గరివిడి లక్ష్మి: వెండితెరపై బుర్రకథ ఎలా ఉంది?

ఉత్తరాంధ్ర, బుర్రకథ, సినిమా, సంగీతం, జీవితం
ఫొటో క్యాప్షన్, బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది
    • రచయిత, సాహితి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

గరివిడి లక్ష్మి.. 80, 90 దశకాల్లో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు.

ఉత్తరాంధ్ర బుర్రకథ కళారూపానికి తనదైన గుర్తింపును తీసుకొచ్చి, ఆ కళకే బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన కళాకారిణి ఆమె.

ఎన్నో ఆటుపోట్లతో సాగిన ఆమె జీవితం ఇప్పుడు వెండితెరపైకి వచ్చింది.

అసలు గరివిడి లక్ష్మి జీవితంలో చోటుచేసుకున్న సంఘటనలు ఏంటి? ఒక మహిళగా, కళాకారిణిగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లేంటి? తన ప్రతిభతో బుర్రకథ రంగంలో ఆమె ఎలాంటి ముద్ర వేశారు? నిజంగా ఆమెకు దక్కాల్సిన గుర్తింపు దక్కిందా ?

ఈ బయోపిక్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఉత్తరాంధ్ర, బుర్రకథ, సినిమా, సంగీతం, జీవితం
ఫొటో క్యాప్షన్, 1980,90 దశకాల్లో గరివిడిలక్ష్మి పాటలు ఆంధ్రప్రదేశ్ అంతటా వినిపించేవి.

జీవితంలో ఎదురుదెబ్బల తర్వాత పాటకు చేరువై...

విజయనగరం సమీపంలోని గరివిడి గ్రామానికి చెందిన లక్ష్మి (ఆనంది) చిన్నతనంలోనే తండ్రి ప్రేమకు దూరమవుతుంది. బాల్య వివాహంలో మరోసారి మోసపోతుంది. ఒంటరి జీవితంలో పాటను ఆశ్రయించి ఆ తర్వాత బుర్రకథ కళాకారిణిగా మారుతుంది.

లక్ష్మి ప్రయాణంలో సత్తిబాబు (రాగ్ మయూర్), రాంబాబు (నరేశ్) పాత్ర ఏంటి? ఎంతో ప్రాచుర్యం పొందిన ఆమె అనూహ్యంగా అదృశ్యం కావడానికి కారణమేంటి? ఆమె జీవితాన్ని సినిమాగా తెరకెక్కించాలనుకున్న రాజేశ్ (అంకిత్ కొయ్య) ప్రయత్నం ఫలించిందా? అన్నదే కథ.

ఒక మంచి బయోపిక్‌కు కావాల్సిన ప్రధాన లక్షణాలన్నీ 'గరివిడి లక్ష్మి'లో కనిపిస్తాయి.

ఒక మహిళ జీవితం.. ఆమె ఎదుర్కొన్న కష్టాలు.. కళాకారిణిగా ఆమెకున్న ప్రతిభ.. సమాజం నుంచి ఎదురైన సవాళ్ళు.. వీటన్నింటినీ ఒకదానితో మరొకటి ముడిపెడుతూ దర్శకుడు కథను నడిపించిన తీరు బాగుంది.

ముఖ్యంగా లక్ష్మి వ్యక్తిగత జీవితంలోని సంఘర్షణలను, కళాకారిణిగా మారిన తీరును చూపించిన విధానం ఆకట్టుకుంటుంది.

ఉత్తరాంధ్ర, బుర్రకథ, సినిమా, సంగీతం, జీవితం
ఫొటో క్యాప్షన్, గుర్తింపుపొందిన తర్వాత కూడా ఓ దశలో గరివిడిలక్ష్మి అజ్ఞాత జీవితం గడిపారు.

‘ఓ ఆడపిల్ల జీవితం’

ఇది కేవలం ఒక బుర్రకథ కళాకారిణి ప్రయాణం మాత్రమే కాదు.

ఇందులో ఓ ఆడపిల్ల జీవితం ఉంది. సమాజంలో తనకు నచ్చినట్టుగా బతికే హక్కుఉందని చెప్పే ధైర్యం ఉన్న ఓ అమ్మాయి ప్రయాణం, ఎదురుదెబ్బలతో చితికిపోయిన ఓ మనసు, తన కళని, చివరికి తన గుర్తింపుని కూడా కోల్పోయి అనామకురాలుగా జీవించే పరిస్థితుల్లోకి వెళ్లిన ఓ జీవితం మనసును కదిలిస్తుంది.

లక్ష్మి జీవితంలో ఎదురయ్యే పరిణామాలు, కళపై ఆమె చూపించే అంకితభావం, తన ప్రతిభను నిరూపించుకోవడానికి చేసే ప్రయత్నాలు ప్రేక్షకుల్లో భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. కొన్ని సన్నివేశాలు మనసును కదిలిస్తే, మరికొన్ని ఆమెపై గౌరవాన్ని పెంచుతాయి.

ఇందులో కొన్ని లోపాలు కూడా కనిపిస్తాయి.

తొలి సగంలో లక్ష్మి ప్రయాణంలో వినోదం, భావోద్వేగం సమపాళ్లలో కనిపిస్తాయి. మలిసగంలో వీటి బ్యాలెన్స్ తప్పింది. ఒకటే ఎమోషన్‌ను పట్టుకోవడంతో సన్నివేశాలన్నీ పునారావృతం అవుతున్న భావన కలుగుతుంది.

కాకపోతే ఈ కథకు హ్యాపీ ఎండింగ్ ఉంది. చివర్లో వచ్చిన ఆ విజువల్ ప్రేక్షకుని మనసు కుదటపడేలా చేస్తుంది. ఆ ఆలోచన మంచి ఫలితాన్నిచ్చింది.

ఉత్తరాంధ్ర, బుర్రకథ, సినిమా, సంగీతం, జీవితం
ఫొటో క్యాప్షన్, గరివిడిలక్ష్మిగా ఆనంది నటించారు.

‘ఆనంది కెరీర్‌లో గుర్తుండిపోయేపాత్ర’

ప్రతి నటి తన కెరీర్‌లో గర్వంగా చెప్పుకోదగ్గ ఒక పాత్ర దక్కాలని కోరుకుంటుంది. అలాంటి పాత్ర ఆనందికి గరివిడి లక్ష్మి రూపంలో దక్కింది.

ఒకవైపు జీవితంలో ఎదురయ్యే కష్టాలు, మరోవైపు కళాకారిణిగా తపన.. ఈ రెండింటినీ తన నటనలో చక్కగా పలికించింది. పాత్రలోని అమాయకత్వం, ధైర్యం, ఆత్మగౌరవం, కళపై ఉన్న ప్రేమను సహజంగా ఆవిష్కరించింది. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన హృదయానికి హత్తుకుంటుంది. ఇది నిజంగానే ఆనంది కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోయే, అవార్డు స్థాయి ప్రదర్శన.

దేవుడమ్మ పాత్రలో రాశి నటన సహజంగా ఉంది. లక్ష్మి బాల్యానికి, ఆమె జీవితంలోని తొలి విషాదాలకు కారణమైన పరిస్థితులను ప్రతిబింబించే ఈ పాత్ర కథకు కీలకమైన భావోద్వేగాన్ని ఇచ్చింది.

సత్తిబాబు పాత్రలో రాగ్ మయూర్ గుర్తుండిపోతాడు. లక్ష్మి జీవితాన్ని మరోదిశలో మలుపు తిప్పిన పాత్రలో కనిపించాడు. రాంబాబు పాత్రలో నరేశ్ హుందాగా కనిపించాడు. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన విభిన్నమైన పాత్ర ఇది.

శరణ్య, అంకిత్ కొయ్య పాత్రలు గతానికి, వర్తమానానికి మధ్య ఒక అనుసంధానంలా పనిచేస్తాయి. మిగతా నటీనటులు కూడా కథకు అవసరమైన సహకారాన్ని అందించారు

ఉత్తరాంధ్ర, బుర్రకథ, సినిమా, సంగీతం, జీవితం
ఫొటో క్యాప్షన్, గరివిడి లక్ష్మి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను సినిమాలో చూపించారు.

గరివిడిలక్ష్మి పాటలే ప్రధాన ఆకర్షణ

దర్శకుడు గౌరి నాయుడు ఈ కథలోని భావోద్వేగాలను తెరపైకి తీసుకొచ్చిన విధానం బావుంది. గరివిడి లక్ష్మి జీవితంలోని ముఖ్యమైన సంఘటనలను చూపించడంతోపాటు కళాకారిణిగా ఎదిగిన క్రమానికి తగిన ప్రాధాన్యం ఇచ్చాడు. అనవసరమైన అంశాలపై దృష్టి పెట్టకుండా ఎమోషన్‌కి పెద్దపీట వేస్తూ సన్నివేశాలు నడిపాడు.

ఈ సినిమాకు సంగీతం మరో ముఖ్యమైన ఆకర్షణ. బుర్రకథ, పాటలు కథలో అంతర్భాగంగా ఉండటంతో సంగీతానికి సహజంగానే ప్రాధాన్యం వచ్చింది. కథలోని భావోద్వేగాలకు, లక్ష్మి కళా ప్రయాణానికి అనుగుణంగా సంగీతం తోడ్పడింది.

చరణ్ అర్జున్ నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంది. కథకు అవసరమైన పల్లె వాతావరణాన్ని, పాత్రల జీవితాల్లోని సహజత్వాన్ని తెరపై ప్రతిబింబించడంలో ఛాయాగ్రహణం కీలక పాత్ర పోషించింది. కథ జరిగే కాలానికి, ప్రాంతీయ సంస్కృతికి అనుగుణంగా వాతావరణాన్ని సృష్టించారు.

నిర్మాతగా కృతి ప్రసాద్ తొలి సినిమా ఇది. నిజంగా ఆమె అబిరుచిని అభినందించాలి. ఇలాంటి కథ ఎంచుకుని అంతే అభిరుచితో సినిమా నిర్మించిన తీరులో తన పాషన్ కనిపించింది. ఇది కమర్షియల్ హంగులు ఉన్న సినిమా కాకపోవచ్చు. కానీ ఒక కళాకారిణి జీవితాన్ని వెండితెరపై చూడాలనే ఆసక్తి ఉన్న ప్రేక్షకులని గరివిడి లక్ష్మి నిరాశపర్చదు.

(గమనిక: అభిప్రాయాలు సమీక్షకుల వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)