భర్తను హత్య చేసి బ్లూ డ్రమ్‌లో దాచిన మహిళకు, ఆమె ప్రియుడికి ఉరిశిక్ష

ఫొటో సోర్స్, Getty Images
(హెచ్చరిక: ఈ కథనంలో కలిచివేసే విషయాలున్నాయి)
సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని హత్య చేసి, ఆయన మృతదేహాన్ని డ్రమ్‌లో పెట్టిన కేసులో ఆయన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్‌కు మేరఠ్ కోర్టు మరణశిక్ష విధించింది.
ప్రాసిక్యూషన్ ఈ విషయాన్ని ధ్రువీకరించినట్టు బీబీసీ ప్రతినిధి దిల్నవాజ్ పాషా తెలిపారు.
దాదాపు ఏడాదిన్నర విచారణ తర్వాత జిల్లా జడ్జ్ జస్టిస్ అరవింద్ కుమార్ ఈ తీర్పును వెలువరించారు. నిందితులిద్దరూ జైలు నుంచే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విచారణకు హాజరయ్యారు. విచారణ సమయంలో వాళ్లు మౌనంగా ఉన్నారు.
హత్య కేసులో సాహిల్, ముస్కాన్‌లకు మరణశిక్ష విధించినట్టు ప్రాసిక్యూషన్ లాయర్ విజయ్ బహదూర్ తెలిపారు. కోర్టు వాళ్లిద్దరికీ 20వేల రూపాయల జరిమానా కూడా విధించిందని చెప్పారు. ఇతర సెక్షన్ల కింద మరో ఏడేళ్ల జైలు శిక్ష కూడా విధించారు.

శిక్ష విధించడానికి ముందు "దోషులకు ఉరిశిక్ష పడాలన్నదే మా ఏకైక కోరిక" అని మృతుడు సౌరభ్‌కు సోదరుడైన రాహుల్ అన్నారు.
"వాళ్లిద్దరూ ఆందోళనగా ఉన్నారు. వాళ్లు రాత్రి భోజనం, ఉదయం అల్పాహారం చాలా తక్కువగా తిన్నారు. కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రపోవడం లేదని తెలిసింది. ముస్కాన్ గత మూడు, నాలుగు రోజులుగా తన పెద్ద కుమార్తెను కలవాలని కోరుతున్నారు. ఆ పాప వయసు ఏడేళ్లు. అయితే ఇప్పటివరకు పాపను ఆమె దగ్గరికి తీసుకువెళ్లలేదు" అని రాహుల్ చెప్పారు.

ఫొటో సోర్స్, @meerutpolice
‘కుటుంబ సభ్యులను కాదని ప్రేమ వివాహం’
మార్చి 2025లో ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఒక హత్య జరిగింది. మేరఠ్‌కు చెందిన సౌరభ్ రాజ్‌పుత్ అనే వ్యక్తిని ఆయన భార్య తన ప్రియుడితో కలిసి హత్య చేశారు.
29 ఏళ్ల సౌరభ్ రాజ్‌పుత్ లండన్‌లో పనిచేసేవారు. 2025 ఫిబ్రవరిలో ఆయన భారత్‌కు వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత కొన్నాళ్లకు సౌరభ్ కనిపించడం లేదని ఆయన కుటుంబసభ్యులు మేరఠ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, ఈ హత్యకు సంబంధించి వివరాలు బయటకు వచ్చాయి.
ముస్కాన్ రస్తోగి (28) తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను మార్చి మూడోతేదీ రాత్రి హత్య చేశారని మేరఠ్ పోలీసులు తెలిపారు.
మృతదేహాన్ని ఒక డ్రమ్‌లో ఉంచి, దాన్ని కాంక్రీటుతో నింపారని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
పోలీసులు ఆ డ్రమ్‌ను స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి కట్టర్‌తో డ్రమ్‌ను కోసి మృతదేహాన్ని బయటకు తీశారు.
సౌరభ్ రాజ్‌పుత్ అన్న రాహుల్ అలియాస్ బబ్లూ ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదైంది.
"మార్చి నాలుగో తేదీ నుంచి సౌరభ్ రాజ్‌పుత్ కనపించలేదు. అనుమానంతో ఆయన భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాను విచారణకోసం పిలిచాం. ముస్కాన్‌తో కలిసి సాహిల్ సౌరభ్‌ను హత్య చేసినట్టు విచారణలో వెల్లడయింది. హత్య అనంతరం మృతదేహాన్ని ముక్కలుగా చేసి, ఒక డ్రమ్‌లో వేసి సిమెంట్, ఇసుక మిశ్రమంతో దాన్నినింపారు. ఆ తర్వాత ముస్కాన్, సాహిల్ ఇద్దరూ సిమ్లా, మనాలి, కసౌలికి విహారయాత్రకు వెళ్లారు'' అని మేరఠ్ అప్పటి ఏఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు.
మేరఠ్‌లోని బ్రహ్మపురి ప్రాంతానికి చెందిన సౌరభ్ రాజ్‌పుత్ తన ఇంటికి కొద్ది దూరంలో నివసించే ముస్కాన్ రస్తోగిని 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు.
కుటుంబసభ్యులు వ్యతిరేకించినప్పటికీ వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.
2019లో వారికి ఓ కూతురు పుట్టింది.

ఫొటో సోర్స్, SHIV PRAKASH
విడాకుల వరకూ వెళ్లి...
ఆర్థిక ఇబ్బందుల కారణంగా సౌరభ్‌కు తన తల్లిదండ్రులతో విభేదాలొచ్చాయని పోలీసులు చెప్పారు. ఆ తర్వాత ఆయన, ముస్కాన్ కలిసి దగ్గరలోని ఇందిరా నగర్లో ఉండసాగారు.
సౌరభ్ ఇంట్లోలేని సమయంలో ముస్కాన్, సాహిల్ శుక్లాల మధ్య సాన్నిహిత్యం పెరిగింది.
‘‘ సౌరభ్ ఇంటికి కొద్దిదూరంలోనే 27 ఏళ్ల సాహిల్ నివసించేవారు. ఆయన, ముస్కాన్ ఎనిమిదో తరగతిలో కలిసి చదువుకున్నారు. సాహిల్ బీకామ్ చదివి ఆన్లైన్ ట్రేడింగ్ చేస్తుండేవారు’’ అని ఏఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ తెలిపారు.
''తన భార్యకు సాహిల్‌తో ఉన్న సంబంధం గురించి సౌరభ్‌కు తెలిసింది. దీంతో 2021లో ఆయన విడాకుల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే కూతురు ఉందని, విడాకులు వద్దని కుటుంబ సభ్యులు నచ్చజెప్పడంతో ఆయన ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారు. కానీ వాళ్లిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి'' అని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, SHIV PRAKASH
2025 మార్చి 3,4 తేదీల్లో ఏం జరిగింది?
విచారణలో ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించారని పోలీసులు తెలిపారు.
సౌరభ్ రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం లండన్ వెళ్లారని, ఆ సమయంలోనే తనకు, సాహిల్‌కు మధ్య స్నేహం మరింత బలపడిందని ముస్కాన్ పోలీసులతో చెప్పారు.
సౌరభ్ పాస్‌పోర్ట్ గడువు ముగియబోతుండడంతో దానిని పునరుద్ధరించుకోవడానికి ఆయన ఫిబ్రవరి 24న భారత్‌కు వచ్చారు.
సౌరభ్ భారత్ రాకముందే ఆయన హత్యకు పూర్తి ప్రణాళికను సిద్ధం చేసుకున్న ముస్కాన్, సాహిల్‌లు ఇందుకోసం ఒక కత్తిని, మత్తుమందును కొన్నారని పోలీసులు చెప్పారు.
''హత్య జరిగిన మార్చి మూడో తేదీ రాత్రి... సౌరభ్ ఆహారంలో ముస్కాన్ మత్తుమందు కలిపారు. సౌరభ్ స్పృహ కోల్పోయిన తర్వాత సాహిల్ ఆయన చేతిని పట్టుకోగా, ముస్కాన్ పలుమార్లు కత్తితో పొడిచారు. సాక్ష్యాలను చెరిపివేయడానికి వాళ్లిద్దరూ బ్లీచింగ్ పౌడర్‌తో గదిని కడిగారు.
మార్చి నాలుగున మార్కెట్ నుంచి ఒక డ్రమ్, సిమెంట్ కొనుగోలు చేసి, ఆ తర్వాత మృతదేహాన్ని డ్రమ్‌లో ఉంచి సిమెంట్‌తో నింపారు'' అని పోలీసులు తెలిపారు.

ఫొటో సోర్స్, @meerutpolice
హత్య విషయం ఎలా బయటపడింది?
మృతదేహాన్ని దాచిన తర్వాత ముస్కాన్ తన కూతురిని తల్లి దగ్గర వదిలి సాహిల్‌తో కలిసి విహారయాత్రకు వెళ్లారు.
పెళ్లి తర్వాత సౌరభ్‌ను ఆయన కుటుంబ సభ్యులు దూరంపెట్టారని, ఆయనతో పెద్దగా సంబంధాలు కొనసాగించలేదని పోలీసులు తెలిపారు. దీంతో సౌరభ్ కనిపించని విషయం చాలా రోజుల పాటు ఎవరికీ తెలియలేదు.
మార్చి 17న ముస్కాన్ తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఆరేళ్ల కూతురు తన తండ్రి సౌరభ్ గురించి అడిగింది. దీంతో ముస్కాన్ భావోద్వేగానికి లోనయ్యారు. తర్వాత పుట్టింటికి వెళ్లి సౌరభ్ అదృశ్యానికి తన అత్తింటివారే కారణమని ఆరోపించారు. ఆమె మాటలపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
విచారణలో ముస్కాన్ తన నేరాన్ని అంగీకరించడంతో పోలీసులు డ్రమ్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ముస్కాన్ తల్లిదండ్రులేమంటున్నారు?
ముగ్గురు అన్నదమ్ముల్లో సౌరభ్ అందరికన్నా చిన్నవాడు.
"నా తమ్ముణ్ని క్రూరులు చంపేశారు. నా తమ్ముణ్ని ముస్కానే కుటుంబం నుంచి దూరం చేసింది. దీని వెనుక ఒక పెద్ద కుట్ర ఉండొచ్చు. ఈ హత్యలో ముస్కాన్ కుటుంబసభ్యులు ప్రమేయం కూడా ఉందని నాకు అనుమానంగా ఉంది. దోషులను కఠినంగా శిక్షించాలి" అని సౌరభ్ అన్న రాహుల్ బీబీసీతో చెప్పారు.
"ముస్కాన్ ఇలాంటి పని చేయగలదంటే నేను నమ్మలేకపోయాను" అని సౌరభ్ ఇంటి యజమాని ఓంపాల్ సింగ్ బీబీసీతో అన్నారు.
సమాజానికి తమ కుమార్తె ప్రమాదకరమని, ఆమెకు మరణశిక్ష విధించాలని ముస్కాన్ రస్తోగీ తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేశారు.
"నా కూతురు తన స్నేహితునితో కలిసి తన గదిలోనే భర్తను హత్య చేసింది. ఆమెకు ఈ సమాజంలో ఉండే అర్హత లేదు. ఆమె ఇతరులకు ప్రమాదకారి... ఆమెకు మరణశిక్ష విధించాలి" అని ముస్కాన్ తండ్రి ఏఎన్ఐ వార్తా సంస్థతో అన్నారు.
''సౌరభ్ చాలా మంచి వ్యక్తి. నా కూతురి వల్ల ఆయనకు అన్యాయం జరిగింది'' అని ముస్కాన్ తల్లి అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























