ప్రధాని మోదీ ముందున్న 10 సవాళ్లు ఏంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ
- హోదా, ఎడిటర్, బీబీసీ న్యూస్ హిందీ
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
గత కొద్దిరోజులుగా ప్రధాని నరేంద్ర మోదీ అధికార పగ్గాలు చేపట్టి 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారనే చర్చ జరుగుతోంది.
మొదట ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆ తర్వాత భారత ప్రధానిగా 25 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్నారు. ఓ పక్క మోదీ మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు, మోదీ మంత్రివర్గం ఆయనను ప్రశంసిస్తూ ఒక తీర్మానాన్ని కూడా ఆమోదించింది.
కానీ మరోవైపు.. విమర్శకులు మోదీ పాతికేళ్ల ప్రజా జీవితంలో ప్రతి అంశాన్ని నిశితంగా గమనిస్తూ, ఆయనను సమీక్షిస్తున్నారు. మోదీ, జవహర్ లాల్ నెహ్రూ మినహా దేశంలో మరెవరూ ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టలేదు.
సాధారణంగా, ఈ మూడో టర్మ్ అంటే సవాళ్లు ఎక్కువవడం మొదలయ్యే సమయం. మరోపక్క అసమ్మతి కూడా పెరుగుతుంది. పాత నిర్ణయాలతోపాటు అనేక ఇతర కొత్త నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ నిర్ణయాన్ని ప్రత్యేక దృష్టితో చూడటంతో మొదలుపెట్టి, విస్తృతంగా చూడటం కూడా మొదలయ్యే సమయమిది.
ప్రస్తుతం, నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా నిలుస్తున్న ఆ పది అంశాలేంటో బీబీసీ హిందీ ఎడిటర్ నితిన్ శ్రీవాస్తవ అందిస్తున్న కథనంలో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
1. ఎన్నికల వ్యవస్థ..
ఇది మొదటి అంశం.. దేశంలోని అతిపెద్ద ఎన్నికల వ్యవస్థ అంటే ఎన్నికల సంఘంతో ప్రారంభమవుతుంది. గత కొంతకాలంగా దీని విశ్వసనీయతపై నిరంతరం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికల నిష్పాక్షికతపై ప్రజల మనస్సుల్లో సందేహాలు పుట్టుకురావడం ప్రారంభమైంది.
పరిస్థితి ఎక్కడి వరకూ వచ్చిందంటే... ఈ వ్యవస్థలో నమ్మదగిన వ్యక్తులుగా భావించే ఇద్దరు సివిల్ సర్వెంట్లు అంటే ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నిర్ణయాలపై తమ అభిప్రాయబేధాల్ని వ్యక్తం చేస్తూ క్యాబినెట్ సెక్రటరీ తలుపు తట్టే స్థాయికి చేరుకుంది.
ఆ తర్వాత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో దిల్లీ సహా దేశంలోని అనేక నగరాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్‌పై వస్తున్న ఆరోపణలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందన కోసం ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్‌తోపాటు దేశ ప్రజలు కూడా ఎదురుచూస్తున్నారు.
2. ఆర్థిక వ్యవస్థ, జీడీపీ
ఇక రెండో అంశం... దేశ ఆర్థిక వ్యవస్థలో అతిపెద్ద మీటర్.. అంటే జీడీపీకి సంబంధించినది. దేశ జీడీపీ గణాంకాల వాస్తవికతపై జాతీయ స్థాయిలో చర్చను రేకెత్తించింది ఏదో పెద్ద ప్రభుత్వ శాఖ కాదు, ఒక పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగి . ఆయన రేకెత్తించిన ఆ చర్చ అందరినీ కుదిపేసింది. ప్రభుత్వ వాదనలకు, క్షేత్రస్థాయి వాస్తవికతకు మధ్య ఉన్న ఈ వ్యత్యాసం ఆర్థికవేత్తలతోపాటు, సామాన్యులను కూడా ఆలోచింపజేసేలా చేసింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి నిరంతరం బలహీనపడుతున్న తరుణంలో ప్రభుత్వం చేసిన వాదనలలో ఎంత నిజముందో అర్థికవేత్తలతోపాటు సామాన్యులను కూడా ఆలోచించేలా చేసింది.
స్టాక్ మార్కెట్లు నిరంతరం అనిశ్చితితో నిండిపోతున్నాయి. విదేశీ పెట్టుబడులు కూడా వేగంగా తగ్గుతున్నాయి, మరి ఇలాంటి పరిస్థితుల్లో విడుదల చేసిన జీడీపీ గణాంకాలు సరైనవని ప్రజలను ఎలా ఒప్పించగలరనేది ఇప్పుడు ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది.

ఫొటో సోర్స్, Getty Images
3.ద్రవ్యోల్బణం
ఇక మూడో అంశం.. నేరుగా మీ జేబుకు సంబంధించినది. ద్రవ్యోల్బణం సుమారు మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని ఆర్బీఐ స్వయంగా చెబుతోంది. పైగా, రూపాయి బలహీనపడుతోంది. ధరలు పెరుగుతున్నాయి. భారతీయ బ్యాంకులు విదేశాల నుంచి డిపాజిట్లను సేకరించాయి.
అంటే దీనిని మీరు ఎలా చూడాలంటే.. మీరు చాలా కష్టపడి చదివినా సరే. పరీక్షలో మార్కులు తక్కువగా వచ్చినట్లుగా పరిస్థితి ఉంది. అంటే కష్టపడి పనిచేసినా సరే.. దాని ఫలితం మాత్రం కనిపించదు. ద్రవ్యోల్బణం మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది,
టీ, పెట్రోల్, ఇంకా కిరాణా వంటి రోజువారీ అంశాలు కూడా ఖరీదైనవిగా మారిపోతున్నప్పుడు, ప్రభుత్వంపై పెరిగే ప్రజాగ్రహాన్ని ఈ ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందనేది చూడాలి.

ఫొటో సోర్స్, Hindustan Times via Getty Images
4.రాజకీయ ప్రతిపక్షాలు
నాలుగో అంశం రాజకీయ పరిస్థితులు. ప్రస్తుత ప్రతిపక్షాలు, ముఖ్యంగా రాహుల్ గాంధీ, ఆయన దూకుడుగా ముందుకెళ్తున్న వైఖరి ప్రభుత్వానికి ఇబ్బందులను పెంచింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు.
మరోవైపు, ఈ అంశంపై మీడియా నుంచి సోషల్ మీడియా వరకూ పెద్దయెత్తున చర్చ జరుగుతోంది.

ఫొటో సోర్స్, Bloomberg via Getty Images
5.యువత, సామాజిక సమస్యలు
ఇక ఐదో అంశంగా మనం చెప్పుకోవాల్సింది దేశంలోని యువత, సామాజిక సమస్యల గురించి. నేటి యువత ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ నిర్ణయాలను బహిరంగంగా ప్రశ్నిస్తోంది. రైట్ వింగ్ మద్దతుదారులు ఆన్లైన్, ఆఫ్‌లైన్‌లో ముందుకొచ్చి నిలువరించే ప్రయత్నం చేసినప్పటికీ.. యువత తమ దూకుడును ఆపేందుకు సిద్ధంగా లేదు.
నీట్ పరీక్ష సమస్యల నుంచి మొదలుపెడితే, ప్రభుత్వ పాఠశాలల దుస్థితి వరకు.. ప్రతి అంశంపైనా ఎజెండాను సోషల్ మీడియా ద్వారానే సెట్ చేస్తున్నారు. నీట్ పరీక్ష వివాదాల తరువాత, దేశం నలుమూలల నుంచి విద్యార్థులు వీధుల్లోకి వచ్చి విద్యావ్యవస్థ పారదర్శకతను ప్రశ్నించడం చూశాక.. ఇకపై యువతలో ఉన్న కోపాన్ని విస్మరించలేమని చెప్పడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది.
దిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర వారాల తరబడి నిరసనలు చేసి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేలా చేయడం ప్రతిపక్షాలు ఒక పెద్ద విజయంగా భావిస్తున్నాయి.
6.ఎన్డీయే కూటమిలో రాజకీయాలు
ఇక ఆరో అంశం.. ఎన్డీయే కూటమి అంతర్గత రాజకీయాలు ఇప్పుడు తెరపైకి వస్తుండడం. కూటమిలోని చిన్న మిత్రపక్షాలు కూడా ప్రభుత్వంపై గళం విప్పడం మొదలుపెట్టాయి. ఇది విస్మరించలేని విషయం.
బిహార్‌లో చిరాగ్ పాశ్వాన్ వంటి చిన్న మిత్రపక్షాలు శాంతిభద్రతల సమస్యపై నేరుగా ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. మరోవైపు, ఓం ప్రకాష్ రాజ్బర్ ఉత్తర్ ప్రదేశ్‌లోని అనేక ప్రాంతాల విభజన గురించి ప్రధానితో మాట్లాడిన విషయాన్ని మీడియా ముందు చెప్పుకొస్తున్నారు.
కానీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా ఈ అంశానికి వ్యతిరేకంగా ఉన్నారు. సంకీర్ణ భాగస్వాములు ఒకరికొకరు బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నప్పుడు, వారిని సమన్వయం చేయడానికి ప్రభుత్వానికి మరికొంచెం ఎక్కువ ప్రయత్నం అవసరమన్నది స్పష్టమవుతోంది.
7. ప్రభుత్వ ఇమేజ్
ఇక ఏడో పాయింట్.. ఒకప్పుడు అత్యంత నిర్ణయాత్మకంగా భావించిన ప్రభుత్వ ప్రతిష్ఠ గురించి చెప్పుకోవాలి. కానీ, ఇప్పుడు ఈ పరిస్థితి మారిపోయింది. డీలిమిటేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లాలా వద్దా అన్న అంశంపై నెలల తరబడి గందరగోళం నెలకొంది.
చెరకు నుంచి తయారైన ఇథనాల్‌ను ఇంధనంగా ఉపయోగించాలనే విధానపరమైన అంశంపై గందరగోళం నెలకొన్నప్పుడు కూడా చాలా మంది దీనిని నిర్ణయంలో జాప్యంగానే చూశారు.
8. క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ
ఇక ఎనిమిదో అంశం క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ. మంత్రివర్గంలో పెద్ద ఎత్తున మార్పు జరుగుతుందని, లేదా ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేస్తారని చాలా కాలంగా చర్చ జరుగుతోంది.
కానీ ఈ అంశంలో కనిపించిన దీర్ఘకాల తాత్సారం, ప్రతికూల ప్రభావితం చూపుతోంది. ముఖ్యమైన మంత్రిత్వ శాఖలలో శాశ్వత, ఫుల్ టైం నాయకత్వం లేకపోవడం వల్ల, విధాన స్థాయిలో చాలాసార్లు అవసరమైన వేగం లేకపోవడం మాత్రమేకాదు, ఇది ఆయా వ్యవస్థల పనితీరును కూడా నేరుగా ప్రభావితం చేస్తుందన్నది ఆలోచించాలి.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా మంత్రివర్గం, పదవుల గురించి తరచుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
9.దేశంలో పెట్టుబడులు
ఇక తొమ్మిదో అంశం.. దేశంలో పెట్టుబడిదారులు, మధ్యతరగతికి సంబంధించినది. ఒకవైపు, అమెరికా, యూరప్, జపాన్, దక్షిణ కొరియా, చైనా వంటి ప్రపంచ సహచరుల స్టాక్ మార్కెట్లు రికార్డులు బద్దలు కొడుతున్నాయి.
కానీ, మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రస్తుతం భారత్ స్టాక్ మార్కెట్ విలువలు నిరంతరం క్షీణిస్తున్నాయి. మార్కెట్లు నిరంతర మందగమనాన్ని చవిచూస్తున్నాయి. కోట్లాది మధ్యతరగతి ప్రజలు తాము కష్టపడి సంపాదించిన డబ్బును సిప్‌లలో పెట్టుబడి పెట్టారు.
ప్రభుత్వం కూడా వారి ఈ అలవాటును ప్రశంసించింది. కానీ, ఇప్పుడున్న సమస్యను విస్మరించడం అంటే.. కూర్చున్న కొమ్మను నరుక్కోవడం లాంటిదే అని గుర్తించాలి. అంటే విదేశీ పెట్టుబడిదారులు అంటే ఎఫ్‌పీఐలు భారత మార్కెట్ నుంచి పారిపోతున్న వేగం భయపెడుతుంటే, మరోవైపు, సాధారణ రిటైల్ పెట్టుబడిదారులు భారీ నష్టాలను చవిచూస్తున్నారు. ఈ అంశంపై నిర్ణయాత్మక చర్యలు తీసుకోకపోవడం పెద్ద సమస్యగా నిలుస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
10.అంతర్జాతీయ సంబంధాలు
ఇక చివరిది, పదో అంశం... అంతర్జాతీయ సంబంధాల గురించి చెప్పుకోవాల్సిందే. ఈ రోజు ప్రపంచంలో భారత్ పరిస్థితి గత కొన్ని దశాబ్దాలలో ఉన్నట్లుగా లేదు. డోనల్డ్ ట్రంప్ రెండోసారి అమెరిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి భారతదేశ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి నిర్ణయాలను ప్రతిరోజూ బహిరంగంగా సవాల్ చేస్తున్నారు.
ఇది కాకుండా, యుక్రెయిన్ యుద్ధం, మండుతున్న మిడిల్ ఈస్ట్, క్షీణిస్తున్న ఇంధన మార్కెట్లు, ఇంకా పాకిస్తాన్ చేతుల్లో ఉన్న దౌత్యపరమైన అంశాలు భారతదేశానికి ఇబ్బందులు పెంచాయి. వాణిజ్య సుంకాలు లేదా వ్యూహాత్మక విషయాలపై ప్రపంచ అగ్రరాజ్యాల నిరంతర ఒత్తిడి ఉన్నప్పుడు, దేశ విదేశాంగ విధానం, దౌత్యపరమైన అంశాల ముందు చాలా పెద్ద ప్రశ్నలు తలెత్తుతాయి.
దక్షిణాసియాలో బంగ్లాదేశ్ , నేపాల్, మాల్దీవులు లేదా శ్రీలంక అయినా, ఈ దేశాలన్నింటి విదేశాంగ విధానంలో భారత్ పరపతి తగ్గిందని చాలామంది నిపుణులు ఇప్పటికీ ప్రశ్నిస్తున్నారు.
బ్రిటన్ మాజీ ప్రధాని విన్స్టన్ చర్చిల్ 1935లో ఒక ప్రసంగంలో ఇలా అన్నారు, "మీరు చరిత్రను ఎంత లోతుగా అర్థం చేసుకుంటే, మీరు భవిష్యత్తును అంత బాగా చూడగలరు." రాజకీయాల్లో ఇలాంటి ప్రకటనలు, ఇలాంటి అంతర్దృష్టి ఎప్పుడూ కొనియాడేలా ఉంటుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























