మార్కో రూబియో భారత పర్యటనలో దిల్లీ ఎందుకు లేదు, జై శంకర్ ఆయనను కలవడానికి ముంబయి వెళ్లడంపై విమర్శలు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆరు నెలల వ్యవధిలో రెండోసారి భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఇంధనం, వాణిజ్య సంబంధాలపై కీలక చర్చలు ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ బుధవారం వెల్లడించింది. రూబియో ముంబయి, జామ్‌నగర్‌లలో పర్యటించనున్నారు.
ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్ పర్యటన అనంతరం రూబియో అక్టోబర్ 19 నుంచి 22 వరకు భారత్‌లో పర్యటించనున్నారు. అయితే ఆయన ఈ పర్యటనలో దిల్లీకి వెళ్లడం లేదు.
అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకోవడం, ఇంధన రంగంలో సహకారాన్ని విస్తరించే అవకాశాలపై చర్చించడానికి రూబియో భారత ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశమవుతారని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది.
పెట్టుబడి అవకాశాలను ప్రోత్సహించడానికి రూబియో వ్యాపార రంగ ప్రముఖులతోనూ సమావేశమవుతారని పేర్కొంది.
జామ్‌నగర్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన ప్రపంచ అతిపెద్ద చమురుశుద్ధి ఫ్యాక్టరీ ఉండటంతో, ఇక్కడ రూబియో పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆయనకు అంబానీ కుటుంబం ఘనంగా స్వాగతం పలకనున్నట్లు సమాచారం. ప్రపంచంలో రష్యా ముడి చమురును శుద్ధి చేసే మూడు ప్రధాన సంస్థల్లో జామ్‌నగర్ రిఫైనరీ కూడా ఒకటి.


ఫొటో సోర్స్, Getty Images
రూబియో పర్యటనపై కాంగ్రెస్ విమర్శలు
రూబియో దిల్లీకి రాకపోవడంపై పలువురు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. వచ్చే వారం ముంబయిలో అమెరికా విదేశాంగ మంత్రి భారత ప్రభుత్వ అధికారులతో సమావేశం కానుండటంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ వ్యవహారంపై విదేశాంగ శాఖ అధికారులు అయోమయంలో ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలనుకుంటే ఇవ్వవచ్చని కూడా వ్యాఖ్యానించారు.
రూబియో ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతారని, ఆ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ కూడా పాల్గొంటారని ఆశిస్తున్నట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ గురువారం ప్రకటించారు.
ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే రాహుల్ గాంధీ ఎక్స్‌లో స్పందిస్తూ ‘రూబియో, తన బృందాన్ని ముంబయికి పిలిపించుకున్నారు. మోదీ జీ, విదేశాంగ శాఖలో మీ అధికారులు ఏం జరుగుతోందో తెలియక అయోమయంలో ఉన్నారు. మీరు అనుకుంటే దీనిపై వివరణ ఇవ్వండి. లేదు, నేనే మీకు వివరించాలనుకుంటే అది వేరే విషయం అనుకోండి" అని పేర్కొన్నారు.
అంతకుముందు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
"అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ముంబయి పర్యటన గురించి భారత్‌లోని అమెరికా రాయబారి మరిన్ని వివరాలు వెల్లడించడం ఆశ్చర్యకరమేమీ కాదు. రూబియో ముంబయిలో భారత ప్రభుత్వ అధికారులతో సమావేశమవుతారన్న సమాచారం కూడా ఊహించనిదేమీ కాదు. అయితే 'విదేశాంగ మంత్రి డాక్టర్ జైశంకర్ కూడా ఇతరులతో కలిసి అక్కడకు వస్తారని ఆశిస్తున్నాం' అని ఆయన చెప్పడం మాత్రం అసాధారణం.
"భారత విదేశాంగ మంత్రి దేశీయ సమావేశాల గురించి అధికారిక ప్రకటనలు చేసే బాధ్యతను విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి కాకుండా మరొకరికి ఎప్పటి నుంచి అప్పగించారు? ఈ సమావేశం గురించి భారత్‌కు అమెరికా రాయబారి ద్వారా సమాచారం అందుతోంది. 2025 మే 10వ తేదీ సాయంత్రం ఆపరేషన్ సిందూర్‌ను నిలిపివేసినట్లు కూడా భారత్‌కు మొదట రూబియో నుంచే తెలిసింది. ముంబయిలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, రూబియో మధ్య జరగనున్న సమావేశంపై విదేశాంగ శాఖ ఎందుకు మౌనంగా ఉంది?" అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, MEA/X
విదేశాంగ శాఖ వివరణ
రూబియో దిల్లీకి రాకపోవడంపై వస్తున్న ప్రశ్నలకు భారత విదేశాంగ శాఖ స్పందించింది.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ముంబయిలో సమావేశమవుతారని, అమెరికా స్వాతంత్య్రానికి 250 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొంటారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం విలేకరుల సమావేశంలో తెలిపారు.
గత దశాబ్ద కాలంగా విదేశీ ప్రముఖులకు భారత్‌లోని వివిధ నగరాల్లో ఆతిథ్యం ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని ఆయన వివరించారు.
గతంలో దేశ రాజధాని దిల్లీ వెలుపల జరిగిన సమావేశాలను ప్రస్తావిస్తూ, స్పెయిన్ ప్రధానితో వడోదరలో, జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్‌తో అహ్మదాబాద్‌లో, మారిషస్ ప్రధానితో వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమైన విషయాలను గుర్తుచేశారు.
షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశం గోవాలో జరగడంతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఇతర దౌత్య కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.
అయితే, రూబియో, జైశంకర్ సమావేశం గురించి సెర్గియో గోర్ చేసిన ప్రకటన దౌత్యపరమైన ప్రోటోకాల్‌పై ప్రశ్నలను లేవనెత్తింది. సంప్రదాయంగా ఇలాంటి ద్వైపాక్షిక సమావేశాల గురించి ముందు ఆతిథ్య దేశమే ప్రకటిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
విదేశాంగ శాఖ వివరణ ఇచ్చినప్పటికీ ఈ వ్యవహారంపై చర్చ కొనసాగుతోంది.
ప్రముఖ కాలమిస్టు ప్రతాప్ భాను మెహతా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన తన వ్యాసంలో రూబియో పర్యటనపై విశ్లేషణ చేశారు.
"దిల్లీకి బదులుగా జామ్‌నగర్, ముంబయిల్లో పర్యటించాలన్న మార్కో రూబియో నిర్ణయం వెనుక ఏదైనా ప్రతీకాత్మక ఉద్దేశం లేకపోయి ఉండొచ్చు. కానీ దీనిని భారత్, అమెరికా సంబంధాలలో భవిష్యత్ పరిమాణాలకు ఒక సూచనగా చూడకుండా ఉండటం కష్టం. అమెరికా విదేశాంగ మంత్రి భారత్‌లోని అతిపెద్ద ఆర్థిక కేంద్రంతో అనుసంధానమవుతూ, అంబానీ కుటుంబం సాధించిన సామర్థ్యాలను ప్రశంసించనున్నారు" అని ఆయన రాశారు.
"ఇతర సందర్భాల్లో ఇది ఒక ఆహ్లాదకరమైన పరిణామం కావచ్చు. ఇది కేవలం ప్రయోజనవాదం, ఆచరణాత్మకతపై ఆధారపడిన సంబంధం. ఇందులో సంప్రదాయ రాజకీయాల కంటే కార్పొరేట్ పెట్టుబడులకే ప్రాధాన్యం లభిస్తుంది, ప్రపంచాన్ని చక్కదిద్దడం కంటే ఒప్పందాలు కుదుర్చుకోవడానికే ప్రాధాన్యం దొరుకుతుంది’’ అని మెహతా రాశారు
"అయితే, ఇది భారత్ ప్రాధాన్యం తగ్గుతోందన్న సంకేతాన్ని కూడా ఇస్తోంది. ప్రపంచ వ్యవస్థను రూపొందించడంలో భారత్ ఇక భాగస్వామిగా లేదు. రాజకీయంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన దేశంగానూ పరిగణించడం లేదు. కార్పొరేట్ ప్రయోజనాల సమూహంగా మాత్రమే మిగిలిపోతోంది" అని ఆయన అభిప్రాయపడ్డారు.
భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వల్ సిబల్ కూడా ప్రతాప్ భాను మెహతా విశ్లేషణతో ఏకీభవించారు. "ఈ వ్యాసంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇందులో ప్రస్తావించిన అంశాలు పూర్తిగా సమర్థించదగినవి" అని ఆయన ఎక్స్‌లో రాశారు.
భారత్, అమెరికా సంబంధాలు ప్రస్తుతం లావాదేవీల ఆధారంగా, కార్పొరేట్ ప్రయోజనాల చుట్టూ తిరిగే దిశగా మారుతున్నాయని మెహతా అభిప్రాయపడ్డారు. గతంలో ఈ సంబంధాలకు బలాన్నిచ్చిన రాజకీయ, వ్యూహాత్మక, సాంస్కృతిక పునాదులు బలహీనపడుతున్నాయని పేర్కొన్నారు.
"వ్యాపార సహకారం రాజకీయ ఉద్రిక్తతలను భర్తీ చేయలేదు. సాంకేతిక భాగస్వామ్యాలు, పెట్టుబడులు, భారతీయ కంపెనీల ప్రపంచ విస్తరణ కొత్త అవకాశాలను అందిస్తున్నాయి. కానీ ఇవి మాత్రమే ద్వైపాక్షిక సంబంధాలను నిలబెట్టలేవు. భారత్ ఎదుగుదలకు అమెరికా ఇస్తున్న మద్దతు బలహీనపడింది. బలమైన భారత్ అమెరికా ప్రయోజనాలకు అవసరమన్న ఏకాభిప్రాయం గతంలో అమెరికాలోని రెండు ప్రధాన పార్టీల్లోనూ ఉండేది. ఇప్పుడు దాని స్థానంలో పరస్పర ప్రయోజనాల ఆధారంగా జరిగే బేరసారాలు వచ్చాయి. డోనల్డ్ ట్రంప్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా భారత్‌కు గతంలో ఉన్న ప్రాధాన్యం కొనసాగకపోవచ్చు" అని మెహతా రాశారు.
పాకిస్తాన్, బంగ్లాదేశ్‌తో అమెరికా సంబంధాలు కూడా క్రమంగా భారత్ ప్రాంతీయ ఆందోళనల కంటే అమెరికా ప్రాధాన్యాలకు అనుగుణంగా సాగుతున్నాయని విశ్లేషించారు.
అమెరికా రాయబారి సెర్గియో గోర్, బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మార్కో రూబియో భారత పర్యటన గురించి చేసిన ప్రకటనను పంచుకుంటూ జోర్వార్ దౌలత్ ‘‘ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత గడ్డపైనే భారత్‌పై తన ఆధిపత్యాన్ని రుద్దగలననే నమ్మకం అమెరికాకు ఎంత బలంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది’’ అని రాశారు. జోర్వార్ దౌలత్ భౌగోళిక ప్రాంతీయ రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలపై వ్యాసాలు రాస్తుంటారు.
"అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, భారత ప్రభుత్వ అధికారుల నుంచి అధికారిక అనుమతి పొందిందా లేదా అన్నదానితో సంబంధం లేకుండా, దేశంలోని ప్రభుత్వేతర వ్యక్తులతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు అమెరికా ఒక కొత్త సంప్రదాయానికి తెరతీస్తోంది" అని రాశారు.
ది వైర్ వ్యవస్థాపక సంపాదకులు, సీనియర్ జర్నలిస్టు సిద్ధార్థ్ వరదరాజన్ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు.
"భారత విదేశాంగ మంత్రి అమెరికాలోని లూసియానా రాష్ట్రం, బాటన్ రూజ్‌కు వెళ్లి, తనతో సమావేశమయ్యేందుకు వాషింగ్టన్ డీసీ నుంచి అమెరికా విదేశాంగ మంత్రి రావాలని కోరినట్లు ఊహించగలమా? ఆ తర్వాత అమెరికా విదేశాంగ మంత్రి తనను కలవడానికి వస్తున్నారని ఒక జూనియర్ అధికారి ప్రకటించినట్లు ఊహించగలమా?" అని ఆయన ప్రశ్నించారు.
దిల్లీలోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్లో సీనియర్ ఫెలోగా ఉన్న తన్వి మదన్ మాత్రం ఈ వివాదంపై మరో అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"రూబియో దిల్లీకి రావడం లేదన్న అంశంపై ఇంత వివాదం ఎందుకు జరుగుతోందో అర్థం చేసుకోవడం కష్టం. ఆయన కొన్ని నెలల క్రితమే దిల్లీలో పర్యటించారు. భారత్, అమెరికా సంబంధాల చరిత్రలో ఒకే ఏడాదిలో అమెరికా విదేశాంగ మంత్రి, అమెరికా ఇండో-పసిఫిక్ కమాండ్ అధిపతి రెండుసార్లు భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి కావచ్చు" అని ఆమె ఎక్స్‌లో రాశారు.
ట్రంప్ తర్వాత ఏం జరగొచ్చు?
భారత్, అమెరికా సంబంధాల్లో పెరుగుతున్న అపనమ్మకంపై దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ డీన్, ప్రొఫెసర్ అమితాబ్ మట్టూ ది టెలిగ్రాఫ్‌లో తన అభిప్రాయాలను వెల్లడించారు.
"ట్రంప్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత సంబంధాలు వాటంతటవే సాధారణ స్థితికి వస్తాయని భారత్ భావించకూడదు. ఆర్థిక జాతీయవాదం, వలసలకు వ్యతిరేకత, అంతర్జాతీయ బాధ్యతలపై అనుమానాలు ఇవన్నీ ఒక అధ్యక్షుడి నిర్ణయాలకు మాత్రమే పరిమితమైనవి కాకుండా, అమెరికా రాజకీయాల్లో దీర్ఘకాలిక మార్పును సూచిస్తుండవచ్చు" అని ఆయన పేర్కొన్నారు.
భారత్ స్పందన భావోద్వేగ అనుబంధం, దెబ్బతిన్న ఆత్మగౌరవం లేదా అతిగా పక్షపాతంతో కూడిన వైఖరిపై ఆధారపడకూడదని మట్టూ అభిప్రాయపడ్డారు. బదులుగా, భారత్ తన వ్యూహాత్మక శక్తిని, ప్రభావాన్ని, అంటే ఇతర దేశాలతో చర్చల్లో తనకున్న బలాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.
భారత్ ఆచరణాత్మక దృక్పథంతో చర్చలు జరపాలని, తన ప్రయోజనాలకు ఉపయోగపడే చోట రాజీ పడాలని, అవసరమైన చోట దృఢంగా నిలబడాలని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో అమెరికాతో సంబంధాలను తెంచుకోకుండా, యూరప్, గల్ఫ్ దేశాలు, తూర్పు ఆసియా, గ్లోబల్ సౌత్ దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించారు.
ట్రంప్ పదవీకాలం ముగిసే వరకు వేచి చూడటమే భారత్ ముందున్న సవాలు కాదని మట్టూ అభిప్రాయపడ్డారు. ట్రంప్ తర్వాత కూడా అమెరికా రాజకీయాలు చాలావరకు 'ట్రంప్వాద' ధోరణిలోనే కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో, ఆ దేశంతో దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని నిర్మించుకోవడమే అసలు సవాలని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























