దిల్లీలో నిరసనకారులపై దాడులు, హిందుత్వ సంఘాల ప్రస్తావన ఎందుకు వస్తోంది?

దిల్లీలో సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు ఆందోళనాకారులపై కఠినంగా వ్యవహరించారు
ఫొటో క్యాప్షన్, దిల్లీలో సీజేపీ నిరసనల సందర్భంగా పోలీసులు ఆందోళనాకారులపై కఠినంగా వ్యవహరించారు
    • రచయిత, శుభాంగి మిశ్రా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • ప్రచురణ
  • చదివే సమయం: 5 నిమిషాలు

దిల్లీలో నిరసనకారులపై హిందూత్వ సంస్థలకు చెందిన వ్యక్తులుగా చెప్పుకుంటున్న కొందరు దుర్భాషలాడుతూ, దాడులకు పాల్పడుతున్నట్లు చూపుతున్న పలు వీడియోలు శనివారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (ప్రధాన ఎన్నికల కమిషనర్) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు.

ఒక వీడియోలో, ఒక వ్యక్తి ఏడుస్తూ తనపై దాడి చేశారని చెప్పడం కనిపిస్తోంది. పోలీసులు నిన్ను రక్షించలేదా అని ఒక రిపోర్టర్ ఆ వ్యక్తిని అడగగా పోలీసులు అలాంటి పనేదీ చేయలేదని ఆ వ్యక్తి చెప్పారు.

హిందూ రక్షా దళ్ అనే హిందూత్వ సంస్థ జాతీయ అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి (పింకీ భయ్యా అని కూడా పిలుస్తారు), ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో షేర్ చేశారు. వీడియోలో దాడి చేస్తున్న వ్యక్తులు తన సంస్థకు చెందిన కార్యకర్తలేనని ఆయన పేర్కొన్నారు.

ఆయన తన పోస్ట్‌లో ఇలా రాశారు, "వీరు నా కార్యకర్తలు. హిందూ రక్షా దళ్ ఏదైతే చెప్తుందో అదే చేస్తుంది. హిందూ రక్షా దళ్‌కు తనకు కనిపించే ఇటువంటి దేశద్రోహ శక్తుల బుద్ధిని సరిచేసే శక్తి ఉంది, భవిష్యత్తులోనూ ఇది ఇలాగే కొనసాగుతుంది."

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం సృష్టించిన తర్వాత, దిల్లీ పోలీసులు ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి రమన్ సైనీ, వివేకానంద అలియాస్ వివేక్, కపిల్ కుమార్ రవీందర్ సింగ్ అలియాస్ గోవింద్ హిందూ అనే నలుగురు వ్యక్తులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

కమలా మార్కెట్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక సీనియర్ పోలీస్ అధికారి బీబీసీ తో మాట్లాడుతూ, నిందితులు నలుగురినీ అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

అయితే వీడియోలో కనిపించిన మరో వ్యక్తిని మైనరో కాదో అధికారులు నిర్థరించలేదు. ‘‘కేసు దర్యాప్తు చేస్తున్నాం. బాధితులను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని మాత్రమే పోలీసులు చెబుతున్నారు.

భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్ 126 (శాంతిభద్రతలకు భంగం కలిగించడాన్ని నిరోధించడం), 115 (ఉద్దేశపూర్వకంగా గాయం చేయడం) 130 (దాడికి పాల్పడటం) తో పాటు ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

తదుపరి దర్యాప్తు ఆధారంగా ఈ కేసులో మరికొన్ని సెక్షన్లను కూడా చేర్చుతామని ఓ పోలీసు సీనియర్ అధికారి పేర్కొన్నారు.

అయితే బీబీసీ వద్ద ఎఫ్ఐఆర్ కాపీ లేదు.

వీడియోె నుంచి తీసిన ఫోటో
ఫొటో క్యాప్షన్, వీడియో నుంచి తీసిన ఫోటో

నిందితులు ఎవరు?

ఈ హింసకు సంబంధించిన వీడియో వైరల్ అయిన తర్వాత, ఇండియన్ యూత్ కాంగ్రెస్‌తో సహా పలు సోషల్ మీడియా ఖాతాల నుంచి దాడులకు పాల్పడిన వారి గుర్తింపును వెల్లడిస్తూ పోస్ట్‌లు షేర్ అయ్యాయి.

"ఇప్పటివరకు ఇద్దరిని గుర్తించారు. వీరిద్దరూ ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థల తీవ్రవాద శక్తులు. వీరు నిరంతరం ద్వేషాన్ని వెళ్లగక్కుతున్నట్టుగా వీరి ఇన్‌స్టా గ్రామ్ పోస్టులు చూపుతున్నాయి. ఈ రోజు వారు పోలీసుల సమక్షంలోనే దాడి చేశారు’’ అని ఆ పోస్టులో రాశారు.

అయితే, సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నప్పటికీ, దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు వ్యక్తులు తమ గుర్తింపును దాచుకోవడానికి ప్రయత్నించలేదు.

నిందితుడు కపిల్ కుమార్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఒక వీడియోలో ఆయనతోపాటు మరో నిందితుడు రవీందర్ సింగ్ కనిపించారు.

– "జంతర్ మంతర్ వద్ద మేము ఆ దేశద్రోహ శక్తులకు బుద్ధి బాగా చెప్పాం." అని ఆ వీడియోకు శీర్షిక పెట్టారు.

"మేం మోదీ, దిల్లీ పోలీసుల మద్దతుదారులం, మేం వారి గౌరవాన్ని కాపాడటానికి వచ్చాం, అయినా మమ్మల్ని నిర్బంధించారు."

మరొక నిందితుడు రమన్ సైనీని ఫోన్ ద్వారా సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది, కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది.

పింకీ భయ్యాను కూడా బీబీసీ సంప్రదించింది, కానీ ఆయన మాట్లాడటానికి నిరాకరించారు అయితే "ఈ వ్యక్తులు మా సంస్థతో సంబంధం ఉన్నవారా కాదా అనేది నేను ధృవీకరించలేను" అన్నారు.

పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత రవీందర్ సింగ్ ఒక వీడియోలో తానూ హిందూ రక్షా దళ్ సభ్యుడినని చెప్పుకున్నారు పోలీసు అధికారులు ఆయనను తీసుకెళ్తుండటం ఆ వీడియోలో కనిపిస్తుంది.

'ఈటీవీ భారత్' అప్‌లోడ్ చేసిన ఒక వీడియోలో ఆయన , "నన్ను ఇబ్బంది పెట్టకండి. సీనియర్ అధికారులందరికీ నేను తెలుసు" అనడం వినిపిస్తోంది.

"నేను తిరిగి వెళ్లి ఆ దేశద్రోహ శక్తులకు బుద్ధి చెబుతాను. దేశ వ్యతిరేక నినాదాలు చేస్తూ, దిల్లీ పోలీసులను దూషిస్తున్న వారికి నేను గుణపాఠం నేర్పుతాను. హిందూ రక్షా దళ్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గదు." అని కూడా ఆయన అన్నారు.

దిల్లీలోని కన్నాట్ ప్లేస్ పరిధిలో ఇంకా తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. సెంట్రల్ దిల్లీలోకి ప్రవేశిస్తున్న నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో పారామిలిటరీ బలగాలు పోలీసు సిబ్బందిని మోహరించడంతో ఆ ప్రాంతంలో కఠినమైన భద్రతా చర్యలు తీసుకున్నారు.

అయితే నిరసనకారులలో ఒక వర్గం దిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా విమర్శించింది.

వందలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, హిందూ రక్షా దళ్ వంటి హిందూత్వ సంస్థలపై పోలీసులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోలేదని వారు ఆరోపిస్తున్నారు.

శనివారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన వీడియోలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారని, తగిన చర్యలు తీసుకుంటామని దిల్లీ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

హిందూత్వ సంస్థల సభ్యులకు చెందిన సోషల్ మీడియా ఖాతాల నుంచి వరుసగా కొన్ని వీడియోలు షేర్ అయిన నేపథ్యంలో పోలీసుల నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఆ వీడియోలలో తామే స్వయంగా ఈ హింసకు పాల్పడినట్లు సదరు సంస్థల సభ్యులు పేర్కొన్నారు.

ఉదాహరణకు, శనివారం నాడు పింకీ భయ్యా ' ఎక్స్‌లో లో మరొక వీడియోను షేర్ చేశారు. దానిలో ఆయన "హిందూ రక్షా దళ్‌తో పెట్టుకోవద్దని ముందే చెప్పాను. హిందూ రక్షా దళ్‌ను తక్కువగా అంచనా వేయకూడదు. మాకు ఎలాంటి రాజకీయాలపై ఆసక్తి లేదు, కానీ ఎవరైనా సనాతనాన్ని లక్ష్యంగా చేసుకుంటే, వారు ఎక్కడికి చేరాలో అక్కడికే పంపుతాం." అని పేర్కొన్నారు.

శనివారం నాటి నిరసనలకు ముందు రోజుల్లో కూడా, ఆయన "సనాతన ధర్మానికి వ్యతిరేకంగా" ఉన్నవారిపై హింసకు పాల్పడతామని హెచ్చరిస్తూ పలు వీడియోలను షేర్ చేశారు.

దిల్లీ పోలీసుల సమక్షంలోనే నిరసనకారులపై దాడులు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి
ఫొటో క్యాప్షన్, దిల్లీ పోలీసుల సమక్షంలోనే నిరసనకారులపై దాడులు జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి

హింసకు పాల్పడతామనే బెదిరింపులు

జర్నలిస్ట్ ధైర్య మహేశ్వరి ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను షేర్ చేశారు, అందులో కొందరు వ్యక్తులు ఒక నిరసనకారుడిని చుట్టుముట్టి, ఆయనతో బలవంతంగా "సారీ" చెప్పిస్తుండటం కనిపిస్తుంది.

'ది క్వింట్' వార్తా సంస్థ రితేష్ ఠాకూర్ అనే వ్యక్తిని కూడా ఇంటర్వ్యూ చేసింది. ఆయన తనను బజరంగ్ దళ్ కార్యకర్తగా పరిచయం చేసుకున్నారు. దానికి అనుబంధంగా ఉన్న సంస్థల నుండి 250 మంది వ్యక్తులు ఈ నిరసనల వద్ద ఉన్నారని తెలిపారు.

"ఈ వ్యక్తులు గతంలో కూడా రాముడు సీత గురించి దుర్భాషలాడారు. మేం వారిని మళ్లీ ఇలా చేయనివ్వం" అని ఠాకూర్ పేర్కొన్నారు.

బీబీసీ జర్నలిస్టులు కూడా అక్టోబర్ 10న సెంట్రల్ దిల్లీలో ఇటువంటి ఘర్షణలను ప్రత్యక్షంగా చూశారు.

ఒక నిరసనకారుడు మాట్లాడుతూ, "సీజేపీ కావచ్చు లేదా రాహుల్ గాంధీ కావచ్చు, దేశాన్ని విభజించడానికి ఎవరు ప్రయత్నించినా మేం వెనక్కి తగ్గం" అన్నారు.

మరొక వ్యక్తి మాట్లాడుతూ, "ఈ దేశద్రోహ శక్తుల వల్లే దిల్లీ స్తంభించిపోయింది పనులన్నీ నిలిచిపోయాయి" అని పేర్కొన్నారు .

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలు నిరసనకారులకు వారిని వ్యతిరేకించడానికి వచ్చిన వారికి మధ్య ఉన్న ఉద్రిక్తతలను చూపించాయి.

కన్నాట్ ప్లేస్‌లోని ఇందిరా చౌక్ వద్ద రైట్ వింగ్ సంస్థల సభ్యులతో ఘర్షణ పడుతున్న ఒక నిరసనకారుడు బీబీసీతో మాట్లాడుతూ: "మేంనిరసనను కొనసాగిస్తే మమ్మల్ని కొడతామని వారు బెదిరిస్తున్నారు. మేము ఇక్కడికి చట్టవిరుద్ధంగా వచ్చామని వారు చెబుతున్నారు" అన్నారు.

పీటీఐ కథనం మేరకు సీజేపీ నిరసనలకు సంబంధించి దిల్లీ పోలీసులు 20 ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేశారు, ఇందులో పోలీసు సిబ్బందిపై దాడికి పాల్పడినట్లు నమోదైన కేసులు కూడా ఉన్నాయి. ఈ ఎఫ్‌ఐఆర్‌లలో హిందూ రక్షా దళ్‌తో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తులపై నమోదైన కేసు కూడా ఉంది. నిరసనల సమయంలో మహిళలను నెట్టివేసి, వారిపై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేశారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)