అద్దెకు గర్బా పార్టనర్: ‘నుదుటిపై ముద్దు’, ‘ఆఫ్టర్ పార్టీ’ ఆఫర్ల వెనుక అసలు నిజమేంటి?

గర్బా నృత్యం, గుజరాత్, దిల్లీ, నేరాలు, సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, గర్బా ఆడేందుకు పార్టనర్‌ను అద్దెకు తీసుకోవచ్చనే ప్రకటనలు సోషల్ మీడియాలో కనిపించాయి.
    • రచయిత, శ్యామ్ బక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

నవరాత్రికి దాదాపు 25 రోజుల ముందు సోషల్ మీడియాలో మొదలైన 'గర్బా డ్యాన్స్ కోసం భాగస్వామిని అద్దెకు తీసుకోండి" అనే ట్రెండ్ చర్చనీయాంశంగా మారింది. ఇందులో అత్యంత ఖరీదైన ప్లాన్‌లో నుదుటిపై ముద్దు, "ఆఫ్టర్-పార్టీ" కూడా ఉన్నాయి.

ఈ ట్రెండ్ సోషల్ మీడియా ఫీడ్‌లో కూడా కనిపించి ఉండొచ్చు.

నవరాత్రుల సమయంలో గర్బా ఆడేందుకు భాగస్వామిని అద్దెకు తీసుకోవచ్చంటూ అనేక సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల్లో వేర్వేరు ఖాతాల నుంచి పోస్టులు కనిపిస్తున్నాయి.

ఈ పోస్టుల్లో "గోల్డ్," "సిల్వర్," "ప్లాటినం" వంటి ప్లాన్‌లను కూడా అందించారు. ఒక్కో ప్లాన్‌ను బట్టి వేర్వేరు సదుపాయాలుంటాయని అందులో పేర్కొన్నారు. అత్యంత ఖరీదైన ప్లాన్‌లో "నుదుటిపై ముద్దు", పార్టీ తర్వాత జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కూడా ఉన్నట్టు చెప్పారు.

నిజంగానే 'గర్బా భాగస్వామిని అద్దెకు ఇచ్చే వ్యాపారం చేస్తున్నాయా అనే విషయం తెలుసుకోవడానికి, బీబీసీ న్యూస్ గుజరాతీ ప్రతినిధి అలాంటి కొన్ని సోషల్ మీడియా అకౌంట్లకు మెసేజ్ చేశారు. పరిశీలనలో భాగంగా అలాంటి 'అకౌంట్ ఆపరేటర్ల'తో మాట్లాడారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

డబ్బులు చెల్లిస్తే గర్బా ఆడేందుకు భాగస్వామిని ఏర్పాటుచేస్తామని చెబుతున్న సోషల్ మీడియా ఖాతాలు, ప్రకటనలు పరిశీలిస్తున్నప్పుడు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి.

అనవసరమైన ప్రచారాన్ని నివారించడానికి, వినియోగదారుల వ్యకిగత గోప్యతను కాపాడటానికి వాళ్ల పేర్లు, ప్లాట్‌ఫామ్‌లపేర్లను వెల్లడించడం లేదు.

"గర్బా పార్టనర్‌ను అద్దెకు తీసుకోండి" అనే పోస్టులు పెట్టినవారిలో కొందరు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు కూడా ఉన్నారు. వాళ్లల్లో కొందరికి వేలాదిమంది ఫాలోవర్లున్నారు.

గర్బా నృత్యం, గుజరాత్, దిల్లీ, నేరాలు, సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, గర్బా పార్ట్‌నర్ కోసం పలు రకాల ఆఫర్లున్నాయి.

‘మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లలో కూడా పోస్టులు’

ఈ ట్రెండ్‌ను ఉపయోగించుకుని కస్టమర్లను ఆకర్షించేందుకు కొన్ని మ్యాట్రిమోనీ, డేటింగ్ యాప్‌లు కూడా ఇలాంటి పోస్టులు పెట్టినట్టు మాకు తెలిసింది.

తమ ప్లాట్‌ఫామ్ పెళ్లికి సంబంధించినదని 'గర్బా పార్టనర్' పోస్టులు కూడా ఆ కోణంలోనే ఉంచామని అలాంటి మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లు స్పష్టంచేశాయి.

డేటింగ్ యాప్ నిర్వాహకుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

ఒక అకౌంట్ 'గర్బా భాగస్వామి' కోసం ఒక ప్రత్యేక 'షాడో అకౌంట్'ను సృష్టించింది. వారిని సంప్రదించినప్పుడు ప్రధాన అకౌంట్ లింక్‌ను ఇచ్చి దానిని ఫాలో అవ్వమని కోరారు.

ఫాలోవర్ల సంఖ్యను, పోస్టుల రీచ్‌ను పెంచుకోడానికి ఈ పద్ధతిని ఉపయోగించినట్టు భావించొచ్చు.

అదే అకౌంట్ గుజరాత్‌లో 'గర్బా పార్టనర్' సేవలను అందించడానికి నిరాకరించింది. మధ్యప్రదేశ్‌లోని ఒక నగరంలో ఈ సేవలు అందిస్తామని తెలిపింది.

చాలా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అద్దెకు 'గర్బా భాగస్వాములను' అందించడంపై పోస్ట్ చేస్తున్న చాలా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు సెప్టెంబర్ 2026లో మొదలైనవే.

అంటే అవి పూర్తిగా కొత్తవి. వీటికోసమే ప్రత్యేకంగా సృష్టించిఉండొచ్చు. కొన్ని నకిలీవి కూడా అయ్యుండొచ్చు.

అయితే ఈ సేవల గురించి పోస్ట్ చేసే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌ల ఖాతాలు సగటున మూడు నుంచి నాలుగు సంవత్సరాల క్రితమే మొదలయ్యాయి.

గర్బా నృత్యం, గుజరాత్, దిల్లీ, నేరాలు, సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, గర్బా పార్టనర్‌గా మారాలనుకునే అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ ఫ్రీ అని కొందరు వ్యక్తుల ఇన్ స్టా అకౌంట్లలో ఉంది.

‘అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ ఫ్రీ’

చివరకు 'గర్బా పార్టనర్'ను ఏర్పాటుచేస్తామని చెప్పిన ఒక అకౌంట్‌ను మేం గుర్తించాం.

గర్బా భాగస్వామిని ఏర్పాటు చేయడానికి నిర్వాహకులు సుముఖత వ్యక్తంచేశారు.

'గర్బా భాగస్వామి' కోసం వెతుకుతున్న యువకుడిగా నటిస్తూ ఆ అకౌంట్‌ నిర్వాహకులతో మాట్లాడాం. ఈ అకౌంట్ కూడా సెప్టెంబర్ 2026లో ప్రారంభమైంది.

ఆ అకౌంట్‌లో నవరాత్రులకు సంబంధించిన ఆకర్షణీయమైన చిత్రాన్ని పోస్ట్ చేశారు.

'మీకు నచ్చిన భాగస్వామిని వెతుక్కోండి. కొత్త స్నేహితులను చేసుకోండి, కలిసి నృత్యం చేయండి, అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ ఉచితం' అని అందులో ఉంది.

దీంతో పాటు యువతీయువకుల మధ్య సన్నిహిత సంబంధాన్ని చూపించే పోస్టులను గర్బా పాటలతో కలిపి షేర్ చేశారు. బయోలోని లింక్‌పై క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరారు.

ఆ అకౌంట్‌కు మెసేజ్ చేసి 'మీరు ఏ నగరాల్లో గర్బా భాగస్వాములను అందిస్తున్నారు?' అని అడగ్గా దిల్లీ, నోయిడా, ఇతర రాష్ట్రాల్లో' అని సమాధానం వచ్చింది.

గర్బాతో ముడిపడి ఉన్న రాష్ట్రమైన 'గుజరాత్‌లో ఎందుకు సేవలందించడంలేదని అడగ్గా 'గుజరాత్ రాష్ట్రానికి చెందిన కొంతమంది అమ్మాయిలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు' అని సమాధానం వచ్చింది.

దిల్లీ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి 'గర్బా భాగస్వాములు'గా ఎలా అందిస్తారో తెలుసుకోడానికి ప్రయత్నించాం.

" అమ్మాయిలు కూడా 'గర్బా భాగస్వాముల' కోసం వెతుకుతున్నారని మీకు తెలుసు కదా. వాళ్లిక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అబ్బాయిలతో మేం వాళ్లను కలుపుతాం. దిల్లీ, ఉత్తర ప్రదేశ్, నోయిడాకు చెందిన అమ్మాయిలు మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రాజస్థాన్ నుంచి కూడా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు"

"అబ్బాయిలు రిజిస్ట్రేషన్ కోసం 99రూపాయలు చెల్లించాలి. అమ్మాయిలకు రిజిస్ట్రేషన్ ఉచితం. మీరు రిజిస్టర్ చేసుకుంటే గర్బా పార్టనర్'గా అమ్మాయిని ఎలా దొరుకుతుందో మీకు తెలుస్తుంది" అని ఆయన అన్నారు.

'అబ్బాయిలకు, అమ్మాయిలకు మధ్య ఈ తేడా ఎందుకుంది?' అని అడగ్గా

"అమ్మాయిలకు ఉచితంగా ఇవ్వకపోతే వాళ్లు రిజిస్ట్రేషన్ చేసుకోరు కదా" అని సమాధానమిచ్చారు.

గర్బా నృత్యం, గుజరాత్, దిల్లీ, నేరాలు, సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, కేటాయించిన గర్బా పార్టనర్ నచ్చకపోతే మరొకరిని కేటాయిస్తామని నిర్వాహకులు చెప్పారు.

‘కేటాయించిన భాగస్వామి నచ్చకపోతే’

'గర్బా పార్టనర్' కోసం వెతుకుతున్నప్పుడు వ్యక్తిగత వివరాల గోప్యతపై మేం ఆందోళన వ్యక్తంచేశాం.

''మీ సమాచారం వంద శాతం సురక్షితంగా ఉంటుంది. మీరు చెప్పే పేరు, వయసు, ఫోన్ నంబర్ మాత్రమే తీసుకుంటాం'' అని చెప్పారు.

మాట్లాడుతున్నంతసేపూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆ వ్యక్తి పదే పదే కోరారు. మరింత సమాచారం రాబట్టేందుకు ఆయనతో ఎక్కువసేపు మాట్లాడాం.

"ఈ 99 రూపాయలు నవరాత్రుల తొమ్మిది రోజుల కోసమా లేక ఒక్క రోజు కోసమా? నాకు ప్రతిరోజూ ఒకే భాగస్వామి వస్తారా లేక మారుతుంటారా? కేటాయించిన భాగస్వామి ఒకవేళ నాకు నచ్చకపోతే?" అని అడగ్గా

"మేం మీకు ఆ అమ్మాయి ఫోన్ నంబర్ మాత్రమే ఇస్తాం. మేమే మధ్యవర్తులం. మీరు ఆమెతో మాట్లాడొచ్చు. మీకు కేటాయించిన 'గర్బా పార్టనర్' నచ్చకపోతే మరో అమ్మాయి నంబర్ ఇస్తాం" అని తెలిపారు.

గర్బా నృత్యం, గుజరాత్, దిల్లీ, నేరాలు, సోషల్ మీడియా
ఫొటో క్యాప్షన్, గర్బా పార్టనర్ ప్రకటనలపై జాగ్రత్తగా ఉండాలని గుజరాత్ పోలీసులు హెచ్చరించారు.

అకౌంట్ బయోలో ఇచ్చిన లింక్‌లో ఏముంది?

ఈ అకౌంట్ వివరాలతో పాటు లింక్‌తో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్‌ను సంప్రదించాం.

ఏసీపీ హార్దిక్ మకాడియా ఈ అకౌంట్లను పరిశీలించి తన కంప్యూటర్‌లో ఆ లింక్‌ను తెరిచారు. అందులో ఒక గూగుల్ ఫామ్ కనిపించింది. పేరు, ఈమెయిల్ ఐడీ, ఇన్‌స్టాగ్రామ్ ఖాతా వివరాలు, భాగస్వామి పురుషుడు కావాలా లేక స్త్రీనా, ఎలాంటి 'గర్బా పార్టనర్' కావాలి వంటి వివరాలను అడిగారు.

ఆ ఫామ్‌ను సబ్‌మిట్ చేయగానే ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని స్కాన్ చేసి 99రూపాయలు చెల్లించమని అడుగుతారు.

"గూగుల్ ఫామ్‌లను విశ్వసనీయమైన ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. వాటి ద్వారా సర్వేలు నిర్వహించొచ్చు. ఎవరైనా తమ అభిప్రాయాలను తెలియజేయొచ్చు. కానీ ఇక్కడ గూగుల్ ఫామ్‌ను సమర్పించిన తర్వాతే అసలు మోసం మొదలవుతుంది"

"మిమ్మల్ని 99 రూపాయలు చెల్లించమని అడుగుతారు. ఆ చెల్లింపు స్క్రీన్‌షాట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా ప్రజల నుంచి డబ్బులు తీసుకుని వాళ్లను మోసం చేస్తున్నారు. ఈ ప్రొఫైల్‌ను కూడా మేం గుర్తించాం. డబ్బులు తీసుకుంటున్నారుగానీ 'గర్బా పార్ట్‌నర్‌ను అందించడంలేదు.

వీళ్లు వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం కూడా చేయొచ్చు. పెళ్లికానివాళ్లని, జీవిత భాగస్వామి కోసం వెతుకుతున్నవాళ్లని లక్ష్యంగా చేసుకోవచ్చు. హనీట్రాప్‌లో చిక్కుకునేలా చేయొచ్చు. చాట్ చేసిన తర్వాత ఉచిత నవరాత్రి పాస్ పేరుతో మీకు ఒక ఏపీకే ఫైల్‌ను పంపొచ్చు. ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేస్తే వాట్సాప్‌ను హ్యాక్ చేమొచ్చు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు ఖాళీ చేయొచ్చు" అని ఏసీపీ హార్దిక్ మకాడియా చెప్పారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)