గోడావణ్: బట్టమేక పక్షి కాదు ‘విస్కీ’

the great indian bustard

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, చారుకేసీ రామదురై
    • హోదా, ఫీచర్స్ కరస్పాండెంట్
  • చదివే సమయం: 4 నిమిషాలు

అంతరించిపోతున్న బట్టమేక పక్షిని (గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ) కాపాడేందుకు కార్పొరేట్ సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా ‘గోడావణ్’ విస్కీ తయారీ మొదలైంది. జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందిన రాజు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు.

అంతరించిపోతున్నబట్టమేక పక్షిని రక్షించడంలో సహాయపడుతుండడం ఈ విస్కీ ప్రత్యేకత.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

బట్టమేక పక్షిని హిందీలో గోడావణ్ అంటారు. దీనిని ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కంజర్వేషన్ ఆఫ్ నేచర్’(ఐయూసీఎన్) రెడ్ లిస్ట్‌లో క్రిటికల్లీ ఎన్‌డేంజర్డ్‌గా గుర్తించారు. అంటే అంతరించిపోయేందుకు అత్యంత చేరువులో ఉన్న జంతుజాతులు. ఒకప్పుడు పశ్చిమ భారతదేశంలోని రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో విస్తారంగా కనిపించిన ఈ పక్షిని ఆహారం కోసం వినోదం కోసం ఎంతలా వేటాడారంటే, ఇప్పుడిది అంతరించిపోయే దశకు చేరుకుంది.

ప్రపంచంలో ఎగిరే పక్షుల్లో అత్యంత బరువైన వాటిలో ఒకటైన బట్టమేక, సుమారు 1.2 మీటర్ల పొడవు వరకు పెరుగుతుంది. దీని బరువు 15 కిలోల వరకు ఉంటుంది. దీని పొడవైన కాళ్లు, పొడవైన మెడ, గోధుమ రంగు శరీరం ప్రత్యేక లక్షణాలు.

కానీ తాజా అంచనాల ప్రకారం, భారతదేశంలో ప్రస్తుతం కేవలం సుమారు 120 బట్టమేక పక్షులు మాత్రమే మిగిలి ఉన్నాయి.

గోడావన్ బట్టమేక సంరక్షణ సింగల్ మాల్ట్ విస్కీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్

ఫొటో సోర్స్, Radheshyam Pemani Bishnoi

ఆల్కహాల్ బ్రాండ్‌ గోడావణ్ విస్కీని 2023లో బట్టమేక సంరక్షణ కార్యక్రమాల్లో భాగంగా తయారు చేయడం ప్రారంభించారు. ఇది రాజస్థాన్‌లోని అల్వార్ పట్టణంలో తయారు చేసే ఒక ఆర్టిసనల్ సింగిల్ మాల్ట్ విస్కీ. స్థానికంగా పండించిన బార్లీని ఉపయోగించి, తక్కువ నీరు అవసరమయ్యే పద్ధతులతో దీనిని తయారు చేస్తారు. ఇది తయారయ్యే ఎడారి ప్రాంతాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాలను అనుసరిస్తారు. అదనంగా, భారతీయ వనస్పతులతో తయారైన జిన్ తరహా ఇన్ఫ్యూషన్‌ను కలుపుతారు. దీని వల్ల కిస్మిస్, అంజీర్, అప్రికాట్, కరామెల్ వంటి రుచులు వస్తాయని చెబుతున్నారు.

చైతన్య రాజ్ సింగ్ అనే సామాజిక వ్యాపారవేత్త, జైసల్మేర్ రాజ కుటుంబానికి చెందిన వారసుడు బట్టమేక పక్షి సంరక్షణకు మద్దతు ఇస్తున్నారు. ఆయన గోడావణ్ విస్కీకి చెందిన మాతృసంస్థ డియాజియోతో కలిసి సంరక్షణ కార్యక్రమాలను ప్రమోట్ చేస్తున్నారు.

ఈ సంస్థ భారత పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖతో కలిసి గడ్డి భూములను రక్షించేందుకు పని చేస్తోంది. ఇవే బట్టమేక పక్షుల ప్రధాన నివాస ప్రదేశాలు.

ఈ ప్రాంతాలను కాపాడటం ద్వారా పక్షులు సంతానోత్పత్తి చేసుకునేందుకు ఎక్కువ స్థలం లభించి, వాటి సంఖ్య పెరగవచ్చని ఆశిస్తున్నానని చైతన్య రాజ్ అంటున్నారు.

"ఈ సంరక్షణ కార్యక్రమం సరైన దిశలో ఒక ముందడుగు. భారతదేశంలో అంతరించిపోవడానికి చేరువలో ఉన్న రాయల్ బెంగాల్ టైగర్‌ను ఎలా రక్షించామో అదే విధంగా మేము ఈ పక్షిని కూడా కాపాడగలమని ఆశిస్తున్నాం"అని ఆయన అన్నారు.

Chaitanya Raj Singh గోడావన్ బట్టమేక సంరక్షణ సింగల్ మాల్ట్ విస్కీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్

ఫొటో సోర్స్, Bajo Rao

ఫొటో క్యాప్షన్, చైతన్య రాజ్ సింగ్

లాల్ మాంస్‌తో

మృదువైన టెక్స్చర్, కాస్త పొగ వాసన, మసాలా తళుకులతో ఈ విస్కీ రెడ్ మీట్‌తో తాగేందుకు అనుకూలంగా ఉంటుందని చెబుతారు. ఇది రెడ్ వైన్‌లా ఉంటుంది. చైతన్య సింగ్ రాజ్ తన ప్రత్యేకమైన లాల్ మాంస్‌ కానపీతో దీన్ని తాగడాన్ని ఇష్టపడతారు. ఇది రాజస్థాన్‌లో ప్రసిద్ధి చెందిన మటన్ కర్రీకి ఆయన ఇచ్చిన ఆధునిక రూపం.

ఈ వంటకం రాజ కుటుంబాల వంటగదుల్లో పుట్టిందని చెబుతారు, కాబట్టి ఇది సింగ్‌కు దగ్గరైనదే. లాల్ మాస్ మొదట్లో జింక లేదా అడవి పంది మాంసంతో తయారయ్యేదని కొందరు చెబుతారు. అయితే, చాలా మంది నిపుణులు లాల్ మాంస్ ఎప్పటినుంచో మటన్‌తోనే తయారవుతుందని అంటున్నారు.

"సాధారణంగా ఈ వంటకం పెరుగు, మసాలాలతో చేసేది అయినప్పటికీ, ప్రతి ప్రాంతం, ప్రతి ఇంటికీ తయారీ విధానం వేర్వేరుగా ఉంటుంది" అని చైతన్య అన్నారు. ఉపయోగించే మసాలాలు, వండే సమయం ఈ తేడాకు కారణాలు. ఎక్కువసేపు మెల్లగా వండితే రుచి మరింత మెరుగవుతుంది.

ఈ వంటకానికి జోధ్‌పూర్ సమీపంలో పండించే స్థానిక మథానియా ఎర్ర మిరప పొడి ఎక్కువగా ఉపయోగిస్తారు. దీని వల్ల కూరకు ఎర్రటి రంగు, మసాలా రుచి వస్తాయి. "లాల్ మాంస్ కొంచెం మృదువుగా ఉంటే, ఈ విస్కీ కూడా ఇంకా బాగా సరిపోతుంది" అని చైతన్య అంటున్నారు

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)