సీజేపీ: బాండ్‌పై సంతకం చేస్తే నిరసనలకు దూరంగా ఉంచగలరా? చట్టం ఏం చెబుతోంది?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అర్షద్ మిసాల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 4 నిమిషాలు
శనివారం నాడు విమానంలో పోలీసులు అదుపులోకి తీసుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, కో-కన్వీనర్ అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను ఆదివారం నాడు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.
వారి నుంచి 50, 000 రూపాయల పూచీకత్తుతో కూడిన బాండ్స్ తీసుకొని వారిని మేజిస్ట్రేట్ విడుదల చేశారు. కొన్ని షరతులు కూడా విధించారు.
అయితే నిరసనలు చేయకుండా అడ్డుకునే ఎలాంటి బాండ్స్‌పై తాను సంతకం చేయలేదని అభిజిత్ దీప్కే ప్రకటించారు.
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 10న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనలకు సీజేపీ పిలుపునిచ్చింది.
దీంతో ఈ ముగ్గురు సీజేపీ నేతలు శనివారం నాడు ముంబై నుంచి విమానంలో వచ్చారు. వారంతా విమానం నుంచి దిగే లోపు దిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

"బీఎన్‌ఎస్‌లోని సెక్షన్ 126, 170 ప్రకారం అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్‌ను ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నాం. అన్ని చట్టపరమైన విధానాలు పాటించి వారిని కంటోన్మెంట్‌లోని స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ కోర్టులో అక్టోబర్11న హాజరుపరిచాం" అని దిల్లీ పోలీసులు ఆదివారం ఎక్స్‌లో వెల్లడించారు.
"శాంతిభద్రతలను కాపాడడానికి మంచి ప్రవర్తనతో ఉంటామని చెబుతూ సంవత్సరం చెల్లుబాటు అయ్యేలా 50వేల రూపాయల పూచీకత్తుతో కూడిన బాండ్‌ను కోర్టు సూచించింది. అనంతరం వారిని విడుదల చేశారు" అని పోలీసులు పేర్కొన్నారు.
బీఎన్ఎస్ఎస్‌లో సెక్షన్ 126, 170 ఏం చెబుతున్నాయి?
ముగ్గురు సీజేపీ నేతలపై భారతీయ నాగరిక్ సురక్షా సంహిత(బీఎన్‌ఎస్ఎస్)లోని సెక్షన్ 126, 170 ప్రకారం చర్యలు తీసుకున్నారు.
సెక్షన్ 126 (శాంతిభద్రతల కోసం భద్రతా బాండ్) ప్రకారం, ఒక వ్యక్తి శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని లేదా ప్రజాశాంతికి భంగం కలిగించే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ భావిస్తే, వివరణ ఇవ్వాలని షోకాజ్ నోటీసు ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు. అవసరమైతే, శాంతిని కాపాడుతానని హామీ ఇస్తూ ఒక బాండ్ సమర్పించాలని కూడా ఆదేశించవచ్చు.
"ఒక వ్యక్తి నిర్ణయించిన కాలంలో శాంతిభద్రతలను పాటించేలా చూడటానికి ఈ బాండ్ తీసుకుంటారు. ఒకవేళ ఆ వ్యక్తి బాండ్‌లోని షరతులను ఉల్లంఘిస్తే, చట్టంలో ఉన్న విధానం ప్రకారం బాండ్ మొత్తాన్ని జప్తు చేయవచ్చు" అని సుప్రీంకోర్టు న్యాయవాది నిపుణ్ సక్సేనా అన్నారు.
ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తనకు చట్టం కల్పించిన అధికారాల ప్రకారమే సీజేపీ నాయకులపై చర్యలు తీసుకున్నారని సక్సేనా చెప్పారు.
"ఒక ప్రాంతంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని అధికారులు అనుమానించారు. అందుకే శాంతిని కాపాడుతానని హామీ ఇస్తూ ఆయనతో ఒక బాండ్‌పై సంతకం చేయించారు" అని తెలిపారు.
"సెక్షన్ 126, 170 కింద చర్యలు తీసుకునే ముందు సంబంధిత వ్యక్తులు కాగ్నిజబుల్ అఫెన్స్ చేసే అవకాశం ఉందని మేజిస్ట్రేట్‌కు పోలీసులు తెలియజేయాలి. ఆ తర్వాత అలాంటి నేరాన్ని నివారించేందుకు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడానికి మేజిస్ట్రేట్ అనుమతి కోరుతారు. దీంతో సదరు వ్యక్తులను అదుపులోకి తీసుకోవచ్చు" అని సక్సేనా వివరించారు.
ఏమైనా సరే, నిర్బంధం 24 గంటలకు మించకూడదు. అందుకే అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు 24 గంటల్లోపే మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.

ఫొటో సోర్స్, UGC
ఇతర నిరసనకారులపై ఏ సెక్షన్ కింద చర్యలు తీసుకున్నారు?
దిల్లీలో అక్టోబర్ 10న నిరసన తెలిపిన మిగతా నిరసనకారులను కూడా పోలీసులు నిర్బంధించారు. కానీ ఎలాంటి బాండ్స్ తీసుకోకుండానే విడుదల చేశారు.
"ఇలాంటి సందర్భంలో సెక్షన్ 172 కింద చర్యలు తీసుకుంటారు. ఈ సెక్షన్‌లోని సబ్ సెక్షన్ (2) ప్రకారం పోలీసులు, లేదా అధికారులు ఇచ్చిన చట్టబద్ధమైన ఆదేశాలు పాటించకపోతే, సంబంధిత వ్యక్తిని అదుపులోకి తీసుకోవచ్చు" అని సక్సేనా చెబుతున్నారు.
"ఎవరినైనా ఇలా అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు వారిని ఆ ప్రదేశం నుంచి మరో చోటుకు తరలించి అక్కడ విడుదల చేయవచ్చు" అని పేర్కొన్నారు.
అలాంటి సందర్భంలో బాండ్లు అవసరం లేదని ఆయన అంటున్నారు. దీనినే సింప్లిసిటర్ డిటెన్షన్ అంటారని వివరించారు.
శని, ఆదివారాల్లో ఏఐఎస్ఏ అధ్యక్షురాలు నేహా బోరా సహా పలువురు నిరసనకారులను ఈ సెక్షన్ కిందే అదుపులోకి తీసుకొని విడిచి పెట్టారు.

ఫొటో సోర్స్, UGC
బాండ్ చెల్లించిన తర్వాత సీజేపీ నాయకులు నిరసనల్లో పాల్గొనవచ్చా?
సీజేపీ నాయకులు గతంలో కూడా శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా ఎలాంటి చర్యలకు పాల్పడలేదని నిపుణ్ సక్సేనా అన్నారు.
"ఇంతకు ముందు కూడా దేనినైనా ధ్వంసం చేయాలని, చట్టాన్ని ఉల్లంఘించాలని పిలుపునివ్వలేదు. తమ రాజ్యాంగ హక్కులను ఉపయోగించుకొని శాంతియుతంగా నిరసనలు చేయాలని మాత్రమే ప్రజలను కోరారు" అని ఆయన తెలిపారు.
"నా అభిప్రాయం ప్రకారం, మొదట తీసుకున్న చర్యే చట్టపరంగా నిలబడే అవకాశం లేదు. అందువల్ల దానిని కోర్టులో సవాలు చేయవచ్చు" అని చెప్పారు.
గతంలో కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద అభిజిత్ దీప్కే ఆందోళన చేపట్టారు. ఆ నిరసనల కారణంగానే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
సాధారణ పౌరులు మాదిరిగానే అభిజిత్ దీప్కే, అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్ కూడా ఆందోళనల్లో, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు అని నిపుణ్ సక్సేనా పేర్కొన్నారు.
విడుదలైన తర్వాత ఆదివారం నాడు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా మీడియా సమావేశం నిర్వహించారు. అయితే సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే మాత్రం అందులో పాల్గొనలేదు. నాన్నమ్మ మరణించడంతో ఆయన తన స్వస్థలానికి వెళ్లారు.
ఈ సందర్భంగా తమను అదుపులోకి తీసుకున్న ఘటనపై కూడా సీజేపీ నాయకులు మాట్లాడారు.
మీడియా సమావేశంలో అశుతోష్ రాంకా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేశారు. "భారతదేశ చరిత్రలో నరేంద్ర మోదీ అత్యంత పిరికి ప్రధానమంత్రి" అని అభిప్రాయపడ్డారు.
"నీరవ్ మోదీ, విజయ్ మాల్యాను దేశం దాటించిన ఇదే ప్రభుత్వం మమ్మల్ని మాత్రం విమానం లోపల నుంచే బయటకు దింపింది" అని సౌరవ్ దాస్ ఆరోపించారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























