లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సహా వివిధ ముఠాలపై అమెరికాలో చర్యలు.. 'రౌడీలకు ఎక్కడా చోటు లేదు' అని ప్రకటన

ఫొటో సోర్స్, ANI
- రచయిత, జెస్సికా మర్ఫీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
- ప్రచురణ
- చదివే సమయం: 3 నిమిషాలు
భారత్‌కు చెందిన లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్ సహా మూడు వ్యవస్థీకృత నేర ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై అమెరికా, కెనడా, ఐరోపా దేశాలలో 24 మంది అనుమానితులను అరెస్ట్ చేసినట్లు అమెరికా ప్రాసిక్యూటర్లు ప్రకటించారు.
2023లో కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో ఉన్న ఒక గురుద్వారా వెలుపల సిక్కు నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు కుట్ర పన్నడంతో పాటు పలు రకాల నేరాలకు పాల్పడినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా టార్గెటెడ్ కిల్లింగ్స్, వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడుతున్న భారతీయ నేర ముఠాలపై కొన్నేళ్లుగా సాగిన ఫెడరల్ దర్యాప్తు ఫలితమే ఈ అరెస్టులని లాస్ ఏంజిల్స్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
భారతీయ నేర ముఠాలపై కేంద్రీకరించి, కొన్నేళ్లుగా సాగిన సుదీర్ఘ దర్యాప్తు ఫలితమే ఈ అరెస్టులని లాస్ ఏంజిల్స్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు తెలిపారు.
టార్గెటెడ్ కిల్లింగ్స్, వసూళ్లు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి నేరాలకు ఈ ముఠాలు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మంగళవారం వెల్లడించిన మూడు ఛార్జ్‌షీట్లలో మొత్తం 37 మంది నిందితులపై అభియోగాలు నమోదు చేశారు.
"భయాందోళనలు సృష్టిస్తూ, మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ, హింసకు పాల్పడే అంతర్జాతీయ నేర ముఠాలు న్యాయవ్యవస్థ పూర్తి శక్తిని, ఫెడరల్ ప్రభుత్వ కఠిన చర్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది" అని అమెరికా ఫస్ట్ అసిస్టెంట్ అటార్నీ బిల్ ఎసాలీ చెప్పారు.
"ఈ రౌడీలకు ఎక్కడా చోటు లేదు" అన్నారు.

ఫొటో సోర్స్, Reuters
నిజ్జర్ హత్యపై ఆరోపణలు
45 ఏళ్ల నిజ్జర్‌ను మూడేళ్ల కిందట ఆయన వాహనంలోనే కాల్చి చంపారు. వ్యాంకోవర్‌కు తూర్పున సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సరే నగరంలోని గురునానక్ సిక్కు గురుద్వారా పార్కింగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రద్దీగా ఉన్న ఆ సమయంలో ఇద్దరు ముసుగు వేసుకున్న దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు.
నిజ్జర్ ఒక ప్రముఖ సిక్కు వేర్పాటువాద నాయకుడు. ఖలిస్తాన్ డిమాండ్‌కు బహిరంగంగా మద్దతు ఇచ్చేవారు.
భారతదేశంలోని పంజాబ్‌కు చెందిన 33 ఏళ్ల లారెన్స్ బిష్ణోయి, 32 ఏళ్ల సతీందర్‌జీత్ సింగ్ అలియాస్ "గోల్డీ బ్రార్" నిజ్జర్ హత్యకు ఆదేశాలు జారీ చేసినట్లు ఫెడరల్ ప్రాసిక్యూటర్లు చార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూటర్లు తమ పత్రాలలో నిజ్జర్‌ను "హెచ్ఎస్ఎన్"గా పేర్కొన్నారు.
బ్రార్ ఇంకా పరారీలోనే ఉండగా, లారెన్స్ బిష్ణోయి 2015 నుంచి భారత్‌లో జైలులో ఉన్నారు.
గత ఏడాది కెనడా ప్రభుత్వం బిష్ణోయి గ్యాంగ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. దీనివల్ల ఆ దేశంలో ఈ ముఠాకు చెందిన ఆస్తులను జప్తు చేయడానికి, వారి నిధులను నిలిపివేయడానికి అక్కడి ఫెడరల్ ప్రభుత్వానికి చట్టపరమైన అధికారం దక్కింది.
2024లో ఈ హత్యకు సంబంధించి నలుగురు భారతీయ పౌరులను అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత కెనడా, భారత్ మధ్య పెద్ద దౌత్యపరమైన వివాదం చెలరేగింది. ప్రస్తుతం వారు విచారణను ఎదుర్కొంటున్నారు.

ఫొటో సోర్స్, SIKH PA
బెదిరింపులు, వసూళ్లు
బిష్ణోయి గ్యాంగ్ సభ్యులు ప్రముఖ మత, రాజకీయ నాయకులను లక్ష్యంగా చేసుకున్నారని, ఆపై ఆయా వర్గాల ప్రజలను బెదిరించి వసూళ్లకు పాల్పడటానికి ప్రయత్నించారని ప్రాసిక్యూటర్లు మంగళవారం ఆరోపించారు.
కాలిఫోర్నియాలోని బాధితులను బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి బిష్ణోయి, బ్రార్, ఇతర నిందితులు ప్రయత్నించినట్లు వారు పేర్కొన్నారు. అందులో భాగంగానే డిసెంబర్, జనవరి నెలల్లో ఒక బాధితుడిని 50 లక్షల డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేశారని పేర్కొన్నారు.
ఈ దర్యాప్తులో భాగంగా సుమారు 1,000 కిలోల కొకైన్, ఒక కిలో హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు మంగళవారం అధికారులు వెల్లడించారు. వీటితో పాటు 40,000 డాలర్ల నగదు, సుమారు ఒక డజను ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఉమ్మడి దర్యాప్తులో ఎఫ్‌బీఐ, లాస్ ఏంజిల్స్ పోలీస్, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్, అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ అధికారులు పాల్గొన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)





























