కోళ్ళూరు: వజ్రాలగనికి మారుపేరుగా నిలిచిన ఈ ఊరు ఇప్పుడెలా ఉంది, ఇప్పటికీ వజ్రాలు దొరుకుతున్నాయా?

కోళ్ళూరులో వజ్రాల వేట
ఫొటో క్యాప్షన్, కనీసం 800 సంవత్సరాల కిందటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల గని కలిగిన ఊరుగా కోళ్లూరు ప్రసిద్ధి చెందిందని చరిత్ర చెబుతోంది.
  • ప్రచురణ
  • చదివే సమయం: 11 నిమిషాలు

వీధుల్లో వజ్రాలు రాశులుగా పోసి అమ్మేవారు అనగానే తెలుగు వారందరికీ గుర్తొచ్చేది విజయనగర సామ్రాజ్యం. రాయల కాలంలో హంపీ వీధుల్లో ఆ వ్యాపారం ఎంత వైభవంగా జరిగిందో కథల్లో విని, సినిమాల్లో చూసే ఉంటారు.

కానీ, అదే తెలుగునేలను పాలించిన మరో సామ్రాజ్యం కూడా వజ్రాల వ్యాపారానికి అంతే పేరు పొందిందని కొందరికే తెలుసు. అదే ప్రస్తుత హైదరాబాద్ రాజధానిగా విలసిల్లిన గోల్కొండ సామ్రాజ్యం.

ప్రస్తుతం ఒక పాత కోటగా మాత్రమే ఎక్కువ మంది తెలుగువారికి తెలిసిన గోల్కొండ అనే పదం ఇంగ్లిష్ భాషలో అదృష్టం, సౌభాగ్యం అనే అర్థాలకు పర్యాయపదంగా మారిందంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.

హంపీ వీధుల్లానే, హైదరాబాద్‌లో ప్రస్తుత పాత బస్తీలోని కార్వాన్ వీధుల్లో కూడా అదే స్థాయిలో వజ్రపు రాశులను అమ్మారని చెప్పుకోవచ్చు.

దాదాపు 18వ శతాబ్దం వరకూ ప్రపంచం మొత్తానికి వజ్రాలు అందించిన అతి పెద్ద, అతి ముఖ్య ప్రదేశం భారత దేశం మాత్రమే.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఆఫ్రికా, దక్షిణ అమెరికాల్లో 18వ శతాబ్దం తరువాతే వజ్రాల గనులు కనుగొన్నారు.

దక్షిణ భారతంలోని కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ ప్రాంతాలు ఈ వజ్రాలకు పుట్టినిల్లు.

అందుకే విజయనగర, బీజాపూర్, గోల్కొండ సామ్రాజ్యాలు... అంటే స్థూలంగా దక్కన్ ప్రాంతం వజ్రాల వ్యాపారానికి మారుపేరుగా నిలిచాయి.

గోల్కొండ కోట
ఫొటో క్యాప్షన్, విజయనగర, బీజాపూర్, గోల్కొండ సామ్రాజ్యాలు... వజ్రాల వ్యాపారానికి మారుపేరుగా నిలిచాయి.

ఒకప్పటి గోల్కొండ సామ్రాజ్యం పరిధిలో ఉండి, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్‌లోని ఆ ఊరు వెళ్లాలంటే.. ప్రస్తుత పల్నాడు జిల్లా బెల్లంకొండ దాటుకుని, పొలాల మధ్యలో ప్రయాణిస్తూ, చెట్లు, గుట్టలను దాటుకుంటూ.. ట్రాక్టర్లూ, బైకులు తప్ప కార్ల వంటివాహనాలు ప్రయాణించలేని దారిలో వెళ్తే... సెల్ ఫోన్ సిగ్నల్ కాదు కదా, కరెంటు కూడా లేని ఒక ఊరు వస్తుంది.

ఆ ఊరే పులిచింతల బారేజ్ వెనుక ఉన్న కోళ్ళూరు గ్రామం.

ఆ ఊరిలో ఇళ్లలో ఎవరూ కనిపించరు. కానీ, వారాల తరబడి కుటుంబాలను వదిలేసి అక్కడ మట్టిలో ఏదో వెతుకుతూ, గోతులు తవ్వుతూ, ఇసుకను జల్లెడ పడుతూ కొందరు కనిపిస్తారు. ఈ జనం ఎక్కడెక్కడి నుంచో ఆ ఊరు వస్తుంటారు.

చరిత్ర ప్రకారం, కనీసం 800 సంవత్సరాల కిందటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల గని ఉన్న ఊరు అది.

కోళ్ళూరు గ్రామం
ఫొటో క్యాప్షన్, పులిచింతల రిజర్వాయర్‌ ముంపు గ్రామంగా కోళ్లూరు మారిపోయింది

ఆ ఊరి గురించి ఇంకా సమగ్రంగా తెలియాలంటే కనీసం 400 ఏళ్ల క్రితం యూరోపియన్లు, యాత్రికులు, వర్తకులు రాసిన పుస్తకాలు చదవాల్సిందే.

అది క్రీస్తు శకం 1618-22 మధ్య ప్రాంతం. కోళ్ళూరుకి యూరోప్ నుంచి విలియం మొథోల్డ్ అనే విదేశీయుడు వచ్చారు. అక్కడ జనాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయారు.

ఆ గ్రామం దగ్గర వజ్రాల గనుల్లో 30 వేల మంది పనిచేస్తున్నారని ఆయన రాశారు.

ఆయన రాసిన 50 ఏళ్ళ తరువాత, 1665 లో అదే ఊరు వచ్చారు బాప్టిస్ట్ టావెర్నియర్ అనే ఫ్రెంచ్ యాత్రికుడు.

ఈ గ్రామంలో వజ్రాల గనుల్లో 30 వేల మంది కాదు... 60 వేల మంది పనిచేసేవారు అని ఆయన రాశారు.

వాళ్లే కాదు, మార్కోపోలో, హెన్రీ హోవర్డ్, కొలిన్ మెకంజీ.. ఇలా ఎందరో ఈ వజ్రాల గనుల గురించి ఘనంగా రాశారు.

కోళ్ళూరు గ్రామం
ఫొటో క్యాప్షన్, కోళ్ళూరులో ఇప్పటికీ వజ్రాల కోసం కొందరు ప్రజలు వెదుకుతున్నారు.

తరువాత కాలంలో ఈ ఊరు పులిచింతల ముంపు గ్రామంగా మారి, రిజర్వాయర్‌లో పూర్తిగా మునిగిపోయింది.

దశాబ్దం క్రితమే ఖాళీ అయిన ఆ ఊరి చివర ఎత్తైన దిబ్బమీద ప్రస్తుతం మేకలు మేపుకునే నాలుగు కుటుంబాలు మాత్రమే ఉంటున్నాయి.

అక్కడ నుంచి పడవ ఎక్కితే, కృష్ణా నది మధ్యలో, పులిచింతల రిజర్వాయర్లో మరికొన్ని కిలోమీటర్లు ప్రయాణిస్తే మధ్యలో ఒక ద్వీపంలాంటి ప్రాంతం కనిపిస్తుంది. అది సహజ దీవి కాదు, ఊరి మధ్యలో ఉండే దిబ్బ రిజర్వాయర్లో అలా కనిపిస్తుంది.

ఆ దీవి మీద చిన్ని చిన్న టెంట్లు కనిపిస్తాయి. అక్కడ కొందరు మట్టిలో ఏదో తవ్వుతూ కనిపిస్తారు. వారంతా ఇల్లూ వాకిలి, కుటుంబాలను వదిలేసి అక్కడకు వచ్చి వజ్రాల కోసం వెతుకుతున్నారు. ఇప్పటికీ అక్కడ వజ్రాలు దొరుకుతుండడంతో కొంతమంది ప్రజలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.

బీబీసీ 2018లో అక్కడ పర్యటించినప్పుడు ఊరు అంతలా మునగిపోలేదు. అప్పుడు కూడా అక్కడ పదుల సంఖ్యలో జనం వజ్రాలు తవ్వుతూ ఉండేవారు. 2025లో బీబీసీ బృందం మరోసారి అక్కడ పర్యటించింది.

జీఎస్ఐకి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ
ఫొటో క్యాప్షన్, జీఎస్ఐకి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ

గనికి పర్యాయపదంగా మారింది

కోళ్ళూరు గురించి ఒక్కమాటలో చెప్పాంటే గని అనేమాటకు పర్యాయపదంగా మారిపోయింది. గని అంటే కోళ్లూరు అనే అర్థం చెప్పుకునేంతగా అప్పట్లో ఈ గ్రామం ప్రాచుర్యం పొందింది.

''18వ శతాబ్దం వరకూ దక్షిణ భారతంలోని దక్కన్ ప్రాంతం వజ్రాలకు ప్రధాన వనరుగా ఉండేది. కోహినూర్ మాత్రమే కాకుండా.. గ్రేట్ మొఘల్, రీజెంట్, ఓర్లాఫ్, నిజాం, హోప్ లాంటి వజ్రాలు ఇక్కడే దొరికాయి. ముఖ్యంగా 13 - 17 శతాబ్దాల మధ్య ఈ వజ్రాల వ్యాపారం వెల్లివిరిసింది’’ అని జీఎస్ఐకి చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ బీబీసీతో చెప్పారు.

‘‘ఆంధ్ర, తెలంగాణల్లోని కృష్ణా, పెన్నా నదీ లోయల్లో పెద్ద ఎత్తున వజ్రాలు దొరికేవి. అక్కడక్కడా చిన్న చిన్న గనులు మినహాయిస్తే.. ప్రపంచానికి ఇదే పెద్ద డైమండ్ వనరుగా ఉంది. 1725లో బ్రెజిల్‌లో గనులు కనుగొనే వరకూ అదే పరిస్థితి. బ్రిటిష్ కంటే ముందు భారత విదేశీ వాణిజ్యంలో వజ్రాల పాత్ర ముఖ్యమైనది. విజయనగరం, బీజాపూర్, గోల్కొండ సామ్రాజ్య కాలాల్లో ఇది మంచి ప్రాచుర్యం పొందింది'' అని బీబీసీతో చెప్పారు ఎస్వీ సత్యనారాయణ.

''తుంగభద్ర, కృష్ణా పరిసరాల్లోనే వజ్రాలు ఎక్కువ దొరికాయి. వాటన్నిటిలోకీ కోళ్ళూరు బాగా ప్రసిద్ధి. ఇంకా రావులకొండ వంటి గనులుండేవి. గండికోట వంటి వ్యాపార కేంద్రాలుండేవి. విజయనగర సామ్రాజ్యం దీనికి ఎంతో ప్రసిద్ధి. తరువాత బీజాపూర్, గోల్కొండ సామ్రాజ్యాలు ఆ స్థానంలోకి వచ్చాయి. వజ్రాల చుట్టూ ఎన్నో ఆసక్తికర కథనాలుంటాయి. కొన్ని వజ్రాలకు శాపగ్రస్తమైనవన్న ముద్ర ఉంటుంది. సాధారణంగా వేసవిలో నది ఎండిపోయినప్పుడు బయటపడిన నేలలో వజ్రాల కోసం వెతుకుతారు'' అని చరిత్ర పరిశోధకుడు, పాత్రికేయుడు నానిశెట్టి శెరీష్ బీబీసీకి చెప్పారు.

చరిత్ర పరిశోధకుడు, పాత్రికేయుడు నానిశెట్టి శెరీష్
ఫొటో క్యాప్షన్, చరిత్ర పరిశోధకుడు, పాత్రికేయుడు నానిశెట్టి శెరీష్

కార్వాన్ - వజ్రాలను సానబెట్టడానికి ప్రసిద్ధి

గోల్కొండ సామ్రాజ్యాన్ని 1518-1687 మధ్య హైదరాబాద్ కేంద్రంగా కుతుబ్ షాహీలు పాలించారు. పశ్చిమాన గుజరాత్‌లోని సూరత్ నుంచి తూర్పున ఏపీలో మచిలీపట్నం వరకు (ఈ రెండూ పూర్వం నుంచి అంతర్జాతీయ వర్తక కేంద్రాలు).. వీటి మధ్యలో హైదరాబాద్ నగరం - గోల్కొండ సామ్రాజ్యం ఉంది.

ఓల్డ్ సిటీలోని కార్వాన్ ఒకప్పుడు వజ్రాలకు సాన పెట్టడం, కత్తిరింపులకు, అమ్మకాలకు కేంద్రంగా ఉండేది. గుజరాతీలు, మార్వాడీలు, ఇతర భారతీయ వ్యాపారులు కార్వాన్‌లో స్థిరపడ్డారు. విదేశీయులు కార్వాన్ వచ్చి వెళ్తుండేవారు.

నానిశెట్టి శెరీష్ వివరించిన ప్రకారం.. ‘‘ థెవినాట్ (Thevenot) అనే ఫ్రెంచి యాత్రికుడు గోల్కొండ రాజ్యాన్ని వజ్రాల దేశమని రాశారు. 17వ శతాబ్ది నాటికి 23 గనులు గోల్కొండ కింద, 15 గనులు బీజాపూర్ కిందా ఉన్నాయి. పెద్ద సంఖ్యలో ప్రజలు ఉపాధి పొందేవారు. ఔరంగజేబు గోల్కొండ మీద దాడి చేయడానికి ఈ వజ్రాల లభ్యత కూడా ఒక కారణం అంటారు’’

''పాత రోజుల్లో రాజుకు ఇంత అని డబ్బు ఇచ్చి వజ్రాల వేట సాగించేవారు. అందులో ఒక కారెట్ లేదా అంతకంటే తక్కువ బరువైన వజ్రాలు దొరికితే, దొరికిన వారు పట్టుకుపోవచ్చు. కానీ, ఎక్కువ బరువైన వజ్రాలు దొరికితే మాత్రం రాజుకే అప్పజెప్పాలి. అందుకే ఆ రోజుల్లో పెద్ద గనుల దగ్గర సాయంత్రం ఇళ్లకు వెళ్లే వారిని వజ్రాలేమైనా తీసుకువెళ్తున్నారా అని బట్టలు విప్పి మరీ తనిఖీ చేసేవారు.. . ఎందరు పనిచేసేవారో అంతమంది కాపలా ఉండేవారు’’ అని శెరీష్ బీబీసీకి చెప్పారు.

‘‘విజయనగర సామ్రాజ్య పతనం తరువాత గోల్కొండ రాజ్యం వజ్రాల వ్యాపారులకు ఒక గొప్ప హబ్‌గా అవతరించింది’’ అని చెప్పారు శెరీష్.

కోహినూర్ వజ్రం
ఫొటో క్యాప్షన్, కోహినూర్ వజ్రం

కోహినూర్ ఇక్కడే దొరికిందా?

కోహినూర్ వజ్రం ఎక్కడ దొరికింది అనే విషయంలో అత్యంత స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ ఎక్కువ మంది చరిత్రకారులు, భూగర్భ శాస్త్రవేత్తలు కోహినూర్ కోళ్ళూరులోనే దొరికిందని చెబుతారు.

షాజహాన్ చేతికి వెళ్ళిన తరువాత కోహినూర్ ఎలా చేతులు మారింది, బ్రిటిష్ సింహాసనం వరకూ ఎలా వెళ్లింది అనే విషయం స్పష్టంగా చరిత్రలో నమోదైంది. కానీ, షాజహాన్ వరకూ అది ఎలా వెళ్లిందనే విషయంలో స్పష్టమైన ఆధారాలు లేవు.

''కోహినూర్ విషయంలో అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. నా పరిశోధన మేరకు, కోళ్ళూరు గని నుంచి నేరుగా గండికోట పాలకుడు మీర్ జుమ్లా దగ్గరకు వెళ్ళింది. ఆయన నుంచి అది షాజహాన్‌కు అందింది. షాజహాన్‌కు తన మద్దతు ప్రకటించే క్రమంలో మీర్ జుమ్లా దీనిని బహుమానంగా ఇచ్చాడు. మొఘల్ పత్రాల్లో నమోదైన వజ్రం రంగు, సైజు, ఫైన్ వాటర్, ట్రాన్స్పరెన్సీ, రెడ్ వెల్వెట్ క్లాత్‌లో ఉన్న పెట్టె... ఇవన్నీ కోహినూర్‌నే సూచిస్తున్నాయి. అలాగే అప్పట్లో అంత పెద్ద వజ్రాలు దొరికే గని కోళ్ళూరు మాత్రమే. మీర్ జుమ్లా దగ్గరున్నంత వరకు దానికి పేరులేదు. షాజహాన్ దానికి 'వెలుగు పర్వతం' అంటే పర్షియన్ భాషలో కోహినూర్ అనే పేరు పెట్టారు'' అని చెప్పారు శెరీష్.

మీర్ జుమ్లా దగ్గర ఉన్న వజ్రాల గురించి ఫ్రెంచ్ బాప్టిస్ట్ టావెర్నియర్ వివరంగా రాశారు. అతని దగ్గర వజ్రాల రాశులు (హీప్ ఆఫ్ డైమండ్స్) ఉన్నాయని టావెర్నియర్ రాశారు.

జీఎస్ఐ రిటైర్డ్ శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు.

''బహుశా 1656లో లేదా 1304లో అది కోళ్ళూరులో దొరికి ఉండవచ్చు'' అని ఆయన అన్నారు.

''కోహినూర్ ఎప్పుడు దొరికింది, దొరికినప్పుడు బరువు ఎంత అన్న విషయంలో అనుమానం ఉండవచ్చు. కానీ, అది కృష్ణా వ్యాలీలో దొరికింది అనడంలో అనుమానం లేదు'' అన్నారు శెరీష్.

ఎస్వీ సత్యనారాయణ అందించిన వివరాల ప్రకారం కోహినూర్ కాక ఇతర ప్రముఖ వజ్రాలు దొరికిన ప్రదేశాలు:

వజ్రాలు దొరికిన గని
ఫొటో క్యాప్షన్, ప్రముఖ వజ్రాలు దొరికిన ప్రదేశాలు

ఆ వజ్రాల గనులు ఇప్పుడెక్కడ ఉన్నాయి?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి అనంతపురం, కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో విస్తృతంగానూ, ప్రస్తుత తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, కర్ణాటకలోని రాయచూరు, మహారాష్ట్రలోని వైరాగర్ ప్రాంతం, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి ప్రకాశం, కడపల్లో తక్కువగానూ వజ్రాలు దొరికేవి.

జీఎస్ఐ విశ్రాంత శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ బీబీసీకి చెప్పిన వివరాల ప్రకారం 1677లో హెన్రీ హోవర్డ్ సిద్ధం చేసిన పత్రం ఆధారంగా పాత వజ్రాల గనులు ఇవి:

పాత వజ్రాల గనులు

ఇక్కడే ఎందుకు వజ్రాలు దొరికేవి?

వజ్రాలు ప్రధానంగా కింబర్లైట్, లంప్రోయిట్స్, కాంగ్లోమెరేట్స్, గ్రావెల్స్‌తో అనుబంధంగా ఉంటాయి.

''ఈ ప్రాచీన గనులన్నీ కూడా దాదాపు సెడిమెంటరీ రాళ్లలోనే ఉన్నాయి. అంటే కింబర్లైట్స్, లంప్రోయిట్స్, సర్ఫేస్ సాయిల్స్‌లో. అవి కూడా ఉమ్మడి కృష్ణా, గుంటూరు, మహబూబ్ నగర్, కర్నూలు, ప్రకాశం, కడప, అనంతపురం సహా కృష్ణా తుంగభద్రా సంగమం నుంచి విజయవాడ మధ్య దాదాపు 300 కి.మీ. మేర విస్తరించాయి. ఎక్కువ మైనింగ్ కోళ్ళూరు - పరిటాల బెల్ట్ మధ్య జరిగింది. కోహినూర్, గ్రేట్ మొఘల్, పిట్ లేదా రీజెంట్, ఆర్లాఫ్, నిజాం, హోప్ వజ్రాలు ఇక్కడే దొరికాయి. తుంగభద్రా-కృష్ణా సంగమం మధ్యప్రదేశంలోనూ, అటు కోళ్ళూరు – పరిటాల బెల్ట్‌గా పిలిచే ఈ ప్రదేశంలోనూ వజ్రాలు ఉండేవి'' అని చెప్పారు జీఎస్ఐ రిటైర్డ్ శాస్త్రవేత్త ఎస్వీ సత్యనారాయణ.

ఎస్వీ సత్యనారాయణ ప్రకారం... ప్రముఖ కాంగ్లొమెరేట్ (మిశ్రమ శిలల) ఖనిజాలు కర్నూలు జిల్లాలో రామల్లకోట, బనగానపల్లె, వజ్రగిరి, మునిమడుగులో, గుంటూరు జిల్లాలో కోళ్ళూరు, కృష్ణా జిల్లాలో మల్లవెల్లిలో ఉన్నాయి.

అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని వజ్రకరూరు, జొన్నగిరి ప్రాంతాల ఉపరితల మట్టి, అనంతపురం జిల్లాలోని వజ్రకరూరు కింబర్లైట్ పైపులు, కర్నూలులోని చెలిమ లాంప్రోయిట్ డైక్స్ వంటి ప్రాంతాలలో కూడా వజ్రాల కోసం తవ్వకాలు జరిగాయి. ఈ నేలలన్నీ వజ్రాలకు నిలయాలు.

''పెద్ద పరిమాణంలో వజ్రాలు కృష్ణా జిల్లాలోని గ్రావెల్ ఖనిజాల్లోనూ, విజయనగర సామ్రాజ్యంలో ఉన్న వజ్రకరూరు ప్రాంతాల తవ్వకాలలోనూ లభించాయి. ఒక పోర్చుగీసు యాత్రికుడు 1610 ప్రాంతంలో వజ్రకరూరులో 400 కారెట్లకు మించిన ఒక వజ్రాన్ని పొందాడని హోవర్డ్ 1677లో రాశాడు. గార్సియా డా ఓర్టా ప్రకారం... 1534లో విజయనగరంలో చిన్న కోడి గుడ్డు పరిమాణంలో ఒక వజ్రం, సుమారు 150, 175, 312 కారెట్ల బరువుతో మరో మూడు వజ్రాలు దొరికాయి. ఇంకా చాలా వజ్రాలు ఏయే సంవత్సరాల్లో ఏ రాజు వద్దకు చేరాయో రాశారు'' అని చెప్పారు సత్యనారాయణ.

వజ్రాల వేట
ఫొటో క్యాప్షన్, కోళ్ళూరు వంటి చోట్ల దాదాపు 600 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున వజ్రాలు తవ్వారు.

ఇప్పుడు ఎందుకు తవ్వడం లేదు?

చరిత్రకు అందిన మేరకు కోళ్ళూరు వంటి చోట్ల దాదాపు 600 సంవత్సరాల పాటు పెద్ద ఎత్తున వజ్రాలు తవ్వారు. అంటే 13వ శతాబ్ది నుంచి 18వ శతాబ్దం వరకు. ఇది కాక అనేక ఇతర గనులు వందల ఏళ్ల పాటు వజ్రాలను ఉత్పత్తి చేశాయి.

''ఏ వజ్రాల గని అయినా ఎక్కువ ఉత్పత్తి వస్తేనే లాభదాయకం. లేకపోతే ఇండస్ట్రియల్ పద్ధతిలో వెలికితీత కుదరదు'' అన్నారు శెరీష్.

సరిగ్గా అదే సమస్య ఈ గనులకు ఎదురైంది. ఈ వజ్రాల గనులన్నిటినీ ఆయా రాజుల కాలంలోనే జల్లెడ పట్టేశారు. ఇక ఇప్పుడు అక్కడ ఏమీ లేని పరిస్థితి.

అంటే, అసలు దొరకవని కాదు. అక్కడక్కడా ఎప్పుడో ఒకటీ అరా దొరకవచ్చు. కానీ, పారిశ్రామికంగా తవ్వేంత స్థాయిలో వజ్రాలు దొరకవు.

వజ్రాలు
ఫొటో క్యాప్షన్, 1890-94 మధ్య హైదరాబాద్ డెక్కన్ కంపెనీ ప్రస్తుత పరిటాల దగ్గర వజ్రాల వేట ప్రారంభించినా లాభదాయకం కాదని ఆపేసింది.

''1725 నుంచి బ్రెజిల్‌లో కొత్తవి రావడం, సామ్రాజ్యాల పతనం, అన్నిటికీ మించి వజ్రాలు తగ్గిపోవడం వంటి కారణాలతో ఈ గనుల్లో పని ఆగిపోయింది. కాకపోతే అక్కడక్కడ వజ్రాల వేట సాగుతోంది. . 1890-94 మధ్య హైదరాబాద్ డెక్కన్ కంపెనీ మళ్లీ ప్రస్తుత పరిటాల దగ్గర వజ్రాల వేట ప్రారంభించినా లాభదాయకం కాదని ఆపేసింది. 1825లో ఓసే (Voysey) అనే ఆయన కృష్ణా పెన్నా లోయల్లో గనులు ఆల్మోస్ట్ ఖాళీ అయ్యాయనీ, పెద్ద ప్రొడక్షన్ లేదనీ, ఏవో చిన్న గనుల్లో వెతుకుతున్నారనీ రాశారు’’ అని ఎస్వీ సత్యనారాయణ చెప్పారు.

‘‘భారత ప్రభుత్వం 1950 తరువాత జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇక్కడ వజ్రాల తవ్వకం కోసం ప్రయత్నం చేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల పరిధిలోని కోళ్ళూరు, చంద్రాలపాడు, పరిటాల ప్రదేశాల్లో తవ్వారు. కింబర్లైట్, లంప్రోయిట్ కోసం వెతికారు. కానీ, ఫలితం లేకపోయింది. బాగా చిన్నవి దొరుకుతున్నాయి. పారిశ్రామికంగా లాభసాటి కాదని వదిలేశారు'' అన్నారు ఎస్వీ సత్యనారాయణ.

ఇప్పుడు తవ్వుతున్నది ఎవరు?

ప్రస్తుతం చాలా మంది సాధారణ ప్రజలు, పేదలు, దిగువ మధ్యతరగతి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఈ వజ్రాల వేట సాగిస్తుంటారు.

ముఖ్యంగా వర్షాలు పడ్డ తొలినాళ్లలో.. తొలకరి జల్లుల వేళ ఈ వజ్రాలు దొరుకుతాయని వారు చెబుతారు.

ఉమ్మడి కర్నూలు – జొన్నగిరి, ఉమ్మడి అనంతపురం – వజ్రకరూరు, ఉమ్మడి కృష్ణా – పరిటాల, ఉమ్మడి గుంటూరు – కోళ్ళూరు.. ఈ ప్రదేశాల్లో మే చివర నుంచి జూలై చివరి వరకూ రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ వజ్రాల వేట కోసం వచ్చిన వారు కనిపిస్తారు.

బియ్యం, ఉప్పు, నూనె, కారం వంటి కనీస పదార్థాలు తెచ్చుకుని, అక్కడ చేపలు పడుతూ లేదా వారాంతం సంతలో కూరగాయలు కొంటూ అక్కడే కాపురం ఉంటూ వజ్రాలు వెతికేవారు ఉంటారు.

కుటుంబంతో సహా వచ్చి వెతికేవారు, కుటుంబాన్ని వదిలేసి వచ్చి వెతికేవారు, గుంపులు గుంపులుగా, స్నేహితులు, చుట్టాలతో కలసి వచ్చిన వారు, వారంలో మిగిలిన రోజులు ఏదో పనిచేసుకుంటూ, వారాంతంలో వచ్చి వెతికే వారు.. ఇలా చాలా రకాలు అందులో ఉంటారు.

కోళ్ళూరు గ్రామంలో వజ్రాల వేట
ఫొటో క్యాప్షన్, విజయమ్మ, వజ్రాలు వెతుకుతున్న మహిళ

దీనిపై అక్కడ వజ్రాల వేట సాగించే ఎందరితోనో బీబీసీ మాట్లాడింది. ఎవరూ తమకు స్పష్టంగా వజ్రం దొరికిందని చెప్పరు. కానీ ఫలానా చోట, ఫలానా వారికి దొరికిందంట, అది ఎంతో ఖరీదంట, వేరే వాళ్లకి అమ్మేశారంట.. ఇలాంటి మాటలే వినిపిస్తాయి. అందులో వాస్తవమెంత, కల్పితం ఎంత అన్నది ఎవరూ నిర్ధరించలేరు.

పిడుగురాళ్లకు చెందిన విజయమ్మ మిరప, పత్తి వేసి నష్టపోయారు. అప్పులు తీర్చడానికి వజ్రాలు దొరుకుతాయేమోనని నెల రోజుల పాటు వెతికారు కోళ్ళూరులో.. ''దొరికేవాళ్లకు దొరుకుతాయి. ఎవరూ చెప్పరు. ఎవరేం చేస్తారోనని భయం. పచ్చళ్లు తెచ్చుకుని అవే తింటాం'' అన్నారామె.

ఇక యర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన నరసమ్మ కూడా ఏడు నెలలుగా కోళ్ళూరులో ఉండి, నెలా నెలా సొంతూరుకెళ్లి పింఛన్ తెచ్చుకుంటూ మిగతా సమయం అంతా భర్తతో కలసి వజ్రాల కోసం వెతికారు.

''అప్పులు తీర్చడానికి మా ప్రయత్నం'' అన్నారామె.

ఇక్కడ స్థానికులు చాలా మంది వజ్రాల బ్రోకర్ అవతారం ఎత్తారు. వారి వద్ద వజ్రాల నాణ్యత కొలిచే మెషీన్స్ ఉన్నాయి.

వజ్రం అనుకున్న రాళ్లను బ్రోకర్ దగ్గరకు తెస్తే, వారు నాణ్యత పరిశీలించి, వజ్రాల వ్యాపారులతో బేరం చేసి, అమ్ముతారు. కాకపోతే ఇదంతా చట్టపరిధిలో జరగదు.

వజ్రాల వేట

వజ్రాల గురించి ఏం రాశారు?

ప్రాచీన భారత సాహిత్యంలో అంటే మహాభారతం నుంచి కౌటిల్యుని అర్థ శాస్త్రం వరకూ అనేక గ్రంథాల్లో వజ్రాల ప్రస్తావన ఉన్నప్పటికీ వజ్రాలు తీసే గనుల గురించి వర్ణన తక్కువ.

ఎక్కువగా విదేశీ యాత్రికులు, వర్తకులు, యూరోపియన్ వలస పాలన అధికారుల రచనల ద్వారా ఆ గనుల సమాచారం దొరుకుతుంది.

13వ శతాబ్దంలో ప్రస్తుత ప్రకాశం జిల్లాలోని మోటుపల్లి రేవు ప్రాంతానికి వచ్చిన మార్కోపోలో ఈ వజ్రాల గనుల గురించి రాశారు.

ఆయన కృష్ణా లోయ వజ్రపు గనులను సందర్శించారు అని ఉంది. మోటుపల్లికి దగ్గరలో కృష్ణా లోయ అంటే కోళ్ళూరు కావచ్చనేది ఎక్కువ మంది పరిశీలకుల అభిప్రాయం.

''ప్రపంచంలో వజ్రాలు ఈ రాజ్యంలో తప్ప ఎక్కడా దొరకవు. ఇక్కడ బోలెడన్ని మంచి వజ్రాలు దొరుకుతాయి'' అని మార్కోపోలో రాశారు.

వారందరిలోకీ సవివరంగా రాసింది జీన్ బాప్టిస్ట్ టావెర్నియర్. ఆయన స్వయంగా వజ్రాల వ్యాపారి కావడంతో వజ్రాల గనులు, పనితీరు, పరిశ్రమ, వ్యాపారం, వజ్రాల కటింగ్, వజ్రాల బరువు, నాణ్యతల గురించి రాశారు.

యూరోపియన్లు ఇక్కడ గనుల్లో రకాలు, ఉత్పత్తుల వివరాలు అన్నీ రాశారు. ఎక్కువ మంది తిరిగినదీ, వివరంగా రాసిందీ కోళ్ళూరు గురించే.

ఇది కాక మల్లవరం, కొడవటికల్లు, పరిటాల కూడా పెద్ద గనులే అని రాశారు.

1814లో హీనే అనే రచయిత కొడవటికల్లులో ఎడ్లబండిలో పట్టే అన్ని వజ్రాలు వచ్చాయి అని రాశారు.

ఇక పెన్నా, కుందేరు, హింద్రీ తీరం సహా రాయలసీమలో అనేక ప్రాంతాల గురించి రాశారు.

కోళ్లూరు చరిత్ర పేజీల్లో మాత్రమే నిలిచి, భౌతికంగా కాలగర్భంలో కలిసిపోతున్నా... చాలామందికి ఇప్పటికీ అది తమ కలను నెరవేర్చే వజ్రమే.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)