వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్-2026 అవార్డులు సాధించిన ఎంట్రీల నుంచి టాప్- 9 ఫోటోలు ఇవే...

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ప్రచురణ
చదివే సమయం: 4 నిమిషాలు

చనిపోయిన గున్నఏనుగు(పిల్ల ఏనుగు)ను మోసుకెళ్తున్న ఒక ఏనుగు ఎమోషన్‌ను చిత్రీకరించిన ఇటలీ ఫోటోగ్రాఫర్ ఫెడెరికో వెరోనేసి వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ ఆఫ్ ది ఇయర్ 2026 టైటిల్‌ను గెలుచుకున్నారు.

నమీబియాలోని హువాబ్ నదీలోయలో ఏనుగుల కదలికలను ట్రాక్ చేస్తున్నప్పుడు ఎండిపోయిన నదీగర్భంలోని ఇసుకపై దేన్నో ఈడ్చుకెళ్లినట్టుగా వింత గుర్తులు వెరోనేసికి కనిపించాయి. ఆ గుర్తులను అనుసరిస్తూ వెళ్లిన ఆయనకు... చనిపోయిన పిల్ల ఏనుగును మోసుకెళ్తూ ఒక ఆడ ఏనుగు కనిపించింది. ఆ పిల్ల ఏనుగు కాలు, పెద్ద ఏనుగు దంతానికి, తొండానికి మధ్య ఇరుక్కుపోయి ఉంది.

మొదట ఆ పెద్ద ఏనుగే ఆ పిల్లకు తల్లని వెరోనేసి అనుకున్నారు. ఆ ఏరియాలో పరిశోధన చేస్తున్న ఎలీఫెంట్ ప్రాజెక్ట్ వాళ్లకు ఈ ఫోటోలను చూపించారు. చనిపోయిన ఏనుగు తల్లి ఆ పెద్ద ఏనుగేనని కచ్చితంగా నిర్ధరించలేమని వారు చెప్పారు.

రీసెర్చర్లు ఆ ఏనుగును గుర్తుపట్టారు. దానికి కొన్ని ఏళ్ల క్రితమే ఒక పిల్ల పుట్టి చనిపోయింది. అప్పటినుంచి అది వేరే ఆడ ఏనుగుల చనిపోయిన పిల్లలను కూడా ఇలాగే తెచ్చుకుంటూ ఉంటుందని వాళ్లు చెప్పారు. ఈ దృశ్యం వెరోనేసికి జీవితంలోనే ఒక మర్చిపోలేని అనుభవం.

"నేను గత 20 ఏళ్లుగా జంతువుల ఫోటోలు తీస్తున్నా. కానీ నా కెరీర్ లో ఇదే అత్యంత హృదయవిదారకమైన, ఆసక్తికరమైన, నాటకీయమైన అనుభవం''అని వెరోనేసి అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానెల్
వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, కెన్యాలోని ఓ నేషనల్ పార్క్‌లో తీసిన ఫోటో

ది మీటింగ్ ప్లేస్ - రచ్చబండ

విభాగం: జంతువులు - వాటి పరిసరాలు

ఫోటోగ్రాఫర్: జేమ్స్ లెవిన్, యూకే

లొకేషన్: చైయులు హిల్స్ నేషనల్ పార్క్ ,కెన్యా

ఒక నీటి గుంట దగ్గర చిన్న వయసున్న మగ ఏనుగు, జీబ్రాలపై నీళ్లు చల్లుతున్న దృశ్యాన్ని బ్లాక్ అండ్ వైట్ ఫోటోగా లెవిన్ తన కెమెరాలో బంధించారు. ఫోటోలో జిరాఫీలు కూడా ఉన్నాయి.

తీక్షణమైన వెలుతురును మృదువుగా మార్చేందుకు ఆయన ఇన్‌ఫ్రారెడ్‌ సాంకేతికతకు అనుగుణంగా మార్పులు చేసిన కెమెరాను ఉపయోగించారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, పువ్వుపై వాలడానికి సిద్ధమవుతున్న తుమ్మెద

తుమ్మెద ఎగిరే క్షణం

విభాగం: 10 ఏళ్లు, అంతకంటే తక్కువ వయసు ఉన్నవి

ఫోటోగ్రాఫర్: అమేలీ డేవిస్, యూకే

లొకేషన్: సర్రే, ఇంగ్లండ్

అవార్డు గెలుచుకునే ఫోటో తీయడానికి ప్రత్యేకంగా కెమెరా లేదా విమానం టిక్కెట్ అవసరం లేదు. డేవిస్ తన తండ్రి స్మార్ట్‌ఫోన్‌‌తో తమ తోటలోనే ఈ అద్భుతమైన ఫోటోను తీశారు. ఒక పువ్వుపై వాలడానికి సిద్ధమవుతూ ఒక సాధారణ కార్డర్ జాతి తుమ్మెద తన రెక్కలను ఆడించిన ఈ ఫోటో అద్భుతంగా బంధించింది.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, ద్రాక్షతోటలో పాట

పక్షి పాట రంగులు

విభాగం: 15-17 సంవత్సరాల వయసు

ఫోటోగ్రాఫర్: కాన్రాడ్ గ్రేటర్, జర్మనీ

లొకేషన్: బాడెన్-వుర్టెంబర్గ్, జర్మనీ

వసంత కాలంలో ఆడ పక్షులను ఆకర్షించడానికి, పాటలు పాడటానికి మగ బ్లాక్‌ బర్డ్స్ ఎత్తయిన ప్రదేశాల కోసం వెతుకుతుంటాయి.

తెల్లవారుజామున ఒక ద్రాక్షతోటలో ఈ ఫోటో తీశారు. ఆ సమయంలో ఈ పక్షులు అత్యంత సంక్లిష్టమైన రాగాలు ఆలపిస్తుంటాయి.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, అర్బన్ వైల్డ్‌లైఫ్

విభాగం: పట్టణాల్లోని వన్యప్రాణులు

ఫోటోగ్రాఫర్: సేథ్ ఫారెస్ట్సన్, యూకే

లొకేషన్: లుంఫీనీ పార్క్, బ్యాంకాక్, థాయిలాండ్

ఈ నీటి బల్లిని ఫోటో తీయడానికి ఫారెస్ట్‌సన్స్ బురదలోకి దిగారు.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, ప్యూమా

విభాగం: ఫోటో జర్నలిజం

ఫోటోగ్రాఫర్: ఫ్రాన్సిస్కో నీగ్రోని , చిలీ

లొకేషన్: రూట్ 40 , శాంటా క్రూజ్ ప్రావిన్స్, అర్జెంటీనా

అర్జెంటీనా పాటగోనియాలోని శాంటా క్రూజ్ ప్రావిన్స్‌లో హంటింగ్ ట్రోఫీగా ప్రదర్శించిన ఒక చనిపోయిన ప్యూమా దృశ్యాన్ని నెగ్రోని రికార్డ్ చేశారు.

శాంటా క్రూజ్ 2025లో ప్యూమా వేటను నిషేధించినప్పటికీ, చట్టవిరుద్ధంగా వేట కొనసాగుతూనే ఉంది.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, సూక్ష్మ ప్రపంచంలోని జీవులు

విభాగం: పోర్ట్‌ఫోలియో అవార్డు

ఫోటోగ్రాఫర్: కుతుబ్ ఉద్దీన్, బంగ్లాదేశ్/యూకే

లొకేషన్: వెస్ట్ ససెక్స్, ఇంగ్లండ్, యూకే

కుతుబ్ ఉద్దీన్ ఫోటోలు స్లైమ్ మోల్డ్స్, వాటి సూక్ష్మ ప్రపంచాన్ని అన్వేషిస్తాయి. ఇవి మామూలు కంటి చూపుకు దాదాపు కనిపించవు. వీటి ఫలదీకరణ నిర్మాణాలు కేవలం ఒకటి నుంచి రెండు మిల్లీమీటర్ల ఎత్తు మాత్రమే ఉంటాయి.

వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ
ఫొటో క్యాప్షన్, సముద్ర జీవుల ప్రేమాయణం

విభాగం: అండర్ వాటర్

ఫోటోగ్రాఫర్: టోనీ వు, యూఎస్ఏ/జపాన్

లొకేషన్: కాగోషిమా ప్రిఫెక్చర్, క్యూషు, జపాన్

అబాట్స్ మోరే ఈల్స్ (ఒక రకమైన సముద్రపు జీవులు) ప్రేమాయణాన్ని ఫోటో తీయడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చని అని ఎన్‌హెచ్‌ఎం తెలిపింది. వీటికి ఎటువంటి అంతరాయం కలగకుండా చూడటం కోసం జీవశాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు టోనీ వూ. అందుకోసం ఆయన తక్కువ వెలుతురు ఉన్న ఎరుపు రంగు కాంతిని, ప్రత్యేకంగా తయారు చేసిన ఫిష్‌ ఐ లెన్స్‌ను ఉపయోగించారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)