కొలంబస్ కన్నా ముందే అమెరికాను చేరుకున్న వైకింగ్స్ ఎవరు?

ఫొటో సోర్స్, Alamy
- రచయిత, ఫియోనా మెక్‌డొనాల్డ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 7 నిమిషాలు
దాదాపు క్రీస్తుశకం వెయ్యో సంవత్సరంలో నోర్స్ ప్రజలు కెనడా చేరుకున్నారు. అక్కడినుంచి మరిన్ని ప్రాంతాలు అన్వేషించడానికి దాన్నొక స్థావరంగా ఉపయోగించుకున్నారు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి అమెరికా చేరిన తొలి యూరోపియన్ల "మరుగునపడ్డ చరిత్ర"ను బీబీసీ పరిశీలించింది.
క్రిస్టోఫర్ కొలంబస్ 1492లో సముద్ర ప్రయాణం చేశారు. కచ్చితంగా చెప్పాలంటే అదే ఏడాది అక్టోబర్ 12న ఆయన బహామాస్దీవులకు చేరుకున్నారు. కానీ ఇప్పుడు మనం అమెరికా అని పిలిచే భూభాగానికి చేరుకున్న తొలి యూరోపియన్ ఆయన కాదు. ఆయనకంటే ముందుగానే మరికొందరు యూరోపియన్లు అక్కడికి చేరుకున్నారు.
అయితే వాళ్లు అక్కడికి వెళ్లిన విషయం పెద్దగా ప్రచారంలోకి రాలేదు. వాళ్లు తిరిగి వచ్చినప్పుడు రాజుల నుంచి అధికారిక ప్రకటనలు వెలువడలేదు. వీధుల వెంట ప్రజలు నిలబడి వారికి స్వాగతం పలకలేదు.
అంతేకాదు...వాళ్లు ఒక ఖండం నుంచి మరో ఖండానికి నేరుగా అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటుకుంటూ ప్రయాణించలేదు.
దాని బదులుగా వాళ్లు దశలవారీగా ప్రయాణిస్తూ అక్కడకు చేరుకున్నారు. ఐస్లాండ్, గ్రీన్‌లాండ్‌లను మధ్యలో ప్రయాణ విరామ కేంద్రాలుగా ఉపయోగించుకున్నారు.

వాళ్ల అన్వేషణ కథలు ఎన్నో శతాబ్దాల తర్వాత "సాగాలు" రూపంలో మళ్లీ వెలుగులోకొచ్చాయి. అవి చరిత్ర పుస్తకాల కంటే సాహసగాథలన్న అభిప్రాయం ఎక్కువ కలుగుతుంది.
క్రిస్టోఫర్ కొలంబస్ కంటే సుమారు 500 సంవత్సరాల ముందే వాళ్లు అమెరికా నేలపై తొలిసారి అడుగుపెట్టారు.
'నోర్స్ సాగాలు' అంటే వైకింగుల వారసులు రాసిన కథలు. వీటిలో విశ్వసనీయమైన చారిత్రక వాస్తవాలు ఉన్నాయని ఇప్పుడు గుర్తిస్తున్నారు.

‘కొలంబస్ అమెరికా చేరుకోవడానికి 500ఏళ్ల కంటే ముందే...’
14వ శతాబ్దానికి చెందిన ఫ్లాటేయర్ బోక్ లేదా ఫ్లాటే ఐస్లాండ్ బుక్‌ను ''ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత విలువైన ఐస్లాండ్ మాన్యుస్క్రిప్ట్ల్లో ఒకటి'' అని బీబీసీ వ్యాఖ్యాత మాగ్నస్ మాగ్నసన్ 1966లో చెప్పారు.
ఈ పుస్తకం ఎంత విలువైనదంటే 1893లో చికాగో వరల్డ్ ఫెయిర్ నిర్వాహకులు కొలంబస్ ప్రయాణానికి 400 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆలస్యంగా నిర్వహించిన వేడుకల కోసం ఈ గ్రంథాన్ని అప్పుగా ఇవ్వమని కోరారని ఆయన చెప్పారు.
ఆ పుస్తకాన్ని తీసుకురావడానికి డెన్మార్క్‌కు యుద్ధనౌకను పంపుతామని, అమెరికాలో రవాణా కోసం సాయుధ బలగాల రక్షణతో రైలును ఏర్పాటు చేస్తామని, అంతేకాక పది లక్షల డాలర్ల బీమా సైతం కల్పిస్తామని వాళ్లు ప్రతిపాదించారు.
ఆ సమయంలో ఆ గ్రంథం డెన్మార్క్‌లో ఉండేది.
అయినప్పటికీ డెన్మార్క్ ప్రభుత్వం ఆ ప్రమాదాన్ని స్వీకరించడానికి సిద్ధపడలేదు.
అమెరికన్లు ఆ పుస్తకం కావాలని అంతగా ఎందుకు కోరుకున్నారంటే... ఆ పుస్తకంలో పదో శతాబ్దంలో నోర్స్ ప్రజలు గ్రీన్లాండ్లో ఏర్పరుచుకున్న స్థిర నివాసాల గురించి వివరాలున్నాయి.
అంతకంటే ఆశ్చర్యకరమైనవిషయం ఏంటంటే ఆ తర్వాత కొన్నేళ్లకు వాళ్లు ఉత్తర అమెరికాను కనుగొని, అక్కడ వలస స్థావరాలు ఏర్పాటుచేసేందుకు ప్రయత్నించిన కథ కూడా అందులో ఉంది.
అది కొలంబస్కు అమెరికా చేరుకోడానికి ఐదు శతాబ్దాల ముందటి విషయం.

‘మరుగున పడ్డ చరిత్రకు ఆరంభం’
1960లో కెనడాలోని న్యూఫౌండ్లాండ్ ప్రాంతంలో ఉన్న లాన్స్ ఆక్స్ మెడోస్ దగ్గర నోర్స్ ప్రజల తాత్కాలిక స్థావరాన్ని గుర్తించారు.
వైకింగులు వెయ్యేళ్ల క్రితమే ఆ ప్రాంతంలో నివసించారని 2021లో కొత్త కాల నిర్ధరణ పద్ధతిని ఉపయోగించి పరిశోధకులు గుర్తించారు.
ఉత్తర అమెరికా లోపల మరిన్ని ప్రాంతాల లోతైన అన్వేషణకు ఈ స్థావరాన్ని ప్రధాన కేంద్రంగా ఉపయోగించుకుని ఉంటారని భావిస్తున్నారు.
"ఇది ఒక మరుగునపడ్డ చరిత్రకు ఆరంభం. యూరోపియన్లు అమెరికాను సందర్శించిన ఆ శతాబ్దాల చరిత్రకు సంబంధించిన రికార్డులు నీటిపైనే రాసినట్టుగా ఉన్నాయి. అంటే వారి ప్రయాణానికి సంబంధించిన ఆధారాలు చాలా తక్కువగా ఉన్నాయి" అని బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ టైమ్వాచ్లో 1997లో ప్రసారమైన ఓ ఎపిసోడ్లో రాబిన్ ఎల్లిస్ చెప్పారు.
నోర్స్ ప్రజలు సుమారు క్రీస్తు శకం 870లో ఐస్లాండ్ను కనుగొన్నారు.
దాదాపు 100 సంవత్సరాల తర్వాత గ్రీన్లాండ్కు చేరుకున్నారు.
అక్కడి నుంచి ఆధునిక కెనడాలోని బాఫిన్ దీవి వరకు చేరుకోవడానికి డేవిస్ జలసంధిని దాటితే సరిపోయేది. అది 200 మైళ్లు మాత్రమే ఉంటుంది.
ఆ ప్రాంతాన్ని నోర్స్ ప్రజలు హెల్లులాండ్ అని పిలిచేవారు. అంటే పెద్ద రాతి పలకల నేల అని అర్థం.
సాగాల ప్రకారం వాళ్లు అక్కడినుంచి తీరప్రాంతం వెంబడి దక్షిణ దిశగా ప్రయాణించి ప్రస్తుత లాబ్రడార్ ప్రాంతానికి చేరుకున్నారు. దాన్ని వాళ్లు మార్క్లాండ్ అని పిలిచారు.
అంటే "అడవుల నేల" అని అర్థం.
అక్కడి నుంచి ఇంకా దక్షిణంగా వెళ్లి విన్లాండ్ చేరుకున్నారు.
విన్లాండ్ అంటే "ద్రాక్ష తీగలు పెరిగే నేల" అని అర్థం.
"వాళ్లు ఒక ప్రాంతంలో కాకుండా అనేక ప్రాంతాల్లో ఆగినట్టు సాగాల్లో వివరించారు" అని ఐస్లాండ్ యూనివర్శిటీకి చెందిన ఎమిలీ లెత్‌బ్రిడ్జ్ 2016లో టైమ్వాచ్ కార్యక్రమంలో చెప్పారు.
"వాళ్లు అనేక సంవత్సరాల పాటు అక్కడే ఉండిపోయారు"
"అన్వేషించడానికి వారికి పూర్తిగా కొత్త ప్రపంచం కనిపించింది" అని ఆమె వివరించారు.

‘ఆల్థింగ్ అంటే’
సాగాల ప్రకారం నోర్స్ ప్రజల్లో అత్యంత ప్రసిద్ధి చెందిన వలసదారుడు ఎరిక్ ది రెడ్.
హత్యకు సంబంధించిన ఆరోపణలతో ఆయన తండ్రిని నార్వే నుంచి బహిష్కరించడంతో ఎరిక్ దాదాపు క్రీస్తు శకం 960 ప్రాంతంలో ఐస్లాండ్కు చేరుకున్నారు.
క్రీ.శ. 932 నాటికే ఐస్లాండ్ ప్రజలు ఆల్థింగ్ అనే పార్లమెంటును ఏర్పాటు చేసుకున్నారు.
ఇది మొత్తం దేశ ప్రజలంతా పాల్గొనే బహిరంగ సభ.
ప్రతి వేసవిలో రెండు వారాల పాటు ఈ సభ జరిగేది.
చట్టాలు రూపొందించడం, న్యాయపరమైన విషయాలను పరిష్కరించడం దాని ప్రధాన ఉద్దేశాలు.
ఈ సభ జరిగే ప్రదేశం కూడా చాలా ప్రత్యేకమైనది. సహజంగా ఏర్పడిన ఓ లోయలో ఈ సభ నిర్వహించేవారు. ఆ లోయ అద్భుతమైన సహజ రంగస్థలంలా ఉండేది.
"ఈ ప్రదేశాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కేవలం ధ్వని, ప్రతిధ్వని మాత్రమే కాదు. ఇది భూమి పొరల్లో సహజంగా ఏర్పడిన చీలిక ఉన్న ప్రాంతం. మనం ప్రస్తుతం ఉత్తర అమెరికా, యూరేషియా టెక్టానిక్ ప్లేట్లు కలిసే ప్రదేశంలో నిలబడి ఉన్నాం" అని లెత్‌బ్రిడ్జ్ బీబీసీకి వివరించారు.
సమాజ నియమాలను తీవ్రంగా ఉల్లంఘించిన వారికి ఆల్థింగ్‌లో దేశ బహిష్కరణ శిక్ష విధించేవారని లెత్‌బ్రిడ్జ్ చెప్పారు.
"మీరు ప్రపంచంలో మరెక్కడికైనా వెళ్లొచ్చు. కానీ శిక్ష అమల్లో ఉన్నంతకాలం ఐస్లాండ్లో అడుగుపెట్టకూడదు" అని ఆమె వివరించారు.

‘చరిత్రలో అద్భుతమైన అధ్యాయానికి దారితీసిన ఓ బహిష్కరణ ఘటన’
క్రీ.శ. 982లో పొరుగున ఉన్న ఒక రైతుతో జరిగిన హింసాత్మక వివాదం తరువాత ఎరిక్ ది రెడ్ను ఐస్లాండ్ నుంచి ఆల్థింగ్ బహిష్కరించింది.
ఆ బహిష్కరణే వైకింగుల అన్వేషణ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయానికి నాంది పలికింది.
" గ్రీన్‌లాండ్‌ను కనుగొని అక్కడ శాశ్వత నివాసం ఏర్పాటు చేసిన తొలి ఐస్లాండ్ వ్యక్తి ఎరిక్ ది రెడ్" అని లెత్‌బ్రిడ్జ్ చెప్పారు.
ఆయన గ్రీన్లాండ్లో ఒక వలస స్థావరాన్ని నెలకొల్పారు.
అది దాదాపు 500 సంవత్సరాలపాటు కొనసాగింది.
అదే ఉత్తర అమెరికాలో నోర్స్ ప్రజల అన్వేషణలకు ప్రారంభ కేంద్రంగా మారింది.
"వాళ్లు సాహసాలకు వెనకాడని ప్రజలు. "ఏం దొరుకుతుందో, తామేమి కనుగొనగలమో తెలుసుకోవడానికి తెరిచి ఉన్న చిన్న పడవల్లో అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటేంతటి శారీరక కష్టాలను ఎదుర్కొనడానికి సిద్ధపడేవారు" అని లెత్‌బ్రిడ్జ్ చెప్పారు.
గ్రీన్లాండ్లో నోర్స్ కాలనీ 15వ శతాబ్దం ప్రారంభం వరకు కొనసాగింది.
ఎరిక్ కుమారుడు లీఫ్ ఎరిక్సన్ నేతృత్వంలో వైకింగులు గ్రీన్లాండ్ నుంచి ఉత్తర అమెరికాకు ఒక్కసారి మాత్రమే కాకుండా అనేకసార్లు సముద్రప్రయాణాలు చేసినట్టు ఆధారాలు సూచిస్తున్నాయి.
"లీఫ్ ఎరిక్సన్, ఆయన స్నేహితులు విన్లాండ్కు వచ్చి అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోయిన తర్వాత కొత్త ప్రపంచం గురించి మరే సమాచారం తెలియలేదని చాలా మంది అనుకుంటారు" అని కెనడియన్ మ్యూజియం ఆఫ్ సివిలైజేషన్కు చెందిన పురావస్తు శాస్త్రవేత్త రాబర్ట్ మెక్‌గీ టైమ్వాచ్ కార్యక్రమంలో చెప్పారు.
"కానీ పురావస్తు ఆధారాలను పరిశీలిస్తే నోర్స్ ప్రజలు ఆ తర్వాత మరో రెండు లేదా మూడు శతాబ్దాల పాటు కూడా అప్పుడప్పుడు కొత్త ప్రపంచానికి ప్రయాణాలు చేస్తూనే ఉన్నారని తెలుస్తోంది"అని ఆయన వివరించారు.

విన్లాండ్ గురించి కొలంబస్కు తెలుసా?
"గ్రీన్లాండ్, ఉత్తర అమెరికా అని మనం పిలిచే ఈ రెండు ప్రాంతాల తీరాల వెంట మధ్యయుగాల కాలమంతటా సముద్ర ప్రయాణాలు కొనసాగినట్టు మన దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయి" అని మధ్యయుగ సముద్రయాన చరిత్రకారిణి కిర్‌స్టెన్ సీవర్ టైమ్వాచ్ కార్యక్రమంలో చెప్పారు.
"1480 నాటికే వాళ్లు ఉత్తర అమెరికాకు లేదా వాళ్లు బ్రెజిల్ ద్వీపమని పిలిచే ప్రాంతానికి నేరుగా ప్రయాణించేందుకు ప్రయత్నించినట్టు మనకు తెలుసు"
"అది వాళ్ల మొదటి సముద్రయానంగా మనం భావించకూడదు. గ్రీన్లాండ్ మీదగా కాకుండా నేరుగా అక్కడకు చేరుకోడానికి వాళ్లు చేసిన మొదటి ప్రయత్నంగా చూడాలి. ఎందుకంటే అప్పటివరకు గ్రీన్‌లాండ్‌ను మార్గమధ్య సూచికగా ఉపయోగించుకోవడం సాధారణ నావిగేషన్ పద్ధతి'' అని ఆమె వివరించారు.
ఇలాంటి సముద్ర ప్రయాణాల గురించి కొలంబస్కు కూడా తెలుసని సూచించే మరో పత్రాన్ని కూడా సీవర్ ప్రస్తావించారు.
1497-98 శీతాకాలంలో జాన్ డే అనే ఆంగ్లేయుడు క్రిస్టోఫర్ కొలంబస్కు ఓ లేఖ రాశారు. 1497లో జాన్ కాబట్ ఉత్తర అమెరికాకు చేసిన విజయవంతమైన ప్రయాణం గురించి ఆ లేఖలో వివరించారు.
ఆ లేఖలో అనేక ఇతర విషయాలతో పాటు ఓ ముఖ్యమైన విషయాన్ని కూడా సహజంగా ప్రస్తావించారు.
బ్రిస్టల్‌కు చెందిన నావికులు చాలా సంవత్సరాలుగా ఉత్తర ప్రాంతాలకు ఈ ప్రయాణం చేస్తున్నారని, కొలంబస్కు ఈ విషయం తెలుసని ఆ లేఖలో జాన్ డే తెలిపారు.
అంటే 1492లో కొలంబస్ బహామాస్ తీరాలకు చేరుకునే సమయానికే వైకింగులు విన్లాండ్ అని పిలిచిన ప్రాంతం గురించి ఆయనకు తెలిసి ఉండే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
కొలంబస్ అసలు ఉద్దేశమేంటి?
యూరోపియన్లు అప్పటికే కనుగొన్న భూభాగానికి వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగానే తప్పించుకోడానికి కొలంబస్ ప్రయత్నించి ఉండవచ్చనే సిద్ధాంతాలూ ఉన్నాయి.
"ఉత్తర అర్ధగోళంలో సముద్రాలను దాటి ప్రయాణించాలంటే అక్షాంశాల మధ్య దూరం తక్కువగా ఉండే ఉత్తర ప్రాంతానికి వెళ్లి అక్కడినుంచి వేగంగా సముద్రాన్ని దాటి ఆ తర్వాత మళ్లీ దక్షిణంవైపు వెళ్లాలని ఇప్పటి నావికులకు తెలిసినట్టే కొలంబస్కు కూడా తెలుసు'' అని మెక్‌గీ టైమ్వాచ్లో చెప్పారు.
"కానీ ఆయన ఆ మార్గాన్ని ఎంచుకోలేదు. దాని బదులుగా నేరుగా సముద్రాన్ని దాటి దక్షిణ దిశలో పొడవైన మార్గాన్ని ఎంచుకున్నారు. బహుశా ఆయన కెనడాను తప్పించుకునేందుకు ప్రయత్నించి ఉండొచ్చు. బహుశా విన్లాండ్ను కూడా తప్పించుకోవాలనుకుని ఉండొచ్చు. ఎందుకంటే ఆయన వెతుకుతున్నది అది కాదు. ఆయన అసలు లక్ష్యం అమెరికాను దాటేసి, తూర్పు ఆసియాలోని సంపదలను చేరుకోవడమేనని నేను భావిస్తున్నాను" అని మెక్‌గీ చెప్పారు.
కాబట్టి ప్రతి అక్టోబర్‌లో కొలంబస్ డే జరుపుకునే అమెరికన్లు, ఆయనకంటే ముందే అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి ప్రయాణించిన వారిని కూడా గుర్తుంచుకోవాలి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























