జిన్నా అనారోగ్యం గురించి ముందే తెలిస్తే భారత విభజన ఆగిపోయేదా? ఆ జబ్బు రహస్యాన్ని దాచిన వైద్యులు ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వఖార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్టు, రీసెర్చర్
- ప్రచురణ
- చదివే సమయం: 8 నిమిషాలు
పింగ్ పాంగ్ బాల్ కంటే కాస్త పెద్దగా ఉన్న రెండు గుండ్రని నల్లటి మచ్చల చుట్టూ తెల్ల వలయాలు, ఊపిరితిత్తుల అంతటా వ్యాపించి ఉన్న తెల్ల మచ్చలు-క్షయవ్యాధి ఊపిరితిత్తులను మెల్లగా నాశనం చేస్తోంది.
ఇది పాకిస్తాన్ వ్యవస్థాపకుడు మొహమ్మద్ అలీ జిన్నా ఊపిరితిత్తులకు చెందిన ఎక్స్-రే రిపోర్టు.
''1946 జూన్‌లో బొంబాయికి చెందిన డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ డీబూ ఈ ఎక్స్-రేను చూసిన తర్వాత.. వ్యాధి చాలా ముదిరిపోయిందని జిన్నా ఒకటి లేదా రెండేళ్లు మాత్రమే బతకగలరని అర్థం చేసుకున్నారు'' అని లారీ కొలిన్స్, డొమినిక్ లాపియర్ తమ పుస్తకం 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'లో రాశారు.
అయితే, జిన్నా అభ్యర్థన మేరకు ఆ ఇద్దరు వైద్యులు ఈ నివేదికను తమ వద్దే ఉంచుకున్నారు. ఎవరికీ చెప్పలేదు.
పాకిస్తాన్ ఏర్పడిన 79 ఏళ్ల తర్వాత, మరణానంతరం ఈ ఇద్దరు పార్శీ వైద్యులను 'నిషాన్-ఎ-ఖైద్-ఎ-ఆజమ్' పురస్కారం కోసం నామినేట్ చేసింది పాకిస్తాన్ ప్రభుత్వం. ‘నిశ్శబ్దంగా , అందించిన అసాధారణ సేవ’’లకు వారికి ఈ అవార్డు ప్రకటించారు.

''చాలామంది చరిత్రకారులు 20వ శతాబ్దపు అత్యంత ముఖ్యమైన, చరిత్రను మార్చివేసిన రహస్యాలలో ఒకటిగా దీనిని పరిగణిస్తారు'' అని పాకిస్తాన్ ప్లానింగ్ మినిస్టర్, అవార్డుల కమిటీ చైర్మన్ అహ్సాన్ ఇక్బాల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో రాశారు.
ఒకవేళ జిన్నా అనారోగ్యం గురించి రాజకీయ ప్రత్యర్థులకు, బ్రిటీష్ పాలకులకు తెలిసుంటే?
భారత విభజనకు ఆటంకం కలిగి ఉండేదని, పాకిస్తాన్ ఏర్పడకపోయేదని చాలామంది భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, OUP
క్షీణిస్తూ వచ్చిన జిన్నా ఆరోగ్యం
జిన్నా ఆరోగ్యం క్షీణించడం, ఆయన శరీరంపై పడుతున్న తీవ్రమైన ఒత్తిడి వంటి విషయాలు బయట ప్రపంచానికి తెలియలేదు.
''జిన్నా చక్కని వస్త్రధారణ, హుందాగల వ్యక్తిత్వం.. ఆయన శారీరక ఆరోగ్యం బాగోలేదనే నిజాన్ని బయటికి తెలియకుండా చేశాయి'' అని 'జిన్నా, పాకిస్తాన్, ఇస్లామిక్ ఐడెంటిటీ: ది సెర్చ్ ఫర్ సలాదిన్' అనే పుస్తకంలో అక్బర్ అహ్మద్ రాశారు.
''1938 నుంచి జిన్నా ఆయన నరాల వ్యవస్థ, శారీరక సామర్థ్యంపై పడుతున్న ఒత్తిడిపై కంప్లయింట్లు చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఆయన తరచూ అనారోగ్యానికి గురయ్యేవారు. అయినప్పటికీ దాన్ని రహస్యంగా ఉంచారు'' అని పేర్కొన్నారు.
రచయిత హెక్టర్ బోలిథో 1952 మే నెలలో బొంబాయిలో డాక్టర్ పటేల్‌ను కలిశారు.
1944 సెప్టెంబర్‌లో జిన్నాను పరీక్షించినప్పుడు, ఆయన బీపీ సుమారు 90గా ఉందని డాక్టర్ పటేల్ తనకు చెప్పినట్లు హెక్టర్ బోలిథో తన పుస్తకం 'జిన్నా:క్రియేటర్ ఆఫ్ పాకిస్తాన్'లో రాశారు.
'ఆ సమయంలో ఆయన చాలా శ్రద్ధగా పనిచేసేవారు. కానీ, చాలా బక్కచిక్కిపోయి నీరసంగా కనిపించేవారు. అంతేకాక ఛాతి నొప్పి, దగ్గు కూడా ఉండేవి. ఆయన ఊపిరితిత్తుల కింద భాగంలో పూర్తిగా తగ్గని నిమోనియా ఆనవాళ్లు ఉన్నాయి'' అని డాక్టర్ పటేల్ చెప్పారు.
''ఆయనకు కాల్షియం ఇంజెక్షన్లు, బలాన్ని ఇచ్చే మందులు, షార్ట్ వేవ్ డయాథర్మీ చికిత్సను ఇచ్చాను. దగ్గు తగ్గింది. విశ్రాంతి తీసుకునేందుకు ఆయనొక పర్వత ప్రాంతానికి వెళ్లారు. తిరిగి వెళ్లొచ్చిన తరువాత 18 పౌండ్ల బరువు పెరిగారు. ఈ విషయం వార్తాపత్రికల్లో వచ్చింది. నా పేరు కూడా ప్రస్తావించారు'' అని తెలిపారు.
''నేను జిన్నాగారి వద్దకు వెళ్లి, ఎవరో ఒక మూర్ఖుడు ఈ వార్తను పత్రికలకు లీక్ చేశాడని చెప్పాను. దానికి ఆయన, 'ఆ మూర్ఖుడిని నేనే' అని బదులిచ్చారు. అయినా, నాకు ఇంత బాగా సేవ చేసిన వ్యక్తికి నేను ఎందుకు కృతజ్ఞతలు చెప్పకూడదు? అని అన్నారు'' అని డాక్టర్ పటేల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Keystone/Getty Images
‘వ్యాధి తీవ్రమవుతోంది’
''జిన్నా 1945లో తొలి ఆరు నెలలలో చాలాకాలం అనారోగ్యంతోనే ఉన్నారు'' అని అక్బర్ అహ్మద్ చెప్పారు.
''ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని నేను భరించలేకపోతున్నా'' అని ‘ఇస్ఫహాని కలెక్షన్’ లో చేరిన ఆ సంవత్సరం అక్టోబర్ 9వ తేదీ నాటి లేఖ ద్వారా తెలిసింది.
విశ్రాంతి తీసుకోవాలని, పనిభారాన్ని తగ్గించుకోవాలని సూచించేందుకు ఆయన వైద్యులు డాక్టర్ జల్ పటేల్, డాక్టర్ దిన్‌షా మెహతాలు జిన్నాకు నచ్చజెప్పడానికి ప్రయత్నించారు. కానీ, పాకిస్తాన్ కోసం పోరాటం అప్పటికే మొదలైంది. జిన్నాకు సమయం వేగంగా గడిచిపోతోంది.
జిన్నాకు బలహీనమైన ఊపిరితిత్తుల కారణంతో జీవితాంతం ఆరోగ్యం బాగుండేది కాదని లారీ కొలిన్స్, డొమినిక్ లాపియర్ రాశారు.
''1946 మే నెలాఖరున ముస్లిం లీగ్ నాయకుడు (జిన్నా) మరోసారి సిమ్లాలో బ్రాంకైటిస్ బారిన పడ్డారు. జిన్నాకు అత్యంత విధేయురాలైన సోదరి ఫాతిమా రైలులో ఆయన్ను బొంబాయికి తీసుకెళ్లారు. కానీ, ఈ ప్రయాణంలో ఆయన పరిస్థితి మరింత విషమించింది. ఫాతిమా వెంటనే డాక్టర్ పటేల్‌కు కాల్ చేశారు. రోగి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని ఆయన గుర్తించారు'' అని పేర్కొన్నారు.
1970ల ప్రారంభంలో, లారీ, డొమినిక్ తమ పుస్తకం కోసం పరిశోధన చేస్తున్నప్పుడు, డాక్టర్ పటేల్ వారికి జిన్నా చికిత్సకు సంబంధించిన రహస్య ఫైల్‌ను చూపించారు. దానిపై కేవలం "ఎం.ఎ. జిన్నా" అని రాసి ఉంది.
అప్పటికే జిన్నాకు ఎక్స్-రే తీసిన రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ డీబూ చనిపోయారు. డాక్టర్ జల్ డీబూ కుమార్తె హోమీని లారీ సంప్రదించారు. డాక్టర్ పటేల్ అందించిన వివరాలనే హోమీ కూడా అందించారు.
ఆ వ్యాధి ‘చికిత్స పొందలేని దశ’కు చేరుకుందని పటేల్, డీబూ నిర్ధరించారు.
ఈ రహస్యాన్ని లారీ, డొమినిక్‌లు 1975లో తమ పుస్తకం 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'లో రాసి తొలిసారి ప్రపంచానికి వెల్లడించారు.
బొంబాయి రైల్వే స్టేషన్‌లో తనకు స్వాగతం పలకడానికి గుమిగూడిన జనసమూహాన్ని కలిసేందుకు ముందుకు వెళ్తే, స్పృహ కోల్పోయి పడిపోవచ్చని జిన్నాను పటేల్ హెచ్చరించారు.
''అందుకే పటేల్ ఆయన్ను ముందుగానే రైలు నుంచి దింపి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు'’ అని ఆ పుస్తకంలో పేర్కొన్నారు.
''మీ శారీరక బలం తగ్గిపోతుంది. పనిభారాన్ని బాగా తగ్గించుకోకపోతే, ఎక్కువ విశ్రాంతి తీసుకోకపోతే, ధూమపానం మానేయకపోతే, శరీరంపై ఒత్తిడిని తగ్గించుకోకపోతే, జీవించడానికి ఒకటి లేదా రెండు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం మిగిలి ఉండదని నేను జిన్నాకు చెప్పా'' అని డాక్టర్ పటేల్ తెలిపారు.
''ఈ చేదు వార్త విన్నప్పటికీ, జిన్నా ముఖంలో ఎలాంటి భావం లేదు. ఆయన పాలిపోయిన ముఖాన్ని అసలు కదిలించలేదు. కేవలం ఒక శానిటోరియంలో మంచం మీద పడుకోవడానికి జీవిత పోరాటాన్ని వదులుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టంగా చెప్పారు'' అని పటేల్ తెలిపారు.

ఫొటో సోర్స్, Douglas Miller/Keystone/Getty Images)
మరణానికి దగ్గరగా ఉన్నట్లు తన ప్రత్యర్థులకు తెలిస్తే, మొత్తం రాజకీయ ముఖచిత్రం మారిపోవచ్చని జిన్నాకు తెలుసు. వారు బహుశా జిన్నా మరణం కోసం వేచిచూసి, ముస్లిం లీగ్ నాయకత్వంలోని మరింత 'సమర్థులైన' వ్యక్తుల ద్వారా ఆయన కలను నాశనం చేయడానికి ప్రయత్నించి ఉండేవారు.
ప్రతి రెండు వారాలకు ఒకసారి జిన్నాకు డాక్టర్ పటేల్ రహస్యంగా ఇంజెక్షన్లు ఇచ్చేవారని 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్' అనే పుస్తకంలో రాశారు. ఇవి ఆయనకు కొంత బలాన్ని ఇచ్చేవి. అలా జిన్నా తిరిగి పనిలోకి వెళ్లేవారు.
వైద్యుని సలహాను పాటించడాన్ని ఆయన పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. అసాధారణమైన ధైర్యసాహాసాలు, పట్టుదలతో జిన్నా తన జీవిత లక్ష్యం వైపుకు మాత్రమే వేగంగా ముందుకు సాగారు.
పాకిస్తాన్ ఏర్పాటయ్యే సమయానికి జిన్నా ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిందని అక్బర్ అహ్మద్ తెలిపారు.
''ఆయన క్షయవ్యాధితో బాధపడ్డారు. బాగా స్మోకింగ్ చేసేవారు. ఆయనకు ఇష్టమైన బ్రాండ్ క్రావెన్ ఏకు చెందిన సిగరెట్లను రోజుకు 50 దాకా కాల్చేవారు. నిరంతరం పనిలో మునిగిపోవడం వంటివి ఆయన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి'' అని చెప్పారు.
పాకిస్తాన్ ఏర్పడటానికి కొన్ని వారాల ముందు, 1947 జూలై 31న, జిన్నా బొంబాయిలోని ఆరామ్ బాగ్ స్మశానవాటికలో ఉన్న తన భార్య రతన్‌బాయి (రట్టి) సమాధిని సందర్శించారు.
తాను బహుశా బొంబాయికి మళ్లీ తిరిగి రానని ఆయనకు తెలుసు.
పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత, జిన్నా మళ్లీ బిజీ అయ్యారు. అయినప్పటికీ, ఆయన దైనందిన జీవితం, పని కొంతవరకు మెరుగుపడ్డాయి.

ఫొటో సోర్స్, Getty Images
'నేను చాలా అలసిపోయా'
1948 ఫిబ్రవరి ప్రారంభంలో హెక్టర్ బోలిథో రాసిన ప్రకారం.. జిన్నాకు పార్శీ స్నేహితుడైన జంషెద్ నస్రవాంజీ ఒక రోజు కరాచీలో గవర్నమెంట్ హౌస్ గార్డెన్‌లో ఆయనకోసం వెతుకుతుండగా.. ఒక బెంచ్ వద్ద కునుకు తీస్తూ కనిపించారు.
జిన్నా తన కళ్లు తెరిచి, ''నేను చాలా అలసిపోయాను జంషెద్, చాలా అలసిపోయా'' అని ఆయనతో అన్నారు.
''పాకిస్తాన్ ఏర్పడక ముందు ఆయన ఎప్పుడూ తీరిక లేకుండా ఉండేవారు. బయట ఇలా కూర్చొని కునుకు తీయడాన్ని ఊహించడం కూడా ఆయనకు అసాధ్యంగా ఉండేది'' అని బోలిథో చెప్పారు.
''కానీ, ఇప్పుడు జిన్నా అప్పుడప్పుడు గార్డెన్‌లో కూర్చుని కొన్ని క్షణాల పాటు అలా నిశ్శబ్దంగా ఆలోచించి, కాసేపు నిద్రపోయేవారు. కొన్నిసార్లు, గార్డెన్‌లో నడుస్తున్నప్పుడు, ఆయన వంగి, ఒక పువ్వును కోసి, దానితో తన కోటును అలంకరించుకునేవారు'' అని తెలిపారు.
ఆ ఫిబ్రవరిలో ఒకరోజు ఉదయం జిన్నాను కలిసేందుకు 'ది స్టేట్స్ మన్ ' మాజీ ఎడిటర్ ఇయాన్ స్టీఫెన్స్ వెళ్లారు.
''ఆ సమయంలో, పాకిస్తాన్ సృష్టికర్త మృత్యుముఖంలో ఎవరూ గ్రహించలేదు. క్షయవ్యాధితో ఆయన ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ విషయం ఎవరికీ తెలియదు. కొన్ని నెలల తర్వాత అదే ఆయన ప్రాణాలను బలిగొంది" అని చెప్పారు.
"నేను అనారోగ్యంతో ఉన్నానని ప్రజలు అంటున్నారు. అనారోగ్యంతో లేను. కేవలం అలసిపోయాను. నాకు ఇప్పుడు వయసు పైబడుతోంది, చాలా బాధ్యతలు ఉన్నాయి. అందుకే నేను అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకుంటాను. నా వైద్యులను వెళ్లమని చెబుతాను. వారు అనవసరంగా నా చుట్టూ తిరగడం నాకు ఇష్టం లేదు" అని ఒక సమావేశం ముగింపులో చెప్పారు.
అప్పటికి మూడున్నర ఏళ్ల కిందట బొంబాయి వైద్యులు ఇచ్చిన ఆందోళనకరమైన సమాచారాన్ని జిన్నా రహస్యంగా ఉంచారని బోలిథో తెలిపారు.
1948 జూలై నాటికి, జిన్నా ఊపిరితిత్తుల వ్యాధి మరింత తీవ్రమైంది. గాలి కాస్త స్వచ్చంగా ఉంటుందన్న కారణంతో బలూచిస్తాన్‌లోని మారుమూల పర్వత ప్రాంతమైన జియారత్‌కు ఆయనను తరలించారు. అయినప్పటికీ ఆయన ఆరోగ్యం మెరుగుపడలేదు.
జిన్నా రక్త పరీక్షలు, ఛాతీ ఎక్స్-రేలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత, ఆయన వైద్యుడు ఇలాహీ బక్ష్, జిన్నా ఊపిరితిత్తుల వ్యాధి చికిత్సకు అందని దశకు చేరుకుందని నిర్ధరించారు.
బహుశా ఆ రోజుల్లో జిన్నా స్నేహితుల్లో కొందరు ఆయనకు చికిత్స చేయించడానికి ప్రయత్నిస్తూ ఉండి ఉంటారు.
అనుమానాస్పద ఫోన్ కాల్
''వాషింగ్టన్‌లోని పాకిస్తాన్ రాయబార కార్యాలయం నుంచి నాకు కొన్ని రహస్యమైన ఫోన్ కాల్స్ వచ్చాయి. వ్యక్తి పేరును, అనారోగ్యాన్ని వెల్లడించకుండా.. ఆయన్ను పరీక్షించడానికి వెంటనే పాకిస్తాన్‌లోని కరాచీ రావాలని నాకు చెప్పారు'' అని డాక్టర్, రచయిత డాక్టర్ ఫ్రాంక్ ర్యాన్ తన 'ట్యూబర్‌క్యులోసిస్: ది గ్రేటెస్ట్ స్టోరీ నెవర్ టోల్డ్'లో రాశారు.
''కేసును స్వభావాన్ని పూర్తిగా అర్థం చేసుకునేందుకు నేను చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. కొన్ని రోజుల తర్వాత రోగి చనిపోయారని, ఇక నా సేవలు అవసరం లేదని నాకు ఫోన్ కాల్ వచ్చింది'' అని తెలిపారు.
రెండు మూడేళ్ల తరువాత, తాను శాన్‌ఫ్రాన్సిస్కోకు వెళ్లినప్పుడు, ఒక డాక్టర్ తనను చూడటానికి వచ్చారని ఫ్రాంక్ ర్యాన్ రాశారు.
''ఆ ఫోన్ కాల్స్ చేసింది తానేనని, ఆ రోగి మరెవరో కాదు జిన్నాయేనని ఆయన నాకు చెప్పారు. జిన్నాకు ఆయన వ్యక్తిగత వైద్యుడు. ఇప్పుడు ఆ రహస్యానికి కారణం స్పష్టమైంది. ఆ డాక్టర్ కొన్ని సంవత్సరాల కిందట పాశ్చర్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను ఇచ్చిన ఉపన్యాసాన్ని విన్నారు. అలాగే నేను ప్రచురించిన కొన్ని రచనలను కూడా చదివారు'' అని ఫ్రాంక్ ర్యాన్ పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
కీలక రహస్యాలు
‘‘1947 ఏప్రిల్‌లో లార్డ్ లూయిస్ మౌంట్‌బాటెన్‌కు, జవహర్‌లాల్ నెహ్రూకు లేదా గాంధీకి ఈ అసాధారణమైన రహస్యం తెలుసుంటే, భారత విభజనను బహుశా అడ్డుకుని ఉండేవార’’ని 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'లో రాశారు.
జిన్నా తన ముస్లిం సహచరుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో చివరి వైస్రాయ్‌పై ఒత్తిడి తెచ్చి ఈ నిర్ణయం తీసుకునేలా చేశారు.
ఈ రహస్యాన్ని తాను లార్డ్ మౌంట్‌బాటన్‌కు చెప్పినప్పుడు, ఆయన దిగ్భ్రాంతికి లోనయ్యారని డొమినిక్ తర్వాత తెలిపారు.
''అప్పుడు కనుక నాకు ఇదంతా తెలుసుంటే, చరిత్ర గమనం భిన్నంగా ఉండేది. స్వాతంత్య్రం ఇచ్చే నిర్ణయాన్ని నేను కొన్ని నెలల పాటు వాయిదా వేసి ఉండేవాడిని. పాకిస్తాన్ ఉనికిలోకి వచ్చి ఉండేది కాదు'' అని మౌంట్ బాటెన్ అన్నట్లు డొమినిక్ చెప్పారు.
ఈ రహస్యాన్ని ఎంత జాగ్రత్తగా దాచిపెట్టారంటే, బ్రిటిష్ గూఢచార సంస్థకు కూడా దాని గురించి ఏమాత్రం తెలియదని 'ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్'లో రాశారు.
జిన్నా చివరకు 1948 సెప్టెంబర్ 11న క్షయవ్యాధి (టీబీ) కారణంగా కన్నుమూశారు.
భారత ప్రభుత్వం 1962లో డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్‌కు దేశంలోని మూడో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మభూషణ్‌ను ప్రదానం చేసింది.
పాకిస్తాన్ ఈ సంవత్సరం ఆగస్టు 14న డాక్టర్ జల్ రతన్‌జీ పటేల్, డాక్టర్ జల్ డీబూలకు 'నిషాన్-ఎ-ఖైద్-ఎ-ఆజమ్' అవార్డును ప్రకటించింది.
దీనిని వచ్చే ఏడాది మార్చి 23న జరిగే ఒక వేడుకలో లాంఛనంగా ప్రదానం చేస్తారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































