'సర్'పై పోరాటం: 'ఇండియా' బ్లాక్‌లో విభేదాలున్నాయా, కొన్నిపార్టీలు మీటింగ్‌కు ఎందుకు రాలేదు?

‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, బుధవారం దిల్లీలో సమావేశమైన ఇండియా కూటమి
ప్రచురణ
చదివే సమయం: 6 నిమిషాలు

ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ బ్లాక్ బుధవారం ప్రత్యేకంగా నిర్వహించిన సమావేశానికి 19 పార్టీలు హాజరయ్యాయి.

ఉత్తరప్రదేశ్‌లో తన పార్టీకి చెందిన ఇద్దరు నేతల రాజ్యసభ నామినేషన్ దాఖలు చేస్తున్నందున అఖిలేశ్ యాదవ్ ఈ సమావేశానికి రాలేదు. ఆయన తరఫున సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేతలు హాజరయ్యారు.

అఖిలేశ్ యాదవ్‌తోపాటు డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, ఆమ్‌ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్‌ కూడా ఈ సమావేశానికి రాలేదు.

ముఖ్యనేతల గైర్హాజరును ప్రస్తావిస్తూ ‘ఇండియా’ బ్లాక్ ఐక్యతపై బీజేపీ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఆ కూటమిలో ఐక్యత లోపించిందని వ్యాఖ్యానించింది.

‘ఇండియా’ బ్లాక్ సమావేశానికి అఖిలేశ్ యాదవ్ రాకపోవడంపై స్పందించిన సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత మహిబుల్లా నద్వీ, ప్రతిపక్ష కూటమి చాలా బలంగా ఉందని చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, సోనియా గాంధీ, మమతా బెనర్జీ

‘‘ఇండియా బ్లాక్ సమావేశానికి సమాజ్‌వాది పార్టీ తరఫున రెండు పేర్లు పంపించారు. అందులో నాతోపాటు హరేంద్ర మాలిక్‌ పేర్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్నందున మా అధ్యక్షుడు అఖిలేశ్ చాలా బిజీగా ఉన్నారు. చర్చించిన అనంతరం ఆయన ఇక్కడికి రాలేకపోవడానికి కారణాన్ని వివరించి, మా ఇద్దర్ని పంపించారు. ఇది ఇండియా బ్లాక్ పటిష్టంగా ఉంది’’ అని ఆయన అన్నారు.

అయితే, ఈ మీటింగ్‌కు సంబంధించి ‘ఇండియా’ బ్లాక్‌ ఐక్యతను బీజేపీ ప్రశ్నిస్తోంది. ‘‘ఉత్తర ప్రదేశ్‌లో త్వరలోనే ఎన్నికలు రానున్నాయి. మరి అఖిలేశ్ యాదవ్ ఎక్కడున్నారు?’’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్‌ సింగ్ చౌహాన్ ప్రశ్నించారు.

‘ఇండియా’ బ్లాక్ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ హాజరయ్యారు. అక్టోబర్ 2 నుంచి 8 వరకు జాతీయ స్థాయిలో చేపట్టే సేవ్ డెమొక్రసీ మార్చ్ సహా కీలక అంశాలపై చర్చించారు. కూటమి ఐక్యంగా ఉందని ప్రజలకు సందేశం ఇవ్వాలని కూడా నిర్ణయించారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో అక్టోబర్ 2 నుంచి జైల్‌ భరో ఉద్యమానికి పిలుపునిచ్చింది కాక్రోచ్ జనతా పార్టీ. ముంబై, దిల్లీలో నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని సీజేపీ యోచిస్తోంది.

‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న అఖిలేశ్ యాదవ్

ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయాలు ఏంటీ?

దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన భేటీలో సోనియా గాంధీ, మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఓ'బ్రియన్, కల్యాణ్ బెనర్జీ, తేజస్వి యాదవ్, సుప్రియా సూలే, మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లా, దీపక్ భటాచార్య, కపిల్ సిబల్ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు వివరించారు.

ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు ఈ సమావేశంలో ఆరు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు.

  • అక్టోబర్ 2 నుంచి 8 వరకు 'సేవ్ డెమొక్రసీ మార్చ్‌'ను జిల్లా స్థాయిలో నిర్వహించడం
  • అక్టోబర్ 6న ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు.
  • అక్టోబర్ రెండో వారంలో రాష్ట్రపతిని కలిసేందుకు ప్రతిపక్ష ఎంపీలు సమయం కోరనున్నారు.
  • దేశవ్యాప్తంగా ఐదు భారీ ర్యాలీలు నిర్వహించనున్నారు.
  • ఓటు చోరీకి సంబంధించిన అంశాలను హైలైట్‌ చేయడానికి నవంబర్ 1న దిల్లీలో భారీ ర్యాలీ చేపడతారు.
  • సుప్రీంకోర్టులో 'సర్‌'కు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులను వీలైనంత త్వరగా విచారణ చేయాలని ‘ఇండియా’ బ్లాక్‌ డిమాండ్ చేస్తోంది.

సమావేశం తర్వాత రాహుల్ గాంధీ ఏం చెప్పారు?

‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు వివరిస్తున్న మల్లికార్జున ఖర్గే

‘‘భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్న వారికి శిక్ష పడుతుంది. వారు ఎంత సీనియర్ అయినా, ఎవరైనా కావచ్చు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.

‘‘వ్యక్తుల కంటే భారత ప్రజాస్వామ్యం గొప్పది. ఆ ప్రజాస్వామ్యంపై బీజేపీ, నరేంద్ర మోదీ, అమిత్‌షా, జ్ఞానేశ్ కుమార్ దాడి చేస్తున్నారని అన్ని పార్టీలు అంగీకరించాయి. దీన్ని మేం విడిచిపెట్టబోం. ప్రతిపక్ష నేతలందరం భారత ప్రజాస్వామ్య సంరక్షకులం. కలిసి పని చేయడం మాకు గౌరవం. రాబోయే నెలల్లో దేశంలో కీలక మార్పులు తీసుకువస్తామని నమ్ముతున్నాం’’ అని అభిప్రాయపడ్డారు.

‘‘నరేంద్ర మోదీ, అమిత్‌షా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని, ఎన్నికలను హైజాక్ చేస్తున్నారని ప్రజలకు తెలియజేయడంలో ప్రతిపక్షంగా మేం చాలా వరకు విజయం సాధించామని ఇక్కడ ఉన్న వారంతా భావిస్తున్నారు. భారత్‌లో తప్పు జరుగుతుందని, దాన్ని కచ్చితంగా ఆపాలనే ఆలోచన యువతలో వచ్చింది’’ అని పేర్కొన్నారు.

‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, రాబోయే నెలల్లో దేశ రాజకీయాల్లో కీలక మార్పులు చూస్తారన్న రాహుల్ గాంధీ

‘‘ఎన్నికల సంఘంలో ఉన్న ఇద్దరు ముగ్గురు సభ్యులు కేవలం పావులే. వారిని తోలుబొమ్మల్లా అమిత్‌షా, నరేంద్ర మోదీ ఆడిస్తున్నారు' అని సమావేశం తర్వాత మల్లికార్జున ఖర్గే అన్నారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు.

‘‘ఓట్లను చోరీ చేసి బెంగాల్, మధ్యప్రదేశ్, హరియాణా, బిహార్‌లో బీజేపీ గెలిచింది. మేం సుప్రీకోర్టులో పోరాటం చేశాం’’ అని ఆమె అన్నారు.

‘‘ప్రజలు ఓటు వేసుకోలేకపోతే, వారి ఓటు చోరీకి గురైతే లేదా ఓటర్లను మోసం చేస్తే దేశం ఎటు వెళ్తుంది? ’’ అని మమత ప్రశ్నించారు.

‘ఇండియా’ బ్లాక్ మీటింగ్ , రాహుల్ గాంధీ, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్
ఫొటో క్యాప్షన్, సమావేశానికి అఖిలేశ్ యాదవ్ ఎందుకు రాలేదని ప్రశ్నించిన కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

‘ఇండియా’ బ్లాక్‌లో నేతల గైర్హాజరుపై బీజేపీ ప్రశ్నలు

దిల్లీలో ఇండియా బ్లాక్ సమావేశం అనంతరం బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ సహా ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేశారు.

‘‘సమావేశానికి ముందే ఇండియా బ్లాక్ ముక్కలైనట్టు కనిపిస్తోంది’’ అని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.

‘‘డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, జేఎంఎం చీఫ్ హేమంత్ సోరెన్, ఆప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కూడా రాలేదు. ఉద్దవ్ ఠాక్రే కూడా నేరుగా రాలేదు. వర్చువల్‌గా హాజరయ్యారు’’ అని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీని నాయకుడిగా అంగీకరించేందుకు ఇండియాలోని ఏ పార్టీ కూడా సిద్ధంగా లేదని చౌహాన్ అభిప్రాయపడ్డారు.

అయితే, హేమంత్ సోరెన్, ఉద్దవ్ ఠాక్రే వర్చువల్‌గా సమావేశంలో పాల్గొని తమ ఆలోచనలు పంచుకున్నారని మీడియాతో మల్లికార్జున ఖర్గే తెలిపారు.

కూటమికి ఇది మంచి సమయమా?

‘ఇండియా’ బ్లాక్‌కు ఇది రాజకీయంగా ఒక మంచి అవకాశమని ‘ది హిందూ’ పబ్లిషింగ్ గ్రూప్ డైరెక్టర్, సీనియర్ జర్నలిస్ట్ అయిన ఎన్.రామ్ అన్నారు.

"ఎన్నికల సంఘానికి సంబంధించిన వివాదాలు, పరీక్షలు, ఉద్యోగ నియామక ప్రక్రియలలో ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయన్న ఆరోపణలు వంటి సమస్యలు యువతలో అసంతృప్తిని సృష్టించాయి. అయితే, కాంగ్రెస్-‘ఇండియా’ కూటమి దీనిని సరైన దిశలో నడిపించగలదా లేదా అన్నదే అసలు ప్రశ్న’’ అని ఎన్.రామ్ అభిప్రాయపడ్డారు.

సవాళ్లు కేవలం ‘ఇండియా’ కూటమికి మాత్రమే ఎదురవడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార ఎన్డీఏ కూడా అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని వారంటున్నారు.

"తమ తదుపరి అడుగు ఏంటో అర్థం చేసుకోవడానికి బీజేపీ కూడా ప్రయత్నిస్తోంది. ఎన్నికల సంఘం పనితీరులో సమస్యలు లేవని బీజేపీ చెప్పలేదు. కానీ దానిని అంగీకరించనూ లేదు" అని సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకురాలు అదితి ఫడ్నిస్ బీబీసీతో అన్నారు.

‘‘వారి ప్రధాన దృష్టి ఎన్నికల సంఘంపైనే ఉంది. ఇది సరైన వ్యూహమని నేను భావిస్తున్నా. బీజేపీ ఈ విషయం నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రయత్నించిందిగానీ ఇప్పటి వరకు అందులో పూర్తిగా విజయం సాధించలేదు. అదే సమయంలో దీనిపై రాహుల్ గాంధీ దూకుడు వైఖరి ప్రభావం చూపుతున్నట్లు కనిపిస్తోంది" అని అదితి అభిప్రాయపడ్డారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)