమాన్ ఒమన్‌లోనే మరణించారని ప్రొఫెసర్ ఇలియాస్ చెప్పారు. ఏదేమైనప్పటికీ రెండు కథనాలు ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాయి. వారు మాలిక్ బిన్ దీనార్‌ను కలిశారు. తమ దేశంలోని వారసుడికి ఒక లేఖ పంపారు. అందులో మాలిక్ బిన్ దీనార్, ఆయన సహచరులకు ఇచ్చిన గౌరవం అలాగే వారితో ప్రవర్తించిన తీరు గురించి పేర్కొన్నారు.
మాలిక్ బిన్ దీనార్ ముజిరిస్ నౌకాశ్రయానికి (ప్రస్తుతం కొడుంగల్లూర్) చేరుకున్నప్పుడు, రాజు వారసుడు ఆయనకు స్వాగతం పలికి మసీదు నిర్మాణానికి రాజభవనం పక్కన స్థలాన్ని ఇచ్చారు. ఆ మసీదు ఇప్పటికీ అక్కడ ఉంది. అక్కడ రోజుకు ఐదు పూటల నమాజు చేస్తారు.
"మసీదు ఉన్న ప్రదేశం చుట్టుపక్కల ముస్లిం జనాభా లేకపోవడం ఆశ్చర్యకరం. ఎందుకంటే ఇది రాజభవనం పక్కనే ఉంది. కానీ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు వచ్చి ఈ మసీదును సజీవంగా ఉంచుతున్నారు" అని యోహాన్ చెప్పారు.
కేరళలో ఇస్లాం సామాజిక సమానత్వ సందేశం వల్ల వ్యాపించిందని ప్రొఫెసర్ ఇలియాస్ చెప్పారు. ఇస్లాం ప్రవచించిన సామాజిక న్యాయం భావన కుల వ్యవస్థకు వ్యతిరేకం. వివక్షకు, జాతి ఆధిపత్యానికి వ్యతిరేకం. ఇది ప్రజలను ఆకర్షించింది.
"అరబ్బులు ప్రధానంగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం, ముఖ్యంగా మిరియాల వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చారు. ప్రతిగా వారు మాకు ఇస్లాం మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు అందించారు. ఉదాహరణకు లెక్కల విధానాలు లేదా కొలతల పద్ధతులు తీసుకొచ్చారు. వాటిని మనం ఇప్పటికీ ఉపయోగిస్తున్నాం. అంతేకాకుండా అరబ్బులు పడవలు తయారు చేయడం కూడా నేర్పించారు. మంచి పడవలను తయారు చేయడం మనం వారినుంచే నేర్చుకున్నాం" అని ప్రొఫెసర్ ఇలియాజ్ అన్నారు.

చేరమాన్ జామా మసీదు
బీబీసీ బృందం మధ్యాహ్న ప్రార్థన (జుహర్) సమయంలో ఈ చారిత్రక మసీదు వద్దకు చేరుకుంది. అక్కడ ఇమామ్ సలీం నద్వీని బీబీసీ టీమ్ కలిసింది. ఆయన లఖ్‌నవూలోని ఇస్లామిక్ విద్యాసంస్థ నద్వద్ ఉల్ ఉల్మాలో చదువుకున్నారు.
మసీదు పక్కనున్న దాలాన్‌లో మాలిక్ బిన్ దీనార్ కుమారుడు యూసుఫ్ బిన్ దీనార్, ఆయన భార్య సమాధులు ఉన్నాయి. మాలిక్ బిన్ దీనార్, ఆయన సహచరులు ఆ ప్రాంతంలో అదే కాలంలో దాదాపు పది మసీదులు, ఖాన్కాలు (సూఫీ ఆశ్రమాలు) స్థాపించారు. ఆయనను కాసరగోడ్ ప్రాంతంలో సమాధి చేశారని సలీం నద్వీ చెప్పారు.
చేరమాన్ ద్వారా భారత్‌కు ఇస్లాం చేరిందనే దాన్ని అన్ని కథనాలు ఏకీభవిస్తున్నాయని ప్రొఫెసర్ ఇలియాస్ చెబుతున్నారు.
భారత ఉపఖండంలోని తీర ప్రాంతాలకు ఇస్లాం మొదటగా అరబ్ వ్యాపారుల ద్వారా చేరిందని ఆయన చెప్పారు. ఏడు, ఎనిమిదో శతాబ్దాల్లో అరబ్ వ్యాపారులు అరేబియా, హిందూ మహాసముద్రంలోని వాణిజ్య మార్గాలపై ఆధిపత్యం చలాయించారు. వారు వ్యాపార వస్తువులతో పాటు తమ సంస్కృతి మతపరమైన సంప్రదాయాలను కూడా తీసుకువచ్చారని ఇలియాస్ అంటున్నారు.
కేరళ, గుజరాత్ తీర ప్రాంతాల్లో స్థానిక పాలకులు.. ముఖ్యంగా కేరళలోని జమోరిన్ వంటి అరబ్ వ్యాపారులను స్వాగతించి మసీదులు నిర్మించుకునేందుకు, అక్కడ స్థిరపడేందుకు అనుమతి ఇచ్చారు.
ఈ పరస్పర సంబంధాల ఫలితంగా స్థానిక ప్రజలు, అరబ్ వ్యాపారుల మధ్య బంధాలు ఏర్పడ్డాయి. క్రమంగా 'మోప్లా' వంటి స్థానిక ముస్లిం సముదాయాలు ఉద్భవించాయి.

ఫొటో సోర్స్, Mirza AB Baig
యుద్ధాల్లో గెలుపు ద్వారా ఇస్లాం విస్తరించిందా?
భారతదేశంలో ఇస్లాం విస్తరణ అరబ్బుల విజయాలు, రాజకీయ విస్తరణ'కు సంబంధించినదనేది ఒక సిద్ధాంతం.
భారత ఉపఖండంలో ఇస్లాంకు మొదటి పెద్ద రాజకీయ విజయం క్రీస్తు శకం 712లో లభించిందని ఆ సిద్ధాంతం చెబుతోంది.
ఆ సమయంలో మొహమ్మద్ బిన్ ఖాసిం నాయకత్వంలోని అరబ్ సైన్యాలు సింధ్, ముల్తాన్‌ను జయించాయి.
ఈ యాత్ర సముద్ర దోపిడీ సంఘటనలను నివారించే నేపథ్యంతో ప్రారంభమైంది. అనంతరం గజనీ, ఘోరీ దాడులు ఢిల్లీ సల్తనత్ ఏర్పాటుకు పునాది వేశాయి.
కొంతమంది పాత చరిత్రకారులు దీనిని 'కత్తి ద్వారా ఇస్లాం రాక' గా పేర్కొన్నప్పటికీ, ఈ విజయాల అసలు లక్ష్యం రాజకీయ అధికారాన్ని స్థాపించడం మాత్రమే అనేది ఆధునిక పరిశోధకుల అభిప్రాయం.
ప్రజలను బలవంతంగా ఇస్లాంలోకి మార్చలేదనీ, మత మార్పిడి ప్రక్రియ ఎక్కువగా సామాజిక స్వభావంతో జరిగిందని వారు చెబుతారు.

ఫొటో సోర్స్, Mirza AB Baig
సూఫీలు, సాధువుల బోధన
యెమెన్, హధ్రమావత్ ప్రజలు వెళ్లిన ప్రతిచోటా మసీదులు, సమాధులు ఉన్నాయి. మఠాలు నిర్మించారు.
రాజకీయంగా ఇస్లాం రాకకు ముందు ఇవి శాంతియుత కేంద్రాలుగా ఉన్నాయి. ఇక్కడ నుంచే ఇస్లాం బోధన వ్యాప్తి జరిగరిందని ప్రొఫెసర్ జాఫరీ రాసిన 'ది గ్రేవ్స్ ఆఫ్ తరీమ్' పుస్తకంలో రాశారు.
కేరళలోని మలబార్ ప్రాంతం, గుజరాత్ ఓడరేవుల వంటి భారతదేశ తీరప్రాంతాలు హధ్రమాత్ వ్యాపారులకు, సూఫీలకు ముఖ్యమైన స్థావరాలుగా ఉండేవి.
ఇక్కడి నుంచి వారు వ్యాపారం చేయడమే కాకుండా మలేషియా, ఇండోనేషియా వరకు ఇస్లాంను వ్యాప్తి చేశారని ప్రొఫెసర్ జాఫరీ తన రచనలో వెల్లడించారు.
11వ శతాబ్దం తర్వాత చిష్తియా, సుహ్రవర్ది ఇతర శాఖలకు చెందిన సూఫీ సన్యాసులు వివిధ ప్రాంతాలలో స్థిరపడ్డారు. వారి బోధనలు ప్రేమ, సహనం, మానవత్వం సామాజిక సమానత్వానికి ప్రాధాన్యతనిచ్చాయి. ఇది సామాన్య ప్రజలను ఎంతగానో ఆకర్షించింది.
సూఫీ మఠాలు అన్ని మతాల ప్రజలు తరలివచ్చే ఆధ్యాత్మిక కేంద్రాలుగా ఆవిర్భవించాయి. అజ్మేర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తీ పుణ్యక్షేత్రం ఇందుకు ఒక ప్రముఖ ఉదాహరణ.
ఈ విధంగా, ఇస్లాం వ్యాప్తిలో సూఫీ ఉద్యమం సున్నితమైన ప్రభావవంతమైన పాత్రను పోషించింది.
ఇస్లాం 'సామాజిక స్వేచ్ఛ, సమానత్వం" అనే సూత్రం ప్రజలను ఆకర్షించిందని ప్రొఫెసర్ జాఫ్రీ చెప్పారు.
ఉపఖండంలోని చాలామంది ప్రజలు, ముఖ్యంగా వెనుకబడిన కులాలకు చెందినవారు, కఠినమైన కుల వ్యవస్థ నుండి విముక్తి పొందడానికి ఇస్లాంవైపు మళ్లారనేది అనేక మంది అభిప్రాయం.
ఇస్లాం మత సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే సూత్రాలు వారికి మెరుగైన సామాజిక హోదాను సాధించే అవకాశాన్ని కల్పించాయి.
అయితే, ఆధునిక పరిశోధకులు ఈ సిద్ధాంతంలో అంతర్లీనంగా ఉన్న కొన్ని పరిమితులను కూడా ప్రస్తావిస్తున్నారు. ఎందుకంటే ఇస్లాం వేగంగా వ్యాపించిన కొన్ని ప్రాంతాలలో కుల వ్యవస్థ అంత బలంగా లేదు.

వ్యవసాయ ప్రోత్సాహకాలు, రాష్ట్ర ఏకీకరణ
'వ్యవసాయ పరిరక్షణ మరియు రాష్ట్ర ఏకీకరణ' అనే సాపేక్షంగా కొత్త సిద్ధాంతాన్ని రిచర్డ్ ఈటన్ వంటి చరిత్రకారులు ప్రతిపాదించారు.
ఈ సిద్ధాంతం ప్రకారం, బెంగాల్, పంజాబ్ వంటి ప్రాంతాలలో ఇస్లాం వ్యాప్తి ప్రధానంగా వ్యవసాయ అభివృద్ధి, రాష్ట్ర విధానాలతో అనుసంధానమై ఉంది.
ముస్లిం పాలకులు పాడుబడిన భూములను మతపరమైన సంస్థలు, సూఫీ ఆశ్రమాలు మసీదులకు ఇచ్చారు. అవి కొత్త వ్యవసాయ నివాసాలను స్థాపించాయి.
ఈ ప్రాంతాలలో నివసించిన రైతులు క్రమంగా ఇస్లాంను స్వీకరించారు. ఎందుకంటే అది వారి ఆర్థిక అభివృద్ధి, రాష్ట్ర నిర్మాణంలో భాగంగా మారింది.
ఇవన్నీ చూస్తే ..భారత ఉపఖండంలో ఇస్లాం వ్యాప్తి ఏదో ఒక కారణంతో ఒకసారి జరిగిందని కాదని, అది అనేక అంశాల సమ్మేళనమని స్పష్టమవుతోంది.
వాణిజ్యం, ఆధ్యాత్మికత, రాజకీయాలు, సామాజిక న్యాయం, ఆర్థిక అవకాశాలు ..ఇవన్నీ కలిసి ఒక చారిత్రక ప్రక్రియను నిర్మించాయి.
ఈ ప్రక్రియ ఈ ప్రాంతపు మతపరమైన, సాంస్కృతిక గుర్తింపును లోతుగా ప్రభావితం చేసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























