‘అభిజీత్ దీప్కేకు కోర్టు షరతులు’.. సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు ఇంకా జ్యుడిషియల్ కస్టడీలోనే..

అభిజిత్ దీప్కే
ఫొటో క్యాప్షన్, అభిజీత్ దీప్కే
    • రచయిత, దుష్యంత్ కుమార్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

కాక్రోచ్ జనతాపార్టీ వ్యవస్థాకులు అభిజీత్ దీప్కే తాను పిలుపునిచ్చిన 'లెహరా దో తిరంగా'యాత్రలోపాల్గొనలేకపోయారు. మార్చ్ ప్రారంభంకాక ముందే ఆయనను ముందుజాగ్రత్తగా అదుపులోకి తీసుకున్నారు.

ఇవాళ ఆయన్ను మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, అక్కడి నుంచి స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్(ఎస్ఈఎం) ఎదుట హాజరుపరిచారు.

అనంతరం అభిజీత్ దీప్కే విడుదలయ్యారని, ఆ పార్టీ న్యాయ విభాగ అధిపతి రత్నా సింగ్ తెలిపారు .

విడుదలైన తర్వాత అభిజీత్ దీపక్ ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారని... బీబీసీ విలేకరి జుగల్ పురోహిత్ తెలిపారు.

కాగా అభిజీత్ దీప్కే విషయంలో ఎస్ఈఎం కోర్టు ఒక ఉత్తర్వు జారీ చేసిందని... కోర్టు కొన్ని షరతులను కూడా విధించిందని బార్ & బెంచ్ పేర్కొంది.

వామపక్ష విద్యార్థి సంఘం ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరాను కూడా శుక్రవారం సాయంత్రం(అక్టోబర్ 16) అదుపులోకి తీసుకున్నారుగానీ ఇవాళ తెల్లవారుజామున ఆమెను విడుదల చేశారు.

సీజేపీకి చెందిన మరో ఇద్దరు ప్రముఖ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. అనుమతి లేకుండా జంతర్ మంతర్‌లోకి ప్రవేశించినందుకు వారిని ఐదు రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు.

ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్న యువ నాయకులపై పోలీసులు చర్యలు తీసుకున్నప్పటికీ శుక్రవారం కన్నాట్ ప్లేస్, దాని పరిసర ప్రాంతాల్లో వందలాది మంది ప్రజలు గుమిగూడారు. వారిలో చాలామంది చేతుల్లో త్రివర్ణ పతాకాలున్నాయి. ఈ సమయంలో పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ప్రభుత్వం ముందు సవాల్

సుమారు 150 మందిని అదుపులోకి తీసుకున్నారని పోలీసు వర్గాలు తెలిపినట్టు ఇండియా టుడే వెల్లడించింది.

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో తాము చేపట్టిన ఉద్యమానికి అభిజీత్ దీప్కే 'సీజేపీ 2.0' అని పేరు పెట్టారు. కానీ ఈ ఉద్యమంలో కీలకంగా ఉన్న ముగ్గురు పెద్ద యువ నాయకులు జైలులో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇకపై ఈ ఉద్యమం ఎలా ముందుకు సాగుతుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇలాంటి ఉద్యమాలను ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనించాలని సీనియర్ జర్నలిస్ట్ రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడుతున్నారు.

''పోలీసుల చర్యల వల్ల ఈ ఉద్యమానికి మరింత ఊపు, కొత్త దిశ లభించే అవకాశముంది. ఒక రాజకీయ ఉద్యమంపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటే అది మరింత బలపడే అవకాశం ఉంటుంది" అని ఆయన విశ్లేషించారు.

''కాక్రోచ్ జనతా పార్టీ ఆవిర్బావం విభిన్నంగా జరిగింది. పేపర్ లీక్ వంటి సమస్యలను ఆ పార్టీ లేవనెత్తింది. అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత ఆ పార్టీ నిరసనల్లో పాల్గొన్నారు.

"2014 నుంచి మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి రాజకీయ నిరసనలొచ్చినా ప్రభుత్వం నక్సలైట్లు, విదేశీ శక్తులు లేదా దేశ వ్యతిరేక కార్యకలాపాలతో ముడిపెట్టి వాటి ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించింది.

కానీ జూలై నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ఈ ఉద్యమాన్ని ఒక నిర్దిష్టవర్గానికి లేదా రాజకీయధోరణికి చెందినదిగా చిత్రీకరించలేకపోయింది. ఈ ఉద్యమాన్ని నియంత్రించడంలో తొలిసారి ప్రభుత్వం విఫలమైందని చెప్పొచ్చు. అయితే ఇది యువతకు సంబంధించిన విషయం కాబట్టి ప్రభుత్వం ఎలాంటి అవకాశాన్ని వదులుకోవాలనుకోడం లేదు'' అని రషీద్ కిద్వాయ్ అభిప్రాయపడ్డారు.

సీజేపీ, నిరసన, అభిజిత్ దీప్కే, నేహాబోరా, రాజకీయ పార్టీలు
ఫొటో క్యాప్షన్, పలు ప్రజాసమస్యల గురించి యువత మాట్లాడుతోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

‘కఠిన చర్యల వల్ల పరిస్థితి మరింత కష్టంగా మారుతుంది’

కఠిన చర్యలవల్ల ఈ ఉద్యమాన్ని అరికట్టడం ప్రభుత్వానికి మరింత కష్టమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

"ఇలాంటి నిరసనలు జరిగినప్పుడు లేదా ప్రభుత్వం ఇలాంటి కఠిన చర్యలు తీసుకున్నప్పుడు ప్రభుత్వానికి పరిస్థితి మరింత కష్టమవుతుంది. ఇప్పుడు ఈ ఉద్యమాన్ని అంత సులభంగా అణచివేయలేకపోవచ్చు" అని సీనియర్ జర్నలిస్ట్ లవ్ కుమార్ మిశ్రా విశ్లేషించారు.

''ఇది రాజకీయ అంశమే అయినప్పటికీ నిరసన చేస్తోంది విద్యార్థులు, యువత. ఈ నిరసనలను బంగ్లాదేశ్‌ ఉద్యమంతో పోలుస్తున్నప్పటికీ అప్పట్లో అక్కడి ప్రభుత్వాలు చాలా క్లిష్టమైన దశలో ఉన్నాయి. భారత్‌లో పరిస్థితి భిన్నంగా ఉంది. భారతదేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చాలా బలంగా ఉంది" అని తెలిపారు.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా విధానానికి వ్యతిరేకంగా 2024 జూలైలో విద్యార్థుల నిరసనలు ప్రారంభమయ్యాయి.

ఆ తర్వాత ఆ నిరసనలు షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమంగా మారింది. 2024 ఆగస్టు 5న షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం వీడాల్సివచ్చింది.

అదేవిధంగా అవినీతికి, సోషల్ మీడియాపై ఆంక్షలకు వ్యతిరేకంగా 2025 సెప్టెంబర్‌లో నేపాల్‌లో 'జెన్ జెడ్' యువత ఉద్యమం చెలరేగింది. హింసాత్మక నిరసనల తర్వాత ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రాజీనామా చేశారు. మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీల కార్కి నాయకత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది.

"వీళ్లు యువకులు. జెండానే కదా ఎగురవేస్తున్నారు. అందులో ఇబ్బంది ఏముంది? ఈ యువత పోరాటం రాజకీయమైనది కాదు. నీట్, పేపర్ లీక్ వంటి సమస్యలను వీళ్లు లేవనెత్తారు" అని బీబీసీ హిందీ కార్యక్రమం 'దిన్‌భర్' లో పాల్గొన్న సీనియర్ రాజకీయ విశ్లేషకురాలు మనీషా ప్రియమ్ అన్నారు.

"ఈ యువత ఏ చట్టాన్ని ఉల్లంఘించడం లేదు. పోలీసులు వారిని ఎలా కొడుతున్నారో అందరూ చూస్తున్నారు. పోలీసులు యువతను కొడుతున్నారు. వారు దానికి వ్యతిరేకంగా కొంచెం మాట్లాడినా, కోర్టు ధిక్కారంగా పరిగణిస్తున్నారు"

"ఏ ప్రభుత్వమూ యువతలో భావోద్వేగాలను దెబ్బతీయకూడదు. దానికి బదులుగా యువత లేవనెత్తుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి" అని అన్నారు.

సీజేపీ, నిరసన, అభిజిత్ దీప్కే, నేహాబోరా, రాజకీయ పార్టీలు
ఫొటో క్యాప్షన్, నేహాబోరాను శనివారం(అక్టోబర్ 17)ఉదయం పోలీసులు విడిచిపెట్టారు.

అభిజీత్ దీప్కేను పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకున్నారు?

శుక్రవారం సాయంత్రం 5 గంటలకు కన్నాట్ ప్లేస్‌లోని సెంట్రల్ పార్క్‌లో 'లెహరా దో తిరంగా' కార్యక్రమానికి సీజేపీ పిలుపునిచ్చింది.

అభిజీత్ దీప్కే బస చేసిన ఇంటికి శుక్రవారం ఉదయం వచ్చిన పోలీసులు మార్చ్‌లో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేశారు. కన్నాట్ ప్లేస్‌ దగ్గరకు ప్రజలు రావాలని పిలుపునిచ్చిన అభిజీత్ దీప్కే చట్టపరమైన అనుమతితీసుకోలేదని ఆ నోటీసులో ఉంది.

ఆ తర్వాత సాయంత్రం సుమారు 4:50 గంటలకు అభిజీత్ ఇంటి నుంచి బయటకురాగానే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అభిజీత్‌ను నైరుతి దిల్లీలోని జాఫర్‌పూర్ కలాన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లినట్టు పోలీసు వర్గాలు చెప్పినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పేర్కొంది .

అయితే అభిజీత్ ఎక్కడున్నారనే సమాచారం తమకు ఇవ్వడం లేదని, లాయర్లతో మాట్లాడేందుకు కూడా అనుమతించడం లేదని సీజేపీ తర్వాత ఆరోపించింది.

సీజేపీ, నిరసన, అభిజిత్ దీప్కే, నేహాబోరా, రాజకీయ పార్టీలు
ఫొటో క్యాప్షన్, సీజేపీ కీలక నేతలను పోలీసులు పలుమార్లు అదుపులోకి తీసుకున్నారు.

జ్యుడీషియల్ కస్టడీలో సౌరవ్, అశుతోశ్

సీజేపీ కార్యకర్తలు 14మంది అక్టోబర్ 13న జంతర్ మంతర్‌కు వెళ్లారు. వారిలో సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా, అజింక్య షిండే కూడా ఉన్నారు.

నిరసన ప్రదేశాల జాబితా నుంచి జంతర్ మంతర్‌ను తొలగించి, అక్కడ భారీ బారికేడ్లు ఏర్పాటు చేసినప్పటికీ ఒక ప్రైవేట్ ప్రాంగణం గుండా వాళ్లు లోపలికి ప్రవేశించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

సౌరవ్, అశుతోష్‌లు పదేపదే చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, సోషల్ మీడియా ద్వారా ఇతరులను కూడా అలాంటి కార్యకలాపాలకు ప్రేరేపించేందుకు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

ఇద్దరినీ ప్రత్యేక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. వాళ్లను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీ కోసం తీహార్ జైలుకు పంపారు. సీజేపీ మరోనేత అజింక్య షిండేను ఐదువేల రూపాయల బాండ్‌పై విడుదల చేశారు. ఏడాదిపాటు శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి కార్యకలాపాల్లోనూ పాల్గొనకూడదనే షరతు విధించారు.

సీజేపీ, నిరసన, అభిజిత్ దీప్కే, నేహాబోరా, రాజకీయ పార్టీలు
ఫొటో క్యాప్షన్, అహింసామార్గంలో తాము నిరసనలు చేపడుతున్నామని సీజేపీ అంటోంది.

‘అధికార మార్పిడికి ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి’

బంగ్లాదేశ్ తరహాలో అధికార మార్పిడికి ప్రయత్నించేందుకు ప్రతిపక్షాలు యువతను వాడుకుంటున్నాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు.

ఎన్నికల సంస్కరణలు, ఎస్ఐఆర్ లేదా యువత భవిష్యత్తు కోసమో ప్రతిపక్షాలు పోరాడడం లేదని, అరాచకాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు.

"ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారానే అధికారంలోకిరావాలి. గందరగోళం సృష్టించడం ద్వారా కాదు" అని నితిన్ నబీన్ అన్నారు.

అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించి సమాధానాలు అడగడం గందరగోళం సృష్టించడం కాదని, అది ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు అని అభిజీత్ దీప్కే అన్నారు.

"శాంతియుత నిరసనల వల్ల వ్యాపారాలు దెబ్బతినవు. ఇంటర్నెట్‌ను నిలిపివేయడం, ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించడం, నగరాన్ని మూసేయడం వంటి ప్రభుత్వ చర్యల వల్లే వ్యాపారాలపై ప్రభావం పడుతోంది" అని ఆయన అన్నారు.

తాము మహాత్మా గాంధీ చూపిన శాంతి, అహింసా మార్గంలో నడుస్తున్నామని సీజేపీ చెబుతోంది.

సీజేపీ, నిరసన, అభిజిత్ దీప్కే, నేహాబోరా, రాజకీయ పార్టీలు
ఫొటో క్యాప్షన్, అధికారమార్పిడి కోసం ప్రతిపక్షాలు యువతను రెచ్చగొడుతున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది.

ఈ ఉద్యమంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందా?

"విచిత్రం చూడండి.... దిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో జెండా ఎగరేయాలనుకునేవారిపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం మోదీ పాలనలో జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా?" అని రషీద్ కిద్వాయ్ ప్రశ్నించారు.

''ప్రభుత్వం కాక్రోచ్ జనతా పార్టీతో కఠినంగా వ్యవహరిస్తోంది. అదే రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తే ఆయనను సుప్రీంకోర్టువరకు కూడా వెళ్లేందుకు అనుమతిస్తున్నారు'' అని ఆయన అన్నారు.

"కొన్నిసార్లు మన రాజకీయ ప్రత్యర్థుల వల్లే మనం పురోగమిస్తామని మహాత్మా గాంధీ అంటారు. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీతో బీజేపీ కఠినంగా వ్యవహరించడం వెనక ముందస్తు రాజకీయ వ్యూహం ఉందా లేక మరేదైనా కారణం ఉందా అనేది చూడాలి'' అని ఆయన చెప్పారు.

"ప్రభుత్వం ఈ నిరసనలు ముగిసిపోవాలని కోరుకుంటుంది. కానీ విద్యార్థులు ఉద్యమం కొనసాగాలని భావిస్తారు. ఈ ఉద్యమంపై చర్చలు జరిపేలా ప్రభుత్వం ముందుకు రావాల్సి ఉంటుంది" అని అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)