భారతీయ కుటుంబాన్ని డబ్బు కోసం బెదిరించిన పంజాబ్ పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను విచారిస్తామంటున్న అమెరికా.. అసలేం జరిగింది?

ఫొటో సోర్స్, Pradeep Sharma
- రచయిత, షకీల్ అఖ్తర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
అమెరికా న్యాయ శాఖ దర్యాప్తు అధికారులు ఒక భారీ ఆపరేషన్‌లో భారత్‌కు చెందిన నేర ముఠాలతో సంబంధం ఉన్న 24 మందిని అరెస్టు చేసి, వారిపై అభియోగాలు నమోదు చేస్తున్నట్టు ప్రకటించారు.
కాలిఫోర్నియాలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఈ అరెస్టుల వివరాలను అధికారులు వెల్లడించారు. డబ్బు కోసం బెదిరింపులకు పాల్పడిన వ్యవహారంలో ఓ పంజాబ్ పోలీసు అధికారి ప్రమేయం కూడా ఉందని ఈ సందర్భంగా న్యాయశాఖాధికారి బిల్ ఎస్లే ఆరోపించారు.
ఎస్లీ వెల్లడించిన వివరాల మేరకు భారత్‌లోని పంజాబ్ రాష్ట్రం హోషియార్‌పూర్ జిల్లాలోని టాండా పట్టణ ఎస్‌హెచ్‌వో గురిందర్‌జిత్ సింగ్ నగ్రా, ఒక నేర ముఠా సభ్యుల సహాయాన్ని తీసుకున్నారు.
అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాన్ని తనకు నాలుగు లక్షల డాలర్లు (సుమారు రూ.3 కోట్లు 80 లక్షలు) చెల్లించకపోతే పంజాబ్‌లో ఉన్న వారి కుటుంబ సభ్యులను తప్పుడు హత్య కేసులో ఇరికిస్తానని బెదిరించారని ఎస్లీ తెలిపారు.
మొదట ఆ కుటుంబం నుంచి అంతకంటే ఎక్కువ మొత్తాన్ని నగ్రా డిమాండ్ చేశాడని, అనంతరం నాలుగు లక్షల డాలర్లకు రాజీ కుదిరిందని ఎస్లే చెప్పారు. ప్రస్తుతం ఆ అధికారి అమెరికా అదుపులో లేడని, కానీ విచారణ జరపడానికి ఆయనను భారత్ నుంచి తీసుకువస్తామని ఎస్లే ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

నగ్రాపై విచారణకు ఆదేశం
ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. అయితే పంజాబ్ పోలీసులు ఎస్‌హెచ్ఓ గురిందర్‌జిత్ సింగ్ నగ్రాను సస్పెండ్ చేశారు. జలంధర్ ప్రాంతీయ డీఐబీ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో, వసూళ్ల కేసు దర్యాప్తు నేపథ్యంలో నగ్రాను సస్పెండ్ చేసి పోలీసు లైన్స్‌కు పంపినట్లు పేర్కొంది.
మీడియా కథనాలు, సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టులను పంజాబ్ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారని, వెంటనే నగ్రాను టాండా ఎస్‌హెచ్‌వోగా తొలగించినట్లు తెలిపింది. అనంతరం ఆయన్ను హోషియార్‌పూర్ పోలీసు లైన్స్‌కు బదిలీ చేసినట్లు వెల్లడించింది.
ఈ వ్యవహారంపై ఎస్‌పీ ఆధ్వర్యంలోదర్యాప్తు జరిపేందుకు డీఐజీ అదేశించారని ఆ ప్రకటన తెలిపింది. నగ్రాపై వచ్చిన ఆరోపణలన్నింటినీ విచారించి, వాస్తవాలేమిటో పరిశీలించి వీలైనంత త్వరగా నివేదిక సమర్పించాలని ఆదేశించినట్లు తెలిపింది. దర్యాప్తు అనంతరం అవసరమైతే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది.

ఫొటో సోర్స్, Pradeep Sharma
అభియోగపత్రం దాఖలు
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) కాలిఫోర్నియా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. ఆ అభియోగపత్రం ప్రకారం, ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో నగ్రా లాస్ ఏంజెల్స్ కౌంటీలో ఒక ఇల్లు కొనుగోలు చేయడానికి ప్రయత్నించారు.
గ్యాంగ్‌స్టర్ భగవాన్‌పురియా భారత్‌లోని జైలు నుంచే తన నేర కార్యకలాపాలను నిర్వహించాడు. అతని సహాయంతో గురిందర్‌జిత్ సింగ్ నగ్రా, అమెరికాలో నివసిస్తున్న ఒక కుటుంబాన్ని భారత్‌లో తప్పుడు హత్య కేసులో ఇరికిస్తానని బెదిరించాడని ఎఫ్‌బీఐ నివేదిక పేర్కొంది.
ఆ కేసులో ఇరికించకుండా ఉండేందుకు ఆ కుటుంబం నుంచి నాలుగు లక్షల డాలర్లు డిమాండ్ చేశారని అభియోగపత్రంలో పేర్కొన్నారు.
గ్యాంగ్‌స్టర్ భగవాన్‌పురియాపై పంజాబ్‌తో పాటు ఇతర రాష్ట్రాల్లో హత్య, హత్యాయత్నం సహా వందకు పైగా కేసులు నమోదై ఉన్నాయి. పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో కూడా అతను నిందితుడు. 2025 మార్చిలో అతన్ని బఠిండా సెంట్రల్ జైలు నుంచి అసోంలోని సిల్చార్ సెంట్రల్ జైలుకు తరలించారు.
జలంధర్ నుంచి పఠాన్‌కోట్‌కు వెళ్లే జాతీయ రహదారిపై ఉన్న ఓ చిన్న పట్టణం టాండా. ఈ ఏడాది జనవరి 15న ఈ పట్టణం సమీపంలోని మియానీ గ్రామంలో బల్విందర్ సింగ్ అనే వ్యక్తిని కాల్చి చంపారు.
ఎఫ్‌బీఐ కేసు కూడా ఈ హత్య కేసుతో ముడిపడి ఉన్నదే. ఎఫ్‌బీఐ అధికారుల ప్రకారం, అమెరికాలో నివసిస్తున్న భారతీయ కుటుంబాన్ని ఈ కేసులో ఇరికిస్తానని పోలీసు ఇన్‌స్పెక్టర్ బెదిరించారు.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఇన్‌స్పెక్టర్ గురిందర్‌జిత్ సింగ్ ఈ ఆరోపణలన్నింటినీ నిరాధారమైనవిగా కొట్టిపారేశారు.
సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న కథనాల ద్వారానే ఈ కేసు గురించి తనకు తెలిసిందని ఆయన విలేకరులతో చెప్పారు. దర్యాప్తు సంస్థల నుంచి ఇప్పటివరకు తనకు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























