బంగ్లాదేశ్ జంటకు సౌదీ అరేబియాలో మరణశిక్ష.. మక్కాలో ‘అశ్లీల చర్యల’కు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్ష

ఫొటో సోర్స్, Getty Images
మక్కా నగరంలో అశ్లీల చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అరెస్టయిన బంగ్లాదేశ్కు చెందిన ఓ పురుషుడు, మహిళకు మరణశిక్ష అమలుచేసినట్టు సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది.
మక్కాలోని ఒక మసీదులో నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితీ అఖ్తర్ 'అశ్లీల చర్యలకు' పాల్పడ్డారని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ చెప్పినట్టు సౌదీ అరేబియా ప్రభుత్వ వార్తా సంస్థ, సౌదీ ప్రెస్ ఏజెన్సీ (ఎస్పీఏ) పేర్కొంది.
భద్రతా అధికారులు వారిద్దరినీ అరెస్టు చేసి సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచినట్టు ఒక సౌదీ అధికారి తెలిపారు.
నజ్రుల్ ఇస్లాం అబ్దుల్ బషీర్, సితీ అఖ్తర్లకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ ఇద్దరికీ ఉరిశిక్ష అమలుచేసేముందు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని జెడ్డాలోని బంగ్లాదేశ్ కాన్సులేట్ తెలిపింది.
ఈ విషయాన్ని అధికారికంగా నిర్ధరించాలని సౌదీ అధికారులను కాన్సులేట్ కోరింది.

"మంత్రిత్వ శాఖ దీనిపై ముందుగా సమాచారం ఇవ్వలేదు" అని బంగ్లాదేశ్ రాయబార కార్యాలయ అధికారి ఒకరు 'ది డైలీ స్టార్' పత్రికకు తెలిపారు.
"ఈ విషయంపై మేం సౌదీ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒక అధికారిక దౌత్య లేఖను పంపి ఘటనను అధికారికంగా ధ్రువీకరించాలని కోరాం" అని ఆ అధికారి చెప్పారు.
ఈ కేసు తీవ్రత, మసీదు పవిత్రతకు భంగం కలిగించడం, దానికి సంబంధించిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని కోర్టు ఈ శిక్ష విధించిందని మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ కేసులో సౌదీ అధికారులు 'తాజీర్' (దేశద్రోహానికి శిక్ష) అనే శిక్షావిధానం కింద మరణశిక్ష అమలుచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
దిగువ కోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే దిగువకోర్టు తీర్పును సమర్థిస్తూ సుప్రీంకోర్టు మరణశిక్షను ఖరారుచేసింది.
ఈ తీర్పు అమలుపై రాజు ఆదేశం కూడా జారీ అయింది.
అయితే అశ్లీలచర్యలని ఆరోపిస్తున్న ఘటనలో అసలేం జరిగిందనే విషయాన్ని సౌదీ అధికారులు వెల్లడించలేదు.
ఈ ఘటన ఎప్పుడు జరిగిందో, మరణశిక్ష విధిస్తూ కోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీలు ఎప్పుడు దాఖలు చేశారో కూడా వివరాలు తెలపలేదు.
సౌదీ అరేబియాలోని స్థానిక వార్తాపత్రికలు కూడా ఈ విషయంపై వివరంగా ఏమీ ప్రచురించలేదు.
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసిన ప్రకటనలనే అవి ప్రచురించాయి.

ఫొటో సోర్స్, Getty Images
తాజీర్ అంటే ఏంటి? సౌదీ అరేబియా న్యాయ వ్యవస్థలో ఈ విధానంలో శిక్షలు ఎలా విధిస్తారు?
ఈ మరణశిక్షను తాజీర్ పద్ధతిలో అమలుచేశారని సౌదీ అరేబియా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
అయితే ఈ శిక్ష ఏ నిర్దిష్ట చట్టంలోని నిబంధన కింద విధించారనే విషయాన్ని సౌదీ అధికారులు వెల్లడించలేదు.
షరియా చట్ట సూత్రాలు, న్యాయమూర్తుల విచక్షణ ఆధారంగా సౌదీ అరేబియా కోర్టులు తీర్పులు ఇస్తాయని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
షరియా చట్టం ఇస్లాం మత సూత్రాలపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఖురాన్, సున్నత్ ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి.
ఇస్లామిక్ చట్టంలో నిర్దిష్ట శిక్షను నిర్ణయించని నేరాలకు న్యాయమూర్తి తన విచక్షణాధికారాన్ని ఉపయోగించి విధించే శిక్షను తాజీర్ అంటారు.
'తాజీర్' అనేది ఒక ప్రత్యేక చట్టం కాదని, ఇస్లామిక్ చట్టంలోని శిక్షల విభాగాల్లో ఇదొకటని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
నిర్దేశిత శిక్ష లేదా ప్రతీకార న్యాయం వర్గాల పరిధిలోకి రాని ప్రవర్తనకు శిక్షలు విధించే అధికారాన్ని ఇది న్యాయమూర్తులకు ఇస్తుంది.
ఈ విషయంలో నేర స్వభావాన్ని నిర్ణయించడంతో పాటు శిక్షను నిర్ణయించడంలోనూ సౌదీ న్యాయమూర్తులకు చాలా విచక్షణాధికారం ఉంది.
'తాజీర్' కింద అధికారిక హెచ్చరిక లేదా జరిమానా నుంచి జైలు శిక్ష వరకు విధించవచ్చు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మరణశిక్షను కూడా విధించవచ్చు.
సౌదీ అరేబియాలో అన్ని నేరాలు, వాటికి సంబంధించిన శిక్షలను వివరించే సమగ్రలిఖితపూర్వక శిక్షాస్మృతి లేదని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తెలిపింది.
అక్కడి న్యాయ వ్యవస్థ చాలావరకు షరియా సూత్రాలు, న్యాయమూర్తుల విచక్షణపై ఆధారపడి ఉంది.
2026 అక్టోబరు నాటికి అంటే ఈ సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో, సౌదీ అరేబియాలో 175 కంటే ఎక్కువ మందికి మరణశిక్ష అమలు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
20కిపైగా దేశాలకు చెందినవారికి మరణశిక్ష
ప్రపంచంలో అత్యధిక మరణశిక్షలు విధించే దేశాలలో సౌదీ అరేబియా ఒకటి.
ఈ ఏడాది మరణశిక్ష విధించినవారిలో ఎక్కువమంది విదేశీయులే. ఇరవైకిపైగా దేశాలకు చెందిన కనీసం 94 మంది విదేశీయులకు ఈ ఏడాది సౌదీఅరేబియాలో మరణశిక్ష అమలుచేశారు.
ఇటీవల సంవత్సరాల్లో సోషల్ మీడియా పోస్టులకు సౌదీ కోర్టులు దశాబ్దాల జైలు శిక్షలు విధించాయి. అయితే అప్పీళ్ల విచారణ సమయంలో ఈ శిక్షల్లో కొన్ని మారాయి.
సౌదీ అరేబియాకు సంప్రదాయంగా సమగ్రమైన లిఖితపూర్వక శిక్షాస్మృతి లేదు.
అనేక నేరాలు, వాటికి విధించాల్సిన శిక్షల గురించి చట్టంలో స్పష్టమైన ప్రస్తావనలేదు. ఇలాంటి కేసుల్లో న్యాయమూర్తులు షరియా చట్టాన్ని తాము అర్ధం చేసుకున్నవిధానం ఆధారంగా తీర్పులిస్తారు.
సౌదీ అరేబియాలో లిఖితపూర్వక చట్టాలు ఉన్నప్పటికీ అధికారులు ఎక్కువగా ఉగ్రవాద నిరోధక చట్టం, సైబర్ క్రైమ్ చట్టాల్లోని అస్పష్టమైన, విస్తృతపరిధి ఉన్న నిబంధనలను ఉపయోగిస్తుంటారు.
వీటిలో 'ప్రజా భద్రత', 'మతపరమైన విలువలు', 'ప్రజా నైతికత'కు భంగం కలిగించే చర్యలకు సంబంధించిన నిబంధనలున్నాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




























