‘సత్లూజ్’ : ఓటీటీ నుంచి 2 రోజులలోనే తొలగించిన ఈ సినిమాను గురుద్వారాలు, గ్రామాలలో చూస్తూ పంజాబ్ ప్రజలు ఎందుకు చలించిపోతున్నారు?

పంజాబ్, సట్లుజ్ సినిమా, బహిరంగ ప్రదర్శనలు
    • రచయిత, హర్మన్‌దీప్ సింగ్, నవ్‌జోత్ కౌర్
  • ప్రచురణ
  • చదివే సమయం: 8 నిమిషాలు

"నా భర్త 1989లో అదృశ్యమయ్యారు. ఈ రోజు వరకు ఆయన గురించి ఎలాంటి సమాచారం లేదు. నా జీవితంలో ఆ రోజులను మరోసారి గుర్తు చేసుకోడానికి ఇక్కడికి వచ్చాను"

కన్నీటి పర్యంతమవుతూ బల్విందర్ కౌర్ ఈ మాటలు చెప్పారు.

మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని ఆధారంగా చేసుకొని రూపొందించిన ‘సత్లూజ్’ చిత్రాన్ని చూడటానికి ఆమె మొగాలోని ఒక గురుద్వారాకు వచ్చారు.

ప్రసిద్ధ గాయకుడు, నటుడు దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం 2026 జూలై 3న జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది. అయితే విడుదలైన 48 గంటల్లోనే దాన్ని జీ5 నుంచి తొలగించారు.

అనంతరం పంజాబ్‌లోని పలు గ్రామాలు, పట్టణాల్లో ప్రజలు స్వయంగా ఈ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకుని భారీ ఎల్ఈడీ తెరలపై ప్రదర్శిస్తున్నారు. గురుద్వారాలు, బహిరంగ ప్రదేశాల్లోనూ ప్రజలు ఈ చిత్రాన్ని చూస్తున్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
దిల్జిత్ దోసాంజ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రను దిల్జిత్ దోసాంజ్ పోషించారు

ఏం జరిగింది?

ప్రముఖ భారతీయ గాయకుడు-నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించిన ఒక చిత్రాన్ని ఓటీటీ వేదిక నుంచి ఆకస్మికంగా తొలగించడం వివాదానికి దారితీసింది.

'సత్లూజ్’ చిత్రం మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని రూపొందింది. పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం కొనసాగిన సమయంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా జరిగిన హత్యలపై ఆయన దర్యాప్తు చేశారు. అనంతరం ఆయనే అదృశ్యమయ్యారు.

తర్వాత ఆయనను అపహరించి హత్య చేసినట్లు తేలింది. ఈ హత్య కేసులో పంజాబ్ పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు చివరికి దోషులుగా తేలారు.

'సత్లూజ్’' శుక్రవారం జీ5 ఓటీటీ వేదికపై విడుదలైంది. అయితే రెండు రోజులకే దానిని తొలగించారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు ఈ చిత్రం భారత్‌లో అందుబాటులో ఉండదని జీ5 ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ఆ "ప్రస్తుత పరిస్థితులు" ఏమిటో వివరించలేదు.

జీ5 కూడా చిత్రాన్ని తొలగించడంతో ప్రస్తుతం అది భారత్‌లో అధికారికంగా ఎక్కడా అందుబాటులో లేదు.

ఈ చిత్రం 2022లో పూర్తయినప్పటికీ , భారత చలనచిత్ర ధ్రువీకరణ మండలితో (సెన్సార్ బోర్డు) సుదీర్ఘ వివాదం కారణంగా ఎప్పుడూ థియేటర్లలో విడుదల కాలేదు.

అతి తక్కువ సమయం మాత్రమే అందుబాటులో ఉన్నప్పటికీ, సత్లూజ్‌కు మంచి సమీక్షలు వచ్చాయి. ది హాలీవుడ్ రిపోర్టర్ దీనిని "ఈ ఏడాది అత్యుత్తమ భారతీయ చిత్రాల్లో ఒకటి"గా అభివర్ణించింది.

ఈ చిత్ర నిర్మాత ఆర్‌ఎస్‌వీపీ మూవీస్ ప్రతినిధిని ఉటంకిస్తూ, ప్రభుత్వ ఆదేశాల మేరకే చిత్రాన్ని తొలగించినట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై ప్రభుత్వం ఇప్పటివరకు బహిరంగంగా స్పందించలేదు. స్పందన కోసం బీబీసీ కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖను సంప్రదించింది.

చిత్రాన్ని తొలగించడంపై దిల్జిత్ దోసాంజ్ స్పందించారు. సినిమా తొలగిస్తారని ముందే ఊహించానని, అయితే అంత త్వరగా జరుగుతుందని అనుకోలేదని చెప్పారు.

"మీ అందరికీ నా ప్రేమాభిమానాలు. నేను ముందే ఊహించినదే జరిగింది. సోమవారం ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిన తర్వాత సినిమాను నిషేధిస్తారని అనుకున్నాను. కానీ ఆదివారం సాయంత్రమే ఇలా జరుగుతుందని ఊహించలేదు" అని ఆయన అన్నారు.

సినిమా విడుదలపై నెలకొన్న అనిశ్చితి కారణంగానే ప్రచారాన్ని చాలా పరిమితంగా ఉంచామని దోసాంజ్ చెప్పారు.

"మేము విస్తృతంగా ప్రచారం చేసి ఉంటే, ఈ సినిమా అసలు విడుదలయ్యేది కాదు" అని ఆయన అన్నారు.

ఏళ్ల తరబడి ఆలస్యమైన తర్వాత అయినా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడగలిగారని సంతోషంగా ఉందని దోసాంఝ్ చెప్పారు.

సత్లూజ్ సినిమా

ఫొటో సోర్స్, officeofssbadal

ఫొటో క్యాప్షన్, మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా (ఎడమ) జీవితం ఆధారంగా సత్లూజ్ చిత్రం నిర్మించారు

ఎవరీ జస్వంత్ సింగ్ ఖల్రా?

జస్వంత్ సింగ్ ఖల్రా జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకున్న ఈ చిత్రం, పంజాబ్‌లో వేర్పాటువాద ఉద్యమం సాగిన కాలంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేసే ఓ కార్యకర్త కథ. ఆధునిక భారత చరిత్రలో తీవ్ర రక్తపాతానికి దారితీసిన ఘట్టాల్లో ఇది ఒకటి.

1980ల ప్రారంభం నుంచి 1990ల మధ్యకాలం వరకు ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం సిక్కు మిలిటెంట్లు భారత భద్రతా బలగాలతో సాయుధ పోరాటం సాగించారు. ఈ ఘర్షణలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్రభుత్వం అణచివేత చర్యలను ముమ్మరం చేసిన సమయంలో, భద్రతా బలగాలు ఏకపక్ష అరెస్టులు, బలవంతపు అదృశ్యాలు, న్యాయ విచారణ లేకుండా హత్యలకు పాల్పడ్డాయని మానవ హక్కుల సంస్థలు ఆరోపించాయి.

అయితే ఈ ఆరోపణలను అధికారులు ఖండించారు. వేర్పాటువాద ఉద్యమాన్ని అణచి వేయడానికి కఠిన చర్యలు అవసరమయ్యాయని వారు పేర్కొన్నారు. 1990ల మధ్య నాటికి ఈ ఉద్యమం చాలా వరకు తగ్గుముఖం పట్టింది.

అదృశ్యమైన అనేక మంది మృతదేహాలను వారి కుటుంబాలకు తెలియకుండా, సరైన రికార్డులు లేకుండానే రహస్యంగా దహనం చేశారని వచ్చిన ఆరోపణలపై ఖల్రా దర్యాప్తు చేపట్టారు. 1995లో ఆయన అదృశ్యమయ్యారు. అనంతరం ఆయనను అపహరించి హత్య చేసినట్లు తేలింది. ఆయన అపహరణ, హత్య కేసుల్లో పంజాబ్ పోలీసు శాఖకు చెందిన పలువురు అధికారులు తర్వాత దోషులుగా తేలారు.

పంజాబ్, సట్లుజ్ సినిమా, బహిరంగ ప్రదర్శనలు
ఫొటో క్యాప్షన్, బల్విందర్ కౌర్

గ్రామాలు, గురుద్వారాలలో సత్లూజ్ ప్రదర్శన

గత కొన్ని రోజులుగా గురదాస్‌పూర్, సంగ్రూర్, జలంధర్, రూప్‌నగర్ (రోపర్), బఠిండా, ఫిరోజ్‌పూర్, మొగా, పటియాలా తదితర జిల్లాల్లోని వివిధ గ్రామాల్లో ‘సత్లూజ్’ చిత్ర ప్రదర్శనలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ ప్రాంతంలో నిర్వహించిన ఇలాంటి ప్రదర్శనకు సంబంధించిన చిత్రాలు కూడా వైరల్ అయ్యాయి. వాటిని దిల్జిత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు.

మొగాలోని బీబీ కహాన్ కౌర్ జీ గురుద్వారా వద్ద ఈ సినిమాను చూడటానికి వచ్చిన బల్విందర్ కౌర్ బీబీసీ ప్రతినిధి హర్మన్‌దీప్ సింగ్‌తో మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

సినిమాను చూసిన అనంతరం ఆమె కన్నీటి పర్యంతమై "బహుశా ఈ చిత్రం నా గురించి కూడా ఏదో చెబుతోందేమో. ఆ రోజులను నా జీవితంలోనూ అనుభవించాను. ఈ చిత్రం నా కథనే చూపించినట్టుగా అనిపించింది. అలాంటి రోజులు మళ్లీ ఎప్పుడూ రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నా" అన్నారు.

బల్విందర్ కౌర్ మొదటి భర్త 1989లో అదృశ్యమయ్యారు. ఆ తర్వాత ఆయన ఇంటికి తిరిగి రాలేదు. అనంతరం తాను మొగాలో మళ్లీ వివాహం చేసుకున్నానని ఆమె తెలిపారు.

"1989లో నేను తరన్ తరన్‌లోని మా తల్లిదండ్రుల ఇంట్లో ఉన్నాను. నా భర్త టైలర్‌గా పనిచేసేవారు. మా వివాహం చోహ్లా సాహిబ్‌లో జరిగింది. ఆయన పేరు రవీందర్‌పాల్ సింగ్. ఒక రోజు తెల్లవారుజామున పోలీసులు ఆయనను ఇంటి నుంచి తీసుకెళ్లారు. ఈ రోజు వరకు ఆయన మృతదేహం కూడా దొరకలేదు" అని ఆమె చెప్పారు.

"చిత్రంలో చూపించినట్టుగానే అప్పట్లో మా మాట కూడా ఎవరూ వినలేదు. మేమెంతో ప్రయత్నించాం. కానీ ఈ రోజు వరకు ఆయన జాడ కనుగొనలేకపోయాం" అని బల్విందర్ కౌర్ తెలిపారు.

మొగాలో డాక్టర్ సరబ్‌జిత్ కౌర్ తన క్లినిక్‌ను మూసేసి మరీ ప్రత్యేకంగా ఈ చిత్రం చూడడానికి వచ్చారు.

ఆయన మాట్లాడుతూ "ఇది కల్పిత కథ కాదు. మేం అనుభవించిన నిజం. గతంలో జస్వంత్ సింగ్ ఖల్రా గొంతును అణచివేయడానికి ఎలా ప్రయత్నించారో, ఇప్పుడు ఆయనపై తీసిన చిత్రాన్ని కూడా అడ్డుకోవడానికి అలానే ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుకీ జస్వంత్ సింగ్ ఖల్రా మా మధ్యే ఉన్నట్టు అనిపిస్తోంది" అన్నారు.

"మేం చిన్నప్పుడు ఇలా కలిసి కూర్చొని టెలివిజన్‌లో సినిమాలు చూసేవాళ్లం. గురుద్వారాలో ఇంతమంది ప్రజలతో కలిసి సినిమా చూడడం ఇదే మొదటిసారి. మా ప్రాంతానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఈ చిత్రం చూడటానికి వచ్చారు" అని ఆయన అన్నారు.

పంజాబ్, సట్లుజ్ సినిమా, బహిరంగ ప్రదర్శనలు
ఫొటో క్యాప్షన్, సత్లూజ్ సినిమాపై నిషేధాన్ని పంజాబ్ ప్రజలు ప్రశ్నిస్తున్నారు

బీబీసీ జర్నలిస్టు గుర్‌ప్రీత్ చావ్లా కథనం ప్రకారం, గురదాస్‌పూర్‌లోని మంచోప్రాలో బహిరంగంగా ఈ చిత్రాన్ని వీక్షించడానికి వచ్చిన ప్రజలు 'సత్లూజ్' చిత్రంపై విధించిన నిషేధాన్ని ప్రశ్నించారు. అలాగే తమ తమ స్థాయిల్లో ఈ చిత్రాన్ని ప్రదర్శించడాన్ని సమర్థించారు.

"పంజాబ్‌కు చెందిన అమాయక యువకులను ఎలా వారి ఇళ్ల నుంచి అపహరించి హత్య చేశారో, వారి కోసం జస్వంత్ సింగ్ ఖల్రా ఎలా పోరాడారో ప్రజలకు తెలియజేయడమే మా ఉద్దేశం. ఈ విషయాన్ని సినిమా రూపంలో చూపించడానికి ఇదే మొదటి ప్రయత్నం. అందుకు ఈ చిత్రం ప్రజల వద్దకు చేరడం అవసరం. కానీ ప్రభుత్వం చిత్రాన్ని విడుదల చేయనివ్వడం లేదు. అందుకే మేమే ప్రజలకు ఈ చిత్రాన్ని చూపిస్తున్నాం" అని ఓ యువకుడు అన్నారు.

"ఈ చిత్రం చూసిన తర్వాత ఆ రోజులలో అదృశ్యమైన వారి కుటుంబాల నిరీక్షణకు ఒక ముగింపు లభించినట్టే అనిపించింది. పంజాబ్ చరిత్ర గురించి, ఖల్రా సాహిబ్ గురించి మాకు తెలియని ఎన్నో విషయాలు తెలిశాయి. మేమెలాంటి తప్పు చేయడం లేదు. సినిమా తీశారంటే దాన్ని చూసే అవకాశం కూడా ఉండాలి. ప్రభుత్వానికి మేం విజ్ఞప్తి చేస్తున్నాం" అని గ్రామంలో చిత్ర ప్రదర్శనను నిర్వహించిన మరో యువకుడు అన్నారు.

"ఈ చిత్రం విడుదలైందని తెలిసిన రోజు నుంచే చూడాలని అనుకున్నాం. కానీ తర్వాత జీ5 నుంచి తొలగించారు. మంగళవారం సాయంత్రం గురుద్వారా సాహిబ్‌లో చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులందరితో కలిసి వచ్చాం" అని భర్త, పిల్లలతో కలిసి మొగాలో ఈ చిత్రం చూడ్డానికి వచ్చిన వీర్‌పాల్ కౌర్ తెలిపారు.

చిత్రం మళ్లీ విడుదలయ్యే వరకు ప్రేక్షకులు వేచి ఉండాలని చిత్ర దర్శకుడు హనీ త్రేహన్, జీ5 సంస్థ కోరాయి.

అలాగే చిత్రాన్ని అక్రమంగా డౌన్‌లోడ్ చేసి ప్రదర్శించవద్దని హనీ త్రేహన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అయినప్పటికీ పెద్ద సంఖ్యలో ప్రజలు, సంస్థలు, యువత వివిధ గ్రామాల్లో తమ తమ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు.

"జస్వంత్ సింగ్ ఖల్రాపై రూపొందించిన చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అనుమతించలేదు. మా కోసం పోరాడిన మా హీరోపై తీసిన చిత్రాన్ని ఎందుకు చూడనివ్వడం లేదో తెలుసుకోవాలనే ఆసక్తి మాకు కలిగింది. అందుకే గురుద్వారా కమిటీ సహకారంతో గురుద్వారా సాహిబ్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించాం" అని మొగాలోని గురుద్వారా సాహిబ్‌లో చిత్ర ప్రదర్శనను నిర్వహించిన రాజ్వంత్ సింగ్ మాల్ చెప్పారు.

"ఈ చిత్రాన్ని అక్రమంగా ప్రదర్శించినందుకు మాపై ఎలాంటి చర్యలు తీసుకున్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం. మానవ హక్కుల గురించి మాట్లాడిన వ్యక్తిపై తీసిన చిత్రాన్ని ప్రజలు చూడనివ్వకపోవడమే అతిపెద్ద నేరం. మేము ఊహించిన దానికంటే ఎక్కువ మంది ప్రజలు మాకు మద్దతు ఇచ్చారు" అని ఆయన అన్నారు.

పంజాబ్, సట్లుజ్ సినిమా, బహిరంగ ప్రదర్శనలు

ఫొటో సోర్స్, Diljit Dosanjh/Insta & KHALRA MISSION ORGANISATION/FB

ఫొటో క్యాప్షన్, జస్వంత్ సింగ్ ఖల్రా పాత్రను దిల్జిత్ పోషించారు

నటుడు, గాయకుడు దిల్‌జిత్ దోసాంజ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ ద్వారా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బహిరంగ ప్రదర్శనలకు మద్దతు తెలిపారు. "ఈ చిత్రం ఇక ఆగదు. ఇది ప్రజల వద్దకు చేరిపోయింది" అని తన ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో అన్నారు.

అదే సమయంలో, నిషేధం ఉన్నప్పటికీ దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రజలు తమ స్థాయిలో ఈ చిత్రాన్ని వీక్షిస్తున్నట్లు చూపించే కథనాలను దిల్జిత్ దోసాంజ్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో దాదాపు ప్రతిరోజూ పంచుకుంటున్నారు.

మరోవైపు చిత్ర దర్శకుడు హనీ త్రేహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక స్టోరీ పంచుకుంటూ చిత్రాన్ని డౌన్‌లోడ్ చేసి చూడవద్దని ప్రజలను కోరారు. ఓర్పుతో ఉండాలని, ఈ చిత్రాన్ని త్వరలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఆయన హామీ ఇచ్చారు.

అయితే ఈ వ్యవహారంలో చిత్ర ప్రదర్శన నిర్వాహకులపై పోలీసులు ఇప్పటి వరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు సమాచారం లేదు.

సినిమా థియేటర్లలో విడుదలయ్యే చిత్రాల మాదిరిగా జీ5 వంటి ఓటీటీ వేదికలపై నేరుగా విడుదలయ్యే చిత్రాలకు సీబీఎఫ్‌సీ ధ్రువీకరణ అవసరం లేదు.

అయితే ఈ ఓటీటీ వేదికలు భారత ప్రభుత్వ సమాచార సాంకేతిక చట్టం, 2000, సమాచార సాంకేతిక నియమాలు, 2021 పరిధిలోకి వస్తాయి.

మీడియా కథనాల ప్రకారం, 'సత్లూజ్' చిత్రాన్ని భారత్‌లో తొలగించాలని కేంద్ర ప్రభుత్వం సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69ఏ కింద ఆదేశాలు జారీ చేసింది. ఈ సెక్షన్ ప్రకారం ఆన్‌లైన్‌లో ఉన్న కంటెంట్‌ను నిరోధించే లేదా తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.

ఈ చట్టం ప్రకారం ఆ చిత్రాన్ని భారత్‌లో బహిరంగంగా ప్రదర్శించడానికి అనుమతి లేదు. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే గరిష్ఠంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

పంజాబ్, సట్లుజ్ సినిమా, బహిరంగ ప్రదర్శనలు

ఫొటో సోర్స్, ZEE5/INSTA

ఫొటో క్యాప్షన్, సత్లూజ్ చిత్రం 2022లోనే నిర్మాణం పూర్తయిన సెన్సార్ విషయంలో సుదీర్ఘ వివాదం కారణంగా థియేటర్లలో విడుదల కాలేదు.

శిరోమణి అకాలీ దళ్ (బాదల్) అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ బుధవారం విడుదల చేసిన ప్రకటనలో, "సమాజంపై జరిగిన దారుణాల గురించి మా పిల్లలు, భావి తరాలు పూర్తిగా తెలుసుకునేలా శిరోమణి అకాలీ దళ్ పంజాబ్‌లోని ప్రతి గ్రామంలో, ప్రతి మూలలో 'సత్లూజ్' చిత్రాన్ని ప్రదర్శిస్తుంది" అని పేర్కొన్నారు.

దిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్‌మెంట్ కమిటీ కూడా ఢిల్లీలో ఈ చిత్రాన్ని బహిరంగంగా ప్రదర్శించి జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తామని ప్రకటించింది.

శిరోమణి అకాలీ దళ్ (వారిస్ పంజాబ్ దే) కూడా ఈ చిత్ర ప్రదర్శనకు ఏర్పాట్లు చేస్తోంది.

ఓటీటీ నుంచి చిత్రాన్ని తొలగించిన తర్వాత ఈ విషయాన్ని పునఃపరిశీలించాలని సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరినట్లు భారతీయ జనతా పార్టీ పంజాబ్ అధ్యక్షుడు సర్దార్ కేవల్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. వెంటనే వైష్ణవ్ ముగ్గురు సభ్యులతో కూడిన సమీక్ష కమిటీని ఏర్పాటు చేశారని ధిల్లాన్ పేర్కొన్నారు. ఈ కమిటీ అంశాన్ని సమగ్రంగా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని ఆయన చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)