‘‘నేను మాట్లాడేవన్నీ నా ఫోన్ రహస్యంగా వింటోందా? అందుకే ఆ యాడ్స్ వస్తున్నాయా?’’ అని మనకు ఎందుకు అనిపిస్తుంది?

ఫొటో సోర్స్, Getty Images
మొబైల్ లేకుండా రోజువారి జీవితం గడవడం అంత సులభం కాదని ఎలాంటి సందేహం లేకుండా చెప్పవచ్చు. ఎక్కువ మంది యువత రోజులో సగటున 4 గంటల 37 నిమిషాలు ఫోన్‌తోనే గడుపుతున్నట్టు ఒక సర్వేలో తేలింది.
ఫోన్‌ను చేత్తో పట్టుకునో, జేబులో పెట్టుకునో తిరుగుతున్న సమయంలో, లేదంటే మనకు అందుబాటులో ఉంచుకున్నప్పుడో ఈ పరికరం మనల్ని గమనిస్తుందా? మన మాటల్ని వింటుందా? దీనిపై మరింత లోతైన సమాచారాన్ని బీబీసీ అందిస్తోంది.
మీ మాటలు ఫోన్ వినగలదని, మీ మనసును చదవగలదని చెబుతూ అనేక పోస్టులు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. ఉదాహరణకు మీరు ఎవరితోనైనా నేరుగా ఏదైనా విషయం గురించి మాట్లాడితే, దానికి సంబంధించిన ప్రకటన (అడ్వర్టయిజ్మెంట్) మీ సోషల్ మీడియాలో కనిపిస్తుందని చాలామంది చెబుతుంటారు. దీన్ని మీరు కూడా గమనించారా?
ఈ అంశంపై చాలామంది సోషల్ మీడియా యూజర్లు ఆందోళన వ్యక్తం చేశారు. యాప్‌లు ద్వారా కంపెనీలు ప్రజలను ట్రాక్ చేస్తున్నాయనే అభిప్రాయాన్ని చాలామంది యూజర్లు షేర్ చేసుకుంటున్నారు. ఇది నిజమేనని మరికొందరు నమ్ముతున్నారు.
అయితే, మీరు స్నేహితులతో నేరుగా మాట్లాడిన తర్వాత ఆ విషయాలకు సంబంధించిన ప్రకటనలు మీకు సోషల్ మీడియాలో కనిపించడం యాదృచ్ఛికం కావచ్చు. కానీ అలా ఎందుకు జరిగిందనే ప్రశ్న మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది.

ఇంటర్నెట్ ఫోన్ల గురించి ఉన్న వాదనలు ఏంటి?
ఒక నిర్దిష్ట అంశానికి సంబంధించి కంటెంట్‌తో మీరు ఎలా ఇంటరాక్ట్ అవుతారనే దానిపై ఆధారపడి అలాంటి విషయానికి సంబంధించిన మరిన్ని పోస్టులు కనిపిస్తాయి. మీరు ఏ పోస్టులు చూస్తారు, పంచుకుంటారు, లైక్ చేస్తున్నారు అనే అంశాల ఆధారంగా మీ ఆన్లైన్ ప్రవర్తను సోషల్ మీడియా అల్గారిథమ్‌లు విశ్లేషిస్తాయి. మీకు ఎలాంటి కంటెంట్ చూపించాలో అవి నిర్ణయిస్తాయి.
ఈ యాప్‌లు వినియోగదారుల సమాచారాన్ని సేకరిస్తున్నాయని కొంతమంది ఆన్లైన్ కంటెంట్ క్రియేటర్లు చెబుతున్నారు. అయితే ఫోన్ సెట్టింగ్‌లలో కొన్ని మార్పులు చేయడం ద్వారా దానిని నిరోధించవచ్చని కూడా అంటున్నారు. అయితే ఈ వాదనలకు ఇప్పటి వరకు అధికారికంగా ధ్రువీకరణ లభించలేదు.
ప్రభుత్వాలు, కంపెనీలు ఏం చేస్తున్నారో చెప్పకుండానే తమపై గూఢచర్యం చేస్తున్నాయని మరికొందరు కుట్ర సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు.
నిజంగానే నా ఫోన్ నా మాటలు వింటోందా?
దీనికి సమాధానం అవును, కాదు అని చెప్పవచ్చు. అయితే చాలామంది అనుకున్న విధంగా మాత్రం ఉండదు. సిరి, అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వాయిస్ అసిస్టెంట్లను యాక్టివ్ చేయడానికి స్మార్ట్ఫోన్లు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. 'హే సిరి' వంటి నిర్దిష్ట పదాలు వినిపించినప్పుడు మాత్రమే అవి స్పందించి, మీరు అడిగిన విషయాన్ని ఇంటర్నెట్లో వెతుకుతాయి.
యాప్‌లను సిఫార్సు చేయడానికి, మీ సూచనల మేరకు స్పందించడం వంటి సేవల కోసం వాయిస్ అసిస్టెంట్లు స్వర సంబంధిత సమాచారాన్ని ఉపయోగించుకుంటాయి.
అయితే, మన రోజు వారి సంభాషణలు రికార్డు అవుతున్నాయని చెప్పడానికి మాత్రం ఎలాంటి ఆధారాలు లేవు. వినియోగదారుల వ్యక్తిగత సంభాషణలు వింటుందనే ఆరోపణలను గతంలోనే ఇన్స్టాగ్రామ్ ఖండించింది.
మీరు మాట్లాడుకునే విషయం గురించి ప్రకటనలు మీ పేజీలో కనిపించడానికి అనేక కారణాలు ఉండవచ్చని ఇన్స్టాగ్రామ్ పేర్కొంది. ‘‘అది యాదృచ్ఛికం కావచ్చు, ఆ అంశానికి సంబంధించి ఏమైనా ఇంటరాక్ట్ అయ్యి ఉండొచ్చు లేదా దాని గురించి ఇంటర్నెట్లో వెతికి ఉండవచ్చు’’ అని తెలిపింది.
వెబ్సైట్ల సందర్శకుల గురించి డేటా అందించే కొందరు ప్రకటనదారులతో కలిసి పని చేస్తామని కూడా ఇన్స్టాగ్రామ్ వివరించింది. వినియోగదారుల ఆసక్తులు, కార్యకలాపాలకు దగ్గరగా ఉండే కంటెంట్‌కు సంబంధించిన యాప్‌లను చూపించడానికి ఆ డేటా వీలు కల్పిస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
మీ మాటలను ఫోన్ వింటుందని భావిస్తే ఏం చేయాలి?
మొబైల్ ఫోన్లు వినియోగదారుల సంభాషణలను 'వింటున్నాయా' అనే దానిపై ఏదైనా అధికారిక సమాచారం ఉందో లేదో తెలుసుకోవడానికి యూకే సైన్స్ ఇన్నోవేషన్, టెక్నాలజీ విభాగాన్ని బీబీసీ సంప్రదించింది.
"యాప్‌లు, సామాజిక మాధ్యమాలు, మీరు ఉపయోగించడానికి అనుమతి ఇచ్చిన మీ ఫోన్లోని విభాగాలను మాత్రమే యాక్సెస్ చేయగలవు. ఉదాహరణకు కెమెరా లేదా మ్యాప్‌ల కోసం లొకేషన్ వంటివి. అవి ముందుగా మీ అనుమతి పొందాలి. అది ఎందుకు అవసరమో వివరించాలి. మీరు మీ ఫోన్ సెట్టింగ్స్‌లో ఆ అనుమతిని తిరస్కరించవచ్చు లేదా మార్చవచ్చు" అని మంత్రిత్వశాఖ ప్రతినిధి అన్నారు.
మీరు ప్రైవసీ గురించి ఇంకా ఆందోళన చెందుతుంటే ఈ కింది సూచనలు చేసింది.
- మంచి పటిష్టమైన పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం, దాన్ని ఎవరితో పంచుకోకపోవడం.
- ఈమెయిల్ వంటి ముఖ్యమైన ఖాతాలను రక్షించుకోవడానికి టూ- స్టెప్ వెరిఫికేషన్ లేదా పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం.
- యాప్ డౌన్లోడ్ చేసే ముందు, అడిగే అనుమతులను చెక్ చేయండి.
- విశ్వసనీయమైన వెబ్‌సైట్స్‌లోనే మీ వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోండి.
- ఇంటర్నెట్లో మీ వ్యక్తిగత వివరాలు వెల్లడించే ముందు జాగ్రత్తగా ఆలోచించండి.
- సోషల్ మీడియాలో ప్రైవసీ సెట్టింగ్‌లను వినియోగించుకోండి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























