గుండెలో బ్లాకేజీ ఉన్నవారందరికీ యాంజియోప్లాస్టీ అవసరమా? - 8 ప్రశ్నలు -జవాబులు

యాంజియోప్లాస్టీ
ఫొటో క్యాప్షన్, కొన్ని కేసుల్లో యాంజియోప్లాస్టీ ప్రాణాలను కాపాడుతుందని వైద్యులు చెప్పారు.
    • రచయిత, శారద.వి.
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఇటీవల కేరళ ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ‘అవసరం లేకపోయినా యాంజియోప్లాస్టీలను చేయడం’ తగ్గించాలని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

''గుండె ధమనిలో అడ్డంకి ఉన్నట్లు పరీక్షల్లో తేలితే, ప్రతి రోగికి తప్పనిసరిగా స్టెంట్ అమర్చల్సిందేనా?'' అనే ప్రశ్నను ఇది రేకెత్తించింది.

అయితే దీనికి సమాధానం వెదికేందుకు ప్రయత్నించినప్పుడు మెడికల్ గైడ్‌లైన్స్, కార్డియాలజిస్టులు దీనికి ‘కాదు' అనే సమాధానం చెబుతున్నారు.

కొన్ని కేసుల్లో యాంజియోప్లాస్టీ ప్రాణాలను కాపాడుతుందని వైద్యులు చెబుతున్నారు.

అయితే చాలా కేసులలో మందులు, జీవనశైలిలో మార్పులు, సరైన పర్యవేక్షణ సరిపోవచ్చని అంటున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
యాంజియోప్లాస్టీ
ఫొటో క్యాప్షన్, గుండెపోటు సమయంలో, గుండె రక్తనాళాలలో ఒకటి అకస్మాత్తుగా పూర్తిగా మూసుకుపోతుంది.

1. యాంజియోప్లాస్టీ అంటే?

యాంజియోప్లాస్టీ లేదా పీసీఐ (పెర్క్యుటేనియస్ కరోనరీ ఇంటర్వెన్షన్) అనేది గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ఇరుకైన లేదా మూసుకుపోయిన కరోనరీ ధమనిని తెరిచే ఒక ప్రక్రియ.

దీనిలో.. మూసుకుపోయిన ప్రాంతాన్ని వెడల్పు చేసేందుకు ఒక పలుచటి ట్యూబ్‌ ద్వారా బెలూన్‌ను చొప్పిస్తారు.

తరువాత ఆ ప్రాంతంలో "స్టెంట్" అని పిలిచే బాగా పలుచగా ఉండే జాలీలాంటి లోహపు గొట్టాన్ని అమరుస్తారు.

2. ఎప్పుడు ఉపయోగపడుతుంది?

గుండెపోటు సంభవించినప్పుడు యాంజియోప్లాస్టీ ప్రాణాలను కాపాడగలదు. ప్రాణం పోకుండా ఉండటానికి దీనిని తక్షణం చేయడం ముఖ్యం.

గుండెపోటు సమయంలో, గుండె రక్తనాళాలలో ఒకటి అకస్మాత్తుగా పూర్తిగా మూసుకుపోతుంది. దీనివల్ల గుండె కండరానికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. ఈ సమయంలో అడ్డంకిని తొలగించడానికి యాంజియోప్లాస్టీని వేగంగా చేస్తే:

  • గుండె కండరాలకు కలిగే నష్టం తగ్గుతుంది.
  • హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
  • ప్రాణం పోయే ప్రమాదం కూడా తగ్గుతుంది.

దీంతో, తీవ్రమైన ప్రమాదాన్ని కలిగించే అవకాశం ఉన్న గుండెపోటుల విషయంలో వెంటనే యాంజియోప్లాస్టీ చేయాలని వైద్య మార్గదర్శకాలు నొక్కి చెబుతున్నాయి.

''ఎవరైనా సీరియస్‌గా ప్రభావితమైతే, స్టెంట్‌ను కచ్చితంగా అమర్చాల్సిందే. వారు బతికే అవకాశాలను, అలాగే నొప్పితో సహా వారి లక్షణాల తీవ్రతను అంచనా వేస్తారు'' అని ప్రభుత్వ వైద్యులు, కార్డియాలజీ సీనియర్ ప్రొఫెసర్ జస్టిన్ పాల్ అన్నారు.

3. గుండెపోటు సంకేతాలేంటి?

  • ఛాతీలో తీవ్రమైన ఒత్తిడి లేదా నొప్పి
  • ఆ నొప్పి చేతికి, భుజానికి, వెన్నుకు లేదా దవడకు వ్యాపించడం
  • ఊపిరి ఆడకపోవడం
  • ఎక్కువగా చెమటలు పట్టడం
  • కళ్లు తిరగడం లేదా వాంతులు
యాంజియోప్లాస్టీ
ఫొటో క్యాప్షన్, ఛాతీలో తీవ్రమైన ఒత్తిడి లేదా నొప్పి గుండెపోటుకు ముందస్తు హెచ్చరికల్లో ఒకటి

4. కేవలం మందులు సరిపోతాయా?

చాలామందికి గుండెపోటు రాదు. కానీ, వారికి ''స్టేబుల్ కరోనరీ ఆర్టెరీ డిసీజ్'' లేదా ''స్టేబుల్ యాంజినా'' ఉండి ఉంటాది.

అటువంటి రోగులకు:

  • ఛాతీ నొప్పి కొన్ని పరిస్థితులలో మాత్రమే వస్తుంది.
  • వ్యాయామం లేదా నడక సమయంలో వచ్చే నొప్పి, విశ్రాంతితో తగ్గుతుంది.
  • ఈ పరిస్థితి తక్షణ ప్రాణాపాయం కలిగించేది కాదు.

వీటికి సాధారణంగా ప్రాథమిక చికిత్సగా ఈ కింది వాటిని సిఫార్సు చేస్తారు

  • కొలెస్ట్రాల్ నియంత్రించే మందులు
  • ఆస్పిరిన్ లేదా రక్తాన్ని పలచబరిచే ఇతర మందులు
  • రక్తపోటు నియంత్రణ
  • మధుమేహ నియంత్రణ
  • ధూమపానం మానేయడం
  • వ్యాయామం, ఆహారపు అలవాట్లలో మార్పులు

చాలా సందర్భాలలో, ఇవే వ్యాధి నియంత్రణకు సరిపోతాయని వైద్యులు చెప్పారు.

5. స్టెంట్ అవసరం ఎప్పుడు?

మందులు వాడినప్పటికీ లక్షణాలు కొనసాగితే, లేదా గుండెకు రక్త ప్రసరణ బాగా దెబ్బతిన్నట్లు పరీక్షలలో తేలితే, యాంజియోప్లాస్టీని పరిగణించొచ్చు.

కేవలం బ్లాకేజీ ఏర్పడిన మాత్రాన స్టెంట్ ఎందుకు అవసరం లేదు?

ఎవరికైనా బ్లాకేజీ ఏర్పడిన మాత్రాన స్టెంట్‌ను అమర్చాల్సిన అవసరం లేదని జస్టిల్ పాల్ అన్నారు.

యాంజియోగ్రామ్‌లో రక్తనాళంలో అడ్డంకి ఉన్నట్లు తేలినా కూడా, డాక్టర్ ఈ కింద వాటిని చెక్ చేస్తారు.

  • ఆ బ్లాకేజీ ఎంత ప్రమాదకరంగా ఉంది?
  • రక్త ప్రసరణను ఇది నిజంగా ప్రభావితం చేస్తుందా?
  • గుండె కండరాలకు ఆక్సిజన్ తక్కువగా అందిస్తోందా

"ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించాకే స్టెంట్ అవసరమో కాదో నిర్ణయించగలం. స్టెంట్ అమర్చే ముందే.. బ్లాకేజీ ఉన్న ప్రదేశం, ప్రభావిత ప్రాంతంలో ఎంత కీలకమైన కండరం ఉంది, స్టెంట్ అమర్చడం వల్ల నిజంగా రోగికి ప్రయోజనం కలుగుతుందా లేదా అనే విషయాలను తెలుసుకోవాలి" అని డాక్టర్ జస్టిన్ పాల్ అన్నారు.

యాంజియోప్లాస్టీ

6. ఎంత బ్లాకేజీ ఉంటే స్టంట్ వేస్తారు?

అలాగే, '70 శాతం బ్లాకేజీ ఉంటే స్టెంట్ తప్పనిసరిగా వేయాలి' అనేది నిజమేనా అని అడిగినప్పుడు, వైద్యులు 'కాదు' అని చెప్పారు.

యాంజియోగ్రామ్‌లో కేవలం "70 శాతం బ్లాకేజీ" లేదా "80 శాతం బ్లాకేజీ" ఉందని తెలిసినప్పుడు, చికిత్స విషయంలో నిర్ణయం తీసుకోవడానికి అదొక్కటే సరిపోదని గుండె వైద్యులు చెప్పారు.

దీనికి భిన్నంగా వైద్యులు..

  • రోగి లక్షణాలను
  • ఫిట్‌నెస్ టెస్టు ఫలితాలను
  • రక్త ప్రసరణ అంచనాలను
  • మొత్తం గుండెకు సంబంధించిన ప్రమాద స్థాయిలను పరిశీలిస్తారు.

"ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్‌లను వెంటనే పరిష్కరించాల్సినట్లే, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ప్రధాన ధమనులలో అడ్డంకి ఏర్పడితే, రోగి పరిస్థితిని బట్టి స్టెంట్ అమర్చడం అవసరం. కానీ, బ్లాకేజీ రక్తనాళాల చివరి భాగాలలో లేదా ప్రధాన ధమనులు కాకుండా ఇతర రక్తనాళాలలో ఉంటే, స్టెంట్ అవసరం ఉండదు. వీటిని మందులతో తగ్గించవచ్చు" అని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో కార్డియాలజిస్ట్‌గా పనిచేసే ముత్తు బీబీసీతో అన్నారు.

ఒకవేళ బ్లాకేజీ 60 శాతం లేదా 70 శాతానికి పైగా ఉంటే.. చాలామంది వైద్యులు స్టెంట్ వేయడాన్ని సూచిస్తుంటారని డాక్టర్ ముత్తు అన్నారు.

'' 60 శాతం లేదా 70 శాతం బ్లాకేజీ ఉంటే.. పరిస్థితి అకస్మాత్తుగా ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు, వైద్యులు స్టెంట్ సూచిస్తారు'' అని తెలిపారు.

యాంజియోప్లాస్టీ

7. లక్షణాలు లేకపోయినా స్టెంట్ అవసరమా?

లక్షణాలు ఉన్నవారికి సాధారణంగా స్టెంట్ అమర్చడం అవసరమవుతుందని, అయితే కొన్నిసార్లు లక్షణాలు లేనివారికి కూడా ఇది అవసరం కావచ్చని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ జోసెఫ్ రాజ్ అన్నారు.

"కొంతమందికి చిన్న అడ్డంకి ఉంటుంది. కానీ, ట్రెడ్‌మిల్ పరీక్షలో తీవ్రమైన కండరాల నష్టం బయటపడవచ్చు. కాబట్టి, అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, స్టెంట్ అమరుస్తారు" అని ఆయన చెప్పారు.

కేరళలో జరిగిన చర్చ సందర్భంగా, అనవసరమైన వైద్య విధానాలను నివారించాలని భారతీయ వైద్య సంఘం (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కూడా అంగీకరించింది. అయితే, ప్రాణరక్షణ పరిస్థితులలో కూడా యాంజియోప్లాస్టీ అనవసరం అనే అపోహను వ్యాప్తి చేయవద్దని హెచ్చరించింది.

అటువంటి అపోహ గుండెపోటు రోగులకు చికిత్స ఆలస్యం కావడానికి దారితీయవచ్చని భారతీయ వైద్య సంఘం పేర్కొంది.

8. అత్యవసరం కాకపోతే ఏం చేయాలి?

అత్యవసర పరిస్థితి కాకపోతే.. వైద్యుడిని రోగి లేదా కుటుంబం ఈ కింద ప్రశ్నలను అడగవచ్చు..

  • నాకు ఇప్పుడు గుండెపోటు వస్తుందా?
  • ఇది అత్యవసర చికిత్సా లేక ప్రణాళికాబద్ధమైన చికిత్సా?
  • బ్లాకేజీ ఎంత తీవ్రంగా ఉంది?
  • ఇది నిజంగా రక్త ప్రసరణను ప్రభావితం చేస్తుందా?
  • ముందుగా మందులు వాడి చూడొచ్చా?
  • స్టెంట్ అమర్చడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి?
  • సెకండ్ ఒపీనియన్ తీసుకుందామా?

(ఈకథనం కేవలం అవగాహన కోసమే)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)