ట్రంప్ నిర్ణయంతో భారత్‌కు భారీ ఊరట, అమెరికాలో వ్యతిరేకత పెరగనుందా?

ఫొటో సోర్స్, Getty Images
రష్యాపై అమల్లోకి రావాల్సిన ఆంక్షల చట్టంలోని పలు ఆంక్షలను అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తనకున్న అధికారాలను ఉపయోగించి నిలిపివేశారు.
యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను శిక్షించాలనే ఉద్దేశంతో అమెరికా కాంగ్రెస్ ఇటీవల ఈ ఆంక్షలకు ఆమోదం తెలిపింది.
ఈ చట్టం ప్రకారం.. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసే ఐదు అతిపెద్ద దేశాల నుంచి వచ్చే అన్ని వస్తువులపై 100 శాతం సుంకాలు విధించడానికి అమెరికా అధ్యక్షుడికి 30 రోజుల గడువు ఇచ్చారు.
రష్యాకు చెందిన పలు సంస్థలపై ఆంక్షలు విధించడంతో పాటు, అమెరికాలోకి దిగుమతి అయ్యే రష్యా ఇంధన ఉత్పత్తులన్నింటిపైనా 500 శాతం సుంకాలు విధించే నిబంధన కూడా ఇందులో ఉంది. ఈ నిబంధనలను అమలు చేసేందుకు ఇచ్చిన నెల రోజుల గడువు అక్టోబర్ 18తో ముగియనుంది.
ఆంక్షల చట్టంలో మినహాయింపులు ఇవ్వడం ద్వారా రష్యా ఇంధన ఉత్పత్తులను ఎక్కువగా కొనుగోలు చేసే చైనా, భారత్, తుర్కియే దేశాలతో విభేదాలు తలెత్తే అవకాశాలను నివారించడానికి ట్రంప్ ప్రయత్నించినట్లు భావిస్తున్నారు.

కొన్ని ఆంక్షలను నిలిపివేయడం అమెరికా జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా జరిగిందని ట్రంప్ శుక్రవారం రాత్రి విడుదల చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రష్యాపై ఆంక్షలకు సంబంధించిన బిల్లుపై ట్రంప్ గత సెప్టెంబరులో సంతకం చేసి చట్టంగా మార్చారు. ఈ చట్టం ఆదివారం నుంచి అమల్లోకి రావాల్సి ఉంది.
నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికలకు ముందు అమెరికాలో ఇంధన ధరలను తగ్గించేందుకు రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకుంటామని ట్రంప్ ప్రకటించిన కొద్ది రోజులకే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై ఏ పార్టీకి నియంత్రణ ఉంటుందనేది తేలనుంది.
ట్రంప్ ప్రతిపాదనతో అమెరికా చట్టసభ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన పలువురు సభ్యులు ఈ ప్రణాళికను వ్యతిరేకించారు.

ఫొటో సోర్స్, Reuters
భారత్‌కు భారీ ఊరట
ఈ చట్టం ద్వారా భారత్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ట్రంప్‌కు లభించింది.
ట్రంప్ నిర్ణయంపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ది హిందూ దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసిని హైదర్ స్పందిస్తూ, "అమెరికా కొత్త ఆంక్షల చట్టం కారణంగా రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేయబోమని భారత్ స్పష్టం చేసింది. మన పరిమితులను స్పష్టంగా తెలియజేసి, వాటిపై దృఢంగా నిలబడటం ఫలితాన్నిస్తుంది" అని తెలిపారు.
2026 ఆగస్టు నాటికి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా విధించే అవకాశమున్న సుంకాల ప్రభావం ఈ రెండు ఆసియా దేశాలపై అత్యధికంగా పడేది.
రష్యా మొత్తం ముడి చమురు ఎగుమతుల్లో 2022 డిసెంబర్ నుంచి 2026 ఆగస్టు మధ్య చైనాకు 50 శాతం, భారత్‌కు 37 శాతం వాటా ఉంది.
ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ అంశాన్ని అమెరికా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ఈ నిర్ణయం ద్వైపాక్షిక సంబంధాలపైనే కాకుండా అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పైనా ప్రభావం చూపవచ్చని స్పష్టం చేసింది.
భారత్ దిగుమతి చేసుకునే ముడి చమురులో రష్యా వాటా 51 శాతానికి పైగా ఉందని 2026 జులై నాటి తాజా గణాంకాలు చెబుతున్నాయి. హార్ముజ్ జలసంధి మీదుగా చమురు రవాణాకు అంతరాయం ఏర్పడిన సమయంలో, కేవలం 30 రోజుల్లో రష్యా చమురుపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించడం భారత్‌కు కష్టసాధ్యమే.
అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. అయితే, ఇది అంత సులభం కాదు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏలు) అమెరికా మార్కెట్‌కు ప్రత్యామ్నాయం కాలేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఇతర పెద్ద మార్కెట్లలోకి ప్రవేశించేందుకు అయ్యే ఖర్చులను తగ్గించడంలో ఇవి సహాయపడతాయి.
కేవలం సుంకాల రాయితీలు కల్పించినంత మాత్రాన ఆ మార్కెట్లలోకి ప్రవేశించడం సాధ్యం కాదు. భారత ఎగుమతిదారులు రవాణా, సరఫరా వ్యవస్థల్లో పెట్టుబడులు పెట్టాలి. సాంకేతిక, ఉత్పత్తి ప్రమాణాలను అందుకోవాలి. తమ ఉత్పత్తుల డిజైన్లలో మార్పులు చేయాలి. పంపిణీ వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. అమెరికా మార్కెట్లో స్థానం సంపాదించేందుకు వారికి తోడ్పడిన సామర్థ్యాలు ఇవే.
ఎగుమతి మార్కెట్లను విస్తరించడానికి కూడా పరిమితులు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక కంపెనీ అమెరికాపై 60 శాతం ఆధారపడటాన్ని తగ్గించుకుని, యూరప్‌పై 60 శాతం ఆధారపడటం ప్రారంభిస్తే.. భౌగోళికంగా మార్కెట్లను విస్తరించినప్పటికీ, వ్యూహాత్మకంగా మాత్రం వైవిధ్యాన్ని సాధించినట్లు కాదు.
మార్కెట్లను విస్తరించడంతో పాటు వినియోగదారుల పరిధిని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో పెరగనున్న వ్యతిరేకత
అమెరికా ఆంక్షల చట్టానికి దక్షిణ కరోలినాకు చెందిన దివంగత రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం పేరు పెట్టారు. జులై 11న మరణించడానికి ముందు, వాషింగ్టన్లో యుక్రెయిన్‌కు బలంగా మద్దతు తెలిపిన నేతల్లో ఆయనొకరు.
ఈ చట్టం లక్ష్యం రష్యా ఆర్థిక వ్యవస్థ. దీని ప్రకారం.. రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే ఐదు అతిపెద్ద దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే విస్తృత అధికారాలను ట్రంప్‌కు కల్పించారు. వీటిలో ముఖ్యంగా చైనా, భారత్ ఉన్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఆ దేశ ప్రభుత్వంలోని సీనియర్ అధికారులు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలపై ఆంక్షలు విధించే నిబంధన కూడా ఈ చట్టంలో ఉంది. ప్రస్తుత ఆంక్షల నుంచి తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్న రష్యా 'షాడో ఫ్లీట్'లోని చమురు రవాణా నౌకలపైనా ఆంక్షలు విధించే అవకాశం ఉంది.
గురువారం అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన 20 మంది చట్టసభ సభ్యుల బృందం ట్రంప్‌కు లేఖ రాసింది. అక్టోబర్ 18 నుంచి అమల్లోకి రావాల్సిన కొత్త చట్టాన్ని పాటించాలని ఆయనకు విజ్ఞప్తి చేసింది.
గతవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ఫోన్లో మాట్లాడానని, మాస్కో నుంచి డీజిల్ కొనుగోలుకు అంగీకరించానని ట్రంప్ ప్రకటించారు. ఈ నిర్ణయంపై అమెరికా మిత్రదేశాలు విమర్శలు గుప్పించాయి. దీనివల్ల యుక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాకు సహాయం అందించినట్లవుతుందని అవి ఆందోళన వ్యక్తం చేశాయి.
ఈ ఒప్పందాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఇచ్చిన బహుమతిగా యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీ అభివర్ణించారు.
"ఇధి ముగించాల్సిన యుద్ధంలో పెట్టుబడి పెట్టడం లాంటిది" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
యుక్రెయిన్‌కు పెరగనున్న కష్టాలు
"రష్యాపై ఒత్తిడి పెంచాలనే కాంగ్రెస్ ఆదేశాలను ట్రంప్ ఉల్లంఘిస్తున్నారు. దీనివల్ల పుతిన్ తన దురాక్రమణ యుద్ధాన్ని కొనసాగించేందుకు సహాయం చేసినట్లవుతోంది" అని సెనేట్ బ్యాంకింగ్ కమిటీలో సీనియర్ డెమోక్రటిక్ సభ్యురాలు ఎలిజబెత్ వారెన్ అన్నారు.
అమెరికా, యుక్రెయిన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారిన సమయంలోనే ట్రంప్ నిర్ణయం వెలువడింది.
రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులు ఆపాలని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్ స్కీపై ట్రంప్ తీవ్ర ఒత్తిడి తెచ్చారు. మరోవైపు, యుక్రెయిన్‌లోని పౌర, ఇంధన మౌలిక సదుపాయాలపై రష్యా బాంబు దాడులు కొనసాగిస్తోంది. గత వారం రోజుల్లో ఈ దాడుల్లో 100 మందికి పైగా పౌరులు మరణించారు.
బ్రిటిష్ పత్రిక ఫైనాన్షియల్ టైమ్స్ కథనం ప్రకారం.. రష్యా క్షిపణి దాడులపై తమ విదేశీ భాగస్వాముల నుంచి యుక్రెయిన్‌కు అందే నిఘా సమాచారంలో ఎలాంటి స్పష్టమైన కారణం లేకుండానే అంతరాయాలు ఎదురయ్యాయి. దీనికి తోడు, యుక్రెయిన్ డ్రోన్ విభాగాలు ఉపయోగించే ఎలాన్ మస్క్ స్టార్‌లింక్ ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలపైనా ఆంక్షలు విధించారు.
అయితే, యుక్రెయిన్‌తో నిఘా సమాచారాన్ని పంచుకోవడం అమెరికా నిలిపివేసిందన్న వార్తలను ట్రంప్ ఖండించారు.
గతవారం మియామీలో జరిగిన చర్చల సందర్భంగా.. రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై దాడులను ఆపకపోతే, యుక్రెయిన్‌తో కీలకమైన నిఘా సమాచారాన్ని పంచుకోవడం నిలిపివేయవచ్చని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు రిపోర్టులున్నాయి.
ఈ వారం ఫైనాన్షియల్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలియన్ స్కీ ధృడ వైఖరి ప్రదర్శించారు. యుక్రెయిన్‌పై రష్యా నిరంతర బాంబు దాడులు చేస్తున్న నేపథ్యంలో, రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై మళ్లీ దాడులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.
మాస్కోతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వాషింగ్టన్ చూపుతున్న ఆసక్తిని, పుతిన్‌పై ట్రంప్ బహిరంగంగా ప్రశంసలు కురిపించడాన్ని కూడా జెలియన్ స్కీ తీవ్రంగా విమర్శించారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























