జైలర్ 2-మూవీ రివ్యూ: సూపర్ హిట్ సినిమాల ఫార్ములానే మళ్లీ ఫాలో అయ్యారా? రజినీ సీక్వెల్ ఎలా ఉంది?

జైలర్ 2, రజనీకాంత్, రమ్యకృష్ణ, మూవీ రివ్యూ
ఫొటో క్యాప్షన్, జైలర్ సీక్వెల్‌గా జైలర్ 2 విడుదలయింది.
    • రచయిత, జీఆర్ మ‌హ‌ర్షి
    • హోదా, బీబీసీ కోసం
  • ప్రచురణ
  • చదివే సమయం: 4 నిమిషాలు

జైల‌ర్ సూప‌ర్‌హిట్ త‌ర్వాత జైల‌ర్‌-2 పైన భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ర‌జ‌నీకాంత్‌, ద‌ర్శ‌కుడు నెల్స‌న్‌తో క‌లిసి మ‌ళ్లీ మ్యాజిక్ రిపీట్ చేసాడా?

ఫ‌స్ట్ పార్ట్‌లో రిటైర్డ్ జైల‌ర్ ముత్తువేల్ పాండ్య‌న్ (ర‌జినీకాంత్ ) తన కొడుకు అర్జున్‌ని చంపేస్తాడు. త‌ప్పుదారిలో ఉన్న‌ది కొడుకైనా స‌రే టైగ‌ర్ క్ష‌మించ‌డు. విల‌న్ వ‌ర్మ‌ని కూడా అంతం చేసి ఆయన వెనుక వున్న గ్యాంగ్‌ని కూడా తుద‌ముట్టిస్తాన‌ని చెప్ప‌డంతో జైల‌ర్ ముగుస్తుంది.

పార్ట్‌-2లో జైల‌ర్ ఒక సూప‌ర్ మార్కెట్‌లో ప‌ని చేస్తూ సాధార‌ణంగా జీవిస్తూ వుంటాడు. మిస్స‌యిన విగ్ర‌హాల కంటైన‌ర్ కోసం, వ‌ర్మ‌ని చంపిన వ్య‌క్తి ఆచూకీ కోసం దిలిప్ అనే పెద్ద గ్యాంగ్ లీడ‌ర్ వెతుకుతూ వుంటాడు.

ఈ క్ర‌మంలో హీరో ఒక చిన్న రౌడీ మూర్తి (న‌మోనారాయ‌ణ‌) ద‌గ్గ‌ర డ్రైవ‌ర్‌గా చేరుతాడు. విగ్ర‌హాల దొంగ‌గా ఉన్న యోగిబాబు సాయంతో హీరో తానే దిలిప్ ద‌గ్గరికి చేరుతాడు.

దిలిప్ వెనుక ఉన్న బోధి క‌ల్ప‌క్ (ఎస్‌జె.సూర్య‌) అస‌లు విల‌న్‌. ఫైన‌ల్‌గా హీరో అంద‌రినీ ఎలా ఫినిష్ చేశాడు? ఇది మిగ‌తా క‌థ‌. కొడుకుని చంపింది తండ్రేన‌ని ఆయన భార్య ర‌మ్య‌కృష్ణ‌కి తెలిసిందా లేదా?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జైలర్ 2, రజనీకాంత్, రమ్యకృష్ణ, మూవీ రివ్యూ
ఫొటో క్యాప్షన్, క్లైమాక్స్‌లో వ‌చ్చిన ఎమోష‌న్ సీన్‌, యాక్ష‌న్ సీన్స్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.

నిజానికి జైల‌ర్‌2లో కొత్త క‌థ ఏమీలేదు. జైల‌ర్‌లో ఉన్న‌దే కాస్త అటూఇటూ తేడాగా పార్ట్‌-2లో కూడా ఉంటుంది. ఈసారి విల‌న్ నాటు రౌడీ కాకుండా గోవాలో సొంత విమానాల్లో తిరిగే స్టైలిష్ డాన్‌.

ర‌జినీ సినిమాల్లో ప్ర‌త్యేక‌త ఏమంటే ఎలివేష‌న్లు, స్లోమోష‌న్ బిల్డ‌ప్‌లు, గ్లాసెస్ పెట్టుకోవ‌డం, సిగార్ ఎగ‌రేయ‌డం వుంటే చాలు ప్రేక్ష‌కులు లాజిక్‌లు అడ‌గ‌రు, క‌థ గురించి ప‌ట్టించుకోరు. కొంచెం ఎమోష‌న్, కామెడీ క‌లిపితే రేంజ్ మారిపోతుంది. ర‌జినీకాంత్ మాయాజాలం ఇది. ద‌ర్శ‌కుడు నెల్స‌న్ వీటికి హ్యూమ‌ర్ జత క‌లిపి పార్ట్‌-2ని కూడా స‌క్సెస్ చేసాడు.

ఇంట‌ర్వెల్ వ‌ర‌కూ గూస్‌బంప్స్ , విజిల్స్‌తో న‌డిచిన సినిమా సెకెండాఫ్‌లో కొంచెం రొటీన్‌గా స్లోగా ఉంది. కానీ క్లైమాక్స్‌లో వ‌చ్చిన ఎమోష‌న్ సీన్‌, యాక్ష‌న్ సీన్స్‌తో సినిమా మ‌ళ్లీ వేగం పుంజుకుంది.

జైలర్ 2, రజనీకాంత్, రమ్యకృష్ణ, మూవీ రివ్యూ
ఫొటో క్యాప్షన్, జైలర్ 2 ర‌న్ టైం కూడా 2 గంట‌ల 45 నిముషాలు.

‘ఒరిజినల్ టైగర్ బయటికి రాగానే’

ర‌జినీ సినిమాల్లో మెయిన్ ఎలిమెంట్ అద్భుత‌ర‌సం. అక్క‌డున్న‌ది మామూలు సూప‌ర్ మార్కెట్ సూప‌ర్‌వైజ‌ర్ కాదు, టైగ‌ర్ ముత్తువేల్ పాండ్య‌న్ అని ప్రేక్ష‌కుల‌కి తెలుసు. సినిమాలో వున్న చిన్న రౌడీ మూర్తి గ్యాంగ్‌కి తెలియ‌దు.

ఎప్పుడు అస‌లు ర‌జినీ వ‌స్తాడా? అని ఎదురు చూస్తూ ఆ పాత్ర‌ల అమాయ‌క‌త్వానికి మ‌నం న‌వ్వుకుంటూ వుంటాం. హోట‌ల్ సీన్‌లో ఒరిజిన‌ల్ టైగ‌ర్ బ‌య‌టికి వ‌చ్చిన‌ప్పుడు థియేట‌ర్ అంతా విజిల్స్‌. ర‌జినీ సూప‌ర్‌హిట్ సినిమాలు అన్నింటిలో ఇదే ఫార్ములా. జైల‌ర్‌, సీక్వెల్‌లో కూడా నెల్స‌న్ ఇదే ఫాలో అయ్యాడు.

మామూలుగా సీక్వెల్స్ వ‌ర్క‌వుట్ కావు. కార‌ణం ఏమంటే పార్ట్ 1కి మించి ఉండాల‌ని ప్రేక్ష‌కులు ఆశిస్తారు. అదే క‌థ‌లో కొత్త సీన్స్ ఎలా రాయాలో తెలియ‌క ద‌ర్శ‌కులు గంద‌ర‌గోళానికి గుర‌వుతారు. ఈ సినిమాలో కూడా సెకెండాఫ్ అంతా వీక్ రైటింగే.

ఎందుకంటే విగ్ర‌హాల స్మ‌గ్ల‌ర్ సూర్య‌, ఆయన అక్క విద్యాబాల‌న్, తండ్రి మిథున్ చ‌క్ర‌వ‌ర్తి త‌ర‌హా ఫ్యామిలీ విల‌నీని 1970 నుంచి వ‌చ్చిన హిందీ సినిమాల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ కొన్ని వంద‌లసార్లు జ‌నం చూసారు. కొత్త‌ద‌నం పూర్తిగా లేని ఎపిసోడ్ అది.

ప‌డిపోతున్న సెకెండాఫ్‌ని క్లైమాక్స్ సీన్‌లో ర‌మ్య‌కృష్ణ నిలబెట్టింది. కొడుకుని చంపింది ఎవ‌రో కాదు, భ‌ర్తేన‌ని తెలిసిన‌ప్పుడు ఆమె న‌ట‌న అద్భుతం. ఆ త‌ర్వాత హ‌ఠాత్తుగా కామియోలో మెరిసిన బాలీవుడ్ హీరో గూస్‌బంప్స్ తెప్పించాడు. పార్ట్‌-3కి వీలుగా విద్యాబాల‌న్‌ని ద‌ర్శ‌కుడు బ‌తికించాడు.

జైల‌ర్‌లో క‌నిపించిన మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్, జాకీష్రాఫ్ సీక్వెల్‌లో కూడా ఉన్నారు. ర‌జినీ న‌ట‌న‌కి అనిరుధ్ బీజీఎం ప్రాణం పోసింది. అయితే ఒక్క పాట కూడా గుర్తుండేలా లేదు. రెండు ఐటం సాంగ్స్ క‌థ‌కి అడ్డం త‌గ‌ల‌డం మిన‌హా సాధించింది లేదు. పార్ట్ -1లో త‌మ‌న్నా చేసిన ‘నువు కావాల‌య్యా’ పాట సినిమాకి ప్ల‌స్ అయింది. కానీ ఇక్క‌డ మైన‌స్‌.

ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ వెరీ రిచ్‌, కెమెరా సూప‌ర్బ్‌. ర‌న్ టైం కూడా 2 గంట‌ల 45 నిముషాలే. మొత్తంమీద ఎక్క‌డా నిరాశ‌ప‌ర‌చ‌ని సీక్వెల్‌.

జైలర్ 2, రజనీకాంత్, రమ్యకృష్ణ, మూవీ రివ్యూ
ఫొటో క్యాప్షన్, జైలర్ 2లో డైరక్టర్ ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు.

మైనస్‌లు గురించి చెప్పాలంటే....

ప్ల‌స్ పాయింట్స్‌

1.ర‌జినీ స్టైల్‌

2.అనిరుధ్ బీజీఎం

3.కామియో రోల్స్‌లో టాప్ హీరోస్‌

4.క్లైమాక్స్‌లో ర‌మ్య‌కృష్ణ న‌ట‌న‌

మైన‌స్ పాయింట్స్‌

1.సెకెండాఫ్‌లో వీక్ రైటింగ్‌

2.రొటీన్ ఎస్‌జే సూర్య విల‌నిజం

3.ఐటమ్ సాంగ్స్‌

ఫైన‌ల్‌గా టైగ‌ర్ కా హుకుం సీక్వెల్‌లో కూడా న‌డిచింది.

(అభిప్రాయాలు సమీక్షకుడి వ్యక్తిగతం)

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)