మూవీ రివ్యూ: హిట్ కొట్టాలనే ఆఖిల్ ఆశను ‘లెనిన్’ నెరవేర్చిందా, సినిమా ఎలా ఉంది?

ఫొటో సోర్స్, Annapurna studios/FB
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
చాలామంది దర్శకులకు మహాభారతంలోని పాత్రలు, సంఘటనలు, ఘట్టాల ఆధారంగా సినిమాలు చేయాలనే తపన ఉంటుంది. మహాభారతం ఆధారంగా వచ్చిన చాలా సినిమాలు, పాత్రలు క్లాసిక్స్‌గా నిలిచాయి.
మణిరత్నం దళపతి మొదలుకొని రాజమౌళి బాహుబలి వరకు ఎన్నో చిత్రాల్లో మహాభారతం ఛాయలు కనిపిస్తాయి.
ఒక్క సినిమా తీసిన అనుభవం గల దర్శకుడు మురళీకిశోర్ అబ్బూరి, అక్కినేని అఖిల్ కథానాయకుడిగా లెనిన్ సినిమాను మహాభారతంలోని ఘట్టాల ఆధారంగానే తెరకెక్కించాడు.
ట్రైలర్‌లోనే ఆ మొత్తం పాత్రలు, ఒక ప్రాంతాన్ని చూపించిన తీరు మహాభారతాన్ని గుర్తుచేసేలా సాగింది.
ఆదిపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ఎన్నో మహాభారత ఘట్టాలను తలపించే ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో చూద్దాం.


ఫొటో సోర్స్, Annapurna studios/FB
90వ దశకం కథ
ఇది 90వ దశకంలో జరిగే కథ. చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం గ్రామం. అక్కడ ఏటా 18 రోజుల పాటు ద్రౌపదమ్మ తిరుణాలు ఘనంగా జరుగుతాయి. ఆ జాతర జరిగిన అన్ని రోజులు ఒక్క బొట్టు రక్తం కూడా నేలపైకి రాలకూడదనేది ఆ ఊరి ఆచారం.
అలాంటి ఊళ్లోకి అనాథగా వస్తాడు లెనిన్ (అక్కినేని అఖిల్). ఆ ఊరి పెద్ద జయంతి (ఈశ్వరి రావు) అతనిని అక్కున చేర్చుకుంటుంది. ఆమె కొడుకైన వసంత్ (ప్రమోద్ పంజు)తో లెనిన్‌కు స్నేహబంధం ఏర్పడుతుంది.
అలా పెరిగి పెద్దవాడైన లెనిన్ ఒక కేసు విషయంలో జైలుకు వెళ్తాడు. తను జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి? అసలు లెనిన్ జైలుకు ఎందుకు వెళ్లాడు?అన్నది మిగతా కథ. లెనిన్ సినిమాకు మూలం మహాభారతం. అది కొన్ని సన్నివేశాల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇంకొన్ని సన్నివేశాల్లో అంతర్లీనంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Annapurna studios/FB
అఖిల్‌లో ఇంత యాక్షన్ ఉందా?
డ్రామా ఎప్పుడూ కూడా కొంత సమయాన్ని కోరుకుంటుంది. ఒక స్టేజ్ సెట్ అయిన తర్వాత అక్కడి పాత్రలు, వాటి లక్షణాలను ప్రేక్షకుడు అందుకోవడానికి కొంత సమయం పడుతుంది. కాకపోతే ఈ సినిమా దర్శకుడు ఆ డ్రామా ప్రేక్షకుడికి అందడానికి కావాల్సిందానికంటే కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నారనే ఫీలింగ్ కలిగిస్తుంది.
లెనిన్ తనకు జరిగిన కథను చెప్పడంతో ఒక్కో పాత్ర పరిచయం అవుతూ ఉంటుంది. కాకపోతే ఒకసారి ఫ్లాష్‌బ్యాక్ మొదలైన తర్వాత ఆ ప్రేమకథను నడిపించిన తీరులో ఇంకా కొత్తదనం, వేగం చూపించాల్సింది. ఆ కొత్తదనం లేకపోవడంతో ఇందులో డ్రామా చాలా నిదానంగా సాగిన ఫీలింగ్ కలుగుతుంది.
అప్పటివరకు నిదానంగా సాగుతున్న డ్రామా విరామ ఘట్టానికి వచ్చేసరికి ఒక్కసారిగా పుంజుకుంటుంది. దర్శకుడు రాసుకున్న ట్విస్ట్, ఆ పాత్రలు ప్రవర్తించిన తీరు కచ్చితంగా ప్రేక్షకులకు రెండో సగంపై అంచనాలను పెంచేలా ఉంటుంది. ఆ అంచనాలను రెండో సగం అందుకుంటుంది.
తొలి సగంతో పోల్చుకుంటే రెండో సగంలో డ్రామా, యాక్షన్, ఎమోషన్ ఇంకా పుంజుకుంటాయి. ప్రతి పాత్ర ప్రవర్తించిన తీరు, దర్శకుడు దాచుకున్న ట్విస్టులు అన్నీ కూడా ప్రేక్షకుడికి మంచి కమర్షియల్ యాక్షన్ డ్రామా చూస్తున్న అనుభూతిని కలిగిస్తాయి.
క్లైమాక్స్‌కు వచ్చేసరికి నిజంగా కురుక్షేత్రంలో ఒక విశ్వరూపాన్ని చూస్తున్న అనుభూతే కలుగుతుంది. ఆ పాత్రల మధ్య ఉండే ఎమోషన్స్, రివెంజ్ డ్రామా అన్నీ కూడా బలంగా పండాయి.
అఖిల్ ఇప్పటివరకు చేసిన పాత్రలకు ఇందులో చేసిన లెనిన్ పాత్రకు చాలా వైవిధ్యం ఉంది. మాస్ గెటప్‌లో తను కనిపించిన తీరు చాలా కొత్తగా అనిపిస్తుంది. అదే సమయంలో చిత్తూరు యాసను తను పలికిన విధానం, చివర్లో వచ్చే భారీ ఫైట్ సీక్వెన్స్‌లు ఇవన్నీ కూడా తనలో తనకే కొత్త నటుడిని పరిచయం చేసినట్టుగా అనిపించాయి.
ఇందులో యాక్షన్‌తో పాటు చాలా ఎమోషన్ కూడా ఉంది. ఆ ఎమోషన్స్‌ను అఖిల్ చాలా పరిణీతితో పలికించగలిగాడు. ఇది తన కెరీర్‌లో కచ్చితంగా గుర్తుపెట్టుకునే పాత్ర అవుతుంది.

ఫొటో సోర్స్, Bhagyashri Borse/FB
కథను మలుపు తిప్పే స్త్రీ పాత్రలు
లెనిన్‌లో రెండు బలమైన స్త్రీ పాత్రలు ఉన్నాయి. నిజానికి ఈ కథకు ప్రాణం ఆ రెండు పాత్రలే. భారతి పాత్రలో చేసిన భాగ్యశ్రీ బోర్సే ఆ పాత్రకు ప్రాణం పోసింది.భాగ్యశ్రీ కనబరిచిన నటన చాలా హుందాగా, అదే సమయంలో ఎమోషనల్‌గా ఉంది. భాగ్యశ్రీ కెరీర్‌లో ఇది మరొక బలమైన పాత్రగా చేరింది.
కన్నపేగు వ్యామోహంతో కళ్లు మూసుకుపోయిన గాంధారిని తలపించే పాత్రలో కనిపించింది ఈశ్వరి రావు. నిజంగా ఆ పాత్రలో మొదట కనిపించే ట్విస్ట్ ఇంటర్వెల్‌కు ముందు చాలా బలమైన సన్నివేశంగా నిలిచింది. తర్వాత క్లైమాక్స్‌లో అదే పాత్రకు వచ్చిన అసలు కథను మరోవైపు తిప్పింది. జయంతమ్మ పాత్రను దర్శకుడు చాలా మంచి ఆర్క్‌తో రాసుకున్నాడు.
వసంత్ పాత్రలో చేసిన ప్రమోద్ పంజు ఈ సినిమాకి మరో ఆకర్షణ. పైకి అమాయకంగా కనిపించే ఆ పాత్రలో దాగిన ఎమోషన్స్, ఈర్ష్య, కక్ష లెనిన్ కథలో కీలకం. ఆ పాత్రలో తను నటించిన తీరు కూడా గుర్తుపెట్టుకునేలా ఉంటుంది. ముఖ్యంగా లేడీ గెటప్‌లో తను కనిపించిన ఒక సన్నివేశం పుష్ప సినిమాను గుర్తు తెచ్చినప్పటికీ, చూపించడానికి దర్శకుడు ఎంచుకున్న ఆ గెటప్ ప్రేక్షకుడికి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేయగలుగుతుంది.
అలాగే ఎతిరాజు పాత్రలో కనిపించిన శివాజీ, దామోదర్ పాత్రలో చేసిన బ్రహ్మాజీ పాత్రలు కూడా కథలో కీలకంగా నిలిచాయి. రాంకీ పాత్ర హుందాగా ఉంది. సునీల్ పాత్ర కథను ఎలివేట్ చేయడానికి, అలాగే హీరో పాత్రను ప్రేక్షకుడికి మరింత ప్రభావవంతంగా చెప్పడానికి ఉపయోగపడింది.

ఫొటో సోర్స్, Annapurna studios/FB
పాటలు బాగున్నాయి కానీ...
ఈ చిత్రానికి తమన్ అందించిన పాటలు వినడానికి బాగున్నాయి. కాకపోతే కథ గమనానికి ఈ పాటలు అడ్డుగా నిలిచాయి. నిజంగా కథనానికి అనవసరం అనిపించే పాటలే.
నేపథ్య సంగీతం మాత్రం యాక్షన్‌ను ఎలివేట్ చేసేలా చేయగలిగారు. కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. 90వ దశకాన్ని తలపించే కెమెరా వర్క్ కనిపించింది.
కాకపోతే ఈ సినిమా కోసం వేసిన విలేజ్ సెట్‌అప్ కాస్త కృత్రిమంగా అనిపించింది. ఇంకాస్త సహజంగా చూపించి ఉంటే బాగుండేది.
చిత్తూరు యాసలో పలికిన డైలాగులు బాగున్నాయి. కాకపోతే జాతర జరిగే విధానాన్ని 18 రోజులుగా విడగొట్టి చూపించడంతో ఏ రోజు ఏం జరుగుతుందనేది కావాల్సిన దానికంటే ఎక్కువ డీటెయిల్‌గా అనిపించి కాస్త తికమక పెట్టే ఛాన్స్ ఉంది.

ఫొటో సోర్స్, Annapurna studios/FB
అఖిల్ ఎదురుచూస్తున్న సినిమా
అఖిల్‌కు చాలా కాలంగా విజయాలు లేవు. ఏజెంట్ తర్వాత తన కెరీర్‌లో చాలా గ్యాప్ కూడా వచ్చింది.
స్వయంగా నాగార్జున రంగంలోకి దిగి ఈ సినిమాను దగ్గరుండి పర్యవేక్షించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు అఖిల్ కెరీర్‌లో వచ్చిన సినిమాలకు భిన్నంగా యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో కొత్తగానే అనిపించింది.
మహాభారతం రెఫరెన్సులతో ముడిపెట్టి చూసిన కొన్ని కొత్త కోణాలు ఇందులో కనిపిస్తాయి. ఈ మధ్యకాలంలో వచ్చిన కమర్షియల్ యాక్షన్ డ్రామాల్లో లెనిన్ ఒక కొత్త కలర్ లో కనిపిస్తుంది.
రివెంజ్ యాక్షన్ డ్రామాలని ఇష్టపడే ఆడియన్స్ కు నచ్చే సినిమా లెనిన్
(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























