క్యాన్సర్, ఎర్లీ మెనోపాజ్‌ను ఎదుర్కొని.. 23 ఏళ్ల నాటి అండాశయ కణజాలంతో ఈమె ఎలా తల్లయ్యారు

ఫొటో సోర్స్, Sarah Matthews
- రచయిత, రెబెకా థార్న్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 6 నిమిషాలు
కాసాండ్రా బేకన్కు 17 ఏళ్ల వయసులో ఒక అరుదైన బ్లడ్ క్యాన్సర్ హాడ్కిన్ లింఫోమా ఉన్నట్లు నిర్ధరణైంది.
తొలుత కీమోథెరపీ చేయించుకున్న తర్వాత ఆమె బ్లడ్ క్యాన్సర్ అదుపులోకి వచ్చింది. కానీ, ఒక ఏడాది తర్వాత క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.
అయితే, ఈసారి మునుపటి కంటే మరింత తీవ్రంగా వచ్చింది.
గతంలో కంటే మరింత తీవ్రమైన కీమోథెరపీని వెంటనే చేయాల్సి ఉంటుందని బేకన్కు వైద్యులు చెప్పారు.
''డ్రైవింగ్ నేర్చుకోవడం, స్కూల్ ఫైనల్ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో.. అలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని ఎవరూ కోరుకోరు. అది చాలా కష్టమైన సమయం" అని ఆమె బీబీసీ వరల్డ్ సర్వీస్ కార్యక్రమం 'న్యూస్అవర్'కు తెలిపారు.

23 ఏళ్ల పాటు అండాశయ కణజాలం నిల్వ
ఆ సమయంలో బేకన్ టీనేజర్. ఆ చికిత్స వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రభావాల గురించి, అలాగే భవిష్యత్తులో తల్లి అయ్యే అవకాశాలను ఎలా కాపాడుకోవాలనే దాని గురించి ఆమె ఆందోళన చెందారు.
అండాలను బయటికి తీసి, ఫ్రీజ్ చేసే ప్రక్రియకు కావాల్సిన, తన తర్వాత పీరియడ్ వచ్చేంత వరకు ఆగేందుకు కూడా ఆమెకు సమయం లేదు.
కానీ, బేకన్ భిన్నమైన పద్ధతిని అనుసరించాలనుకున్నారు. ఆ సమయంలో అది ప్రయోగం మాత్రమే.
అండాలను ఉత్పత్తి చేసే కణజాలలకు చెందిన కొన్ని భాగాలను అండాశయాల నుంచి తొలగించి, వాటిని ఫ్రీజ్ (నిల్వ) చేసి, ఆ తర్వాత వాటిని తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టడం.
బేకన్ అండాశయాల నుంచి తీసిన కణజాల నమూనాలను 23 ఏళ్ల పాటు నిల్వ చేశారు.
ఆమెకు 44 ఏళ్లు వచ్చినప్పుడు, తిరిగి ఆ కణజాలలను ఆమె శరీరంలోకి ప్రవేశపెట్టారు. గత నెలలో ఆమె పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఆ బాబుకు లాండన్‌ను అని పేరు పెట్టారు.
20 సంవత్సరాలకు పైగా ఫ్రీజ్ చేసిన అండాశయ కణజాలాన్ని తిరిగి అమర్చిన తర్వాత ప్రపంచంలో జన్మించిన మొదటి బిడ్డ లాండన్ అని భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, Kassandra Bacon
ఈ సర్జికల్ ప్రొసీజర్ చాలా క్లిష్టమైంది
తన టీనేజ్ రోజులను గుర్తు చేసుకుంటూ, తాను ఎప్పుడూ తల్లి కావాలని కోరుకున్నానని బేకన్ చెప్పారు.
తన బిడ్డకు జన్మనివ్వలేకపోవచ్చనే పరిస్థితి ఎదురైనప్పుడు, ఆమె తన ఆశను సజీవంగా ఉంచుకునేందుకు ఏమైనా చేయాలనుకున్నారు.
"నాకెందుకో తెలియదు. కానీ, నేను భయపడినట్లుగా ఒకవేళ సహజంగా గర్భం దాల్చలేకపోతే, నాకొక ఆశను ఇచ్చేందుకు మరే మార్గమూ లేదనే విషయాన్ని అంగీకరించడానికి కూడా నేను సిద్ధంగా లేను" అని ఆమె చెప్పారు.
భవిష్యత్తులో సహజంగా గర్భం దాల్చడంలో ఇబ్బంది పడే మహిళలు ఉపయోగించే ఒక సాధారణ పద్ధతి అండాలను ఫ్రీజ్ (నిల్వ) చేయడం.
కానీ, కొన్ని వారాల పాటు హార్మోన్లను ఇంజెక్ట్ చేయడానికి ముందే అండాలను సేకరించాల్సి ఉంటుంది. ఆమెకు అంత సమయం లేదని వైద్యులు బేకన్కు చెప్పారు.
అయితే, చికిత్స ప్రారంభించడానికి ముందే తన అండాశయాల నుంచి కొంత కణజాలాన్ని తీయాలని ఆమె వైద్యులను ఒప్పించారు.
ఆ తర్వాత.. బ్రిటన్‌లో ఈ రకమైన శస్త్రచికిత్స చేసే అతికొద్ది మంది సర్జన్లలో ఒకరైన డాక్టర్ సారా మాథ్యూస్ గురించి ఆమె తెలుసుకున్నారు.
బేకన్ అండాశయాల కణజాలాల నుంచి నాలుగు చిన్న శాంపుళ్లను డాక్టర్ మాథ్యూస్ బయటికి తీశారు.
అయితే, ఈ కణజాలాల సాయంతో భవిష్యత్‌లో ఆమె ఒక బిడ్డకు జన్మనివ్వగలుగుతారా? అన్న విషయంలో అప్పుడు ఎలాంటి గ్యారెంటీ లేదు.

ఫొటో సోర్స్, Kassandra Bacon
'నాకున్న ఒకే ఒక్క ఆశ'
ఆమె ప్రాణాలను కాపాడటానికి, బేకన్కు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్, కీమోథెరపీ చేశారు. ఆ చికిత్సలు విజయవంతం కావడంతో, ఆమె మరోసారి క్యాన్సర్ రహితంగా మారారు.
కానీ వైద్యులు భయపడినట్లే, ఈ చికిత్స ఆమె అండాశయాలను తీవ్రంగా దెబ్బతీసింది. బేకన్ 33 ఏళ్ల వయసులోనే అకాలంగా మెనోపాజ్‌కు గురయ్యారు. అంటే ఆమెకు నెలసరి ఆగిపోయింది.
కానీ, ఆమె ఇప్పుడు బిడ్డ కనాలనుకున్నారు. ఆ తర్వాత ఫ్రీజ్ చేసిన తన ఆరోగ్యకరమైన కణజాలాన్ని తిరిగి తన శరీరంలోకి మార్పిడి చేయగల వైద్యుడి కోసం ఆమె పదేళ్లపాటు ప్రయత్నించారు.
బేకన్ తన అండాశయాల నుంచి కణజాలాన్ని తొలగించే శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు, బ్రిటన్‌లో ఆ ప్రక్రియ చట్టబద్ధమైనది కాదు.
అంటే.. 20 ఏళ్ల తర్వాత అండాశయ కణజాలాన్ని తన శరీరంలోకి ప్రవేశపెట్టేందుకు అవసరమైన డాక్యుమెంటేషన్ ఆమె వద్ద లేదు.
ఈ ప్రయత్నంలో డాక్టర్ మాథ్యూస్ ఆమెకు మద్దతు ఇచ్చారు. చివరికి, ఆ ప్రక్రియను నిర్వహించడానికి అంగీకరించిన ఇజ్రాయెల్‌లోని ఒక క్లినిక్‌ను కనుగొనడంలో బేకన్కు సహాయం చేశారు.
ఫ్రీజ్ చేసిన ఆ కణజాలాన్ని ఇజ్రాయెల్‌లోని రమత్ గాన్‌లో ఉన్న షెబా మెడికల్ సెంటర్‌కు పంపారు. కానీ, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేయడంతో, బేకన్ ఎదురుచూస్తున్న ఆ ప్రక్రియ ఆలస్యమైంది.
దీని తర్వాత, గాజాలో సైనిక చర్యను ఇజ్రాయెల్ ప్రారంభించింది.
నా ఒకే ఒక ఆశ ఆవిరైపోయిందనిపించింది
''నా ఆశ ఆవిరైపోయిందా?'' అనిపించిందని బేకన్ బీబీసీ వరల్డ్ సర్వీసుకు తెలిపారు.
2024 మే నెలలో కొంత కాలం పాటు కాల్పుల విరమణ ప్రకటించారు.
దీనివల్ల బేకన్ ఇజ్రాయెల్‌కు ప్రయాణించి, తన కణజాలాలను సురక్షితంగా తిరిగి తన శరీరంలోకి అమర్చుకోవడానికి వీలు కలిగింది.
బేకన్ బ్రిటన్‌కు తిరిగి వెళ్లడానికి విమానం ఎక్కిన కొన్ని గంటల్లోనే కాల్పుల విరమణ ముగిసింది.
అండాశయ కణజాలాన్ని తిరిగి శరీరంలో ఎలా ప్రవేశపెడతారు?
తొలుత అండాశయాల నుంచి అండాలను ఉత్పత్తి చేసే కొంత కణజాలాలను సర్జన్లు తొలగిస్తారు.
ఆ తర్వాత రోగి బిడ్డను కనడానికి సిద్ధమయ్యేంత వరకు ఒక ల్యాబ్‌లో వాటిని భద్రపరుస్తారు.
ఈ కణజాలాలను తిరిగి శరీరంలోకి ప్రవేశపెట్టే ప్రక్రియ, చర్మంలోని ఒక భాగాన్ని తీసి మరొక ప్రదేశంలో అమర్చడాన్ని పోలి ఉంటుంది.
గడ్డకట్టించిన కణజాలాన్ని కరిగించి, మిగిలిన అండాశయంపైన లేదా దానికి సమీపంలో అతికేలా చేస్తారు (గ్రాఫ్ట్ చేస్తారు).
దీని తర్వాత, ఈ కణజాలం చుట్టుపక్కల రక్త నాళాలతో మళ్లీ కలుస్తుంది. అండాశయం ప్రతి నెలా ఒక అండం విడుదల చేయడం ప్రారంభిస్తుంది.
94 శాతం వరకు కేసులలో మహిళల రుతుక్రమం, ఎగ్ ప్రొడక్షన్ సైకిల్స్ తిరిగి ప్రారంభమైనట్లు 2024 అధ్యయనంలో వెల్లడైంది.
2022లోని మరొక అధ్యయనం ప్రకారం.. అండాశయ కణజాల మార్పిడి కేసులలో దాదాపు 28 శాతం కేసుల్లో వారు బిడ్డను కన్నారు.
2016లో దుబాయ్‌కు చెందిన 24 ఏళ్ల మోజా అల్ మత్రూషి, ప్రసవానికి ముందు తన అండాశయాలను ఫ్రీజ్ చేయించుకున్న ప్రపంచంలోనే మొదటి మహిళగా పేరొందారు.
ఆమె యుక్తవయస్సు రాకముందే ఆమె అండాశయాలను ఫ్రీజ్ చేశారు.
అండాశయ కణజాల మార్పిడి తర్వాత ప్రపంచవ్యాప్తంగా 200 మందికి పైగా శిశువులు జన్మించినట్లు అంచనాలున్నాయి.

ఫొటో సోర్స్, Sarah Matthews
'నాకు నేను ధన్యవాదాలు చెప్పుకోవాలి'
2024లో, కణజాలాన్ని తిరిగి అమర్చిన కొద్ది నెలలకే బేకన్ రుతుక్రమం మళ్లీ ప్రారంభమైంది.
ఆమె సహజంగా గర్భం దాల్చడానికి ప్రయత్నించారు. కానీ, సహజంగా ఆమె గర్భం దాల్చలేకపోయారు.
ఆ తర్వాత.. డాక్టర్లు సూచన మేరకు ఆమె, తన భాగస్వామి ఐవీఎఫ్ చికిత్స తీసుకున్నారు.
వీరు మూడుసార్లు ఐవీఎఫ్ చికిత్స చేయించుకున్నారు. చివరికి 2025 క్రిస్మస్ రోజున, బేకన్కు ప్రెగ్నెన్సీ టెస్టు కన్ఫామ్ అయింది.
"నా 19 ఏళ్ల వయసులో నా శరీరంలో ఉన్న 'తల్లిని కాగలిగే సామర్థ్యం', 43 ఏళ్ల వయసులో నాకు ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించింది" అని ఆమె అన్నారు.
బేకన్ కొడుకు లాండన్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో పుట్టాడు. 25 ఏళ్లకు బేకన్ క్యాన్సర్ రహితంగా మారారు.
ప్రజలు ఆమె కథను, దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నారు
బేకన్ తన స్టోరీని పంచుకున్న తర్వాత.. ఆమె స్టోరీ తమకు ధైర్యాన్ని ఇచ్చిందంటూ.. పలువురు మహిళలు పలు సందేశాలను పంపించారు.
ఈ రోజుల్లో, చిన్న వయసులో క్యాన్సర్‌తో బాధపడే రోగులతో భవిష్యత్తులో తల్లిదండ్రులు అయ్యే అవకాశాల గురించి చర్చించడం గతంలో కంటే చాలా ముఖ్యమని డాక్టర్ మాథ్యూస్ అన్నారు.
ఎందుకంటే, చిన్నతనంలో వచ్చే క్యాన్సర్ నుంచి కోలుకునే అవకాశాలు మరింత మెరుగవ్వడమే ఇందుకు ఒక కారణం.
'' ఈ పిల్లలు పెరిగి, సాధారణ జీవితాలు గడపాలని మేం కోరుకుంటున్నాం'' అని మాథ్యూస్ అన్నారు.
బేకన్ కథ విన్న తర్వాత ఇతరుల వల్లే తాను కూడా అంత చిన్న వయసులోనే ప్రదర్శించిన ధైర్యసాహసాలకు, పట్టుదలకు ఆశ్చర్యపోయినట్లు మాథ్యూస్ తెలిపారు.
''నేను ఇప్పటికీ 18 ఏళ్ల వయసులో ఉన్న నన్ను నేను ఊహించుకుని, 'నేను అంత కష్టపడి ఎలా ప్రయత్నించగలిగాను? నా నిర్ణయం మీద అంత దృఢంగా ఎలా నిలబడగలిగాను?' అని ఆలోచిస్తూ ఉంటాను" అని బేకన్ చెప్పారు.
''నేను వెనక్కి తిరిగి చూసుకుని, నాకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన విషయాలలో ఇదొకటి'' అని అనుకుంటున్నానని అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























