తనిఖీలు,నిర్బంధాలు,ఇంటర్‌నెట్ బంద్, ఎక్కడికక్కడ బారికేడ్లు.. దిల్లీలో ఇప్పటిదాకా ఏం జరిగింది, బీజేపీ ఏమంది?

ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, దిల్లీలో నిరసనకారులను అదుపులోకి తీసుకున్న భద్రతా దళాలు
ప్రచురణ
చదివే సమయం: 5 నిమిషాలు

ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతాన్ని పోలీసులు దిగ్భంధించారు. ఎక్కడికక్కడ బారికేడ్లు అడ్డుపెట్టారు. నిరసనకారులను అదుపులోకి తీసుకోవడం కొనసాగిస్తున్నారు.

శుక్రవారం రాత్రి నుంచే దిల్లీ పోలీసులు, పారామిలటరీ బలగాలు జంతర్‌మంతర్‌ చుట్టూ కఠిన ఆంక్షలు విధించాయి.

దిల్లీ పోలీసులకు చుట్టపక్కల రాష్ట్రాల పోలీసులు సహకరించారు. రైళ్లు, బస్సులు, విమానాశ్రాయల్లో తనిఖీలు చేసి, నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేను విమానం దిగకముందే, పోలీసులే విమానంలోకి ప్రవేశించి దీప్కేను అదుపులోకి తీసుకున్నారు.

ఒక్క దిల్లీలోనే 25 వేల మంది పోలీసు, పారామిలిటరీ సిబ్బందిని మోహరించారని పీటీఐ వార్తా సంస్థ తెలిపింది.

వివిధ ప్రాంతాల నుంచి దిల్లీకి రావలసిన 245 రైళ్లను రద్దు చేసినట్టు వార్తలు వచ్చాయి. దిల్లీలో ఉన్న వారెవరూ జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకోకుండా ఉండేందుకు 45 మెట్రో స్టేషన్లను మూసివేశారు. ధర్నా చౌక్ పరిసరాల్లో, నాలుగు కిలోమీటర్ల పరిధిలో ఇంటర్‌నెట్ సేవలు నిలిపివేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

విమానంలోనే దీప్కే నిర్బంధం

'కాక్రోచ్ జనతా పార్టీ' తలపెట్టిన నిరసన నేపథ్యంలో, భద్రతా చర్యగా ఘజియాబాద్- దిల్లీ సరిహద్దు వద్ద భారీ బారికేడ్లను రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేశారు.

జంతర్‌మంతర్‌ జరిగే ఉద్యమంలో పాల్గొనడానికి శనివారం ఉదయం ముంబై నుంచి దిల్లీ వచ్చిన అభిజిత్ దీప్కే, సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాను పోలీసులు విమానంలోనే అదుపులోకి తీసుకున్నారని సీజేపీ ప్రకటించింది.

ఈ ముగ్గురు ప్రయాణిస్తున్న విమానం దిల్లీ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో లైవ్‌లోకి వచ్చారు. అదేసమయంలో పోలీసులు విమానంలోకి ప్రవేశించి వారిని అదుపులోకి తీసుకున్నారు.

దీప్కే మాట్లాడుతూ , "దేశం ఏ దిశగా వెళ్తోందో మీరు చూడవచ్చు. మమ్మల్ని విమానాల్లో నిర్బంధిస్తున్నారు, ఇందిరా గాంధీ కూడా ఇలా ఎప్పుడూ చేయలేదు. ఇది నియంతృత్వమే, కానీ మేం వారికి భయపడం" అన్నారు.

అభిజీత్, సౌరవ్, అశుతోష్‌లను అదుపులోకి తీసుకోవడానికి మహిళా పోలీసు అధికారులు ముందుకు వచ్చారు. ఈ సమయంలో, దీపక్, ఆయన సహచరులు మగ పోలీసు అధికారులను పంపాలని డిమాండ్ చేశారు.

దిల్లీ పోలీసుల తీరును ఖండించిన సీజేపీ తమ ముగ్గురు ప్రతినిధులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.

ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, జంతర్‌మంతర్ వద్ద మోహరించిన బలగాలు
ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, నిరసనకారులను అడుగడుగునా అడ్డుకున్న భద్రతా సిబ్బంది

ధ్రువ్ రాఠీ హౌస్ అరెస్టు

యూట్యూబర్ ధ్రువ్ రాఠీని కూడా పోలీసులు శనివారం ఉదయం హౌస్ అరెస్టు చేశారు. ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్న విషయాన్ని ఆయన సన్నిహితుడితోపాటు గురుగ్రామ్ పోలీసులు ధ్రువీకరించినట్టు బీబీసీ ప్రతినిధి దిల్‌నవాజ్ పాషా తెలిపారు. గురుగ్రామ్ సెక్టార్-56 నుంచి ధ్రువ్ రాఠీని అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ సమాచారం ఇచ్చింది.

శుక్రవారం రాత్రి ధృవ్ రాఠీ ఇండియా గేటు నుంచి ఒక పోస్టు పెట్టారు. తమవైపు జనం ఉన్నారని మోదీకి సమాచారం ఉందని అందుకే నిర్బంధం విధించారని ఆరోపించారు. "నేను దిల్లీ వచ్చాను. 50కి పైగా మెట్రో స్టేషన్లను మూసివేశారని, అనేక రైళ్లు, బస్సులు రద్దు చేశారని విన్నాను. నిరసన కారణంగా దిల్లీని లాక్‌డౌన్‌లో ఉంచుతున్నారు" అని ధ్రువ్ రాఠీ అన్నారు.

సీజేపీ న్యాయ వ్యవహారాలు చూసే రత్న సింగ్‌ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని సీజేపీ పేర్కొంది.

ఈ విషయంపై నిరసన చేస్తున్న న్యాయవాదులను కలవడానికి వెళ్తుండగా రత్నా సింగ్‌ను అదుపులోకి తీసుకున్నారని సీజేపీ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ తెలిపారు.

దిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ మాజీ అధ్యక్షుడు రౌనక్ ఖత్రిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారని పేర్కొన్నారు.

ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, నిరసనకారులను అడుగడుగునా అడ్డుకున్న భద్రతా సిబ్బంది
రోడ్లపై మేకులతో
ఫొటో క్యాప్షన్, మేకులతో కూడిన షీట్‌ను రోడ్డుకు అడ్డుగా పెట్టిన పోలీసులు

రోడ్డుపై మేకుల షీట్లు

జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ నిరసనను అడ్డుకోవడానికి దిల్లీ నలువైపులా బలగాలను మోహరించారు. ఏఎన్ఐ, ఐఏఎన్ఎస్ వార్తా సంస్థలు పంచుకున్న వీడియోల్లో, దిల్లీ పోలీసులు రోడ్లపై మేకులతో ఉన్న షీట్‌లను పరిచినట్టు కనిపించింది.

దీనిపై పొలిటికల్ యాక్టివిస్ట్ యోగేంద్ర యాదవ్ విమర్శలు చేశారు. "ప్రజలకు స్వాగతం పలకడానికి మోదీ ప్రభుత్వం మరోసారి దిల్లీ వీధుల్లో పదునైన మేకులను దించింది." అని ఆరోపించారు.

జంతర్‌మంతర్‌కు రాకుండా నిర్బంధించడంపై కాక్రోచ్ జనతా పార్టీ కో-కన్వీనర్ సౌరవ్ దాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో తీవ్ర విమర్శలు చేశారు. "ప్రభుత్వం తన సొంత పౌరులతో యుద్ధం చేస్తోంది" అని రాశారు.

సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది లేదని దిల్లీ అడిషనల్ సీపీ దినేష్ కుమార్ చెప్పారు. సరిహద్దుల్లో కూడా ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అక్టోబర్ 10న నిరసన ప్రదర్శనకు అనుమతి కోరుతూ కేవలం మూడు రోజుల ముందు, అంటే అక్టోబర్ 7న దరఖాస్తు సమర్పించారని జాయింట్ పోలీస్ కమిషనర్ నూపుర్ ప్రసాద్ వెల్లడించారు. అయితే నిర్దేశిత ప్రక్రియ ప్రకారం కనీసం 10 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు.

అందుకే నిరసనకారులను సమీకరించి "చట్టవిరుద్ధమైన" పరిస్థితులను సృష్టించిన చరిత్ర ఉన్న వ్యక్తులను గుర్తించిన తర్వాత, ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.

ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, కొన్ని ప్రాంతాల్లో రోడ్డుపై బారికేడ్లు ఏర్పాటు చేసిన బలగాలు

అడుగడుగునా బారికేడ్లు

ఆంగ్ల వార్తాపత్రిక ' ఇండియన్ ఎక్స్‌ప్రెస్' ప్రకారం నిరసనలకు ముందు దిల్లీలో రాత్రికి రాత్రే కనీసం 1,000 మందిని అదుపులోకి తీసుకున్నారు. తర్వాత ఈ సంఖ్య మరింత పెరిగింది.

సెంట్రల్ దిల్లీ, న్యూ దిల్లీ జిల్లాల మధ్య, అలాగే దక్షిణ, ఆగ్నేయ, నైరుతి దిల్లీ జిల్లాలను కలిపే ప్రదేశాలలో అంతర్-జిల్లా సరిహద్దు చెక్‌పాయింట్లు ఏర్పాటు చేశారు. అశోకా రోడ్, టాల్‌స్టాయ్ రోడ్ వంటి జంతర్ మంత్ సమీప రహదారులకు కూడా ప్రవేశం కష్టంగా మారింది. దారి పొడవునా బారికేడ్లను ఏర్పాటు చేశారు. పారామిలిటరీ దళాలను మోహరించారు.

"పోలీసులు బారికేడ్లను పెంచుతూ, అనేక కిలోమీటర్ల రహదారులపై ఆంక్షలు విధించారు. పోలీసులు మా షూటింగ్‌కు, అదుపులోకి తీసుకున్న వారితో మాట్లాడే ప్రయత్నాలకు ఆటంకం కలిగించారు," అని జంతర్ మంతర్ చుట్టూ ఉన్న పరిస్థితులను కవర్ చేసిన బీబీసీ రిపోర్టర్ శుభ్ రాణా వివరించారు.

ధిల్లీ, జంతర్‌మంతర్, కాక్రోచ్ జనతా పార్టీ, అభిజీత్ దీప్కే,
ఫొటో క్యాప్షన్, జనాలను చెదరగొడుతున్న పోలీసులు

భయం కనిపిస్తోందన్న కేజ్రీవాల్

సీజేపీ నిరసనలను అడ్డుకునేందుకు చేపట్టిన చర్యలపై అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డారు. "ఇది ఎమర్జెన్సీ కంటే దారుణం. మోదీ పాలనలో పూర్తి నియంతృత్వంలో జీవిస్తున్నామని ఇప్పుడు అధికారికంగా రుజువైంది. విమానం దిగిన వెంటనే ప్రజలను అరెస్టు చేయడం మునుపెన్నడూ చూడని స్థాయి భయాన్ని చూపిస్తోంది." అని ట్విట్టర్‌లో రాశారు.

కాక్రోజ్ జనతా పార్టీ నిరసనలపై బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పందించారు. "ఈ రోజు దేశంలో చాలా ప్రమాదకరమైన, తీవ్రమైన పరిస్థితులు సృష్టించే ప్రయత్నం జరుగుతోంది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను అస్థిరపరిచే ప్రయత్నం జరుగుతోంది. ఇది ఎవరు చేస్తున్నారు? రెండు అరాచకవాద గ్రూపులు. ఒకటి 'ఇండీ అలయన్స్' నాయకుడు రాహుల్ గాంధీ, మరొకటి అరవింద్ కేజ్రీవాల్ మిత్రపక్షమైన సీజేపీ చేస్తున్నాయి." అని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ నితిన్ నబీన్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)