కోల్‌కతా: దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట.. 19 మంది మృతి

కోల్‌కతాలో దుర్గాపూజ సందర్భంగా తొక్కిసలాటలో 19మంది చనిపోయారు
ఫొటో క్యాప్షన్, 90 ఏళ్ల చరిత్ర కలిగిన చోర్‌బగాన్ పూజా మండపం ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి
ప్రచురణ
చదివే సమయం: 3 నిమిషాలు

కోల్‌కతాలోని దుర్గా పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగి కనీసం 19 మంది మృతి చెందినట్లు పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి శుభేందు అధికారి ప్రకటించారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డారని, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు.

‘‘ఈవిషాద ఘటనలో ఇప్పటిదాకా 19మంది మరణించారు. వీరిలో యువతులు, పిల్లలే ఎక్కువమంది ఉన్నారు. ఇది అత్యంత బాధ కలిగించే ఘటన’’ అని శుభేందు పేర్కొన్నారు.

అక్టోబర్ 17వతేదీ సాయంత్రం 7.30 గంటల సమయంలో నగరంలోని గిరీష్ పార్కు పోలీస్ స్టేషన్ పరిధిలో చోర్‌బగాన్ పూజా మండపం నుంచి బయటకు వెళ్లే ద్వారం వద్ద తొక్కిసలాట జరిగిందని కోల్‌కతా పోలీసులు తెలిపారు.

మృతులు, క్షతగాత్రుల వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. వారిలో చాలామంది కోల్‌కతా వెలుపల ఉన్న వివిధ జిల్లాల నుంచి దుర్గా పూజ చూడటానికి వచ్చినట్లు భావిస్తున్నారు.

ఘటనాస్థలికి సమీపంలోని ఓ భవనం నుంచి చిత్రీకరించిన వీడియోను తృణమూల్ కాంగ్రెస్ నేత కునాల్ ఘోష్ సహా పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ఆ వీడియో కొంత అస్పష్టంగా ఉన్నప్పటికీ.. అందులో చాలామంది నేలపై పడివున్నట్లు కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
కోల్‌కతాలోని ప్రముఖ దుర్గా పూజా మండపం, తొక్కిసలాట
ఫొటో క్యాప్షన్, తొక్కిసలాట బాధితులను ఆస్పత్రికి తరలిస్తున్న దృశ్యాలు (ఎడమవైపు పైన, కింద), ఘటనలో గాయపడిన మహిళ (కుడివైపు).

'మోటార్ సైకిళ్లపై తరలించారు'

కోల్‌కతాలో బీబీసీ అసోసియేట్ జర్నలిస్టుగా పనిచేస్తున్న పీఎం తివారీ తెలిపిన వివరాల ప్రకారం.. మండపం బయట భారీగా జనం గుమిగూడారు. అదే సమయంలో వర్షం కురుస్తుండటంతో తొక్కిసలాట జరిగింది. ఘటనలో చాలామంది మరణించారు.

తీవ్రంగా గాయపడినవారిని ఆస్పత్రిలో చేర్చినట్లు ఆయన తెలిపారు. ఘటనాస్థలికి ముఖ్యమంత్రి, సీనియర్ పోలీసు అధికారులు చేరుకున్నారు.

ముఖ్యమంత్రి శుభేందు అధికారి, ప్రధాన కార్యదర్శి మనోజ్ అగర్వాల్ కోల్‌కతా మెడికల్ కాలేజ్ అండ్ ఆస్పత్రి (ఎంసీహెచ్‌)కి వెళ్లి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది.

ఈ ఘటనలో కనీసం 25 మంది గాయపడినట్లు పీటీఐ వెల్లడించింది.

"చాలామంది స్పృహ కోల్పోయారు. కొందరిని మోటార్‌సైకిళ్లపై తీసుకెళ్తున్నారు. ఇదంతా నా చుట్టూ జరిగింది. స్పృహ కోల్పోతున్న వారిని బైక్‌లపై తరలించారు. అక్కడ భారీగా జనం కూడా ఉన్నారు" అని ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి ఏఎన్‌ఐ వార్తా సంస్థతో చెప్పారు.

కోల్‌కతాలోని ప్రముఖ దుర్గా పూజా మండపం, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి శుభేందు అధికారి
ఫొటో క్యాప్షన్, ముఖ్యమంత్రి శుభేందు అధికారి ఆస్పత్రికి వెళ్లి, చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించినట్లు వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఈ ఘటనపై ఎక్స్‌లో స్పందించారు.

"చోర్‌బగాన్ పూజా మండపం వద్ద తొక్కిసలాట జరిగినట్లు తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఎంతో బాధపడ్డాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని, ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబాలకు ధైర్యం, మనోబలం కలగాలని దుర్గామాతను ప్రార్థిస్తున్నాను" అని తెలిపారు.

"ఉత్తర కోల్‌కతాలోని చోర్‌బగాన్ పూజా మండపం వద్ద అత్యంత దురదృష్టకర ఘటన జరిగింది. అక్కడ ఉన్న కొందరు భక్తులను ఎంసీహెచ్‌కు తరలిస్తున్నారు. ఈ ఘటన ఎలా, ఎందుకు జరిగిందనే విషయాలపై తర్వాత చర్చించవచ్చు. ప్రస్తుతం ప్రజల ప్రాణాలను కాపాడటమే మా ప్రాధాన్యం. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది సంఖ్యను పెంచాలని పోలీసు యంత్రాంగాన్ని కోరుతున్నాం. మా కార్యకర్తలు సహకరిస్తున్నారు. పోలీసులకు కూడా మేం సహకరిస్తున్నాం. మండపం లోపల ఇంకా సహాయక చర్యలు చేపట్టాల్సి ఉంది. పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాం. పూజా సమయంలో ఇలాంటి ఘటన జరగడం అత్యంత దురదృష్టకరం" అని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత కునాల్ ఘోష్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)