సెక్స్, స్ట్రాటజీ, పవర్: ఒడిస్సీ కథను మహిళలు ఎలా మలుపు తిప్పారు?

ది ఒడిస్సీ సినిమా, గ్రీకు వీరుడు, పురాతన కథలు

ఫొటో సోర్స్, Alamy

    • రచయిత, డైసీ డన్
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 6 నిమిషాలు

సుమారు 2,800 ఏళ్ల నాటి ఈ మహాకావ్యం ఇప్పుడు వెండితెరపైకి వస్తోంది. సూటిగా చెప్పాలంటే ఇదొక వీరుడి గాథకంటే పెద్దది.

కథానాయకుడు ఒడిస్సియస్ వీరుడైనా... మార్గమధ్యంలో ఆయనకు ఎదురయ్యే స్త్రీలు, అప్సరసలు, మంత్రగత్తెలు, దేవతల వ్యూహాలు, కపట పన్నాగాలు, ఆకర్షణలే ఈ కథను నడిపిస్తాయి. ఇవే ఆయనను ఒక సాధారణ మనిషిలా మనకు దగ్గర చేస్తాయి.

ట్రాయ్ నగరం కోసం గ్రీకులు చేసిన ట్రోజన్ యుద్ధంలో ఏళ్ల తరబడి పోరాడిన తర్వాత గ్రీకు పురాణ యోధుడైన ఒడిస్సియస్ తిరిగి తన రాజ్యం ఇథాకాకు చేరుకోవడానికి చేసిన అన్వేషణను 'ది ఒడిస్సీ' అనే ఈ పురాణ కావ్యం వివరిస్తుంది.

ఆయన పదేళ్ల తిరుగు ప్రయాణం కఠినమైన ప్రమాదాలు, సవాళ్లు, విపత్తులతో నిండి ఉంటుంది.

క్రిస్టఫర్ నోలన్ రూపొందించిన ఒడిస్సీ చిత్రంలో ఈ విశేషాలన్నీ వెండితెరపై ఆవిష్కృతమవుతున్నాయి. ఇందులో మ్యాట్ డామన్‌తో పాటు మరెందరో ప్రముఖులు నటిస్తున్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ది ఒడిస్సీ సినిమా, గ్రీకు వీరుడు, పురాతన కథలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, కాలిప్సో అనే అప్సరసతో ఒడిస్సియస్ ఏడేళ్లు కలిసి జీవించినట్లు కావ్యంలో ఉంటుంది.

హీరో పురుషుడే.. కానీ మహిళలదే ఆధిపత్యం

కథానాయకుడు పురుషుడే అయినా, ది ఒడిస్సీ అనేది స్త్రీలు ఆధిపత్యం చెలాయించే కథ.

రాజ్యానికి వెళ్లి తిరిగి దాన్ని పొందాలనే హీరో లక్ష్యం.. తిరుగు ప్రయాణంలో ఆయన కలుసుకునే స్త్రీలు, అప్సరసలు, దేవతల వ్యూహాలు, ఆకర్షణల ద్వారా ఈ కథ ప్రతి మలుపులోనూ ప్రభావితమవుతుంది. 'ది ఒడిస్సీ' కేవలం వీరత్వానికి సంబంధించిన సాధారణ కథ కాదు. నేటికీ సరిపోయే సెక్స్, వ్యూహాలు, అధికారం చుట్టూ తిరిగే కథ.

ఈ కావ్యం మధ్యలో అంటే కొన్ని సంఘటనలకు మధ్యన మొదలవుతుంది. ఒగీజియా తీర ప్రాంతంలో ఒడిస్సియస్ ఏడుస్తూ కనిపిస్తారు. అక్కడ ఆయన ఏడేళ్లుగా కాలిప్సో అనే అప్సరసతో జీవిస్తూ ఉంటారు.

యుద్ధ భూమిలో వీరుడిగా నిరూపించుకున్నప్పటికీ ఆయన పూర్తి నిస్సహాయుడిగా కనిపిస్తారు. ఎంత నిస్సహాయుడిగా కనిపిస్తాడంటే... ఆ ద్వీపం నుంచి బయటపడాలంటే దేవుళ్లు ఆయనకు సాయం చేయాలనేంతగా.

కానీ, కాలిప్సో చేతిలో బందీ కావడంకంటే, ఒడిస్సియస్ తనలో తాను బందీగా ఉండటమే ఎక్కువ. ఆయన జడత్వాన్ని, స్వదేశానికి ప్రయాణం పూర్తి చేయలేని అసమర్థతను ఆధునిక పాఠకుడు పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్‌డీ - ఒక రకమైన మానసిక ఒత్తిడి) లక్షణంగా భావించవచ్చు. అలా అని ఆయనపై కాలిప్సోకున్న ప్రభావాన్ని తక్కువ చేసి చూడలేం. తన భార్య పెనెలోప్ సాధారణ మనిషి కావడం వల్ల, అప్సరస అందంతో ఆమెను పోల్చలేమని ఒడిస్సియస్ స్వయంగా ఒప్పుకుంటారు.

అంతఃపురంలో పెనెలోప్ వ్యూహాలు

భర్త ఇన్నేళ్లుగా దూరంగా ఉన్నప్పటికీ, ఒడిస్సియస్ భార్య పెనెలోప్ ఎప్పుడూ చేతులు ముడుచుకుని కూర్చోలేదు. ఆమెను పెళ్లి చేసుకుని ఇథాకా రాజ్యానికి కొత్త రాజు కావాలని ఆశపడి అంతఃపురంలో చేరిన 108 మంది పెళ్లికొడుకుల ప్రయత్నాలను ఆమె తెలివిగా, ధైర్యంగా ప్రతిఘటిస్తారు.

తన మామ లీర్టీస్ అంతిమ సంస్కారం కోసం పెనెలోప్ ఒక వస్త్రాన్ని అల్లడం, పగటిపూట అల్లిన ఆ వస్త్రాన్ని రాత్రి పూట విప్పేయడం... ఈ కావ్యంలో అత్యంత గుర్తుండిపోయే ఘట్టాలలో ఒకటి.

ఆమె తన తెలివితేటలతో ఆ పెళ్లికొడుకులను అడ్డుకోవడంలో సాధించే విజయమే, ఒడిస్సియస్ తన రాజ్యాన్ని తిరిగి దక్కించుకోవడానికి ప్రత్యక్షంగా సహాయపడుతుంది.

ది ఒడిస్సీ సినిమా, గ్రీకు వీరుడు, పురాతన కథలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సైరన్ల పాటకు పురుషులను ఆకర్షించి మరణానికి గురిచేసే శక్తి ఉంది.

దేవతల్లో ఒక దేవి ఒడిస్సియస్‌కు ప్రధాన మద్దతుదారుగా ఉంటారు. తెలివైన వ్యూహాలకు ప్రసిద్ధి చెందిన ఎథీనా దేవత.. ట్రోయ్‌లో ఆయనకు సాయం చేస్తారు. స్వదేశానికి తిరిగి రావాలని ప్రోత్సహిస్తారు. ఆ తర్వాత ఒడిస్సియస్ తీరని నిస్సహాయ స్థితిలో ఫీసియన్ల తీరానికి కొట్టుకొచ్చినప్పుడు, ఆమె చాలా తెలివిగా ఆయనకు రక్షణ ఏర్పాటు చేస్తారు.

ఆయన బలహీనతను దాచి, ఒక దేవుడిలా, ఆ దేశపు ప్రసిద్ధిగాంచిన ఆతిథ్యానికి అర్హుడిగా కనిపించేలా ఆయన రూపాన్ని మారుస్తారు. ఇది సముద్రయానం చేసే ఫీసియన్ల మనసు గెలుచుకోవడానికి ఒడిస్సియస్‌కు ఎంతగానో తోడ్పడింది. దీంతో వారు ఆయనకు ఆశ్రయం, సంపద ఇచ్చి, సురక్షితంగా ఇథాకా చేరుకోవడానికి సాయం చేశారు.

ఒడిస్సియస్, ఆయన కుమారుడు టెలిమాకస్ ముందు ఎథీనా ప్రత్యక్షమైన ప్రతిసారీ, ఆమె పురుషుడి వేషంలోనే కనిపిస్తారు. ఉదాహరణకు, ఇథాకా రాజ్యానికి స్నేహితుడైన మెంటెస్ అనే రాజుగా, అలాగే ఫీసియన్ల దేశానికి చెందిన ఒక పురుష దూతగా ఆమె వేషం మార్చారు. భూమిపై పురుషులకే అధికారం ఉంటుందని, కానీ తెరవెనుక వ్యూహాలతో కథను నడిపించేది మాత్రం మహిళలేనని ఎథీనాకు చాలా బాగా తెలుసు.

ఒడిస్సియస్ తన ప్రయాణంలో కలిసిన పాత్రలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. ఫీసియన్ల దేశానికి చేరుకున్న తర్వాత, ఆయన ఇప్పటి వరకు తనకు ఎదురైన అనుభవాలను లోటస్ ఈటర్స్ (తామర పువ్వులు తినేవారు) నుంచి సైక్లోప్స్ (ఒంటికన్ను రాక్షసుడు) వరకు అన్ని విషయాలను అక్కడి రాజుకు వివరించారు.

ఒడిస్సియస్ చెప్పిన పురాణ మహిళల కథలు ఎంతో వింతగా, భయంకరంగా అనిపిస్తాయి. ఎందుకంటే వారు చూడటానికి ఎలాంటి ప్రమాదం లేని సాధువుల్లా కనిపిస్తూనే ఆపదలు సృష్టిస్తారు.

ది ఒడిస్సీ సినిమా, గ్రీకు వీరుడు, పురాతన కథలు

ఫొటో సోర్స్, Alamy

ఫొటో క్యాప్షన్, హోర్ కావ్యంలో సైరన్లలాగే సిర్సి అనే అందగత్తె బాహ్య రూపం వెనుక మంత్రశక్తులు దాగి ఉంటాయి.

ఆకర్షణీయమైన రూపాల వెనుక ఆపదలు

పశ్చిమ సముద్రంలో, ప్రమాదకరమైన బండరాళ్లతో ఒంటరిగా ఉండే ఒక ద్వీపంలో నివసించే సైరన్ల (సముద్ర కన్యల) పాటను వినడానికి తాను ఎంతగానో ఆరాటపడ్డానని ఒడిస్సియస్ అక్కడి రాజుకు స్వయంగా చెబుతారు. తరువాతి కాలంలో వచ్చిన గ్రీకు కళలు, సంప్రదాయాలలో సైరన్లను పక్షి లాంటి రూపం ఉన్న స్త్రీలుగా లేదా మత్స్యకన్యలుగా చూపించారు. కానీ, ఒడిస్సియస్ మాత్రం వారి మధురమైన పాటను వర్ణించడంపైనే దృష్టి పెట్టారు. ఆ పాటకు పురుషులను ఆకర్షించి మరణానికి గురిచేసే శక్తి ఉంది.

గతంలో ఆ పాట వినడానికి అక్కడ ఆగిన ఎంతోమంది పురుషుల ఎముకల కుప్పలు ఆ సైరన్లు ఉండే మైదానంలో పడి ఉన్నాయి. అయినప్పటికీ ఒడిస్సియస్ ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యారు. మంత్రముగ్ధులను చేసే ఆ సంగీతానికి పరవశించి తాను సముద్రంలోకి దూకకుండా ఉండేందుకు, తన మనుషులతో తనను ఓడ స్తంభానికి గట్టిగా కట్టేయించుకున్నారు. వినడానికి ఎంత మధురంగా ఉన్నప్పటికీ, సైరన్లు ప్రాణాంతకమైనవారు.

మరో ప్రమాదకరమైన అందగత్తె 'సిర్సి'. ఆమెను మొదటిసారి చూసినవారెవరూ ప్రమాదకారిగా భావించరు, కానీ సైరన్లలాగే ఆమె మధురమైన బాహ్య రూపం వెనుక మంత్రశక్తులు దాగి ఉన్నాయి. హోమర్ ఆమెను ఒక మంత్రగత్తెగా చిత్రించారు. ఒడిస్సియస్ సహచరులను పందులుగా మార్చగల మూలికలు, మంత్ర పానీయాలు ఆమె వద్ద ఉంటాయి.

అయితే ఒడిస్సియస్ తన ప్రయాణంలో కలిసిన అనేక వింత జీవులలాగే, సిర్సి కూడా ఓవైపు ఆటంకాలు కలిగిస్తూనే మరోవైపు సహాయం చేస్తారు. ఆమె ఒడిస్సియస్‌ను తన ప్రేమికుడిగా మార్చుకున్నప్పటికీ, ఆయన పాతాళ లోకానికి వెళ్లడానికి మార్గం సుగమం చేస్తారు. అక్కడ 'టైరీసియాస్' అనే ప్రవక్తను ఒడిస్సియస్ కలుసుకుంటారు. ఆ ప్రవక్త ఆయన తన సొంత రాజ్యమైన ఇథాకాకు తిరిగి వెళ్లడానికి అవసరమైన సలహాలు ఇస్తారు.

ఈ కథ అందించే శాశ్వత సందేశం ఏమిటంటే, భయంకరమైన రాక్షస స్త్రీలను, ప్రలోభ పెట్టే అప్సరసలను అంత తేలికగా విస్మరించలేం. విజయం సాధించాలంటే, ఒడిస్సియస్ ఒక పరిమితి వరకు వారికి లొంగిపోవాలి, కానీ పూర్తిగా కాదు. ఆయనకు ఎదురైన వ్యక్తులు, ఆయన పట్టుదలను... అలాగే సమతుల్యతను కాపాడుకునే సామర్థ్యాన్ని పదే పదే పరీక్షించారు. ఈ సమతుల్యత అనేది ప్రాచీన గ్రీకులు ఎంతోగానో ఆశించిన ఒక గొప్ప గుణం.

ది ఒడిస్సీ సినిమా, గ్రీకు వీరుడు, పురాతన కథలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఒడిస్సియస్ ప్రలోభాలకు లొంగిపోయే నైజమే ఆయనను అంతగా ఆకట్టుకునేలా, ఒక సహజమైన మానవత్వం ఉన్న కథానాయకుడిగా నిలబెడుతుంది.

కట్టుకథలా?

ఆయన సాహస యాత్రలను అనుమానంతో చూస్తూ, అవన్నీ కేవలం కల్పిత కథలని భావించే పాఠకులు ఉంటారు. ఫీసియన్లు తనను ఓడలో సొంత ఊరికి చేర్చడానికి అంగీకరిస్తారనే ఆశతో, వారి మనసు గెలుచుకోవడానికి ఒడిస్సియస్ సృష్టించిన కట్టుకథలే ఇవని భావించేవారు ఇలాంటి విశ్లేషణను ముందుగా స్వాగతిస్తారు. బహుశా ఒడిస్సియస్ పోరాడింది భౌతిక రూపంలో ఉన్న రాక్షసులతో కాదు, తనలోని అంతర్గత శత్రువులతోనే (ఇన్నర్ డెమన్స్) కావచ్చు. ఎందుకంటే పైకి కనిపించే దానికంటే ఇవే అత్యంత ప్రమాదకరమైనవని రుజువైంది.

ఒడిస్సియస్ చెప్పే కథల్లోని అస్పష్టత, వాటి వైభవం, రంగులు, నమ్మశక్యం కాని విషయాలను కూడా నమ్మించేలా సాగే విలక్షణ శైలి.. ఈ కావ్యం సృష్టించే మాయాజాలంలో ప్రధాన భాగం. ఆయనను ఒక వీరుడిగా నిలబెట్టేది కూడా ఇదే. ఎమిలీ విల్సన్ తన అనువాదంలో పేర్కొన్నట్లుగా, ఆయన "ఒక సంక్లిష్టమైన వ్యక్తి". మోసాలు చేయడంలో నిపుణుడు కావడం వల్లే ఆయన అంత అస్పష్టంగా, సంక్లిష్టంగా ఉంటారు. అవసరానికి తగినట్లుగా తన కథను, గుర్తింపును మార్చుకుంటూ ఉంటారు.

తెలివైనవాడు, ఊహాశాలి, లోపాలు ఉన్నవాడు అయిన ఒడిస్సియస్... చివరికి ప్రాచీన గ్రీకు ప్రపంచంలోనే అత్యంత సహజమైన మానవత్వం ఉన్న కథానాయకుడిగా కనిపిస్తారు. మహిళల ప్రలోభాలకు, అలాగే ఫీసియన్ల వంటి అద్భుత ప్రపంచాల ఆకర్షణలకు లొంగిపోయే ఆయన నైజమే... ఆయనకు బలమూ అయింది, పతనానికీ కారణమైంది. అందుకే నేటికీ ఆయన కథ మనల్ని అంతగా ఆకట్టుకోవడంలో ఆశ్చర్యం లేదు.

డైసీ డన్ ఒక అవార్డు గ్రహీత, పురాతన సాహిత్య నిపుణురాలు, రచయిత్రి. ఈమె రాసిన పుస్తకాలలో 'ది మిస్సింగ్ త్రెడ్', హోమర్‌పై వచ్చిన 'లేడీబర్డ్ ఎక్స్‌పర్ట్ బుక్' ఉన్నాయి.

'ది ఒడిస్సీ' చిత్రం జులై 17న థియేటర్లలో విడుదల కానుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)