టైటానిక్‌లో ప్రయాణించిన ఏకైక నల్లజాతి ప్రయాణికుడి గురించి ఎలా తెలిసింది?

ఫొటో సోర్స్, Handout
- రచయిత, జార్జీ డాకర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
అప్పట్లో అత్యంత ఆధునిక నౌకగా పేరొందిన టైటానిక్ సౌతాంప్టన్ నుంచి 1912 ఏప్రిల్ 10న తొలి ప్రయాణం ప్రారంభించింది. 2,201 మంది ప్రయాణికులతో న్యూయార్క్ వెళ్తుండగా, నాలుగు రోజుల తర్వాత ఉత్తర అట్లాంటిక్‌లో మంచుకొండను ఢీకొని మునిగి పోయింది.
ఈ విషాద ఘటన గురించి వార్తాపత్రికల నుంచి లియోనార్డో డికాప్రియో నటించిన భారీ హాలీవుడ్ సినిమా టైటానిక్ వరకు లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి.
అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు అంచనా వేస్తున్న 1,500 మందిలో ఒకరి కథ మాత్రం లివర్‌పూల్‌లోని మ్యూజియాన్ని ఓ సామాజిక శాస్త్రవేత్త సందర్శించే వరకు మరుగున ఉండిపోయింది.
టైటానిక్‌లో ప్రయాణించినట్లుగా రికార్డుల్లో ఉన్న ఏకైక నల్లజాతి ప్రయాణికుడు జోసెఫ్ ఫిలిప్ లెమెర్సియర్ లారోష్.
అయితే, ఆయన ఎవరు? అసలు మునిగిపోదని పేరొందిన వైట్ స్టార్ లైన్ సంస్థకు చెందిన టైటానిక్ నౌకలోకి ఆయనను, ఆయన కుటుంబాన్ని తీసుకొచ్చిన పరిణామాలు ఏమిటి?


ఫొటో సోర్స్, National Museums Liverpool
లారోష్ 1886లో హైతీలోని కాప్-హైటియన్లో జన్మించారు. ఫ్రెంచ్ వలస పాలనకు వ్యతిరేకంగా హైతీ స్వాతంత్య్ర పోరాటానికి నాయకత్వం వహించిన ఆ దేశ తొలి చక్రవర్తి జీన్-జాక్ డెసాలిన్స్కు ఆయన ముని ముని మనవడు.
లారోష్ కుటుంబ హోదా, సంపద మధ్య పెరిగారు. 15 ఏళ్ల వయసులో ఇంజినీరింగ్‌లో విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించేందుకు ఓ ఉపాధ్యాయుడితో కలిసి ఫ్రాన్స్‌కు వెళ్లారు.
పదేళ్ల తర్వాత లారోష్ ప్రాణాలు కోల్పోయారు. టైటానిక్‌లో ప్రయాణించిన నల్లజాతీయుడిగా అధికారికంగా నమోదైన ఏకైక వ్యక్తి ఆయనే. ఆయన మృతదేహం లభించలేదు.

ఫొటో సోర్స్, Public Domain
వాషింగ్టన్ డీసీలో జన్మించిన విద్యావేత్త డాక్టర్ కార్లెట్ నార్ఉడ్.. లివర్‌పూల్‌లోని మారిటైమ్ మ్యూజియాన్ని సందర్శించినప్పుడు లారోష్ కథ తెలుసుకున్నారు.
రెండేళ్ల కిందట ఆయన జీవితం ఆధారంగా ఓ నాటకాన్ని రచించి, దర్శకత్వం వహించారు.

ఫొటో సోర్స్, Pete Carr
అక్టోబర్ 17న లివర్‌పూల్‌లో ఈ నాటకం తొలిసారిగా ప్రదర్శితం కానున్న నేపథ్యంలో నార్ ఉడ్ బీబీసీతో మాట్లాడారు. జీవితం అద్భుతంగా ప్రారంభమై, ధైర్యవంతమైన ప్రేమకథ మీదుగా సాగి అంతిమంగా విషాదంగా ముగిసిన ఓ వ్యక్తి జీవితంలోని సంక్లిష్ఠ కథను ఆయన వివరించారు.
లారోష్ 1901లో ఫ్రాన్స్‌కు వెళ్లారు. అప్పటికి ఫ్రెంచ్ కాలనీల్లో బానిసత్వం రద్దయి 50 ఏళ్లు గడిచాయి.
పారిస్ సమీపంలోని బోవే నగరంలో విశ్వవిద్యాలయ విద్యను అభ్యసించాక ఆయన ఇంజినీర్‌గా మారగలిగారు.
"1900ల ప్రారంభంలో ఫ్రాన్స్‌లో ఓ నల్లజాతీయుడికి ఎదురయ్యే జాతి వివక్ష చాలా తీవ్రంగా ఉండేది" అని నార్ఉడ్ చెప్పారు.
"ఆ సమయంలోనూ నల్లజాతీయులకు తోకలు ఉంటాయని ఫ్రెంచ్ ప్రజలు నిజంగానే నమ్మేవారు. అక్కడ ఆయన ఎన్నో జాతిపరమైన ఉద్రిక్తతలను ఎదుర్కొన్నారు" అని వివరించారు.
ఆ కాలంలో భిన్న జాతులకు చెందిన జంటలు ఫ్రాన్స్‌లో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనేవారో తెలిసినప్పటికీ, లారోష్కు జూలియట్ లఫార్గ్ అనే తెల్లజాతీయురాలితో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారిద్దరూ వివాహం చేసుకున్నారు.
"ఆ కాలంలో ఓ నల్లజాతీయుడితో ప్రేమలో పడటానికి ఆమె ఎంతో ధైర్యవంతురాలైన అసాధారణ మహిళ అయి ఉండాలి" అని నార్ఉడ్ చెప్పారు.
" ఆమె తండ్రితో కలిసి నివసిస్తుండటంతో కుటుంబం కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది. లారోష్, లఫార్గ్లకు కుటుంబం నుంచి మద్దతు లభించిందని చెప్పడానికి ఆధారం ఉంది. లారోష్ గురించి తన తండ్రికి లఫార్గ్ రాసిన లేఖ ఇప్పటికీ అందుబాటులో ఉంది’’ అని నార్ ఉడ్ వివరించారు.

ఫొటో సోర్స్, Photo12/Universal Images Group via Getty Images
ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు జన్మించారు. వారి పేర్లు సిమోన్ మేరీ ఆన్ ఆండ్రే లారోష్, లూయిస్ లారోష్. వీరు వరుసగా 1909, 1910 సంవత్సరాల్లో జన్మించారు.
అయితే, కొంతకాలానికే లారోష్ తన కుటుంబాన్ని తీసుకుని స్వదేశమైన హైతీకి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
"లారోష్ డిగ్రీ పూర్తి చేయగలిగారు. అయితే, ఉద్యోగంలో కొనసాగడం ఆయనకు కష్టంగా ఉండేది. తరచూ ఉద్యోగం నుంచి తొలగించేవారు. ఉద్యోగం దొరికినా జాతి వివక్షను ఎదుర్కొనేవారు" అని నార్ఉడ్ చెప్పారు.
ఈ కుటుంబం 1912 చివర్లో ఫ్రాన్స్‌ను విడిచి వెళ్లాలని భావించింది. అయితే, లఫార్గ్ మూడోసారి గర్భవతి కావడంతో ముందుగానే వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
"ఆ బిడ్డ ఫ్రాన్స్‌లో పుట్టి పెరగడం లారోష్కు ఇష్టం లేదు. ఆయన తిరిగి హైతీకి వెళ్లాలనుకున్నారు. తల్లితో ఆయనకు ఎంతో అనుబంధం ఉండేది. ఆమెకు దూరంగా ఉండటాన్ని ఆయన తట్టుకోలేకపోయారు" అని నార్ఉడ్ వివరించారు.
అయితే, భర్తతో కలిసి ఫ్రాన్స్‌ను విడిచి వెళ్తే, తల్లి లేని తన తండ్రి ఒంటరిగా మిగిలిపోతారని లఫార్గ్ ఆందోళన చెందారని నార్వుడ్ చెప్పారు.
కానీ, అప్పటి హైతీ అధ్యక్షుడైన లారోష్ మేనమామ సింసినాటస్ లెకాంట్.. జోసెఫ్‌కు గణిత ఉపాధ్యాయుడిగా ఉద్యోగం ఏర్పాటు చేయడంతో ఆ కుటుంబం ఫ్రాన్స్‌ను విడిచి వెళ్లాలని నిర్ణయించుకుంది.
'విధి ఆడిన వింత నాటకం'
అయితే, లారోష్ కుటుంబం టైటానిక్ నౌకలో ప్రయాణించాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది?
అనుకున్నదానికంటే ఫ్రాన్స్‌ను ముందుగానే విడిచి వెళ్లాలనే నిర్ణయం తీసుకోవడం, మరో నౌకలో టికెట్లు ఉన్నప్పటికీ వాటిని మార్చుకోవడం, చివరి నిమిషంలో టైటానిక్‌ను అందుకోలేని పరిస్థితి నుంచి బోర్డింగ్ కావడం.. ఇలా ఎన్నో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయని నార్ఉడ్ చెప్పారు.
"లారోష్ ఆ నౌకలో ప్రయాణించాల్సిన అవసరమే లేదు" అన్నారు.
లారోష్ తల్లి ఆ కుటుంబం కోసం ఎస్ఎస్ ఫ్రాన్స్ నౌకలో ఫస్ట్ క్లాస్ టికెట్లు పంపించారు. అయితే, ఆ నౌకలో పిల్లలు తమతో కలిసి భోజనం చేయడానికి వీలుండదని కుటుంబానికి తెలిసింది. దీంతో ఫస్ట్ క్లాస్ టికెట్లను తిరిగి ఇచ్చేసి, టైటానిక్‌లో సెకండ్ క్లాస్ టికెట్లు తీసుకున్నారు.
మరో అనూహ్య ఘటన.. వైట్ స్టార్ లైన్ సంస్థకు చెందిన టైటానిక్ నౌకను ఎక్కే సమయంలో ఎదురైంది.
టైటానిక్ ఫ్రాన్స్‌లోని షెర్బర్గ్లో ఆగాల్సి ఉంది. అయితే, ఆ నౌక పరిమాణం చాలా పెద్దదిగా ఉండటంతో అక్కడి నౌకాశ్రయంలోకి చేరడం సాధ్యం కాలేదు. దీంతో షెర్బర్గ్లో నౌక ఎక్కాల్సిన ప్రయాణికులను ఎస్ఎస్ నోమాడిక్ అనే చిన్న అనుబంధ నౌకలో టైటానిక్ వద్దకు తీసుకెళ్లారు.
"వారు మరో పడవలో వెళ్లి ప్రధాన నౌకను చేరుకోవాల్సి వచ్చింది. వారు ప్రయాణిస్తున్న పడవలో ఇంజిన్ సమస్య తలెత్తింది. దీంతో టైటానిక్‌ను చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. కానీ చివరకు నౌకను చేరుకోగలిగారు. ఇది నిజంగా విధి ఆడిన వింత నాటకం" అని నార్ఉడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, National Museums Liverpool
1912 ఏప్రిల్ 14న రాత్రి సుమారు 11.40 గంటలకు టైటానిక్ మంచుకొండను ఢీకొట్టింది.
లారోష్ తన భార్యను నిద్రలేపారు. వారిద్దరూ కొన్ని విలువైన వస్తువులను తీసుకుని, నిద్రపోతున్న తమ పిల్లలను ఎత్తుకుని డెక్‌పైకి చేరుకున్నారు.
అప్పటికే గర్భవతిగా ఉన్న లఫార్గ్, వారి ఇద్దరు కుమార్తెలు లైఫ్బోట్లోకి ఎక్కగలిగారు. మరుసటి రోజు ఆర్ఎంఎస్ కార్పాథియా నౌక వారిని సురక్షితంగా రక్షించింది.
అయితే, జోసెఫ్ లారోష్కు ఏమైందనేది ఇప్పటికీ తెలియదు.

ఫొటో సోర్స్, Handout
లారోష్ కథను ఎలాంటి కల్పిత అంశాలు జోడించకుండా చెప్పడం ఎంతో ముఖ్యమని నార్ ఉడ్ భావిస్తున్నారు. ఒక వ్యక్తి చరిత్రను తెలుసుకోవడానికే కాకుండా, అంతకుమించిన కారణాల వల్ల కూడా ఈ కథను చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు.
"టైటానిక్ చరిత్రలో ఇదొక భాగం కాబట్టి ఈ కథ అందరినీ ఆకర్షిస్తుంది. అయితే, నల్లజాతీయుల్లో చాలామందికి తమ చరిత్ర గురించి తెలియదు. బానిసత్వం కారణంగా మా పూర్వీకులకు సంబంధించిన రికార్డులు అందుబాటులో లేకుండా పోయాయి. దీంతో మా గతానికి సంబంధించిన గుర్తింపును తెలుసుకోవడంలో లోటు ఏర్పడింది" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, Carlette Norwood
"లారోష్ వంటి వారి కథలు.. ప్రముఖ నల్లజాతీయుల చరిత్ర కూడా ఉందని, మేం కేవలం బానిసత్వానికి మాత్రమే పరిమితమైనవాళ్లం కాదని తెలియజేస్తాయి. ఎంతో మంది అభివృద్ధి సాధించి, విజయవంతమైన జీవితాలు గడిపారు. ఇలాంటి కథలు మనల్ని మన గతంతో అనుసంధానిస్తాయి. జోసెఫ్ లారోష్తో మాకు రక్తసంబంధం ఉండకపోవచ్చు. కానీ, ఆయన జీవితంతో మేం అనుబంధం ఏర్పరచుకోగలం" అని నార్ ఉడ్ అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























