తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటన రద్దుపై బంగ్లాదేశ్ చెబుతున్న కారణాలను నిపుణులు ఎలా చూస్తున్నారు?

ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటన రద్దు కావడంతో భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలపై మరోసారి చర్చ మొదలైంది.
గత వారం ఢాకాలోని బంగ్లాదేశ్ అధికారులు తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయని సంకేతాలు ఇచ్చారు. తారిక్ రెహ్మాన్ రెండు రోజుల పర్యటన కోసం వచ్చే వారం మధ్యలో భారత్‌కు రావచ్చని భారత్‌లోని మీడియా కథనాలు తెలిపాయి.
దీంతో ఇరుదేశాల సంబంధాలు మళ్లీ మెరుగుపడతాయని ఆశలు చిగురించాయి. కానీ, తారిక్ రెహ్మాన్ పర్యటన రద్దు కావడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అలాగే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
‘‘పర్యటనకు అనుకూలమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని’’ బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదివారం అధికారికంగా ప్రకటించింది.
ఢాకాలోని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన విలేకరుల సమావేశంలో విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఏకేఎమ్ షాహిదుల్ కరీమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. మాజీ ప్రధాని షేక్ హసీనాను విడుదల చేయాలనే డిమాండ్‌ను బంగ్లాదేశ్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్ నిర్ణయాన్ని కొందరు నిపుణులు ప్రశ్నిస్తుండగా, మరికొందరు సమర్థించారు.


ఫొటో సోర్స్, ANI
బంగ్లాదేశ్ ఏమంది?
"షేక్ హసీనా, పరారీలో ఉన్న ఇతర నేరస్థులను వెంటనే బంగ్లాదేశ్‌కు తిరిగి పంపించాలని, షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్య కేసులో నిందితుడిని ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు అప్పగించాలని భారత అధికారులను కోరాం. దీనిపై భారత్ స్పందన కోసం బంగ్లాదేశ్ ఎదురుచూస్తోంది" అని ఏకేఎమ్ షాహిదుల్ కరీమ్ అన్నారు.
బంగ్లాదేశ్‌లో 2024లో జరిగిన హింసాత్మక ఉద్యమం తర్వాత షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఆమె భారత్‌కు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు.
ఇదిలా ఉండగా, 2025 డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు చెందిన విద్యార్థి నాయకుడు ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ ఉస్మాన్ హాదీ హత్యకు గురయ్యారు. ఆయన హత్య కేసులో ప్రధాన నిందితులు మైమెన్‌సింగ్ డివిజన్ పరిధిలోని హలుఘాట్ సరిహద్దు మీదుగా భారత్‌కు పారిపోయాడని ఢాకా మెట్రోపాలిటన్ పోలీసులు తెలిపారు.
పరారైన నిందితులకు సహకరించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని వెస్ట్ గారో హిల్స్‌లో అదుపులోకి తీసుకున్నట్లు ఢాకా పోలీసులు పేర్కొన్నారు. కానీ, మేఘాలయ పోలీసులు ఈ వాదనను ఖండించారు.
భారత్ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తారిక్ రెహ్మాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్లినప్పుడు, భారత ప్రధాని నరేంద్ర మోదీ తరఫున తారిక్ రెహ్మాన్ ను భారత్ పర్యటనకు అధికారికంగా ఆహ్వానించారు.
అలాగే భారత రాజధాని న్యూదిల్లీలో జరగనున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి హాజరు కావాలని ప్రస్తుత బిమ్‌స్టెక్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బంగ్లా ప్రధాని తారిక్ రెహ్మాన్‌కు భారత్ ఆహ్వానం పంపింది.
ఈ ఆహ్వానాల సమాచారాన్ని బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి ఖలీలుర్ రెహ్మాన్ ఇటీవలే వెల్లడించారు.
ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్‌ను భారత హైకమిషనర్ కలిసినప్పుడు, ఈ ఆహ్వానాలపై తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తారిక్ రెహ్మాన్ చెప్పడం గమనార్హం.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ప్రధానమంత్రి ఆగస్టు మూడో వారంలో దిల్లీని సందర్శించే అవకాశం ఉందని ఇరు దేశాల మీడియా సంస్థలు అధికారిక వర్గాలను ఉటంకిస్తూ కథనాలు ప్రచురించాయి.

ఫొటో సోర్స్, MD Abu Sufian Jewel/NurPhoto via Getty Images
నిపుణుల మాటేమిటి?
"షేక్ హసీనాను అప్పగించాలని బంగ్లాదేశ్ నిరంతరం డిమాండ్ చేస్తోంది. అప్పగింత ప్రక్రియసుదీర్ఘమైనది. ఈ ప్రక్రియ భారత్‌లోనే పూర్తికావాలని, ఆ తర్వాతే షేక్ హసీనా బంగ్లాదేశ్‌కు వెళ్లగలరని భారత ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఆగస్టు 5న దిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వయంగా షేక్ హసీనానే తాను బంగ్లాదేశ్‌కు వెళ్లాలని కోరుకుంటున్నానని, నిర్దేశిత ప్రక్రియ ప్రకారం ఏది జరిగినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కాబట్టి ఇప్పుడు బంతి బంగ్లా దేశ్ ప్రభుత్వం చేతిలోనే ఉంది. షేక్ హసీనా తిరిగి రావడానికి వీలైన ప్రక్రియను వారు సులభతరం చేయాలి" అని బంగ్లాదేశ్‌లో మాజీ భారత హైకమిషనర్ వీణా సిఖ్రీ వార్తా సంస్థ ఐఏఎన్‌ఎస్ తో అన్నారు.
"బంగ్లాదేశ్‌లోని అటార్నీ జనరల్, కొందరు మంత్రులు సహా పలువురు అధికారులు షేక్ హసీనా తిరిగి రావాలనుకుంటే, ఆ ప్రక్రియను సులభతరం చేసేందుకు మార్గాన్ని కనుగొనవచ్చని చెప్పడం మాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ మళ్లీ పాత అంశాన్నే లేవనెత్తుతోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్న అంశంపైనే అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. భారత్, బంగ్లాదేశ్ సంబంధాలు మళ్లీ గాడిన పడాలని కోరుకోని విదేశీ దేశాల ఒత్తిడిలో బంగ్లాదేశ్ చిక్కుకుపోయిందనే విషయాన్ని ఇది సూచిస్తోంది. షేక్ హసీనా హయాంలో ఉన్నట్లుగా ఇరు దేశాల సంబంధాలు ఉండాలని వారు కోరుకోవడం లేదు" అని వీణా సిఖ్రీ అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ చంద్ర ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. "రెహ్మాన్ భారత్ పర్యటనకు బంగ్లాదేశ్ షరతులు పెడుతోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆయనకు స్పష్టంగా, మీ దారిన మీరు వెళ్లండి అని చెబుతుందని ఆశిస్తున్నా’’ అన్నారు.
"బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి షాహిదుల్ కరీమ్ చేసిన ప్రకటన చాలా స్పష్టంగా, సూటిగా ఉంది. ప్రస్తుతం ప్రధానమంత్రి తారిక్ రెహ్మాన్ భారత్ పర్యటనకు అనుకూలమైన పరిస్థితులు లేవు. ద్వైపాక్షిక పర్యటనకు సంబంధించి ఇరు దేశాల అధికారులు కొన్ని వారాలుగా సంప్రదింపులు జరుపుతున్నారని కరీమ్ చెప్పారు. కానీ ఆగస్టు 5న న్యూదిల్లీలో షేక్ హసీనా బహిరంగంగా కనిపించడం ఈ ప్రక్రియకు తీవ్ర విఘాతం కలిగించిందనే చెప్పుకోవాలి. షేక్ హసీనా అమానవీయ నేరాలకు పాల్పడినట్లు అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ తేల్చింది" అని ప్రముఖ బంగ్లాదేశ్ వ్యాఖ్యాత సామి అన్నారు.
‘‘ఈ ప్రత్యేక అంశంపై ప్రభుత్వ వైఖరి పూర్తిగా సరైనదేనని’’ సామి పేర్కొన్నారు.
"ఇరు దేశాల సంబంధాలు పరస్పర గౌరవం, జవాబుదారీతనంపై ఆధారపడి ఉండాలని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది. దౌత్య ప్రయోజనాల కోసం ఒక తీవ్రమైన ఫిర్యాదును పక్కన పెట్టేందుకు నిరాకరిస్తూ ప్రధానమంత్రి నిజంగా బంగ్లాదేశ్ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రస్తుతం చేయాల్సింది కూడా ఇదే" అని పేర్కొన్నారు.
మాజీ అమెరికా దౌత్యవేత్త జాన్ డానిలోవిచ్‌కు బంగ్లాదేశ్, దక్షిణాసియా వ్యవహారాల్లో విస్తృతమైన అనుభవం ఉంది.
"బంగ్లాదేశ్ అనుసరిస్తున్న ఈ విధానం ఉత్తమమైంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోతే, కేవలం ఫొటోల కోసం ప్రధానమంత్రి తారిక్ భారత్‌కు తొందరగా వెళ్లాల్సిన అవసరం లేదు" అని ఆయన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అన్నారు.
"న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి తారిక్, ప్రధాని మోదీ విడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత అవసరమైన ఏర్పాట్లు పూర్తయినప్పుడు తగిన సమయంలో ఇరు దేశాల మధ్య పరస్పర పర్యటనలు జరగచ్చు. ముఖ్యంగా ప్రధాని తారిక్ చైనా పర్యటన తర్వాత భారత్ వైపు నుంచి ఈ పర్యటనపై ఆసక్తి స్పష్టంగా కనిపించింది. విదేశాంగ మంత్రి ఖలీల్ న్యూదిల్లీని సందర్శించినప్పుడు, హసీనా తర్వాత భారత్‌తో సంబంధాలను పునరుద్ధరణ విషయంలో బంగ్లాదేశ్ నెమ్మదిగా, జాగ్రత్తగా ముందుకు సాగాలని కోరుకుంటోందని ఆయన తన భారత అధికారులకు పదేపదే చెప్పారు" అని పేర్కొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)






























