‘‘మతం మారిన తర్వాత కులం ఆధారంగా రిజర్వేషన్ పొందలేరు’’: సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Sanchit Khanna/Hindustan Times via Getty Image
ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తి అంతకు ముందున్న తన సామాజిక హోదా ఆధారంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ ప్రయోజనాలు పొందడానికి అర్హుడు కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
హిందూ మతాన్ని విడిచిపెట్టి ఇతర మతాన్ని స్వీకరించిన వ్యక్తి, గతంలోని సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందలేరని గురువారం సుప్రీంకోర్టు పేర్కొన్నట్టు లైవ్ లా తెలిపింది.
ఒక వ్యక్తి మతం మారిన తర్వాత గతంలో తన మతంలో ఎదుర్కొన్న సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా, మరో మతంలో నోటిఫైడ్ వెనుకబడిన తరగతిలో ఆ వ్యక్తిని చేర్చలేరని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రశేఖర్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 16(4) కింద రిజర్వేషన్ ప్రయోజనాన్ని పొందాలంటే సంబంధిత వెనుకబడిన తరగతికి చెందిన వ్యక్తి అయిఉండాలని ధర్మాసనం పేర్కొంది. కేవలం మతమార్పిడికి ముందు ఉన్న సామాజిక హోదా ఆధారంగా ఆ వ్యక్తిని కొత్త మతంలో వెనుకబడిన తరగతికి చెందినవారిగా పరిగణించలేమని తెలిపింది.
1950 నాటి రాజ్యాంగ (షెడ్యూల్డ్ కులాలు) ఉత్తర్వును సుప్రీంకోర్టు ప్రస్తావించింది.
"అందులోని మూడో పేరా ప్రకారం హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలు కాకుండా వేరే ఏ మతాన్నైనా అనుసరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులాలకు చెందినవారిగా పరిగణించలేం" అని పేర్కొంది.
మతంమారిన తర్వాత ఒక వ్యక్తి తిరిగి హిందూ మతాన్ని స్వీకరించినప్పటికీ గతంలో తనకున్న వెనుకబడిన తరగతి హోదా, రిజర్వేషన్ ప్రయోజనాలు వాటంతట అవే తిరిగి లభించవని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది.









