ఐరాస జనరల్ అసెంబ్లీకి ఈ దేశాధినేతలు ఎందుకు రాలేదు?

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ కొనసాగుతోంది. ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌కు ఇదే చివరి జనరల్ అసెంబ్లీ.
గుటెరస్ పదవీకాలంలో ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో సంక్షోభాలు, ఘర్షణలు, మహమ్మారులు, వాతావరణ విపత్తులు చోటుచేసుకున్నాయి. కృత్రిమ మేధ అభివృద్ధిలోనూ ఇది కీలకమైన ఘట్టమే.
ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీకి బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కొత్త ఐరాస ప్రధాన కార్యదర్శి ఎంపిక ప్రక్రియను ఆయన పర్యవేక్షించనున్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జనరల్ అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే ఈసారి పలువురు ప్రముఖ నేతలు కూడా సమావేశానికి దూరంగా ఉన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కూడా సమావేశానికి రాలేదు.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించేందుకు వెళ్లని నేతలు ఎవరెవరు, వారు హాజరుకాకపోవడానికి కారణాలేంటో చూద్దాం.


ఫొటో సోర్స్, Getty Images
భారత్: నరేంద్ర మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలకు చాలా తక్కువసార్లు హాజరయ్యారు.
ఆయన చివరిసారిగా 2021లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. అప్పటి నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ తరఫున విదేశాంగ మంత్రి ఎస్. జైశంకరే వరుసగా పాల్గొంటున్నారు.
‘‘ఈ ఏడాది ప్రారంభంలో సెప్టెంబర్ 25న జరిగే 81వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో భారత జాతీయ వక్తగా నరేంద్ర మోదీ పేరును నమోదు చేశారు. ఆయా దేశాలు ప్రసంగానికి అవకాశం కోరినప్పుడు మాత్రమే ఐరాస వక్తల జాబితాను విడుదల చేస్తుంది. ఐరాస తనంతట తానుగా ఈ జాబితాను రూపొందించదు. అంటే మోదీ తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. దీంతో జైశంకర్‌కు ఒక రికార్డు ఏర్పడింది" అని ఆంగ్ల దినపత్రిక ‘డెక్కన్ హెరాల్డ్’ ఒక కథనంలో పేర్కొంది"
"భారత ప్రతినిధి బృందానికి ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ఐదుసార్లు నాయకత్వం వహించిన మరో భారతీయురాలు విజయలక్ష్మి పండిట్ మాత్రమే. అయితే ఆమె వరుసగా ఐదుసార్లు ఈ బాధ్యత చేపట్టలేదు. అంతేకాదు, ఆ ఐదు సందర్భాల్లోనూ ఆమె భారత విదేశాంగ వ్యవస్థలో భాగంగా లేరు. 1963లో జరిగిన 18వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించినప్పుడు ఆమె మహారాష్ట్ర గవర్నర్"
దౌత్య వ్యవహారాల విశ్లేషకుడు కేపీ నాయర్ డెక్కన్ హెరాల్డ్‌లో "జైశంకర్‌కు ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది. వచ్చే ఏడాదికి ఆయన దౌత్య జీవితంలో 50 ఏళ్లు పూర్తవుతాయి. ఇలాంటి సామాజిక సంబంధాలు ఆయన రోజువారీ జీవితంలో భాగంగా ఉన్నాయి. ఉన్నత స్థాయి సామాజిక సంబంధాలు కఠినమైన దౌత్యాన్ని ప్రభావితం చేయగలవు. జాతీయ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడంలో సహాయపడగలవు." అని రాశారు,
"మోదీ దీనిపై స్పష్టత ఇచ్చే వరకు, ప్రతి ఏడాది ఐరాస జనరల్ అసెంబ్లీలో తన విదేశాంగ మంత్రికి నాయకత్వ బాధ్యత ఎందుకు ఇస్తున్నారనే దానిపై ఊహాగానాలు మాత్రమే చేయగలం. సాధారణ భారతీయ రాజకీయ నాయకులతో పోలిస్తే, శిక్షణ పొందిన దౌత్యవేత్త ఈ బాధ్యతకు మరింత అనుకూలంగా ఉంటారు."
"2028లో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం పోటీ చేయాలని భారత్ భావిస్తోంది. భద్రతా మండలి స్థానాల కోసం సాధారణంగా విదేశాంగ మంత్రి క్యాంపెయిన్ నడిపిస్తారు. ప్రధానమంత్రి నేరుగా జోక్యం చేసుకోవడం చాలా అరుదు. దౌత్యవేత్త అయిన విదేశాంగ మంత్రి ఈ ముఖ్యమైన క్యాంపెయిన్‌ను నడిపించేందుకు అత్యంత అనుకూలంగా ఉంటారు"

ఫొటో సోర్స్, Getty Images
చైనా: షీ జిన్‌పింగ్
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఈ ఏడాది ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఏడాది ఐరాస ఉన్నత స్థాయి సమావేశం జరిగిన సమయంలో ఆయన అమెరికాలోనే ఉన్నారు. అయినా న్యూయార్క్ వెళ్లలేదు.
వాణిజ్య సంబంధాలు, కృత్రిమ మేధ, తైవాన్ భద్రతా పరిస్థితి వంటి పలు కీలక అంశాల్లో షీ జిన్‌పింగ్, డోనల్డ్ ట్రంప్ మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
షీ జిన్‌పింగ్ చివరిసారిగా 2015లో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షంగా ప్రసంగించారు.
అది ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన సమావేశం. ప్రపంచ ఫాసిజం వ్యతిరేక యుద్ధంలో విజయంలో చైనా పాత్రను ఆయన ప్రస్తావించారు. ఇది రెండో ప్రపంచ యుద్ధాన్ని ఉద్దేశించిన వ్యాఖ్య.
అదే సమయంలో అంతర్జాతీయ వ్యవస్థను రూపొందించడంలో చైనా నాయకత్వ పాత్రకు బీజింగ్‌కు ఉన్న చట్టబద్ధతను కూడా ఆయన నొక్కిచెప్పారు.
"ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల ప్రమాదం కూడా తగ్గుతుంది. జనరల్ అసెంబ్లీలో జరిగే సాధారణ చర్చ సందర్భంగా మరో ప్రపంచ నేత అనూహ్యంగా చైనాను విమర్శించే అవకాశం ఉంటుంది" అని నిక్కీ ఆసియా పత్రిక ఒక కథనంలో రాసింది. 2015లో షీ జిన్‌పింగ్ న్యూయార్క్ పర్యటన సందర్భంగా ఐరాస ప్రధాన కార్యాలయం వెలుపల జరిగిన చైనా వ్యతిరేక నిరసనలు కూడా విస్తృతంగా దృష్టిని ఆకర్షించాయి.

ఫొటో సోర్స్, Getty Images
రష్యా: వ్లాదిమిర్ పుతిన్
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ప్రతిష్ఠాత్మకమైన ఐరాస వేదికపై చాలా అరుదుగా కనిపిస్తారు. అందువల్ల ఈ ఏడాది రష్యా తరఫున విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రసంగించనుండటం ఆశ్చర్యకరం కాదు.
వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా 2015 సెప్టెంబర్ 28న న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి ప్రత్యక్షంగా హాజరయ్యారు. అది 70వ ఐరాస జనరల్ అసెంబ్లీ.
2005 తర్వాత వార్షిక జనరల్ అసెంబ్లీకి ఆయన ప్రత్యక్షంగా హాజరైన తొలి సందర్భం ఇదే.
2015 తర్వాత ఐరాస జనరల్ అసెంబ్లీలకు దూరంగా ఉండటానికి పుతిన్ స్పష్టమైన, స్థిరమైన అధికారిక కారణాన్ని ఎప్పుడూ వెల్లడించలేదు.
ఈ ధోరణి యుక్రెయిన్ యుద్ధానికి ముందే ప్రారంభమైంది. 2016 నుంచి 2019 మధ్య న్యూయార్క్‌లో జరిగిన వార్షిక జనరల్ అసెంబ్లీలకు కూడా ఆయన హాజరు కాలేదు. సాధారణంగా రష్యా తరఫున ప్రాతినిధ్యం వహించే బాధ్యతను విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్కు అప్పగించారు.
ఐరాస జనరల్ అసెంబ్లీ పుతిన్‌కు ఎప్పుడూ సాధారణంగా హాజరయ్యే వేదిక కాలేదు. 2015కు ముందు కూడా ఆయన జనరల్ అసెంబ్లీకి అప్పుడప్పుడు మాత్రమే హాజరయ్యారు.
2000, 2003, 2005, 2015 సంవత్సరాల్లో మాత్రమే ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారు. 2015లో ఆయన పర్యటన ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవంతో పాటు సిరియాకు సంబంధించిన కీలక దౌత్య ప్రయత్నాలతోనూ ముడిపడి ఉంది. అందువల్ల అది సాధారణ పర్యటన కాకుండా ప్రత్యేక సందర్భంగా నిలిచింది.

ఫొటో సోర్స్, Getty Images
జర్మనీ: ఫ్రెడ్రిక్ మెర్జ్
జర్మనీ ప్రసార సంస్థ డీడబ్ల్యూ "ఫ్రెడ్రిక్ మెర్జ్ ప్రధానమంత్రిగా రెండో సంవత్సరంలో ఉన్నారు. అంతర్జాతీయ వేదికపై మరింత చురుకుగా వ్యవహరించాలని ఆయన కోరుకుంటున్నారు. తనను తాను 'విదేశాంగ విధాన ప్రధానమంత్రి'గా అభివర్ణించుకున్నారు. అయితే దేశీయ రాజకీయాలు ఆయనను బిజీగా ఉంచుతున్నాయి." అని రాసింది,
సెప్టెంబర్‌లో జర్మనీలోని మూడు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎన్నికలు జరిగాయి. ప్రధానమంత్రి, క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ నాయకుడిగా ఫ్రెడ్రిక్ మెర్జ్‌పై ఒత్తిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగింది.
దేశంలోని సంక్షోభాన్ని పరిష్కరించడంలో మెర్జ్ బిజీగా ఉన్నారు. తాను లేని సమయంలో ప్రత్యర్థులు తిరుగుబాటుకు ప్రణాళికలు రూపొందించకుండా చూడాలని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆయన స్థానంలో జర్మనీ విదేశాంగ మంత్రి జోహాన్ వాడెఫుల్ ఐరాస జనరల్ అసెంబ్లీలో ప్రసంగించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇటలీ: జార్జియా మెలోని
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని మెర్జ్‌తో పోలిస్తే బలమైన స్థితిలో ఉన్నారు. అయితే ఈ వారం దేశీయ అంశాలపై దృష్టి పెట్టడం తనకు ముఖ్యమని ఆమె చెప్పారు.
జూలై ప్రారంభంలో జరిగిన నాటో సదస్సు తర్వాత జార్జియా మెలోని ఇటీవల పలు అంతర్జాతీయ సదస్సులకు హాజరై తిరిగి వచ్చానని, ఇటలీకి సంబంధించిన పెండింగ్ అంశాలతో పాటు అనేక విషయాలను పరిష్కరించాల్సి ఉందని చెప్పారు.
2025లో మెర్జ్ కూడా ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరు కాలేదని ఆమె పేర్కొన్నారు. ఈసారి మెలోని కూడా తన స్థానంలో విదేశాంగ మంత్రి ఆంటోనియో తజానీని పంపుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
దక్షిణాఫ్రికా: సిరిల్ రమాఫోసా
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమాఫోసా ఇటీవల భారత్‌లో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యారు.
ఆరోగ్య కారణాల వల్ల తాను ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి హాజరు కాలేనని ఆయన తెలిపారు.
విశ్రాంతి తీసుకుని కోలుకునేందుకు సమయం ఇవ్వాలని వైద్యులు ఆయనకు సూచించారు.
రమాఫోసా ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలను ఆయన కార్యాలయం వెల్లడించలేదు. దక్షిణాఫ్రికా తరఫున విదేశాంగ మంత్రి రొనాల్డ్ లమోలా కూడా ప్రాతినిధ్యం వహించనున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈజిప్ట్: అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీ
ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీ స్థానంలో ప్రధానమంత్రి ముస్తఫా మద్బౌలీ ఐరాస జనరల్ అసెంబ్లీలో దేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. అల్ సీసీ హాజరు కాకపోవడానికి కారణాన్ని ఆయన కార్యాలయం వెల్లడించలేదు.
2014లో అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరాల్లో అధ్యక్షుడు అల్ సీసీ ఐరాస జనరల్ అసెంబ్లీలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు.
2020లో కోవిడ్-19 మహమ్మారి కారణంగా సమావేశం ఆన్లైన్లో జరిగింది. మరుసటి ఏడాది హైబ్రిడ్ విధానంలో సమావేశం నిర్వహించగా, అల్ సీసీ ముందుగా రికార్డు చేసిన వీడియో సందేశాన్ని పంపారు.
జనరల్ అసెంబ్లీ ఆఫ్‌లైన్ తిరిగి ప్రారంభమైనప్పటికీ ఇప్పటి వరకు ఆయన దానికి హాజరు కాలేదు.

ఫొటో సోర్స్, Getty Images
నైజీరియా: బోలా టినుబు
నైజీరియా అధ్యక్షుడు బోలా టినుబు ఈ ఏడాది ఐరాస జనరల్ అసెంబ్లీకి దూరంగా ఉన్న ప్రభావవంతమైన ఆఫ్రికా నేతల్లో మూడో వ్యక్తి.
నైజీరియా మీడియా ప్రకారం, పశ్చిమ ఆఫ్రికా దేశానికి ఉపాధ్యక్షుడు కషీమ్ షెత్తిమా పూర్తి స్థాయిలో, సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహిస్తారని టినుబు ప్రతినిధి తెలిపారు.
ఇదిలా ఉండగా, టినుబు ప్రస్తుతం సెలవుల్లో ఉన్నారు. ఆగస్టు నెలలో ఆయన బ్రిటన్‌లో గడిపారు. ఆ తర్వాత ఫ్రాన్స్ వెళ్లారు.

ఫొటో సోర్స్, Getty Images
పాలస్తీనా భూభాగాలు: మహ్మూద్ అబ్బాస్
పైన పేర్కొన్న నేతల్లో ఐరాస జనరల్ అసెంబ్లీలో అత్యధిక అనుభవం ఉన్న నాయకుడు మహ్మూద్ అబ్బాస్.
2005 నుంచి పదవిలో ఉన్న పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చే వరకు జనరల్ అసెంబ్లీలకు క్రమం తప్పకుండా హాజరయ్యారు.
అయితే గత ఏడాది ట్రంప్ ప్రభుత్వం ఆయనకు దౌత్య వీసా మంజూరు చేయడానికి నిరాకరించింది. ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది.
1947లో కుదిరిన ఐరాస ప్రధాన కార్యాలయ ఒప్పందం ప్రకారం, విదేశీ ప్రతినిధులకు ఐరాస ప్రధాన కార్యాలయంలోకి ప్రవేశం కల్పించేందుకు అమెరికా కట్టుబడి ఉంది.
పాలస్తీనియన్ల విషయంలో "పాలస్తీనా విమోచన సంస్థ, పాలస్తీనా అథారిటీ సభ్యులకు వీసాలు జారీ చేయకుండా నిరోధించే" ఆంక్షలను పొడిగిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల తెలిపింది.
గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అబ్బాస్ దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించనున్నారు
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)




























