‘‘5 నెలల్లోనే బియ్యం బస్తా రూ.700 పెరిగింది’’ - తెలుగు రాష్ట్రాల్లో బియ్యం ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

బియ్యం ధరల పెంపు, ఆంధ్ర, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్‌లో 2026 జూన్–ఆగస్టు మధ్య సగం వర్షపాతమే కురిసింది.
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎక్కడ చూసినా బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరల గురించిన చర్చ జరుగుతోంది. కొంతకాలంగా వీటి ధరలు ఊహించనంతగా పెరుగుతూ సామాన్యులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇంతకీ బియ్యం ధరలు పెరగడానికి కారణం ఏంటి?

''నేను 5 నెలల క్రితం సుమారు 1500 కి అమ్మిన 26 కేజీల బియ్యం బస్తా, క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. 20 రోజుల క్రితం కూడా 1900 రూపాయలకు అమ్మాను. ఇప్పుడు ఏకంగా 2200 అయింది.

అంత ధరకు అమ్ముతుంటే కొనుగోలుదారులు బాధపడుతున్నారు, కొందరు మాపై కోప్పడుతున్నారు''... ఇవీ హైదరాబాద్ కి చెందిన వెంకట్ అనే కిరాణా వ్యాపారి బీబీసీతో చెప్పిన మాటలివి. ఆరు నెలల్లో దాదాపు 50 శాతం బియ్యం ధర పెరిగినట్టు ఆయన మాటలు సూచిస్తున్నాయి.

''అవే కాదు పప్పులు కూడా పదేసి రూపాయల చొప్పున పెరుగుతున్నాయి. ఈ మధ్య నూనెల ధర స్వల్పంగా తగ్గింది. కానీ కందిపప్పు మాత్రం మాకు వచ్చే హోల్ సేల్ రేటే ఒక్కసారిగా 20 రూపాయలు పెరిగిపోయింది'' అన్నారు వెంకట్.

హైదరాబాద్ మాత్రమే కాదు, విజయవాడలో బియ్యం ధరలను పరిశీలిస్తే, అక్టోబర్ 13 మంగళవారం నాటికి 26 కేజీల బస్తా 2వేలు దాటింది. ఆన్‌లైన్‌లో కూడా కిలో బియ్యం 82-83 రూపాయల వరకూ ఉంది. ఇక కందిపప్పు ధరలో సుమారు 15 శాతం పెరుగుదల కనిపించింది. 15 రోజుల కిందట కిలో 120-130 మధ్య ఉన్న కందిపప్పు ఇప్పుడు 150-160 వరకూ చేరింది. (ఈ ధరలన్నీ ప్రాంతాలు, రకాలను బట్టి స్వల్పంగా మారుతుంటాయి. స్థూలంగా తీసుకున్న సగటు ధరలను ఇక్కడ రాస్తున్నాం.)

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొనుగోళ్లపైనా ప్రభావం ఉందా?

''కొంత కాలంగా బియ్యం, ఇతర సరకుల రేట్లు బాగా పెరిగిపోయాయి. బియ్యం బస్తా ధర డబుల్ అయిపోయింది. నాలాంటి సామాన్య కుటుంబాలకు ఇది డబుల్ బర్డెన్. ఇంత ధర అయితే ఏం చేయాలి? కొన్నిసార్లు సన్న బియ్యానికి దొడ్డు బియ్యం కలుపుకుని వండుకుంటున్నాం... దాని వల్ల కొంచెం కలసి వస్తుందని. అన్నం ముద్దగా అయిపోతోంది కానీ తప్పట్లేదు. అలాగే తింటున్నాం'' అని బీబీసీకి చెప్పారు హైదరాబాద్‌లోని మూసాపేటకు చెందిన ధర్మ.

వీటితో పాటు కూరగాయల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. అయితే ఆ మార్పు ఒక్కసారిగా కనపడలేదు.

ధరలు ఇంత తీవ్రంగా పెరగడానికి కారణమేంటి అని చూస్తే... వర్షాలు లేకపోవడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు కొందరు వ్యాపారులు.

''వర్షాలు సరిగా కురవలేదు కాబట్టి పంట తగ్గి, ధరలు పెరగడం వాస్తవం. పప్పు దినుసులు, ఇతర కిరాణా సరకులు మన దగ్గర 10-15శాతం వరకూ పెరిగాయి. వర్షాభావం కొనసాగితే ఇంకా పెరిగే అవకాశం ఉంది.

పంచదార రూ.42కి వచ్చి మళ్లీ రూ.50 అయింది. ఇంకా పెరిగే అవకాశం బాగా ఉంది. వానల పరిస్థితి ఇలా ఉంటే అన్ని వస్తువుల ధరలూ 20-25 శాతం పెరుగుతాయి.

ప్రస్తుతానికి కొనుగోళ్లపై ప్రభావం పడలేదు. కానీ పరిస్థితి ఇలానే ఉంటే, అంటే ధరలు 25 శాతం కనుక పెరిగితే, ఖచ్చితంగా కొనుగోళ్లపై కూడా ప్రభావం పడుతుంది'' అని బీబీసీతో చెప్పారు హైదరాబాద్ కిరాణా మర్చంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ విజయ వర్గీయ.

బియ్యం ధరల పెంపు, ఆంధ్ర, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, ప్రస్తుతం దుకాణాల్లో అమ్ముతున్న బియ్యం, రైతుల దగ్గర నుంచి కొని కనీసం ఆరు నెలల నుంచి మూడేళ్లకు పైగా అయి ఉంటుంది.

ఆంధ్ర ప్రదేశ్‌లో 2026 జూన్–ఆగస్టు మధ్య కురవాల్సిన వర్షం దాదాపు సగమే కురిసింది. దీంతో పెద్ద సంఖ్యలో కరవు మండలాలను ప్రకటించారు. అయితే వర్షాభావం వల్ల వరి ఉత్పత్తి కాస్త తగ్గినప్పటికీ, మరీ ఘోరంగా ఉత్పత్తి పడిపోలేదని ప్రభుత్వ గణాంకాలు చూస్తే తెలుస్తుంది.

2026 జూన్–ఆగస్టు మధ్య ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వర్షపాతంతో పోలిస్తే 53.4 శాతం లోటు నమోదైంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 21 జిల్లాల్లోని 388 మండలాలను కరవు ప్రభావిత ప్రాంతాలుగా ప్రకటించింది.

తెలంగాణలో ఇదే కాలానికి వర్షపాతం లోటు 17 శాతంగా నమోదైంది. రాష్ట్రంలో సుమారు 200కి పైగా మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.

తెలంగాణలో
ఫొటో క్యాప్షన్, నల్లగొండ సమీపంలోని ఎల్లారెడ్డి గూడెం గ్రామంలో గింజ గట్టిపడే సమయంలో నీళ్లు లేక ఎండిపోతున్న వరి చేను.

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల గణాంకాలు, అంచనాల ప్రకారం 2024 ఖరీఫ్‌లో 78 లక్షల 28 వేల 460 టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఇక 2025 ఖరీఫ్‌లో ఆ ఉత్పత్తి 94 లక్షల 91 వేల టన్నులు కాగా, 2026 ఖరీఫ్‌కి 66 లక్షల 76 వేల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేస్తున్నారు. అంటే ఈ ఏడాది ఉత్పత్తి తగ్గుతోందని తెలుస్తోంది. కానీ మొత్తంగా పూర్తిగా వరి ఉత్పత్తి ఆగిపోయే పరిస్థితి లేదు.

గతేడాది వరి ఉత్పత్తి బాగా ఉన్నప్పటికీ , ప్రస్తుతం చేనులో ఉన్న వరి ఉత్పత్తి ఆధారంగా మార్కెట్లో ధరలు పెరగడం ఆసక్తికర పరిణామం.

''స్థూలంగా వర్షాభావ పరిస్థితుల వల్ల వరిసాగు తగ్గింది. దీంతో భవిష్యత్తులో కూడా వరి సాగు తక్కువ అవుతుందని ఊహించిన టోకు వ్యాపారులు ఇప్పటి నుంచే ధరలు పెంచి అమ్మడం ప్రారంభించారు'' అని బీబీసీతో చెప్పారు ఒక కిరాణా వ్యాపారి. టోకు వ్యాపారులు నిర్ణయించిన ధరలకే తాము అమ్మకతప్పదని ఆయన బీబీసీతో అన్నారు.

బియ్యం ధరల పెంపు, ఆంధ్ర, తెలంగాణ
ఫొటో క్యాప్షన్, నాదెండ్ల మనోహర్

‘చర్యలు తీసుకుంటున్నాం’

వ్యాపారులు, మిల్లర్లు గతంలో ఎప్పుడో రైతుల దగ్గర సాధారణ ధరకు కొన్న సరకును ప్రస్తుతం అత్యధిక ధరకు అమ్ముతున్నారన్నది పరోక్షంగా వినిపిస్తున్న ఆరోపణ. దీనిపై స్పందించడానికి అఖిల భారత రైస్ మిల్లర్ల సంఘం అధ్యక్షుడు గుమ్మడి వెంకటేశ్వర రావును ఫోన్ ద్వారా సంప్రదించే ప్రయత్నం చేసింది బీబీసీ. ఆయన అందుబాటులోకి రాలేదు.

మరోవైపు సామాన్యులపై ధరల భారం పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ.

''పండగ సమయంలో అనేక కారణాల వలన, యుద్ధ వాతావరణం, ప్రపంచవ్యాప్తంగా ఇన్‌ఫ్లేషన్ ట్రెండ్ వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. దాంతో రెండు నెలల క్రితం రాష్ట్రవ్యాప్తంగా 450 రేషన్ డీలర్ల ద్వారా, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ద్వారా కౌంటర్స్ ఏర్పాటు చేసి స్టీమ్ రైస్, బీపీటీ రైస్ అందుబాటులోకి తెచ్చాం. అయినా ధరలు పూర్తి స్థాయిలో నియంత్రణలోకి రాలేదు. దీంతో ఇప్పుడు దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం 151 రైతు బజార్లలో, బీపీటీ సన్నరకం బియ్యం కేజీ 49 రూపాయలకి, నెల్లూరు కేఎన్ఎం వెరైటీ కేజీ 50 రూపాయలకు అందుబాటులోకి తెచ్చాం. రాష్ట్రవ్యాప్తంగా కావాల్సినంత సరకు మేం తీసుకొచ్చి అందుబాటులో ఉంచుతున్నాం. త్వరలోనే ఉల్లిపాయలు, కందిపప్పు, గోధుమపిండి, పంచదార కూడా ఇలానే అందిస్తాం'' అని మీడియాతో చెప్పారు మంత్రి నాదెండ్ల మనోహర్.

ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ పౌర సరఫరాల శాఖ స్పందన కోసం బీబీసీ ప్రయత్నం చేస్తోంది. వారి స్పందన రావాల్సి ఉంది.

బియ్యం
ఫొటో క్యాప్షన్, గతంలో రైతుల దగ్గర చౌకగా కొన్న ధాన్యం ఇప్పుడు బియ్యంగా మారి రెట్టింపు ధరలకు వినియోగదారుడికి అందుతోంది

ధరల పెరుగుదల ఎవరికి లాభం?

మరోవైపు ధరల పెరుగుదలపై చర్చ వచ్చిన సమయంలోనే మరో ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది.

సామాన్యులకు ధరలు పెరిగినట్టు కనిపించినప్పటికీ, రైతులకు ఇది లాభమేనని కొందరు సోషల్ మీడియా వేదికగా చర్చిస్తున్నారు.

అయితే ప్రస్తుతం దుకాణాల్లో అమ్ముతున్న బియ్యం, రైతుల దగ్గర నుంచి కొని కనీసం ఆరు నెలల నుంచి మూడేళ్లకు పైగా అయి ఉంటుంది. అప్పుడు కొన్న ధరకు, ఆ తర్వాత మిల్లింగ్, ప్యాకింగ్ ప్రాసెస్ కానీ, మధ్యవర్తులు, డీలర్లు, మిల్లర్ల లాభం కానీ కలుపుకున్నా, ఇంత ధర రాదు.

ప్రస్తుతం మార్కెట్లో అమ్ముడవుతున్న సరకు వల్ల రైతుకు ప్రత్యక్షంగా లాభం లేదు. అయితే, ఆ ప్రభావం, ప్రస్తుత పంట కొనుగోళ్లపై పడింది. అప్పట్లో అత్యంత చవకగా రైతుల దగ్గర కొన్న ధాన్యం.. బియ్యంగా మారి ఇప్పుడు రెట్టింపు ధరకు వినియోగదారులకు అందుతోంది.

రెండు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రస్తుతం వరి కోతల సమయం నడుస్తోంది. అక్కడ ప్రభుత్వం నిర్ధరించిన గిట్టుబాటు ధర కంటే, మిల్లర్లు అధిక ధర చెల్లించి వారి వద్ద ధాన్యం కొంటున్నారు. క్వింటాలుకు కనీసంగా 500 రూపాయల నుంచి వివిధ మొత్తాల్లో రైతులకు ఎక్కువ చెల్లిస్తున్నారు. ఆ మేరకు రైతులకు లబ్ధి జరుగుతోంది.

కానీ ఇది ఎంత కాలం సాగుతుంది? ఎంత పంట ఆ రీతిలో కొంటారు? అన్నది స్పష్టత లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)