ప్రేమ్ వత్సా: 8 డాలర్లతో కెనడా వెళ్లిన ఈ హైదరాబాద్ వ్యక్తి 52వేల కోట్లకు ఐడీబీఐ బ్యాంకును ఎలా కొన్నారు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దీపక్ మండల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 5 నిమిషాలు
జేబులో కేవలం ఎనిమిది డాలర్లతో హైదరాబాద్ నుంచి కెనడాకు వెళ్లిన బిలియనీర్ పారిశ్రామికవేత్త ప్రేమ్ వత్సా ఇప్పుడు ఐడీబీఐ బ్యాంక్ యజమాని కానున్నారు.
ప్రేమ్ వత్సాను కెనడా వారెన్ బఫెట్ అని పిలుస్తారు. ఆయనకు 100 బిలియన్ డాలర్ల విలువైన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ సంస్థ ఉందని లైవ్ మింట్ డాట్ కామ్ తెలిపింది.
ఫెయిర్ ఫాక్స్ 1985లో ఓ చిన్న బీమా సంస్థగా ప్రారంభమై, ప్రేమ్ వత్సా వ్యాపార దక్షత, దూరదృష్టి, క్రమశిక్షణతో భారీ ఆర్థిక సంస్థగా ఎదిగింది.
ఐడీబీఐ బ్యాంకులో 60.72 శాతం వాటా కొనుగోలు కోసం ప్రేమ్ వత్సాకు చెందిన ఈ సంస్థ రూ.52,878 కోట్లు చెల్లించనుంది. భారత్‌లో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ బ్యాంకింగ్ ఒప్పందం ఇదేని రాయిటర్స్ తెలిపింది.
ఇంతకీ ఎవరీ ప్రేమ్ వత్సా? ఇంత పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని ఆయన ఎలా నిర్మించారు?


ఫొటో సోర్స్, Getty Images
కెనడా వారెన్ బఫెట్
ప్రేమ్ వత్సా భారతీయ మూలాలున్న పారిశ్రామిక వేత్త అని ఎకనామిక్ టైమ్స్ కథనంతో పాటు, పవన్ వత్సా రాసిన ‘ది ఫెయిర్‌ఫాక్స్ వే’ పుస్తకం చెబుతోంది. 1970వ దశకంలో ఆయన హైదరాబాద్ నుంచి కెనడాకు వెళ్లారు.
ఈ కథనం ప్రకారం, వత్సా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతారు. మీడియా దృష్టికి దూరంగా ఉండే ఆయన, ఫెయిర్‌ఫాక్స్‌లో చేరిన తొలి 15 ఏళ్లలో విలేఖరులతో చాలా అరుదుగా మాట్లాడారు. ఆయన 2001లో పెట్టుబడిదారులతో కాన్ఫరెన్స్ కాల్స్ నిర్వహించడం ప్రారంభించారు. విలువ ఆధారిత పెట్టుబడులకు వత్సా ప్రసిద్ధి చెందారు.
బెంజమిన్ గ్రాహమ్ ప్రతిపాదించిన విలువ ఆధారిత పెట్టుబడి సూత్రాలను వత్సాకు ఆయన మార్గదర్శకుడు జాన్ వాట్సన్ బోధించారు.
ఆర్థిక పునాదులు బలంగా ఉండి, ప్రస్తుతం తక్కువ ధరకు దొరుకుతున్న కంపెనీల షేర్లను కొని,వాటిని దీర్ఘకాలం పాటు అట్టిపెట్టుకోవాలన్నదే బెంజమిన్ గ్రాహమ్ సూత్రం.
ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారుల్లో ఒకరైన వారెన్ బఫెట్ కూడా దాదాపు ఇదే తరహా పెట్టుబడి విధానాన్ని సమర్థిస్తారు.
ఈ సూత్రాలను అనుసరిస్తూ ప్రేమ్ వత్సా అనేక కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. నేడు అవే ఆయనకు బంగారు గనులుగా మారుతున్నాయి.
అందుకే వత్సాను కెనడా వారెన్ బఫెట్ అని పిలుస్తారు.

ఫొటో సోర్స్, Reuters
హైదరాబాద్ టు కెనడా
ప్రేమ్ వత్సా 1950లో హైదరాబాద్‌లో జన్మించారు. ఆయన తండ్రి ఓ స్కూలు టీచర్. ప్రేమ్ వత్సా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. ఇక్కడే మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్, ప్రపంచ బ్యాంకు గ్రూప్ అధ్యక్షుడు అజయ్ బంగా కూడా చదివారు.
పాఠశాల విద్య పూర్తయ్యాక వత్సా ఐఐటీ మద్రాస్‌లో చదివారు. తదుపరి ఐఐఎం ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
అయితే, వత్సా భవిష్యత్తు మరో దారిలో సాగాల్సి ఉంది.
ఆయన అన్నయ్య అప్పటికే కెనడాలో నివసిస్తున్నారు. చిన్న కొడుకు కూడా కెనడాకు వెళ్లి అక్కడే వృత్తి జీవితాన్ని ప్రారంభించాలని ఆయన తండ్రి కోరుకున్నారు.
"నాకు కెనడాపై ఆసక్తి లేదు. భారత్‌ను విడిచి వెళ్లాలని అనుకోలేదు. కానీ 22 ఏళ్ల వయసులో తండ్రి మాట వినాల్సిందే" అని వత్సా తన 'ది ఫెయిర్‌ఫాక్స్ వే' పుస్తకంలో రాశారు.
కెనడాకు వెళ్లిన తర్వాత ఆయన యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ అంటారియో నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. చదువుకు అవసరమైన ఖర్చుల కోసం ఎయిర్ కండిషనర్లు, ఫర్నేస్‌లను విక్రయించారు.
ఒక సేల్స్‌మన్‌గా పనిచేయడం ద్వారా అలవడిన వినయం, కష్టపడే తత్వం తనకు తర్వాత ఎంతో ఉపయోగపడ్డాయని వత్సా చెప్పారు.

ఫొటో సోర్స్, Reuters
ఫ్యామిలీ మ్యాన్
ప్రేమ్ వత్సా కుటుంబ విలువలకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు.వత్సా తండ్రి తరచూ ఒక మాట చెప్పేవారు. "అంతా నీ మీదే ఆధారపడి ఉందన్నట్లుగా కష్టపడి పని చేయి. అంతా దేవుడి మీదే ఆధారపడి ఉందన్నట్లుగా భక్తితో ప్రార్థించు."అని వత్సా తండ్రి తరచూ చెప్పేవారని ఎకనామిక్ టైమ్స్ కథనం పేర్కొంది.
1974లో కాన్ఫెడరేషన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో పరిశోధనా విశ్లేషకుడిగా వత్సా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
1984లో హాంబ్లిన్ వత్సా ఇన్వెస్ట్మెంట్ కౌన్సెల్ లిమిటెడ్ పేరుతో సొంత సంస్థను స్థాపించారు. ఆ తర్వాత ఏడాదే సంక్షోభంలో ఉన్న ట్రక్ బీమా సంస్థ మెర్కెల్ ఫైనాన్షియల్‌ను కొనుగోలు చేసి కీలక విజయాన్ని సాధించారు.

ఫొటో సోర్స్, @amitabhk87
గెలుపు సూత్రాలు
బలమైన పునాదులున్నప్పటికీ సంక్షోభంలో ఉన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ప్రేమ్ వత్సా విజయానికి ప్రధాన సూత్రం.
అలాంటి కంపెనీలను గుర్తించడంలో ఆయనకు అసాధారణమైన సామర్థ్యం ఉంది. అంతేకాదు, వాటిలో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించే సహనం కూడా ఉంది.
కాలగమనాన్ని అంచనా వేయడంలోనూ వత్సా దిట్ట. సంక్షోభం రాబోతోందన్న సంకేతాలను ముందుగానే పసిగట్టగలరు.
ఈ సామర్థ్యంతోనే 1987లో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్ల పతనాన్ని, బ్లాక్ మండేగా ప్రసిద్ధి చెందిన పరిణామాన్ని, 1990లో జపాన్ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడాన్ని, 2008లో సబ్‌ప్రైమ్ సంక్షోభంగా పిలిచే అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాన్ని ఆయన ముందుగానే గుర్తించారు.
ఆ సమయంలో అమెరికా ఆర్థిక మందగమనాన్ని అవకాశంగా మలుచుకున్న ప్రేమ్ వత్సా, భవిష్యత్తులో మంచి పనితీరు కనబరిచే అవకాశమున్న కంపెనీల షేర్లను అతి తక్కువ ధరలకు కొనుగోలు చేశారు.
అయితే, ఫెయిర్‌ఫాక్స్ కూడా ఎదురుదెబ్బలు చవిచూసింది. హార్వీ, ఇర్మా, మారియా తుపానులతో పాటు కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చుల వల్ల సంస్థకు గణనీయమైన నష్టాలు వచ్చాయి.
కోవిడ్-19 మహమ్మారి కూడా సంస్థకు పెద్ద సవాలుగా మారింది. ఆ సమయంలో దాని బీమా వ్యాపారం భారీ నష్టాలను చవిచూసింది.
అయితే, ప్రేమ్ వత్సా సామర్థ్యం ఫెయిర్‌ఫాక్స్‌ను మళ్లీ పుంజుకునేలా చేసింది.
2022 అక్టోబర్‌తో పోలిస్తే 2025లో ఫెయిర్‌ఫాక్స్ విలువ నాలుగు రెట్లు పెరిగింది.
ఫెయిర్‌ఫాక్స్ వ్యాపార వ్యూహం విజయవంతమైంది.
బీమా క్లెయిమ్‌లు చెల్లించాల్సిన సమయం రాకముందే భారీ మొత్తంలో ప్రీమియంలను వసూలు చేసి, బలమైన పునాదులున్నప్పటికీ తక్కువ ధరకు లభించే షేర్లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంస్థ విజయాన్ని సాధించింది.
వ్యాపార, పారిశ్రామిక రంగాలకు చేసిన అసాధారణ సేవలకు గుర్తింపుగా ప్రేమ్ వత్సాకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
భారత్‌లో ప్రేమ్ వత్సా వ్యాపారాలు
ఫెయిర్‌ఫాక్స్ ఇప్పటివరకు చేసిన అతిపెద్ద పెట్టుబడిగా ఐడీబీఐ బ్యాంకులో పెట్టుబడి నిలవనుంది. అయితే ఈ కంపెనీ ఫెయిర్‌ఫాక్స్ ఇండియా హోల్డింగ్ పేరుతో 2014లోనే భారత మార్కెట్లోకి ప్రవేశించింది.
ప్రేమ్ వత్సా కుమారుడు బెన్ వత్సా మార్వెల్ క్యాపిటల్ అనే ఫండ్ మేనేజ్మెంట్ సంస్థను నిర్వహిస్తున్నారు. ఈ సంస్థ భారతీయ కంపెనీల షేర్లలో మాత్రమే పెట్టుబడులు పెడుతుంది.
భారత్‌లో ఐఐఎఫ్ఎల్ తన బంగారు రుణాల వ్యాపారంలో నియంత్రణాపరమైన సమస్యలను ఎదుర్కొంటున్న సమయంలో ఫెయిర్‌ఫాక్స్ ఆ సంస్థకు నిధులు సమకూర్చింది.
బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్‌లోనూ ఫెయిర్‌ఫాక్స్‌కు మెజారిటీ వాటా ఉంది. సమర్ కెమికల్స్‌తో పాటు పలు ఇతర తయారీ రంగ సంస్థల్లోనూ పెట్టుబడులు పెట్టింది.
అయితే, నియంత్రణాపరమైన నిబంధనల కారణంగా సీఎస్బీ బ్యాంకులో గతంలో ఉన్న తన పెట్టుబడిని తగ్గించుకుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























