క్రికెట్ పిచ్ అంత పొడవైన మెడ ఉండే డైనోసార్ గురించి తెలుసా?

ఫొటో సోర్స్, Artwork by Pakorn Chotchaiyapor
- రచయిత, అమీ వాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
థాయిలాండ్‌కు చెందిన శిలాజ శాస్త్రవేత్తలు దేశం ఈశాన్యం ప్రాంతంలో కలాసిన్ ప్రావిన్సులో లభించిన శిలాజాల ఆధారంగా ఒక కొత్త డైనోసార్ జాతిని గుర్తించినట్టు తెలిపారు.
ఉరగసారస్ కలసినేన్సిస్ అని పేరు పెట్టిన ఈ డైనోసార్ సుమారు 15 కోట్ల సంవత్సరాల క్రితం జీవించి ఉండేదని భావిస్తున్నారు. ఇది మొక్కలను ఆహారంగా తీసుకునేది.
దీనికి బాగా పొడవైన మెడ ఉండేది. ఈ డైనోసార్ మెడ పొడవు 66 అడుగులు ఉండేది. ఇది దాదాపు ఒక క్రికెట్ పిచ్‌తో సమానం.
ఈ నమూనా 2008లో మొదట గుర్తించిన ఒక పెద్ద శిలాజ సేకరణలో భాగమని ఈ అధ్యయానికి నేతృత్వం వహించిన థాయ్‌లాండ్‌లోని మహాసారఖామ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ అపిరాట్ నిల్‌ఫనాఫాన్ బీబీసీతో చెప్పారు.
అప్పట్లో ఒక స్థానికుడు ఒకరు పాము పొలుసులను పోలి ఉన్న కొన్ని శిలాజ ముక్కలను గుర్తించడంతో ఆ ప్రదేశం వెలుగులోకి వచ్చింది.

థాయ్‌లాండ్‌లో తొలిసారి పొడవు మెడ డైనోసార్ శిలాజాలు గుర్తింపు
ఉరగసారస్ కలసినేన్సిస్ కనిపించిన ఫూ నోయ్ ప్రాంతంలో జురాసిక్ కాలానికి చెందిన అనేక రకాల శిలాజాలు లభించాయి. అక్కడ తవ్వకాల్లో బయటపడిన శిలాజాల్లో 90శాతానికి పైగా డైనోసార్ అవశేషాలే ఉన్నాయి. ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి వెళ్లిన సర్వే బృందం డైనోసార్ పళ్లు, ఎముకలు వంటి ఇతర శిలాజాలను కూడా గుర్తించింది.
కొత్త జాతి డైనోసార్‌ను వెన్నెముక మధ్య లేదా పై భాగానికి చెందిన డోర్సల్ వెర్టిబ్రా(వెన్నుపూస ఎముక) ద్వారా గుర్తించారు.
ఆ ఎముకలో ప్రత్యేకమైన లక్షణాలు కనిపించాయి. పొడవైన మెడలు ఈ డైనోసార్ల ప్రత్యేకం. దీనివల్ల రకరకాల ఎత్తుల్లో ఉండే మొక్కలను అవి తినగలిగేవి.
సీటీ స్కాన్‌లో ఈ డైనోసార్ మామెన్‌కిసారిడే అనే సారోపాడ్ డైనోసార్ కుటుంబానికి చెందినదని తేలింది. మామెన్‌కిసారిడే కుటుంబానికి చెందిన ఎక్కువ శిలాజాలు ఇప్పటివరకు చైనాలోనే లభించాయి. థాయిలాండ్‌లో ఈ కుటుంబానికి చెందిన డైనోసార్ శిలాజం కనుగొనడం ఇదే మొదటిసారి.

ఫొటో సోర్స్, Getty Images
ఈ డైనోసార్ ప్రత్యేకతలేంటంటే...
సీటీ స్కాన్‌లో మరికొన్ని ప్రత్యేక లక్షణాలు కూడా కనిపించాయి. లామినో అని పిలిచే వై కారంలో అమరిఉన్న ఎముకలు కూడా ఉన్నాయి.
ఎయిర్ క్యావిటీ ప్రపంచంలోని ఏ ఇతర డైనోసార్‌లోనూ కనిపించలేదని నిల్‌ఫనాఫాన్ బీబీసీతో చెప్పారు. అదే దీన్ని ఇతర డైనోసార్‌లన్నింటి నుంచి ప్రత్యేకంగా నిలబెడుతోందన్నారు.
కొత్త డైనోసార్ల జాతిని కనుగొన్నామని గ్రహించిన క్షణంలో తాను ఆనందంతో కీబోర్డు పగలగొట్టేశానని ఆయన చెప్పారు. ఆ సమయంలో తనకు ఒకేసారి ఎంతో ఉత్సాహం, ఊరట కలిగాయన్నారు. ఈ అధ్యయనం ఫలితాలు ఈ వారం ప్రారంభంలో నేచర్ సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
మేలో కూడా థాయ్‌లాండ్‌లో తవ్వకాల్లో బయటపడిన అవశేషాల ఆధారంగా నాగటైటాన్ అనే మరో పొడవైన మెడ కలిగిన శాకాహార డైనోసార్ జాతిని శాస్త్రవేత్తలు గుర్తించారు.
నాగటైటాన్ ఆగ్నేయాసియాలో ఇప్పటివరకు గుర్తించిన అతిపెద్ద డైనోసార్. దీని బరువు సుమారు 27 టన్నులు. అంటే దాదాపు తొమ్మిది ఆసియా ఏనుగుల బరువుతో సమానం. దీని పొడవు 88 అడుగులు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)



























