ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం ట్రంప్‌కు తాత్కాలిక విజయమా? తరువాత ఏం చేయబోతున్నారు?

ఫొటో సోర్స్, EPA
- రచయిత, ఆంథోనీ జర్చర్
- హోదా, నార్త్ అమెరికా కరస్పాండెంట్
- చదివే సమయం: 5 నిమిషాలు
చివరికి, ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రశాంతతతో ఆలోచించే వారే పైచేయి సాధించారు. కనీసం ప్రస్తుతానికైనా..
వాషింగ్టన్ కాలమానం ప్రకారం 18:32 గంటలకు అంటే సాయంత్రం 6.32కు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వెబ్‌సైట్‌లో ఒక పోస్టు పెట్టారు.
అమెరికా, ఇరాన్‌లు ఒక 'నిర్ణయాత్మక' శాంతి ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నాయని, చర్చలు మరింత ముందుకు సాగేందుకు వీలుగా రెండు వారాల కాల్పుల విరమణకు అంగీకరించినట్లు ఆ పోస్టులో పేర్కొన్నారు.
సరిగ్గా ఇది చివరి నిమిషంలో జరగలేదు. కానీ, ఒప్పందం కుదుర్చుకోవాలని లేదంటే ఇరాన్ ఇంధనం, రవాణా మౌలిక సదుపాయాలపై అమెరికా భారీ దాడులు చేస్తుందని ట్రంప్ విధించిన డెడ్‌లైన్ (గ్రీన్‌విచ్ కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి) సమీపించడానికి కాస్త ముందుగానే ఈ పరిణామం జరిగింది.
అయితే, ఇవన్నీ కూడా ఇరాన్ శత్రుత్వాన్ని విడిచిపెట్టి, వాణిజ్య నౌకల రవాణాకు ఎలాంటి ఆటంకం లేకుండా హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవడపైనే ఆధారపడి ఉన్నాయి. అలా చేస్తామని కూడా ఇరాన్ చెబుతోంది.

కానీ, మంగళవారం ఉదయం నాటి పరిస్థితులను చూస్తే ఇలాంటి పురోగతిని ఎవరూ అంచనావేయలేదు.
ఎందుకంటే, హార్ముజ్‌ను తెరిచి, ఒప్పందానికి రాకపోతే ఒక నాగరికత మొత్తం అంతమవుతుందని ఇరాన్‌ను ట్రంప్ బెదిరించారు. ''మళ్లీ ఆ నాగరికతను వెనక్కి తీసుకురావడం ఎప్పటికీ సాధ్యం కాదు'' అని హెచ్చరించారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నుంచి వచ్చిన ఇంతటి తీవ్రమైన బెదిరింపు, గతంలో తాము తిరస్కరించిన కాల్పుల విరమణకు ఒప్పుకునేలా ఇరాన్‌పై ఒత్తిడి తెచ్చిందా? అన్నది అస్పష్టంగా ఉంది.
అయితే, స్పష్టంగా తెలిసేందంటే.. రెండు రోజుల ముందు ఇలాంటి అభ్యంతరకర పదజాలంతో ట్రంప్ ట్రూత్ సోషల్‌లో చేసిన డిమాండ్ తర్వాత, మరోసారి చేసిన ఈ హెచ్చరిక ప్రకటన మరే ఆధునిక అమెరికా అధ్యక్షుడు చేయని విధంగా ఉంది.
రెండు వారాల కాల్పుల విరమణ శాశ్వత శాంతికి దారితీసినా, ఇరాన్ యుద్ధం, ట్రంప్ తాజా మాటలు అమెరికాను మిగతా ప్రపంచమంతా చూసే వైఖరిని ప్రాథమికంగా మార్చివేయొచ్చు.
ఒకప్పుడు ప్రపంచంలో స్థిరత్వానికి ప్రతీకగా నిలిచిన దేశమే.. ఇప్పుడు అంతర్జాతీయ వ్యవస్థ పునాదులను కుదిపేస్తోంది.
దేశీయ రాజకీయాల్లో సంప్రదాయాలను, కట్టుబాట్లను తుంగలో తొక్కడాన్ని ఆనందించినట్లు కనిపించిన అధ్యక్షుడు, ఇప్పుడు ప్రపంచ వేదికపైనా అదే చేస్తున్నారు.
ట్రంప్ వ్యాఖ్యలను మంగళవారం డెమొక్రాట్లు తీవ్రంగా ఖండించారు. కొందరు ఆయన్ను తొలగించాలని కూడా డిమాండ్ చేశారు.
''అధ్యక్షుడి ఆలోచనా తీరు క్రమంగా క్షీణిస్తోంది, ఆయన నాయకత్వం వహించడానికి అనర్హులు అని స్పష్టమవుతుంది'' అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు జోక్విన్ కాస్ట్రో రాశారు.
ఇరాన్ యుద్ధం ముగించడానికి జరిగిన ఓటింగ్‌లో పాల్గొనని ఏ రిపబ్లికన్ అయినా.. ''ఇది ఎంతటి దారుణమైన పరిస్థితి అయినా.. దాని పర్యవసనాలకు బాధ్యత వహించాలి'' అని అమెరికా సెనేట్‌లో టాప్ డెమొక్రాట్ చక్ షుమర్ అన్నారు.
ట్రంప్ సొంత పార్టీలోని చాలామంది అధ్యక్షుడికి అనుకూలంగా నిలిచినప్పటికీ, ఆయనకు తరచూ లభించే సంపూర్ణ మద్దతు మాత్రం ఈసారి ఆశించిన స్థాయిలో కనిపించలేదు.
ఒక నాగరికతే అంతమవుతుందని ట్రంప్ చేసిన బెదిరింపులను మాత్రం జార్జియాకు చెందిన రిపబ్లికన్ పార్టీ సభ్యుడు, హౌస్ ఆర్మ్‌డ్ సర్వీసెస్ కమిటీ సీనియర్ మెంబర్ ఆస్టిన్ స్కాట్ తీవ్రంగా విమర్శించారు.
''అధ్యక్షుడి వ్యాఖ్యలు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి'' అని ఆయన బీబీసీతో అన్నారు. ''వాటితో నేను అంగీకరించను'' అని చెప్పారు.
సాధారణంగా ట్రంప్‌కు విధేయుడిగా పేరున్న విస్కాన్సిన్ సెనేటర్ రాన్ జాన్సన్.. ట్రంప్ కనుక తన బాంబు దాడుల క్యాంపెయిన్‌ను కొనసాగిస్తే, అది ''అతిపెద్ద తప్పిదం'' అవుతుందని అన్నారు.
మొత్తం ''ఒక నాగరికత నాశనం'' చేస్తామని బెదిరించడానికి తాను మద్దతు ఇవ్వనని టెక్సాస్‌కు చెందిన కాంగ్రెస్‌మాన్ నథానియల్ మోరన్ తన సోషల్ మీడియాలో రాశారు.
''ఇది మన తత్వం కాదు'' అని రాశారు. ''ఇది అమెరికా సుదీర్ఘకాలంగా కలిగి ఉన్న సూత్రాలకు అనుగుణంగా లేదు'' అని పేర్కొన్నారు.
అధ్యక్షుడితో తరచూ విభేదించే అలస్కాకు చెందిన సెనేటర్ లిసా ముర్కోవ్స్కీ అదే స్థాయిలో స్పందించారు. ఇరాన్‌తో చర్చలలో పైచేయి సాధించే ప్రయత్నాల్లో భాగంగా అధ్యక్షుడి బెదిరింపులను క్షమించలేమని రాశారు.
అయితే, ఈ ఒత్తిడి ఫలించిందని వైట్‌హౌస్ సమర్థించుకునే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Reuters
కాల్పుల విరమణను తన ట్రూత్ సోషల్ పోస్టులో ప్రకటించిన ట్రంప్, ''అమెరికా తన సైనిక లక్ష్యాలన్నింటినీ సాధించి, అధిగమించింది'' అని అన్నారు.
ఇరాన్ సైన్యం బాగా తగ్గింది. తన ఇస్లామిక్ మౌలికవాద పాలన ఇంకా అధికారంలో ఉన్నప్పటికీ.. బాంబు దాడుల్లో చాలామంది ఉన్నత స్థాయి నేతలు చనిపోయారు.
అయితే, అమెరికా పేర్కొంటున్న లక్ష్యాలలో చాలా వరకు సందేహంగానే ఉన్నాయి. ఇరాన్ అణ్వాయుధాల కార్యక్రమానికి పునాది అయిన ఇరాన్ యురేనియం వెలికితీత ఏమైందో ఎవరికీ తెలియదు. యెమెన్‌లో హూతీ తిరుగుబాటుదారులు వంటి ప్రాంతీయ ప్రాక్సీలపై ఈ దేశం ఇప్పటికీ ప్రభావం చూపుతుంది.
ప్రవేశానికి ఎలాంటి సుంకాలు లేదా ఇతర చెల్లింపులు వంటి షరతులు విధించకుండా పూర్తిగా హర్ముజ్ జలసంధిని తెరిచినా కూడా.. గతంలో కంటే ఇప్పుడు ఈ కీలకమైన భౌగోళిక మార్గాన్ని నియంత్రించే సామర్థ్యాన్ని ఇరాన్ మరింత స్పష్టంగా చాటిచెప్పగలదు.
ట్రంప్ కాల్పుల విరమణ సందేశం తర్వాత విడుదల చేసిన ప్రకటనలో.. ఇరాన్ తన ''రక్షణాత్మక ఆపరేషన్లను'' ముగిస్తుందని, ''ఇరాన్ సాయుధ బలగాల సహకారంతో'' హార్ముజ్ మీదుగా సురక్షితంగా నౌకలను అనుమతిస్తుందని తెలిపింది.
ఇరాన్ పది పాయింట్ల ప్రణాళిక సాధారణ ఫ్రేమ్‌వర్క్‌ను అమెరికా ఆమోదించిందని చెప్పారు.
ఈ ప్రణాళికలో తమ ప్రాంతం నుంచి సైనిక బలగాలను అమెరికా ఉపసంహరించుకోవాలి, ఇరాన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలి, ఇరాన్ పునర్నిర్మాణ ఖర్చుల కోసం పూర్తి నష్టపరిహారం చెల్లించి, హార్ముజ్ జలసంధిపై నియంత్రణను ఇరాన్‌కే వదిలేయడం వంటివి ఉన్నాయి.
ఈ షరతుల్లో దేనికైనా ట్రంప్ అంగీకరిస్తారని ఊహించడం కష్టమే. చర్చల కోసం పెట్టుకున్న రాబోయే రెండు వారాలు క్లిష్టంగా ఉండొచ్చని సంకేతాలు ఉన్నాయి.
అయితే ప్రస్తుతానికి ఇది ట్రంప్‌కు రాజకీయ గెలుపు. ఆయన చేసిన తీవ్రమైన బెదిరింపు, ఆశించిన ఫలితాన్ని సాధించింది. కానీ, కాల్పుల విరమణ ఒక తాత్కాలిక ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం కాదు.
అధ్యక్షుడు మాటలు, చేతల వల్ల మొత్తం యుద్ధంలో జరిగిన దీర్ఘకాలిక వ్యయాన్ని పూర్తిగా అంచనా వేయాల్సి ఉంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

































