సూర్యుడు రెండు రోజులు కనిపించలేదు.. ఉష్ణోగ్రతలు కొన్నాళ్లపాటు భారీగా తగ్గిపోయాయి.. ఖండాలు దాటి వినిపించిన శబ్దం.. క్రకటోవా అగ్నిపర్వతం బద్దలైనప్పుడు ఇంకా ఏమేం జరిగాయి

భూమి, అగ్నిపర్వతం, సూర్యుడు, ప్రకృతి, సైన్స్

ఫొటో సోర్స్, Hulton Archive/Getty Images

    • రచయిత, డైసీ స్టీఫెన్స్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇండోనేసియాలోని అగ్నిపర్వత ద్వీపమైన అనక్ క్రకటోవా ఈ వారం పలుమార్లు విస్ఫోటం చెందింది. బూడిద మేఘాలు 250 మీటర్ల ఎత్తు వరకు ఆకాశంలోకి ఎగిసిపడ్డాయని స్థానిక మీడియా తెలిపింది.

అనక్ క్రకటోవాఈ నెల 7న ఒకసారి, 8న రెండుసార్లు విస్ఫోటం చెందిందని ఇండోనేసియా జియోలాజికల్ ఏజెన్సీ తెలిపింది.

సమీపంలో నివసిస్తున్న ప్రజలకు ప్రస్తుతం ఎలాంటి ప్రమాదం లేదని ఆ ప్రాంతంలోని అగ్నిపర్వతాల స్థితిగతులను పర్యవేక్షించే అధికారుల బృందం చెబుతోంది.

1927లో సముద్రం అడుగున ఏర్పడిన ఒక భారీ అగ్నిపర్వత బిలం అంటే కాల్డెరా నుంచి అనక్ క్రకటోవా ఏర్పడింది.

చరిత్రలో రెండో అత్యంత ఘోరమైన అగ్నిపర్వత విషాదాలలో ఒకటిగా పరిగణించే 1883 నాటి క్రకటోవా అగ్నిపర్వతం భారీ విస్ఫోటం తర్వాత ఈ కాల్డెరా ఏర్పడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భూమి, అగ్నిపర్వతం, సూర్యుడు, ప్రకృతి, సైన్స్

ఫొటో సోర్స్, DEA / AMBROSIANA LIBRARY / Contributor via Getty Images

ఫొటో క్యాప్షన్, బూడిద మేఘం కారణంగా రెండు రోజుల పాటు చీకటి తరహా వాాతావరణం నెలకొంది.

రెండు రోజులకు పైగా చీకటి

1883లో జరిగిన ఈ భయంకరమైన పేలుడు తీవ్రతకు కేవలం 48 గంటల్లోనే 36 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 165 గ్రామాలు పూర్తిగా నాశనమయ్యాయి.

ఈ విస్ఫోటం కారణంగా వెలువడిన శబ్దాన్ని ఇప్పటికీ ప్రపంచ చరిత్రలోనే అత్యంత పెద్ద శబ్దంగా పరిగణిస్తారు. దాని ధ్వని వేల కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది.

అగ్ని పర్వతం నుంచి వాతావరణంలోకి భారీగా వ్యాపించిన బూడిద చాలా సంవత్సరాల పాటు ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసింది. ప్రపంచ ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదైంది.

చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో ఒకదానిపై బీబీసీ ప్రత్యేక కథనం ఇది.

ఈ విపత్తు తొలి సంకేతాలు 1883 మే నెలలోనే కనిపించడం ప్రారంభమయ్యాయి. అటుగా వెళుతున్న ఒక జర్మన్ యుద్ధనౌక కెప్టెన్ క్రకటోవా నుంచి బూడిద, ధూళి భారీగా పైకి లేవడాన్ని చూశారని అమెరికా జాతీయ పర్యావరణ సమాచార కేంద్రం (ఎన్‌సీఈఐ) తెలిపింది.

అప్పటికి ఈ అగ్నిపర్వత ద్వీపం సుమారు 200 సంవత్సరాలుగా నిద్రావస్థలో ఉంది.

తర్వాత కొన్ని నెలల కాలంలో వాణిజ్య, ఇతర నౌకల్లోని సిబ్బంది కూడా ఇలాంటి దృశ్యాలను చూసినట్టు తెలిపారు.

ఆ తర్వాత ఆగస్టు 26న చరిత్రలోనే అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాల్లో ఒకటిగా నిలిచిన విధ్వంస పరంపర ప్రారంభమైంది.

క్రకటోవాలో జరిగిన మొదటి భారీ విస్ఫోటనం లావా, ప్యూమిస్ రాళ్లు, బూడిదతో కూడిన శక్తివంతమైన ప్రవాహాన్ని సముద్రంలోకి పంపింది. దీంతో భారీ సునామీ ఏర్పడి ఉత్తర దిశగా దూసుకెళ్లింది. ఈ సునామీ కారణంగా వేలాదిమంది ప్రాణాలు కోల్పోయారు.

పేలుడు జరిగిన గంటలోపే బూడిద మేఘం సుమారు 48 కిలోమీటర్ల ఎత్తుకు చేరి అన్ని దిశలా వ్యాపించడం మొదలయింది.

ఈ బూడిద మేఘం ఆకాశంలోకి దాదాపు 80 కిలోమీటర్ల మేర విస్తరించింది. ఇది సుమారు మూడులక్షల చదరపు మైళ్ల ప్రాంతాన్ని కప్పివేసింది. ఆ బూడిద మేఘం రెండు రోజులకు పైగా ఆ ప్రాంతమంతటినీ చీకటిలో ముంచేసిందని ఎన్‌సీఈఐ తెలిపింది.

భూమి, అగ్నిపర్వతం, సూర్యుడు, ప్రకృతి, సైన్స్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2018లో జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం ఫోటో

ఆస్ట్రేలియా వరకు వినిపించిన పేలుడు శబ్దం

సిడ్నీ బేకర్ చిన్నతనంలో తన తండ్రి ఓడలో ప్రయాణిస్తూ క్రాకటోవా అగ్నిపర్వతం భయంకరమైన విస్ఫోటాన్ని చూశారు.

తన జీవితపు చివరి రోజుల్లో ఆ దృశ్యాన్ని గుర్తుచేసుకుని ఆయన తన అనుభవాన్ని వివరించారు.

"గాలి మొత్తం బూడిద, దుమ్ముతో నిండిపోయింది. మాకు ఊపిరాడదేమో అనిపించింది" అని ఆయన 1946లో బీబీసీకి చెప్పారు.

"చుట్టూ ఎంత చీకటిగా ఉందంటే ఏమీ కనిపించలేదు. ఓడ మీద, సముద్రం మీద, మా మీద నిరంతరం బూడిద పడుతూనే ఉంది. ఓడ మొత్తం మీద సుమారు ఆరు నుంచి ఏడు అంగుళాల మందంతో బూడిద పొర పేరుకుపోయింది. పేలుళ్ల శబ్దం నమ్మశక్యం కానంత పెద్దగా ఉంది. ఆ శబ్దాన్ని, విధ్వంసాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు'' అని బేకర్ అన్నారు.

ఆగస్టు 27న ఉదయం 10గంటల2నిమిషాలకు జరిగిన "టైటానిక్ పేలుడు"కు ముందు అనేక పెద్ద పేలుళ్లు సంభవించాయని 'క్రకటోవా: ది డే ది వరల్డ్ ఎక్స్‌ప్లోడెడ్' అనే పుస్తక రచయిత సైమన్ విన్‌చెస్టర్ తెలిపారు.

ఆ పేలుడు శబ్దం సుమారు 4,600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆస్ట్రేలియా, మారిషస్‌ల వరకు వినిపించిందని అమెరికా ఎన్‌సీఈఐ తెలిపింది.

"ఆ పేలుడు సంభవించినప్పుడు ద్వీపం అంతటా అనేక కిలోమీటర్ల మేర రాళ్లు ఎగిరిపోయాయి. ప్యూమిస్ రాళ్లు, బూడిద 17 నుంచి 18 మైళ్ల ఎత్తు వరకు ఆకాశంలోకి ఎగసిపడ్డాయి. మొత్తం ద్వీపం అదృశ్యమైనట్టు అనిపించింది" అని 2010లో సైమన్ విన్‌చెస్టర్ బీబీసీ ‘‘విట్‌నెస్ హిస్టరీ’’ పాడ్‌కాస్ట్‌లో తెలిపారు.

"కొన్ని క్షణాల పాటు సముద్రం మధ్యలో ఒక భారీ గుంత ఏర్పడింది. ఆ తర్వాత లక్షల కోట్ల టన్నుల సముద్రపు నీరు ఆ గుంతలో నిండిపోయింది. దాని అడుగు భాగం ఎంత వేడిగా ఉందంటే ఆ నీరు క్షణాల్లోనే ఆవిరిగా మారిపోయింది. దీని వల్ల ఒకదాని తర్వాత ఒకటిగా అనేక భారీ సునామీ అలలు ఏర్పడ్డాయి" అని ఆయన తెలిపారు.

భూమి, అగ్నిపర్వతం, సూర్యుడు, ప్రకృతి, సైన్స్

ఫొటో సోర్స్, FERDI AWED/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, 1883లో సంభవించిన భారీ విస్ఫోటనం వల్ల 36వేలమంది చనిపోయారు.

ఈ విషాదంలో 36 వేల మంది మృతి

ఈ మొత్తం విషాదంలో సునామీ అత్యంత తీవ్ర విధ్వంసం సృష్టించింది. 36,000 మంది మరణించగా అందులో సుమారు 34,000 మంది కేవలం సునామీ కారణంగానే ప్రాణాలు కోల్పోయారు.

తాను, తన తండ్రి ఇండోనేషియాలోని బాంటెన్ ప్రావిన్స్ పశ్చిమ తీరంలో ఉన్న అంజర్ నగరానికి వెళ్లినట్లు సిడ్నీ బేకర్ చెప్పారు.

"నగరం మొత్తం సముద్రపు నీటిలో మునిగిపోయింది" అని తండ్రి చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకుంటూ అప్పటి విషయాలను వివరించారు.

"ఆయన బస చేస్తున్న హోటల్ ఎంతస్థాయిలో నీటమునిగిందంటే దానిపై నుంచి ఒక ఓడ ప్రయాణించి లంగరు వేయగలదని ఆయన చెప్పేవారు" అని తన తండ్రి చెప్పినట్టు బేకర్ గుర్తుచేసుకున్నారు.

కొంతమంది ఎలాగోలా సునామీ నుంచి తప్పించుకుని కొండల వైపు పరుగెత్తారు.

కానీ అక్కడ కూడా వారు పూర్తిగా సురక్షితంగా లేరు. అత్యంత వేగంతో నేలపై ప్రవహించే వేడి వాయువులు, బూడిద, ప్రాణాంతక రాళ్ల మిశ్రమ ప్రవాహాల కారణంగా అనేకమంది ప్రాణాలు కోల్పోయారు.

క్రకటోవా ప్రభావం కేవలం ఆ 48 గంటలకే పరిమితం కాలేదు.

అగ్నిపర్వత విస్ఫోటనం నుంచి వెలువడిన బూడిద ప్రపంచమంతటా వ్యాపించి సూర్యచంద్రుల చుట్టూ ఒక ప్రకాశవంతమైన వలయాన్ని సృష్టించింది. వాతావరణంలో వ్యాపించిన బూడిద కణాలు సూర్యకిరణాలను వడపోసేలా పనిచేశాయి.

దీనివల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సుమారు 0.5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. పరిస్థితులు సాధారణ స్థితికి రావడానికి సుమారు ఐదు సంవత్సరాలు పట్టిందని అమెరికా జాతీయ పర్యావరణ ఆరోగ్య సంస్థ (ఎన్‌సీఈఐ) తెలిపింది.

వాతావరణంలో వ్యాపించిన ఈ సూక్ష్మ కణాలు కాంతిని సాధారణం కంటే భిన్నంగా వెదజల్లడం వల్ల ప్రపంచవ్యాప్తంగా సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు అసాధారణంగా ముదురు ఎరుపు రంగులో కనిపించాయి.

ఆ కాలం నాటి అనేక చిత్రాల్లో ఈ ఎర్రటి ఆకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఎడ్వర్డ్ మంచ్ ప్రసిద్ధ చిత్రమైన "ది స్క్రీమ్"లో చిత్రీకరించిన ఎర్రటి ఆకాశం ఈ క్రకటోవా విస్ఫోటనం నుంచి ప్రేరణ పొందిందని కొంతమంది నిపుణులు భావిస్తారు.

భూమి, అగ్నిపర్వతం, సూర్యుడు, ప్రకృతి, సైన్స్

ఫొటో సోర్స్, Didier Lebrun / Photonews via Getty Images

ఫొటో క్యాప్షన్, క్రాకటోవా విస్ఫోటనం వల్ల శాస్త్రవేత్తలకు అనేక విషయాలు తెలిశాయి.

శాస్త్రవేత్తలకు ఒక కొత్త విషయం నేర్పిన పేలుడు

ఇంత భారీ విధ్వంసం సృష్టించినప్పటికీ ఈ క్రకటోవా విస్ఫోటనం మన భూమి గురించి శాస్త్రవేత్తలకు ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని కూడా నేర్పింది.

ఈ విస్ఫోటనానికి ముందు ప్రపంచానికి జెట్ స్ట్రీమ్‌ల గురించి తెలియదు. ఇవి వాతావరణం పై పొరలలో ప్రవహించే అత్యంత వేగవంతమైన, కంటికి కనిపించని గాలి ప్రవాహాలు. ఇవి ప్రపంచ వాతావరణాన్ని నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

క్రకటోవా అగ్నిపర్వతం విస్ఫోటనం చెంది, దాని బూడిద, దాని ప్రభావాలు ప్రపంచవ్యాప్తంగా కనిపించిన తర్వాత వాతావరణంలో చాలా బలమైన గాలి ప్రవాహాలు ఉన్నాయని, అవి ఈ కణాలను వేల కిలోమీటర్ల దూరానికి తీసుకువెళ్లగలవని శాస్త్రవేత్తలు అర్ధం చేసుకున్నారు.

"ఇది యావత్ భూమిపై ప్రభావం చూపిన మొదటి ప్రకృతి విపత్తు ఇదేనని శాస్త్రీయ ప్రపంచం ఈ సంఘటన ద్వారా గ్రహించింది " అని విన్‌చెస్టర్ అన్నారు.

''ప్రపంచమంతా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉందని ప్రజలు ఇక్కడే అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు మనం గ్లోబల్ వార్మింగ్, పెరుగుతున్న సముద్ర మట్టాలు, యావత్ గ్రహంపై పర్యావరణ ప్రభావం గురించి మాట్లాడే ఆలోచనా విధానం ఈ క్రకటోవా విస్ఫోటనం నుంచే పుట్టింది. ఈ సంఘటన ప్రపంచాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానమైన ఒకే వ్యవస్తగా చూడాలనే దృక్పథాన్ని మనకు ఇచ్చింది" అని విశ్లేషించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)