ముడి చమురు వ్యాపారం డాలర్లలోనే ఎందుకు జరుగుతుంది? డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేసిన దేశాధినేతలకు ఏమైంది?

డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ముడి చమురు వ్యాపారంపై ఇప్పటికీ డాలర్ ఆధిపత్యం స్పష్టంగా ఉంది.
    • రచయిత, అజిత్ గధ్వి
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, హార్ముజ్ జలసంధి దాదాపుగా మూతపడడంతో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత ఏర్పడింది.

మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ యుద్ధంతో ఇటీవల ముడిచమురు ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి.

అమెరికా డాలర్ విలువ కూడా పెరగడంతో ఈ ధరకు ముడి చమురు కొనడానికి చాలా దేశాలు భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది.

అసలు, ముడిచమురు లావాదేవీలు అమెరికా డాలర్లలో మాత్రమే ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

గతంలో కొన్ని దేశాలు డాలర్ ఆధిపత్యాన్ని ప్రశ్నించినా ఆశించిన ఫలితం లభించలేదు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

డాలర్‌కు మునుపు ఏముండేది?

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తీవ్రమైన ఆర్థిక అస్థిర పరిస్థితులు ఏర్పడినప్పుడు అమెరికా సహా 44 మిత్ర దేశాల ప్రతినిధులు 1944 జూలైలో అమెరికా న్యూ హాంప్‌షైర్‌లోని బ్రెటన్ ఉడ్స్‌లో ఉన్న ఒక హోటల్‌లో సమావేశమయ్యారు. వారు కరెన్సీ కోసం ఒక కొత్త వ్యవస్థను ఆమోదించారు. అది 'బ్రెటన్ ఉడ్స్ సిస్టమ్'గా ప్రసిద్ధి చెందింది.

దీని ప్రకారం అమెరికా డాలర్ ధరను బంగారం ఆధారంగా నిర్ణయించారు. ఒక ఔన్సు బంగారం ధరను 35 డాలర్లుగా నిర్ణయించారు. బంగారం మద్దతున్న ఏకైక కరెన్సీ అమెరికా డాలర్ మాత్రమే. మిగతా దేశాలన్నీ బంగారానికి బదులుగా అమెరికా డాలర్లను నిల్వచేసుకునేవి. దీంతో డాలర్ ప్రపంచ కరెన్సీగా మారింది.

ఈ వ్యవస్థ 1971 వరకు అమలులో ఉంది. ఒకానొక సమయంలో అమెరికా విపరీతంగా డాలర్లను ముద్రించడంతో బ్యాంకింగ్ కోసం దాని వద్ద తగినంత బంగారం లేకుండా పోయింది. దీంతో ఈ వ్యవస్థ 1971లో ముగిసింది.

డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ముడి చమురు వ్యాపారం డాలర్లలో ఎందుకు మొదలైంది?

ప్రపంచంలో ముడి చమురును అమెరికా డాలర్లలో వర్తకం చేసే 'పెట్రోడాలర్ వ్యవస్థ'కు ముందు వాణిజ్యం అంతా బ్రెటన్ వుడ్స్ వ్యవస్థ ద్వారా జరిగేది.

1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ గోల్డ్ స్టాండర్డ్‌ను ముగించాలని నిర్ణయించారు. డాలర్లను ముద్రించడానికి ఇకపై బంగారం మద్దతు అవసరం లేదని దానర్థం.

ఆ తర్వాత, 1974లో సౌదీ అరేబియాతో అమెరికా ఒక వ్యూహాత్మక ఒప్పందంపై సంతకం చేసింది. దీని ప్రకారం సౌదీ అరేబియా చమురు ధరను అమెరికా డాలర్ల ఆధారంగా నిర్ణయించి, దానిని డాలర్లలోనే విక్రయించాలి.

బదులుగా సౌదీ అరేబియాకు భద్రత కల్పిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. తర్వాత పెట్రోలియం ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) కూడా చమురు వ్యాపారాన్ని డాలర్ల ఆధారంగా చేయాలని నిర్ణయించింది.

డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్‌తో సౌదీ అరేబియా రాజు ఫైసల్

‘‘అన్ని డబ్బులూ అమెరికాకే’’

పెట్రోడాలర్ వ్యవస్థను అమలు చేయడంతో అమెరికాకు పెద్ద ప్రయోజనం కలిగింది. ఎందుకంటే, ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన, అత్యధికంగా కొని, అమ్మే వస్తువు చమురు. ఏ దేశమైనా ముడి చమురు కొనాలనుకుంటే దానికి అమెరికా డాలర్లు అవసరమయ్యేవి.

చమురు ఎగుమతి చేసే దేశాలు చమురు అమ్మకం ద్వారా పొందిన డాలర్లను అమెరికా ట్రెజరీ బాండ్లలో పెట్టుబడి పెట్టేవి. దీనినే పెట్రోడాలర్ రీసైక్లింగ్ అంటారు .

సులభంగా చెప్పాలంటే, గల్ఫ్ దేశాలకు అమెరికా సైనిక రక్షణ కల్పించింది. దానికి ప్రతిఫలంగా అమెరికా ఇంధన భద్రతను పొందింది. చమురు వ్యాపారం డాలర్లలో జరిగింది. బిలియన్ల డాలర్లు అమెరికా ఆయుధాలు, సాంకేతికతను కొనుగోలు చేయడానికి, అలాగే అమెరికా స్టాక్‌లు, బాండ్లలో పెట్టుబడి పెట్టడానికి తిరిగి అమెరికాకే మళ్లాయి. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్ – ఈ ఐదు దేశాలు తమ కరెన్సీలను డాలర్‌కు అనుసంధానించాయి.

ఇటీవల కొన్ని దేశాలు చైనా కరెన్సీ యువాన్ వంటివాటిలో చమురు వ్యాపారం చేసే అవకాశం కోసం అన్వేషించినా డాలర్ ఆధిపత్యం అలాగే ఉంది.

డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, డాలర్ కాకుండా ఇతర కరెన్సీల్లో చమురు వ్యాపారం చేయాలని నికోలస్ మదురో భావించారు.

సద్దాం హుస్సేన్, గడాఫీ సవాల్ చేసినప్పుడు ఏం జరిగింది?

కొందరు పెట్రోడాలర్‌ను సవాల్ చేసి భిన్నమైన వ్యవస్థను అమలు చేయడానికి ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయారు.

ఉదాహరణకు, 2000లో ఇరాక్ అప్పటి అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఐక్యరాజ్యసమితి ఆయిల్ ఫర్ గ్రెయిన్- (ఆహారానికి చమురు)' కార్యక్రమం కింద చమురు అమ్మకాలకు డాలర్లకు బదులుగా యూరోలను అంగీకరిస్తానని ప్రకటించారు. కానీ ఈ పథకం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2003లో సద్దాం హుస్సేన్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోయడంతో ఇరాకీ ముడి చమురు లావాదేవీలు మళ్లీ డాలర్లలో జరగడం మొదలైంది.

అలాగే, లిబియా పాలకుడు గడాఫీ ముడి చమురుతో సహా వస్తువుల లావాదేవీలకు వీలు కల్పించే ఒక ఆఫ్రికన్ కరెన్సీని ప్రతిపాదించారు. కానీ, ఆయన కూడా లిబియా అంతర్యుద్ధంలో హతమయ్యారు.

ఇటీవల వెనెజ్వెలా పాలకుడు నికోలస్ మదురో కూడా ముడి చమురు వ్యాపారాన్ని డాలర్‌తో కాకుండా ఇతర కరెన్సీలలో చేయాలని వాదించారు. కానీ, జనవరిలో ట్రంప్ ప్రభుత్వం ఆయన్ను బంధించింది. ప్రస్తుతం ఆయన అమెరికా అదుపులో ఉన్నారు.

డాలర్, ముడి చమురు, అమెరికా, గల్ఫ్ దేశాలు

ఫొటో సోర్స్, Getty Images

డాలర్ స్థానాన్ని చైనా యువాన్ భర్తీ చేస్తుందా?

ఇరాన్ యుద్ధం వల్ల ఇటీవల ఏర్పడిన పరిస్థితి పెట్రోడాలర్‌కు ప్రమాదకరంగా భావిస్తున్నారు. ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా తన కరెన్సీ అయిన యువాన్‌ను ప్రపంచ కరెన్సీగా మార్చే ప్రయత్నాలను ప్రారంభించి డాలర్ ఆధిపత్యాన్ని సవాల్ చేస్తోంది.

"ఈ యుద్ధం పెట్రోడాలర్‌ను బలహీనపరిచి, పెట్రోయువాన్ ఆవిర్భావానికి నాంది పలకొచ్చు" అని జర్మనీలోని డాయిష్ బ్యాంక్ వ్యూహకర్త మల్లికా సచ్‌దేవా అన్నారు. ఇరాన్ కొన్ని చమురు ట్యాంకర్లు హార్ముజ్ జలసంధి గుండా వెళ్ళడానికి అనుమతిస్తూ చెల్లింపులను యువాన్‌లో స్వీకరిస్తోందని కొన్ని మీడియా రిపోర్టులను ఉటంకిస్తూ రాశారు.

1974లో అమెరికాతో పెట్రోడాలర్ ఒప్పందంపై సౌదీ అరేబియా సంతకం చేసింది. కానీ సంవత్సరాలు గడిచేకొద్దీ పరిస్థితి చాలా మారిపోయింది.

బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం, సౌదీ అరేబియా ప్రస్తుతం అమెరికాకు అమ్మే దానికంటే నాలుగు రెట్లు ఎక్కువ చమురును చైనాకు అమ్ముతోంది.

గల్ఫ్ దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, అలాగే చైనా, హాంగ్‌కాంగ్, థాయ్‌లాండ్‌లు ప్రస్తుతం 'ఎంబ్రిడ్జ్' అనే వ్యవస్థపై పనిచేస్తున్నాయి. ఇది డాలర్ కాకుండా ఇతర కరెన్సీలలో వ్యాపారం చేయడానికి వీలు కల్పిస్తుంది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)