ఆడ తాబేలు: ఇండియా తూర్పు తీరం నుంచి పశ్చిమ తీరానికి ఆలివ్ రిడ్లే 3,500 కిలోమీటర్ల ప్రయాణం.. శాస్త్రవేత్తలు ఎలా గుర్తించారంటే

ఆలివ్ రిడ్లే సముద్రపు తాబేలు
ఫొటో క్యాప్షన్, ఆలివ్ రిడ్లే తాబేలు(ప్రతీకాత్మక చిత్రం)

ఒక తాబేలు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలదు?

ఈ ప్రశ్నకు స్పష్టంగా సమాధానం చెప్పలేకపోవచ్చు. కానీ, ఒడిశా తీరంలో కనిపించే ఆలివ్ రిడ్లే సముద్రపు తాబేళ్లలో ఒకటి మాత్రం సంతానోత్పత్తికి ఏకంగా 3,500 కిలోమీటర్లు ప్రయాణించినట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇది భారతదేశపు తూర్పు తీరంలో ప్రయాణం మొదలుపెట్టి పశ్చిమ తీరానికి చేరిందని కనుగొన్నారు.

ఒడిశాలోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎస్చ్యురైన్ బయోలజీ రీజనల్ సెంటర్ శాస్త్రవేత్తలు అనిల్ మొహాపాత్ర, ఆశిష్ కుమార్ దాస్, సందీప్ కుమార్ మొహాపాత్ర, ఐఐటీ బాంబే సివిల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ అమిత్ కుమార్ జీనా, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ (ఇన్‌కాయిస్) శాస్త్రవేత్త సంజీబా కుమార్ బలీర్ సింగ్, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వెస్ట్రన్ రీజనల్ సెంటర్ శాస్త్రవేత్త బాసుదేవ్ త్రిపాఠి ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు.

వీరి పరిశోధనపత్రం 'రీసెర్చ్ గేట్' సహా 'కరెంట్ సైన్స్ జర్నల్'లో ఈ ఏడాది సెప్టెంబరులో ప్రచురితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఏమిటీ ఆలివ్ రిడ్లే తాబేళ్లు?

భారత్‌లోని ఒడిశా సముద్ర తీరం తాబేళ్లకు ప్రపంచంలోని అతిపెద్ద సంతానోత్పత్తి కేంద్రంగా ఉందని 2023 నవంబరులో 'సైన్స్ డైరెక్ట్'లో ప్రచురితమైన ఓ పరిశోధన పత్రం చెబుతోంది.

భారత తీరంలో ఉన్న 90శాతం సముద్రపు తాబేళ్లు ఒడిశా తీరంలోనే ఉండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆలివ్ రిడ్లే జాతి తాబేళ్లలో 50శాతం ఇక్కడ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.

ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు గహీర్మథ, దేవి, రుషికుల్య తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

సముద్రపు తాబేళ్లు సంతానోత్పత్తి, ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈదుకుంటూ వెళ్తుంటాయి.

ఇప్పటివరకు శాస్త్రవేత్తలు గుర్తించిన ప్రకారం, ఈ ఆలివ్ రిడ్లే తాబేళ్లు భారత తీరం సహా శ్రీలంక తీరం వరకు ఈదుకుంటూ వెళ్లాయి.

అయితే, మొదటిసారిగా వీటిని పశ్చిమతీర ప్రాంతంలో గుర్తించినట్లు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్త అనిల్ మొహాపాత్ర బీబీసీతో చెప్పారు.

తాబేలు
ఫొటో క్యాప్షన్, ఒడిశా తీర ప్రాంతాల్లోని 11,632 ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ట్యాగ్స్ అమర్చిన శాస్త్రవేత్తలు

ఎలా గుర్తించారంటే..

జువాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఒడిశా తీర ప్రాంతాల్లోని 11,632 ఆలివ్ రిడ్లే తాబేళ్లకు శాస్త్రవేత్తలు ట్యాగ్స్ అమర్చారు. 2021 నుంచి 2025 మధ్య కాలంలో వీటిని వేశారు.

''పరిశోధనల్లో భాగంగా తాబేళ్లకు ట్యాగింగ్ చేశాం. ప్రతి తాబేలుకు ప్రత్యేక కోడ్ నంబరు, సంస్థ అడ్రస్, ఫోన్ నంబరుతో ట్యాగ్ ఉంటుంది'' అని అనిల్ మొహాపాత్ర వివరించారు.

ఇలా ట్యాగ్స్ అమర్చిన తాబేళ్లను గహీర్మథ, రుషికుల్యాతో పాటు ఒడిశా, శ్రీలంక తీరంలో వివిధ ప్రాంతాల్లో శాస్త్రవేత్తలు గుర్తిస్తూ వచ్చారు.

ఒక ఆడ తాబేలుకు 2021 మార్చి 18న గహీర్మథ సమీపంలోని వీలర్ ఐలాండ్ వద్ద జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ట్యాగ్ అమర్చారు.

సుమారు 3500 కిలోమీటర్లు ప్రయాణించిన ఆ తాబేలును మహారాష్ట్ర తీరంలోని గుహగర్ ప్రాంతంలో 2025 జనవరి 27న వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర మాంగ్రూవ్ ఫౌండేషన్ గుర్తించిందని పరిశోధనపత్రంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

సంతానోత్పత్తి కోసం గుడ్లు పెడుతున్న దశలో ట్యాగ్‌పై ఉన్న ఫోన్ నంబరు ఆధారంగా వారు ఫోన్ చేసి చెప్పడంతో ఆలివ్ రిడ్లే తాబేలు సాగించిన సుదీర్ఘ ప్రయాణం వెలుగులోకి వచ్చింది.

''గతంలో జరిగిన అధ్యయనాల్లో ఆలివ్ రిడ్లే మైగ్రేటరీ కారిడార్ (వలస మార్గం) అనేది ఒడిశా తీరం నుంచి భారత్, శ్రీలంక మధ్య జలాల్లోనే ఉండేది. మేం వేసిన ట్యాగ్స్ ఉన్న తాబేళ్లు గుర్తించామని శ్రీలంక నుంచి మాకు కాల్స్ వచ్చాయి. కానీ, భారత పశ్చిమతీరం వైపు, అంటే మహారాష్ట్ర వరకు ఈదుకుంటూ వెళ్లిన విషయం మొదటిసారి వెలుగులోకి వచ్చింది'' అని అనిల్ కుమార్ మొహాపాత్ర వివరించారు.

తాబేలు
ఫొటో క్యాప్షన్, ఒక ఆడ తాబేలు పశ్చిమ తీరానికి చేరడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.

పాక్ జలసంధిని దాటుకుని వెళ్లిందా?

ఆలివ్ రిడ్లే తాబేళ్లు శ్రీలంక వరకు చేరుకున్నప్పటికీ, తిరిగి వెనక్కి వచ్చేస్తుంటాయని శాస్త్రవేత్తలు ఇప్పటివరకు భావిస్తూ వచ్చారు. అందుకు ప్రధానంగా పాక్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ మన్నార్ వద్ద ఉన్న ప్రతికూల పరిస్థితులు కారణంగా చెబుతుంటారు.

కానీ ఒక ఆడ తాబేలు పశ్చిమ తీరానికి చేరడం ఇప్పుడు ఆసక్తికర పరిణామంగా మారింది.

ఈ తాబేలు రెండు మార్గాల్లో ప్రయాణించి బంగాళాఖాతం దాటుకుని అరేబియా సముద్ర జలాల్లో ప్రవేశించి పశ్చిమ తీరానికి చేరుకుని ఉండవచ్చని శాస్త్రవేత్తలు అంచనాకు వచ్చారు.

ఈ రెండు మార్గాలలో మొదటిది... ఒడిశా తీరం నుంచి దక్షిణ భారత తీరం వెంబడి పాక్ జలసంధిని దాటుకుని పశ్చిమ తీరం వెంట ప్రయాణించి మహారాష్ట్ర తీరం చేరుకోవడం.

రెండో మార్గం.. శ్రీలంక దక్షిణ ప్రాంతం మీదుగా అరేబియా సముద్రంలోకి వెళ్లి మహారాష్ట్ర తీరం చేరుకోవడం.

ఈ రెండు మార్గాల్లో ఏదైనా ఒక మార్గంలో తాబేలు ఈదుకుంటూ వెళ్లి ఉండవచ్చని భావిస్తున్నారు.

''ఈ రెండు రూట్లలో ఏదో ఒకదాన్ని ఎంచుకుని వెళ్లి ఉండవచ్చు. కానీ ఏ మార్గంలో వెళ్లిందనేది మేం కచ్చితంగా చెప్పలేం. అందుకే రెండు ఆప్షన్లు ఉన్నాయని పరిశోధనలో చెప్పాం'' అని అనిల్ మొహాపాత్ర బీబీసీకి చెప్పారు.

ఇవి ఇలా ఈదుకుంటూ వెళ్లడానికి సముద్రపు తరంగాలు కూడా కారణం కావచ్చని భావిస్తున్నారు.

తాబేలు
ఫొటో క్యాప్షన్, సముద్ర ప్రవాహాలపై ఆధారపడి ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రయాణం

సముద్రపు తాబేళ్ల ప్రయాణం ప్రవాహాలు (కరెంట్స్)పై ఆధారపడి ఉంటుంది. దాని కారణంగా ఎక్కువ శ్రమ పడకుండా తక్కువ శక్తితోనే సులువుగా అవి ఈదుకుంటూ వెళ్లగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఆలివ్ రిడ్లే తాబేళ్లు కూడా సముద్ర ప్రవాహాలపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటాయని శాటిలైట్ టెలీమెట్రీ ఆధారంగా గుర్తించామని వారు వివరిస్తున్నారు.

''బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి చేరుకోవడానికి వీలుగా ఈస్టిండియా కోస్టల్ కరెంట్స్ (ఈఐసీసీ) అనేవి సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో ఉత్తర దిశగా కదులుతుంటాయి. నవంబరు నుంచి జనవరి మధ్య ఇవి దక్షిణ దిశలో కదులుతుంటాయి. దానివల్ల శ్రీలంక తీరానికి తాబేళ్లు చేరుతుంటాయి. కొన్ని సందర్భాల్లో ఈశాన్య రుతుపవనాల సమయంలో వచ్చే ప్రవాహాల నేపథ్యంలో అరేబియా సముద్రంలో ప్రవేశించే వీలుంది'' అని పరిశోధన పత్రంలో శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

అరేబియా సముద్రంలోకి చేరాక ఆహార అన్వేషణ కోసం ఈదుకుంటూ వెళ్తున్న క్రమంలో సముద్ర ప్రవాహాలు మహారాష్ట్ర తీరానికి చేర్చి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

ఈ పరిశోధనకు శాటిలైట్ డాటా ఆధారంగా ఓషియోనాగ్రాఫిక్ అనాలసిస్ చేసినట్లు హైదరాబాద్‌లోని ఇన్‌కాయిస్ శాస్త్రవేత్త సంజీబ్ కుమార్ బీబీసీతో చెప్పారు.

ఆలివ్ రిడ్లే తాబేళ్లు బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రంలోకి ఈదుకుంటూ వెళుతున్న నేపథ్యంలో వాటి పరిరక్షణ కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)